TV Shows | లాంగ్ లాంగ్ ఎగో.. సో లాంగ్ ఎగో.. ఫెస్టివల్‌కు ముందు రకరకాల కళాకారులు పల్లెబాట పట్టేవాళ్లు. తమదైన కళతో పండుగ వినోదాన్ని పదింతలు చేసేవాళ్లు. దసరా వచ్చిందంటే పగటి వేషగాళ్లకు తీరిక ఉండేది కాదు! ఇంటి వాకిలే.. వేదికగా పురాణ ఇతిహాసాల్లోని ఘట్టాలకు పట్టం కట్టేవాళ్లు! యక్షగానాలతో పల్లె అంతా మార్మోగేది. ఇక సంక్రాతివేళకు గంగిరెద్దుల సాములు ఆసాముల ఇండ్లకు పోయి ఆడిపాడేవాళ్లు, అలరించేవాళ్లు. కానీ, రోజులు మారాయి. బుల్లితెర వేదికగా స్వైరవిహారం చేస్తున్న ‘డ్రామా కంపెనీ’లు దండగ మాటలతో పండుగ ఆనందాన్ని హరించేస్తున్నాయ్!
రికార్డింగ్ ట్రూప్లకన్నా నాసిరకం ట్రాక్.. ఈ డ్రామా కంపెనీల సొంతం. స్ఫూప్‌లు చేస్తూ తమ ప్రతిభకు అవే గీటురాయి అని ప్రగల్భాలు పలకడం కంపెనీ నటుల నైజం. ఆ వాచాలురు విసిరే పంచ్‌లకు పగలబడి నవ్వే న్యాయ నిర్ణేతలు ఒకవైపు, తనను ఉద్దేశించే ఆ డైలాగులు కొట్టారని సిగ్గుల మొగ్గయ్యే యాంకరమ్మ మరోవైపు. అలాంటి వ్యాఖ్యలకు అగ్గిమీద గుగ్గిలం కావాల్సిన సదరు ప్రయోక్త… పట్టరాని సంతోషం తొణికిసలాడుతుండగా, కోపం ప్రదర్శించే సన్నివేశం కడు ఏవగింపు కలిగిస్తుంటుంది. పండుగ అనగానే ఈ డ్రామా కంపెనీవాళ్లు పాతికమంది ఒక్కచోట చేరిపోతారు. ఆనక ఈ బాగోతంలో ఎవరి పాత్ర వారిది. అందరి కర్తవ్యం మాత్రం పండుగ పవిత్రతను కాలరాయడమే! డి-కంపెనీ కన్నా డేంజర్గాళ్లన్నమాట!!
వంకర చూపులతో, టింకర వ్యాఖ్యానాలతో సాగిపోయే ఈ దండగ కార్యక్రమం పండుగ పూట పెద్ద పరీక్ష పెడుతుంది. అంతగా నచ్చకపోతే చూడకుండా ఉండొచ్చుగా అంటారేమో! ఆ పూట ఏదో తప్పించుకోవచ్చు! కానీ, సదరు కంపెనీ దురదనంతా పండుగకు పక్షం రోజుల ముందు నుంచి ప్రోమోల రూపంలో ప్రదర్శిస్తూనే ఉంటారు. ఒకరేమో తాగినట్టు వాగుతుంటారు! ఇంకోరేమో ఆడవేషం కట్టి మహిళలను కించపరుస్తూనే ఉంటారు. ఆడపిల్లను గేలి చేసి తలెత్తుకుని నిలబడిన నటుణ్ని చూస్తూ.. అక్కడున్న లేడీసంతా చప్పట్లు చరుస్తూ, ప్రోత్సహించడం కడు శోచనీయం! వినోదం పేరుతో చేస్తున్న వికృత కాండకు ముగింపు పలకాలంటే అంతగా తెగించాల్సిన అవసరమేం లేదు! రిమోట్ నొక్కేయడమే! ఆ పక్క చానెల్లోనూ మరో కంపెనీ ఇదే ప్రదర్శిస్తుంటే టీవీ ఆఫ్ చేయడమే!!