ఓ నలుగురు ఇంజినీర్లు సత్సంకల్పంతో కలిస్తే.. నూతన ఆవిష్కరణ పురుడు పోసుకుంటుంది. అదే నలుగురు వైద్యులు ఒకే ఆలోచనతో దగ్గరైతే.. రోగికి భరోసా వస్తుంది. వచ్చిన రుగ్మతేంటో తెలియక, ఆ వ్యాధికి చికిత్స ఎక్కడ తీసుకోవాలో అవగాహన లేక తల్లడిల్లుతున్న వారు ఎందరో! వారికి మేమున్నామంటూ ధైర్యాన్నిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ఈ నలుగురు యువ వైద్యులు. డాక్టర్.నెట్ వేదికగా సరైన వైద్యానికి చిరునామా చెబుతున్నారు. ఫోన్ కాల్ చేస్తే చాలు.. ఏ వైద్యుడిని, ఎప్పుడు సంప్రదించాలో సూచిస్తున్నారు.
అందుబాటులో ఎన్ని ఆస్పత్రులు ఉన్నా.. సరైన చికిత్స అందుతున్నది ఎందరికి? తమకు ఎందుకు సుస్తీ చేసిందో కూడా తెలియకుండా ఎందరో రోగులు.. రకరకాల స్పెషలిస్టులను కలుస్తున్నారు. మరికొందరు వ్యాధి ముదిరే వరకు వైద్యానికి దూరంగా ఉంటున్నారు. వెరసి అవగాహన లేమితో గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారికి అండగా నిలవాలనుకున్నారు యంగ్ డాక్టర్లు రమణారెడ్డి (ఎంబీబీఎస్), ధన సత్యసాయి (ఎంబీబీఎస్), నటేష్ (ఆర్థోపెడిక్), ధీరజ్‌కుమార్ (ఈఎన్టీ).
ఈ మిత్ర బృందం చేస్తున్న సేవలకు గానూ ఐకానిక్ సేవ, పూర్ణ నంది అవార్డ్, ప్రతిభ పురస్కార్, ఎన్టీఆర్ సేవా అవార్డులు వరించాయి. పవిత్రమైన వైద్య వృత్తిని కాపాడాలంటే ముందుగా రోగికి సరైన వైద్యం అందిచడం అవసరం అంటారీ యువ వైద్యులు. మెరుగైన సత్వర సేవలు అందించే లక్ష్యంతో త్వరలో డాక్టర్.నెట్ యాప్‌నూ అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు.
హైదరాబాద్‌లో ఉంటూ వైద్యవృత్తిలో సేవలు అందిస్తున్న ఈ నలుగురూ అనుకోకుండా స్నేహితులు అయ్యారు. అందరి వృత్తి ఒకటే! అంతకుమించి సమాజానికి సేవ చేయాలన్న సంకల్పం ఉన్నవారే! ఆ సామాజిక స్పృహే ఈ వైద్యులను మంచి మిత్రులను చేసింది. అయితే ఈ మిత్రబృందం డాక్టర్.నెట్ నెలకొల్పడానికి ఓ సంఘటన ప్రేరణగా నిలిచింది. ఓ రోజు వీరంతా తమకు తెలిసిన ఒక పెద్దాయన ఆస్పత్రిలో చేరాడని పరామర్శించడానికి వెళ్లారు. అప్పటికే ఆయన మరణించాడన్న వార్త విని కలత చెందారు. ఇంతలోనే ఇలా ఎలా జరిగిందని ఆ పెద్దాయన కుటుంబ సభ్యులను అడిగారు. వాళ్లు చెప్పిన మాటలు విని హతాశులయ్యారు.
షుగర్‌తో బాధపడుతున్న ఆ పెద్దాయనకు అకస్మాత్తుగా మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని వైద్యుణ్ని సంప్రదించారు ఇంట్లోవాళ్లు. రోగి కుటుంబసభ్యులు చెప్పిన విషయాలు విన్న వైద్యుడు సైక్రియాట్రిస్ట్‌కు చూపించమన్నారు. అలాగే మానసిక వైద్యనిపుణుడి దగ్గరికి వెళ్లారు. తనకు తోచిందేదో ఆయన చెప్పారు. ఈలోపు పుణ్యకాలం కాస్తా పూర్తయింది. ఆ పెద్దాయన కండీషన్ క్రిటికల్‌గా మారింది. చివరికి పెద్దాసుపత్రికి తీసుకువెళ్లినా… పరిస్థితి చేజారిపోయింది. ఖరీదైన వైద్యం అందించినా ఇంటిపెద్ద ప్రాణాలను కాపాడుకోలేకపోయారు. ఈ సంగతి విన్న నలుగురు వైద్యులకూ తప్పు ఎక్కడ జరిగిందో తెలిసింది. సరైన సమయంలో, సరైన వైద్యుణ్ని సంప్రదించకపోవడం వల్లే ఆయన ఆ కుటుంబానికి దక్కకుండా పోయారని గుర్తించారు. ఆ పరిస్థితి మరెవరికీ రావొద్దని నడుం బిగించారు.
నాగరికత ఎంత పెరుగుతున్నా, సాంకేతికత మరెంత అందుబాటులోకి వచ్చినా.. ఇప్పటికీ అసలు ఏ రోగానికి, ఏ వైద్యుణ్ని సంప్రదించాలో చాలామందికి తెలియదు. గ్రామీణ ప్రాంతం వారికి మాత్రమే కాదు, పట్నవాసులకూ ఇలాంటి విషయాలపై సరైన అవగాహన లేదు. ఈ పరిస్థితిలో మార్పును ఆశిస్తూ ఈ నలుగురు వైద్యులు అధ్యయనం చేశారు. రోగులకు సరైన సమయంలో, సరైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో 2024లో డాక్టర్.నెట్ నెలకొల్పారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఇది ఉచిత సేవలు అందిస్తుంది. ఇక్కడి హెల్ప్‌లైన్ 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉంటుంది. నలుగురిలో ఎవరో ఒకరు కాల్ అటెండ్ చేస్తారు. తమను సంప్రదించిన రోగి వ్యాధి లక్షణాలు, సమస్యలు తెలుసుకొని, వైద్య సలహాలు ఇవ్వడంతోపాటు సంబంధిత దవాఖానలు, వైద్యుల వివరాలు రోగులకు చేరవేస్తారు.
ఒకవైపు దవాఖానల్లో తమ వృత్తిని నిర్వహిస్తూనే, మరోవైపు ఎలాంటి లాభాపేక్ష లేకుండా డాక్టర్.నెట్ మెడికల్ సర్వీస్ అందిస్తున్నారు. వెబ్సైట్, వాట్సాప్, మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 5,000 మందికి పైగా రోగులకు ‘ఉచిత’మైన వైద్య సూచనలు అందజేశారు. అంతేకాదు రోగి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని తమకు తెలిసిన వైద్యులతో ఉచితంగానే వైద్యం చేయించిన దాఖలాలూ ఉన్నాయి. వైద్య సలహాలు ఇవ్వడం వరకే పరిమితం కాలేదు వీళ్లు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారు కార్పొరేట్ దవాఖానల్లో చేరుతుంటారు.
చికిత్సకు అయ్యే ఖర్చు ఒక్కోసారి ఇన్సూరెన్స్ పరిధిని మించుతుంది. రోగి సలహా కోసం ఫోన్ చేసినప్పుడే.. ఇన్సూరెన్స్ ఎంతుందో తెలుసుకొని, ఆ పరిమితిలోనే వైద్యం అందించే మేలైన ఆస్పత్రి వివరాలు తెలియజేస్తారు. ఈ మిత్ర బృందం చేస్తున్న సేవలకు గానూ ఐకానిక్ సేవ, పూర్ణ నంది అవార్డ్, ప్రతిభ పురస్కార్, ఎన్టీఆర్ సేవా అవార్డులు వరించాయి. పవిత్రమైన వైద్య వృత్తిని కాపాడాలంటే ముందుగా రోగికి సరైన వైద్యం అందిచడం అవసరం అంటారీ యువ వైద్యులు. మెరుగైన సత్వర సేవలు అందించే లక్ష్యంతో త్వరలో డాక్టర్.నెట్ యాప్‌నూ అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. తమ సేవలు కావాల్సిన వాళ్లు 90002 99892, 99084 50055, 91773 66423 ఫోన్‌నెంబర్లు (24 గంటలు) సంప్రదించాలని సూచిస్తున్నారు. రోగులకు సరైన వైద్యం అందించడమే మెరుగైన సాయమని భావిస్తున్న ఈ వైద్యులకు మనమూ హ్యాట్సాఫ్ చెబుదాం!