Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Married life tips | సరిగమలు ఏడైనా.. మధురిమలు ఎన్నో!వేసేది ఏడడుగులే అయినా, వివాహం వందేండ్ల అనుబంధం. అన్యస్వరాలు రాగాలను శ్రుతి తప్పేలా చేసినట్టు.. ఆలూమగల మధ్య స్పర్ధలు సంసారాన్ని లయ తప్పేలా చేస్తాయి!చిన్న చిన్న విషయాలే చిలికి చిలికి గాలివానై.. పచ్చని సంసారాన్ని నిలువునా కూల్చేస్తాయి! వీటికి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మీ చేతల్లోనే దొరుకుతుంది.మీ దాంపత్యంలో ఈ ఏడు సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించగలిగితే.. మీ సప్తపది జయదేవుని అష్టపదిలా రసరమ్యంగా సాగిపోతుంది.

గ్యాప్ ఇవ్వొద్దు
అప్పటివరకు బాగానే ఉంటారు. అంతలోనే మూతి ముడుచుకుంటారు. ‘ఏమైంది?’ అని అడిగితే.. ఎవరి స్పేస్ వారికి ఉండాలంటారు. ‘చిన్న గ్యాప్’ కావాలంటారు. ఈ చిన్న గ్యాపే తర్వాత అంతులేని అగాథంగా పరిణమిస్తుంది. భార్యాభర్తలు ఎవరి ప్రైవసీ వారికి కావాలనుకోవడం తప్పు కాకపోవచ్చు. కానీ, ఒకరి స్పేస్‌లోకి మరొకరు కలలో కూడా రాకూడదని తీర్మానించుకోవడం దిద్దుకోలేని తప్పునకు దారితీస్తుంది. ఎవరి ప్రాధాన్యాలు వారికున్నా.. ఇద్దరి తొలి ప్రాధాన్యం జీవిత భాగస్వామి ఆనందం కావాలి. ఆ తర్వాతి స్థానంలో ఇల్లు ఉండాలి. ప్రతిరోజూ గంటో, రెండు గంటలో ఇంటికి, జీవిత భాగస్వామికి కేటాయించాలి.

ఆర్థికాంశాలు
ఈ రోజుల్లో ఆలూమగలు ఇద్దరూ సంపాదిస్తున్నారు. స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిన మాట వాస్తవమే! కానీ, 80 శాతం మంది అతివల అకౌంట్లు వారి భర్తల అజమాయిషీలోనే ఉన్నాయన్న అధ్యయనాలు ఎంత ఎదిగినా ఇంతి బాధలు ఇంతింతకాదనే వాస్తవానికి అద్దం పడుతున్నాయి. ఓ ఇరవై శాతం మంది భర్తలు మాత్రమే ఆర్థిక విషయాల్లో భార్య అభిప్రాయానికి విలువ ఇస్తున్నారని తేలింది. ఈ ఆర్థికాంశాలే భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి కారణం అవుతున్నాయి. ఈ వైఖరికి భర్తలు ఫుల్స్టాప్ పెట్టగలిగితే భార్యల మనసు గెలుచుకోవడం పెద్ద కష్టమేం కాదు!

భావ వ్యక్తీకరణ
బంధం బలపడాలంటే ఉండాల్సింది భావ వ్యక్తీకరణ. చెప్పదలచిన విషయాన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. లోపల ఏదో పెట్టుకొని నసిగితే చెప్పదలుచుకున్న విషయం అవతలి వాళ్లకు అర్థం కాకపోగా, లేనిపోని మనస్పర్ధలకు దారితీస్తుంది. కంటిచూపులు, కొంటెసైగలు దంపతుల మధ్య అన్యోన్యతకు వారధి నిర్మిస్తాయి. మృదుభాషణం దాంపత్యానికి భూషణమవుతుంది. మనసులోని మాటలు అరమరికలు లేకుండా చెప్పుకొనే స్వేచ్ఛ ఇద్దరికీ ఉన్నప్పుడు ఆ భార్యాభర్తల మధ్య వైషమ్యాలు తలెత్తే ప్రశ్నే రాదు.

శృంగార యజ్ఞం
దాంపత్య యజ్ఞానికి శృంగారమే ఆజ్యం. శృంగార జీవితం సంతృప్తికరంగా ఉన్న దంపతుల మధ్య ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ. పెండ్లయిన కొత్తలో చాలనుకునే వరకు సాగే సరసాలు.. కొన్నాళ్లకు తూతూ మంత్రంగా సాగిపోతాయి. ఇద్దరిలో ఏ ఒక్కరో చప్పబడిపోతే.. దాంపత్యం దుర్భరమే అవుతుంది. మనసులు ప్రశాంతంగా ఉన్నప్పుడే కోరికలు రేగుతాయి. అప్పుడే కెమిస్ట్రీ పండుతుంది. బలవంతంగా పొందాలనుకోవడం, బలవంతంగా అడ్డుకోవడం రెండూ సమర్థనీయాలు కాదు. శృంగారాన్ని పవిత్ర కార్యంగా భావించి రమించాలి. కలయిక ఇష్టం లేనప్పుడు కోపంతో కాకుండా శాంతంగా ఆపే ప్రయత్నం చేయాలి. కలయిక కోరుకున్నప్పుడు అజమాయిషీతో కాకుండా యుక్తితో అనురక్తి కలిగించాలి. ‘కాదంటే ఔననిలే’ అని తీర్మానించుకుని నెయ్యానికి కాలుదువ్వితే కయ్యానికి కారణం అవుతుందని గ్రహించాలి. చివరగా భార్యాభర్తలు శృంగార రసం ఎంతగా పండించగలిగితే జీవితం అంత ఆనందంగా ఉంటుందన్న సత్యం మర్చిపోవద్దు.

ఇద్దరి మధ్య స్మార్ట్‌ఫోన్
ఇంతకు ముందంటే ‘భార్యాభర్తలన్నాక సవాలక్ష ఉంటాయి. మేము చూసుకుంటాం. మీ జోక్యం అవసరం లేదు’ అని మూడోవ్యక్తి జోక్యాన్ని నివారించేవాళ్లు. ఈ తరం దంపతులకు ఆ మాట అనే అవకాశం లేకుండా పోయింది. ఇద్దరి మధ్యా రెండు స్మార్ట్ఫోన్లు వచ్చి చేరాయి. రోజులో సింహభాగం ఫోన్‌కే కేటాయిస్తున్నారు చాలామంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు సాంసారిక వ్యవహారాల్లో నిర్లిప్తంగా ఉంటున్నారు. అంతేకాదు, తొందరపాటులో చేసే కొన్ని పోస్టులు వారి బంధం బీటలువారేలా చేస్తున్నాయి. కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. వాట్సాప్‌లో లాస్ట్ సీన్ కూడా భార్యాభర్తల మధ్య వైరానికి కారణం అవుతున్నది. కాలానుగుణంగా స్మార్ట్‌ఫోన్ వాడటం ఇప్పుడు అవసరమే! ఎన్నో పనులను చిటికెలో చక్కబెట్టే ఫోన్‌ను పక్కన పెట్టలేం. అలాగని, చక్కని జీవితాన్ని రిస్క్‌లో పెట్టకూడదు. ఫోన్‌ను ఒక ఉపకరణంగానే భావించాలి, ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే వాడాలి. అప్పుడు మీ జీవితంలో స్మార్ట్ ప్రకంపనలకు తావుండదు.
నీదా..నాదా.. పైచేయి
భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువా కాదు. మరొకరు తక్కువా కాదు. ఇద్దరూ సరి సమానం. ఈ సంగతిని మనస్ఫూర్తిగా అంగీకరించగలిగితే సంసారం గతి తప్పదు. అహంతో కారాలు మిరియాలు నూరుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవు. కోపాలు, తాపాలు, జగడాలు ఉంటేనే దాంపత్యం రంజుగా సాగుతుంది. ‘అలక సరదా మీకు, అదే వేడుక మాకు’ అంటూ కోపాన్ని తాపంగా మార్చగలిగితే తగువే భలే వినోదం అనిపిస్తుంది. పొరపాటున అనుకునే మాటలు గోడలు విన్నా ఫర్వాలేదు కానీ, ఆ గోలలు ఈగోలను దెబ్బతీసే వరకు వెళ్లకూడదు. ఇద్దరి మధ్య తలెత్తే వైరాలు వైరల్ కావొద్దు. అప్పుడు పైచేయి గురించి పేచీ ఉండదు. ఒకరినొకరు తక్కువ చేసి చూడటం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించినంత కాలం ఆ కాపురం పచ్చగా ఉంటుంది.
వలలో చిక్కుకోవద్దు
పెండ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు, అంతకు మించిన గొప్ప నమ్మకం. సంసార సాగరం సమర్థంగా దాటాలంటే భర్తకు భార్యపై నమ్మకం ఉండాలి. భర్తపై భార్యకు గురి ఉండాలి. కానీ, జీవన ప్రవాహంలో ఎన్నో ఆకర్షణలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తాయి. ఇంట్లో ఆప్యాయత కరువైనప్పుడు ఈ వలలో చిక్కే ప్రమాదం ఉంది. పనిచేసే చోట, సామాజిక మాధ్యమాల్లో వినిపించే కంటితుడుపు మాటలకే ఇంటిని మర్చిపోతున్నారు కొందరు. తాత్కాలిక సంతోషాల కోసం శాశ్వతమైన బంధాలను సమస్యాత్మకంగా, ప్రశ్నార్థకంగా చేసుకుంటున్నారు. సంసారంలో ఒడుదొడుకులు ఎదురైతే సంయమనంతో వ్యవహరించాలి. శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలి.
స్త్రీ, పురుషుల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ, బాధ్యత ఉండాలి. వైవాహిక జీవితంలో పాటించాల్సిన తొలి సూత్రమిది. భావోద్వేగాలకు విశ్వాసపాత్రులై ఉండాలి. ఇలా చేస్తే ఆ బంధం కలకాలం నిలబడుతుంది. ఒకరిపట్ల ఒకరికి గౌరవం, ప్రేమ లేకపోతే బంధం విచ్ఛిన్నమవుతుందని గుర్తుంచుకోండి.
– డా. హిప్నో పద్మాకమలాకర్, సైకోథెరపిస్ట్,
మ్యారేజ్ ఫ్యామిలీ హెల్త్ సైకలాజికల్ కౌన్సెలర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఈ ఐదు రకాల వ్యక్తులను అస్సలు పెండ్లి చేసుకోవద్దు..!
దంపతుల మధ్య చిచ్చు రేపుతున్న ఆశలు.. ఆందోళనలో పెద్దలు
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!
ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా?
Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హనీమూన్.. ఎక్కడో తెలుసా?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Couple
- Marriage
- married couple
- tips
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

