ఆయుర్వేదానికి ఆయువుపట్టు కేరళ. దేశవిదేశాల నుంచి వైద్యం కోసం కేరళలోని పల్లెల చుట్టూ తిరుగుతుంటారు. ఏ రుగ్మత లేకున్నా.. ప్రకృతి ఆలయంలో నాలుగు రోజులు ఉండటానికి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. కోవలం, కొట్టాయం, కొల్లాం, వార్కల తదితర ప్రాంతాల్లోని ఆయుర్వేదశాలలు, వైద్యం అనుబంధంగా ఉన్న రిసార్టులు పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి. కోవలం తీరం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమతీరం ప్రత్యేకమైంది. ఆయుర్వేద గ్రామంగా పేరొందిన ఈ ప్రదేశంలో వైద్యశాలలు, రిసార్టులు కోకొల్లలు. అరేబియా సముద్రం అంచున, నిండైన పచ్చదనంతో మెరిసిపోయే సోమతీరం ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్నిస్తుంది.
పంచకర్మ, సౌందర్య చికిత్సలు, యోగాభ్యాసం, ఒత్తిడిని తగ్గించే విధానాలు ఇలా రకరకాల వైద్యాలు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కలిపి రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. భోజనం, బస కూడా ప్యాకేజీలో భాగంగా అందిస్తారు. మరిన్ని వివరాలకు somatheeram.org వెబ్సైట్ని సందర్శించండి. కేరళలోని ఇతర ప్రాంతాల్లోని ఆయుర్వేదశాలల సమాచారం కోసం www.keralatourism.org/ayurveda/ క్లిక్ చేయండి. చేరుకునేదిలా: కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి కోవలం 18 కి. మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్, వరంగల్ నుంచి తిరువనంతపూరానికి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోవలం మీదుగా సోమతీరం చేరుకోవచ్చు.