ధీరజ్ తన పనిలో బిజీగా ఉన్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేశాడు. ‘సార్ మేము.. ఏసీబీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. నేను మాట్లాడేది ధీరజ్తోనేనా?’ అని అటువైపు నుంచి వాయిస్!! ‘నేను బిజీగా ఉన్నాన’ని కాల్ కట్ చేశాడు ధీరజ్. వెంటనే ఆ నెంబర్ బ్లాక్ చేశాడు. సూరజ్‌కి కూడా అలాంటి కాల్ వచ్చింది. కానీ, ‘మేం బ్యాంకు నుంచి’ అనగానే.. చెప్పండి సార్ అంటూ పాజిటివ్‌గా స్పందించాడు. వాళ్లు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం ఇచ్చాడు. కాల్ కట్ అయింది. తర్వాత సూరజ్ ఫోన్‌కు సందేశాల పరంపర మొదలైంది. చూస్తే.. అన్నీ అతని బ్యాంకు అకౌంట్ లావాదేవీలే! క్షణాల్లో ఖాతా ఖాళీ!! అంటే.. వచ్చిన కాల్ బ్యాంకు నుంచి కాదు.. హ్యాకర్ల నుంచి. స్ట్రెయిట్‌గా చెప్పాలంటే అదో స్పామ్ కాల్.
ధీరజ్, సూరజ్ ఇద్దరూ ఫోన్ లిఫ్ట్ చేశారు. కానీ, ధీరజ్ కాస్త అవగాహనతో తప్పించుకున్నాడు. కానీ, సూరజ్ ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకోలేక మోసపోయాడు. మరైతే, ఇలాంటి వారికి రక్షణ ఏంటి? వాడేది బేసిక్ ఫోనే అయినా.. స్పామ్ కాల్, ప్రమోషనల్ కాల్ అని గుర్తుపట్టడం ఎలా? ఈ మోసపూరిత స్పామ్ కాల్స్‌ని ఫిల్టర్ చేసే ఉపాయం ఏంటి? సింపుల్.. వీటికి సమాధానంగా ట్రాయ్ TRAI ఓ ప్రత్యేక నంబర్ సిరీస్‌ని ప్రేశపెట్టింది. అదే 160 సిరీస్. అంటే.. ఏదైనా ఫోన్ నంబర్ 160తో స్టార్ట్ అయితే అది కచ్చితంగా టెలీ మార్కెటింగ్ కాల్ అని నిర్ధారించుకోవాలి. అంటే.. ఇకపై బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మనకి కాల్ చేయాలంటే 160తో మొదలయ్యే నంబర్ నుంచే చేయాలన్నమాట. ఈ నంబర్ని చూడగానే.. అది మనకు బ్యాంకు నుంచి వచ్చిన కాల్ అని తెలుస్తుంది. అప్పుడు వినియోగదారుడు మోసపోయే అవకాశాలు తగ్గుముఖం పడతాయి.
సోషల్ ఇంజినీరింగ్ స్కామ్ చోటు చేసుకోవాలంటే.. సైబర్ నేరగాళ్లు మనతో మాట కలపాల్సిందే. అందుకు ఏదో ఒక నంబర్ నుంచి ఫోన్ చేయాల్సిందే! అప్పుడది గుర్తు తెలియని నంబరైతే.. మనకు డౌట్ వస్తుంది. అదే 160 నంబర్ సిరీస్‌తో కనిపిస్తే.. రిలాక్స్డ్గా మాట్లాడొచ్చు. ఇష్టం ఉంటే.. యాక్సెప్ట్ చేస్తాం. లేదంటే.. రిజెక్ట్ చేస్తాం. అందుకే RBI, SEBI, IRDAI లేదా PFRDA పరిధిలో ఉన్న ఏ ఫైనాన్షియల్ సంస్థ అయినా వారి మార్కెటింగ్ కాల్స్ నిమిత్తం కచ్చితంగా 160 సిరిస్‌తో కూడిన నంబర్ని తీసుకోవాలి. వాటితోనే వినియోగదారులతో సంప్రదింపులు చేయాలి. ఇది ట్రాయ్ తీసుకున్న నిర్ణయం. లేకుంటే సైబర్ మోసాలపై అవగాహన లేని వాళ్లు ఈ స్పామ్ కాల్స్ ఉచ్చులో పడుతున్నారు.
టెలి మార్కెటింగ్, ఆర్థికపరమైన సేవలు అందించే సంస్థలు, లోన్ యాప్స్.. ఇలా రకరకాలుగా కాల్స్ వస్తూనే ఉంటాయి. వీటిలో ఎక్కువ శాతం స్కామర్లే ఉంటున్నారు. కీలకమైన బ్యాంకింగ్ వివరాల్ని సేకరిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని అరికట్టేందుకు ట్రాయ్ వినియోగదారుల్ని చైతన్యపరిచేలా పలు కార్యక్రమాల్ని చేపడుతున్నది. వాటిల్లో ‘కన్జ్యూమర్ ఎంపవర్మెంట్’ ఒకటి. దీని ద్వారా ఇప్పుడు 160 సిరీస్ ప్రయోజనాల్ని వివరిస్తున్నది. ఎప్పుడైతే ఈ మూడంకెల సిరీస్‌తో ఫోన్ నంబర్ కనిపిస్తుందో.. అప్పుడు అది బ్యాంకింగ్ కాల్ అని వినియోగదారుడికి అర్థమవుతుంది. దీంతో కాల్ అటెండ్ చేయాలో, వద్దో యూజర్ నిర్ణయించుకోవచ్చు.
160 నంబర్ అధికారిక టెలీకాల్ సిరీస్‌గా వినియోగదారులకు చేరువ కావాలి. అప్పుడే కంపెనీ, కస్టమర్ల కచ్చితమైన సమాచార మార్పిడి జరుగుతుంది. కస్టమర్లు నమ్మకంతో కాల్ లిఫ్ట్ చేస్తారు. వివరాల్ని ధైర్యంగా వెల్లడిస్తారు.
ఇప్పటికే మొబైల్ యూజర్లు స్పామ్ కాల్స్‌ని ఫిల్టర్ చేసేందుకు Do Not Disturb (DND)ని వాడుతున్నారు. దీంతోపాటు ట్రాయ్ టెలికామ్ ఆపరేటర్లతో కలిసి ‘స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీ’తో మోసపూరితమైన కాల్స్‌ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నది. ఆటోమేటిక్‌గా వాటిని ఫిల్టర్ చేస్తూ అలాంటి కాల్స్ బ్లాక్ అయ్యేలా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా.. ట్రాయ్ నిబంధనల్ని అతిక్రమించిన సంస్థలకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నది. అమల్లోకి తెచ్చిన 160 సిరీస్‌ని మిస్ యూజ్ చేసినా, టెలికాలింగ్తో మోసపూరితమైన విధానాల్ని అనుసరించినా కొరడా ఝళిపిస్తున్నది. 160 నంబర్ అధికారిక టెలికాల్ సిరీస్‌గా వినియోగదారులకు చేరువ కావాలి. అప్పుడే కంపెనీ, కస్టమర్ల కచ్చితమైన సమాచార మార్పిడి జరుగుతుంది.
కస్టమర్లు నమ్మకంతో కాల్ లిఫ్ట్ చేస్తారు. వివరాల్ని ధైర్యంగా వెల్లడిస్తారు. ఎవరు స్కామరో, ఎవరు బ్యాంకరో కూడా తెలుస్తుంది. దీంతో వినియోగదారులు తమ ప్రైవసీని కాపాడుకోవచ్చు. అయితే, స్కామర్లు గుమ్మం దారి మూసేస్తే దొడ్డిదారిని వెతుకుతారు. మూడంకెల సిరీస్‌ని మార్ఫింగ్ చేసే పన్నాగాలు పన్నుతారు. వారికి ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా ట్రాయ్, టెలికాం సంస్థలు ఎప్పటికప్పుడు వినూత్నమైన టెక్నాలజీ అప్డేట్స్తో స్కామర్ల పన్నాగాల్ని తిప్పికొట్టాలి. 160 నంబర్ సిరీస్‌ని ఓ కట్టుదిట్టమైన స్పామ్ ఫిల్టర్ టూల్‌గా అభివృద్ధి చేయాలి. అప్పుడే.. స్పామ్ ఫ్రీ నెట్వర్క్ కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. ఏది ఏమైనా.. స్పాల్స్కు చిక్కకుండా, స్కామర్లకు దొరక్కుండా వినియోగదారులు స్వీయ నియంత్రణ కలిగి ఉండటం చాలా అవసరం. నెట్టింట జరుగుతున్న మోసాలపై అవగాహన కలిగి, అప్రమత్తంగా వ్యవహరించడం అత్యావశ్యకం.
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్