Dasara | దసరా! జగన్మాతను కొలిచే వారికి… పది రోజులపాటు తనివితీరా చేసుకునే పండుగ. ఆస్తికులకు రకరకాల సంప్రదాయాలను గుర్తుచేసే వేడుక. దసరా ఒక్కరోజులో ముగిసేదీ కాదు, ఒకేతీరున జరిగేదీ కాదు. బతుకునే ఓ దేవతగా భావించే అరుదైన ఘట్టం బతుకమ్మ.. ఈ సమయంలోనే తెలంగాణలో ఆవిష్కృతం అవుతుంది!
అప్పటివరకూ పడిన వర్షాలకు చెట్లన్నీ నిండుగా, రంగురంగుల పూలతో కళకళలాడుతుంటే… ప్రకృతే బతుకమ్మ ఆడుతున్నదా అనేంత గొప్పగా ఉంటుందీ కాలం. జనం వనంతో కలిసి ఆడిపాడేందుకు ఇంతకంటే గొప్ప సందర్భం ఇంకేముంది? దసరా గురించి తలుచుకునేందుకు చాలా కబుర్లే ఉన్నాయి. రాజస్థాన్లో వీరులను తలుచుకునే పండుగలా మార్చుకున్నా, బెంగాల్లో గణపతి నవరాత్రుల్లాగానే పందిళ్లు వేసి అమ్మవారిని ఆరాధించి నిమజ్జనం చేసినా… దేశవ్యాప్తంగా దసరా సమయంలో కనిపించే హడావుడే వేరు. కేవలం ఆధ్యాత్మిక వైభవంగానే కాకుండా వ్యక్తిత్వ వికాసంగానూ దసరా కొన్ని కబుర్లు చెబుతున్నది!
దశ- హరుడు- దశ కంఠుడైన రావణుని వధించిన రోజే దసరా అయ్యిందని ఓ నమ్మకం. ఆ పది తలల వెనుక అంతరార్థం అదుపు తప్పిన అహంకారమనీ, అది వినాశనానికి దారి తీస్తుందనీ పెద్దల హెచ్చరిక. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాల మీద అదుపు సాధించాలన్న సూచన కూడా ఇందులో కనిపిస్తుంది. ఈ రావణ సంహారం నేపథ్యంగా ఉత్తరాదిన జరిగే రామలీల ఉత్సవాల గురించి తెలిసిందే. తులసీదాసు ‘రామచరిత మానస్’లోని దోహాలనే సంభాషణలుగా మార్చుకుని సాగే రామగానం, దశమి రోజున జరిగే రావణ దహనం… సామాన్య భక్తుల ఆచరణలో సంప్రదాయం ఎంత పదిలంగా ఉందో చెబుతుంది. అందుకే యునెస్కో సైతం రామలీలను సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది.
చలనం లేకపోయినా, స్పందన చూపించకున్నా… దున్నపోతుతో పోలుస్తూ సామెతలు వినిపిస్తాయి. మందకొడిగా ఉండటం, విచక్షణ లేకపోవడం, లెక్కలేనితనం లాంటి లక్షణాలకు మహిషం ప్రతీక. ఆ మహిష రూపంలో ఉన్న రాక్షసుడితో తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసిందే మహిషాసురమర్దిని. కొన్ని ఆలయాలలో దసరా అంటే మహిషాసురుడి మీద విజయాన్ని వేడుకగా చేసుకోవడమే. ఆ మహిషపు లక్షణాలను తరిమికొట్టి సహానుభూతి, స్పందించడం, వివేకంతో ఆలోచించడం, యుక్తిగా ప్రవర్తించడం లాంటి లక్షణాలను అలవర్చుకోమని సూచిస్తుంది దసరా. ఇప్పటి మైసూరు ఒకప్పటి మహిషపుర అనీ, ఇక్కడే మహిషాసురుడి వధ జరిగిందని ఐతిహ్యం. ఆ అనుబంధంతోనే కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కనిపిస్తుంది. మైసూరు దసరా ఉత్సవాలంటేనే అదో కోలాహలం. మహిషాసురుడిలా ఉండకూడదనే సూచన కూడా!
ఎంతటివారికైనా సరే కష్టాలు వస్తాయి, తగ్గి ఉండాల్సిన పరిస్థితులూ వస్తాయి. కాస్త ఓపిక పట్టాలి. కాలం మారేదాకా సహనంతో మెలగాలి. నైపుణ్యాలను సైతం మన మనసులోనే దాచుకోవాలి. ఈ విషయాన్ని నిరూపించేదే అజ్ఞాతవాసం. పన్నెండేండ్ల పాటు వనవాసం చేశాక… ఒక ఏడాదిపాటు అజ్ఞాతవాసం చేయాలనే నిబంధనతో బయల్దేరారు పాండవులు. ఒకవేళ అజ్ఞాతవాసంలో వారి అసలు రూపం బయటపడిపోతే… మళ్లీ పన్నెండేండ్ల వనవాసం చేయాల్సి ఉంటుంది. అందుకే విరాటరాజు కొలువులో చేరారు పాండవులు. అది కూడా ఎలా? గోవులను కాస్తూ ఒకరు, గుర్రాలను మేపుతూ ఇంకొకరు! అరివీర శూరుడైన అర్జునుడు బృహన్నలగా మారాడు. భీముడు వంటమనిషి అవతారం ఎత్తాడు. ధర్మరాజేమో విరాట రాజు కొలువులో కంకుభట్టుగా చేరాడు. దసరా రోజునే వారి అజ్ఞాతవాసం ముగిసింది. జమ్మిచెట్టు మీద ఉన్న తమ అస్త్రశస్ర్తాలను బయటకు తీసి యుద్ధానికి సిద్ధమయ్యారు. జమ్మిపూజ వెనక కథ ఇదే. దసరా సందర్భంగా చేసే ఆయుధపూజ నేపథ్యమూ ఇదే.
దసరా సందర్భంగా ఒక్కోరోజు ఒక్కో అలంకరణ/ రూపంలో అమ్మవారు కనిపిస్తారు. స్థానిక సంప్రదాయాల ప్రకారం ఇవి మారుతూ ఉంటాయి. అందుకే శ్రీశైలంలో ఒకలా ఉంటే, విజయవాడలో మరోలా ఉంటుంది. కాస్త గమనిస్తే ప్రతీ అలంకరణలోనూ కనిపించే రూపం వెనుక ఎన్నో సూత్రాలు వినిపిస్తాయి. ఉదాహరణకు సరస్వతి అన్న పేరు దగ్గర నుంచి తన చేతిలోని పుస్తకం, వీణ, అక్షమాల, కమలం, హంసవాహనం, ధవళవస్ర్తాలు… అన్నీ కూడా వ్యక్తిత్వ వికాసానికి సూచనలే!