Fonts | ఆ ఇద్దరూ అక్షర ప్రేమికులు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉపయోగిస్తున్న అనేక ‘కంప్యూటర్ ఫాంట్స్’కు సృష్టికర్తలు. నిరంతరం అక్షరమాల మధ్యే సేదతీరుతారు. వాటికి సొబగులద్ది.. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. కంప్యూటరీకరించి అందరికీ అందుబాటులోకి తెస్తారు. వారే.. తమిరి రమణ, జి.పురుషోత్త్ కుమార్. అను నుంచి అపూర్వ వరకు అనేక కొత్త ఫాంట్స్‌ను వాడుకలోకి తీసుకొచ్చిన ఆ ఇద్దరు మిత్రుల ప్రయాణం వారి మాటల్లోనే..
నాకు జన్మనిచ్చింది ఆంధ్ర. ఊపిరిపోసింది తమిళనాడు. నీడనిచ్చింది తెలంగాణ. మాది పశ్చిమగోదారి జిల్లా ఆచంట. బాల్యం నుంచే గోడలపై, పోస్టర్లపై కనిపించే అక్షరాల శైలిని నిశితంగా పరిశీలిస్తూ, అచ్చంగా అలాగే రాసేందుకు ప్రయత్నించేవాణ్ని. నా అక్షరాలను చూసి మా టీచర్లు ప్రశంసించేవారు. ఓరోజు గోడపైన ‘ప్రేమ్‌నగర్’, ‘మోసగాళ్లకు మోసగాళ్లు’ సినిమా పోస్టర్లను చూసి, వాటిని అచ్చుగుద్దినట్టు పేపర్‌పై రాశాను. అప్పుడే.. నేను కూడా సినిమాలకు టైటిల్స్ రాయగలనని అనిపించింది.
అన్నయ్య ప్రోత్సాహంతో..
మా కజిన్, గురు సమానులు లంక భాస్కర్, ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారి వద్ద పనిచేసేవాడు. ఆయనే నన్ను 1980లో మద్రాసుకు రమ్మన్నారు. ఈశ్వర్ గారికి నన్ను పరిచయం చేసి, ఓ అవకాశం ఇప్పించారు. అన్నయ్య సూచనలతో ‘ఆకలి రాజ్యం’ టైటిల్ కోసం పనిచేశాను. అదే నా ప్రయాణానికి తొలిమెట్టు. అలా ఈశ్వర్ గారి దగ్గర పనిచేస్తూ ఎన్నో సినిమాలకు టైటిళ్లు అందించాను. ‘ఖైదీ’ టైటిల్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. నాకూ మంచి పేరు తీసుకొచ్చింది. బాపు-రమణలతోపాటు పలువురు దిగ్గజాల ప్రశంసలు అందుకొన్నాను. 40 ఏండ్లుగా అక్షరాలతోనే ప్రయాణిస్తున్నా. ‘ఆకలి రాజ్యం’తో మొదలుపెట్టి.. నిన్నటి ‘రాధేశ్యామ్’ వరకూ వందల సినిమాలకు టైటిళ్లు అందించాను. పురుషోత్త్ పరిచయంతో కంప్యూటర్ ఫాంట్స్ సృష్టికర్తగా మారాను. ‘రమణ బ్రెష్’ కలం పేరుతో లెటరింగ్ చేస్తున్నాను. ప్రస్తుతం వినియోగిస్తున్న తెలుగు (అనూ ఫాంట్స్)లో 60 శాతం వరకు నేను రాసిన అక్షరాలే!
– తమిరి రమణ
మాది హైదరాబాద్‌లోని దోమలగూడ. ఏదైనా సాధించాలనే తపనే.. డీటీపీ ఆపరేటర్‌గా ఉన్న నన్ను, ఫాంట్స్ సృష్టికర్తగా మార్చింది. అప్పట్లో అన్నీ ఇంగ్లిష్ ఫాంట్లే ఉండేవి. మనవాళ్ల కోసం తెలుగులోనూ అందించాలని సంకల్పించాను. మొదటి సారిగా మా నాన్న చేతిరాతతో తెలుగు ఫాంట్ రూపొందించాను. దానికి మంచి స్పందన రావడంతో ఫాంట్స్పై మరింత ఆసక్తి కలిగింది. చేతిరాత బాగుండేవారి కోసం అన్వేషించాం. ఈ క్రమంలో అనేక ఫాంట్స్‌ను రూపొందించాం. అనూ ఫాంట్స్‌లో ‘రమణ’ పేరు చూసి, ఒకరోజు వెళ్లి కలిశాను. వారి అక్షరాలను కంప్యూటరీకరిద్దామని ఒప్పించాను. అలా మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. ఇప్పటివరకూ అనేక ఫాంట్స్‌కు ప్రాణంపోశాం. ‘పీవీ నరసింహారావు’, ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ పేరుతో ఫాంట్స్ తయారు చేశాం. మన భాషను నిలబెట్టుకోవడానికి సాంకేతిక రంగంలో మరిన్ని తెలుగు ఫాంట్స్ రావాల్సిన అవసరం ఉన్నది.
జి.పురుషోత్త్ కుమార్
…?ఇడుమాల కిరణ్ కుమార్
India Pride Project | దేవుళ్లకు రక్షకుడు ఈయన.. ఇంతకీ ఏం చేస్తాడు?”
కాళ్లు, కండ్లు లేకపోయినా నలుగుర్ని నడిపిస్తున్నరు.. వైకల్యానికే సవాలు విసురుతున్నరు”
“అమెరికా అధ్యక్షుడికే పట్టు శాలువాను పంపిన సిరిసిల్ల యువకుడు చేసిన అద్భుతాల గురించి తెలుసా”
“నాసాలో జాబ్ వదిలేసి.. రైతుల కోసం కష్టపడుతున్నడు”