ఇంటింటా ఉంటుంది తులసి. ప్రతి వాకిట్లో పలకరిస్తుంది తులసి. హిందువులకు పవిత్రమైన మొక్క ఇది. ఆధ్యాత్మికంగానే కాదు ఔషధ పరంగానూ ప్రాధాన్యం కలిగినది. తులసి సులభంగా పెరుగుతుంది. ఆకులు మంచి వాసన కలిగి ఉంటాయి. తులసి పువ్వులు చాలా చిన్నగా ఉంటాయి. వీటి ఆకృతి అద్భుతంగా ఉంటుంది. తులసి పువ్వు ఆకారంలో బంగారు నగలు చేయించుకుంటారు.
తులసి దేవతార్చనలో అగ్రభాగాన నిలుస్తుంది. భాగవతంలో తులసి ప్రస్తావన ఉంది. సత్యభామ తన సమస్త సంపదలను శ్రీకృష్ణునితో తులాభారానికి ప్రయత్నిస్తుంది. కానీ, సమతూకం సాధ్యపడదు. కానీ, రుక్మిణి భక్తితో సమర్పించిన ఒక్క తులసి దళానికి శ్రీకృష్ణుడు తులతూగుతాడు. అంత మహిమ గలది ఈ తులసిదళం. వైష్ణవ దేవాలయాలను తులసి దళంతో చేసిన హారాలను అలంకరిస్తారు. స్నానానంతరం ప్రతి హిందువు తులసి మొక్కను పూజించి, నీళ్లు పోసిన తర్వాత దైనందిన జీవితం ప్రారంభిస్తాడు. మా వనంలో నాలుగు రకాల తులసి మొక్కలున్నాయి. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, రామ తులసి, కర్పూర తులసి.
తులసి అనేక ఔషధ గుణాలకు నిలయం. వర్షాకాలం మొదలు కాగానే మా అమ్మ కషాయం కాచేది. తులసి ఆకులు, ఓమ, శొంఠి కలిపి డికాక్షన్ లాంటిది కలిపి వడగట్టేది. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తేనె కలిపి తాగించేది. తులసి ఆకులు తినొచ్చు. టీలో కూడా కాచుకోవచ్చు. తులసి ఆకులో యాంటి ఫంగల్, యాంటి బ్యాక్టీరియల్, యాంటి వైరల్ గుణాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయులను తగ్గిస్తుంది.
– ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు