తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని కీల్‌కట్టలైలో ‘తవమోళి అన్నదాన కూడం’ ఆకలి కడుపులకు ఓ వరం. అన్నం కోసం ఆవురావురంటూ వెళ్లే వాళ్లకు ఇక్కడ అన్నం, చిరుధాన్యాల ఉప్మా, వేడివేడి సాంబారు, నంచుకోవడానికి ఓ కూర, రసం, ఓ గ్లాసెడు మజ్జిగ ఉచితంగా దొరుకుతాయి. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పక్కవాళ్ల ఆకలి పట్టించుకోని వాళ్లున్న కాలంలో… నాలుగున్నరేండ్లుగా కీల్‌కట్టలైలో అన్నదానం జరుగుతున్నది. 36 ఏండ్ల ఉమారాణి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆమె ఒకప్పుడు తిరువణ్నామలైలో నర్సింగ్ బోధించేవారు. ఇప్పుడు రోజుకు పదులకొద్ది మందికి క్షుద్బాధ తీరుస్తున్నారు. ఎవ్వరూ కూడా ఆకలికి ఉండొద్దనేది ఆమె అభిమతం. ఇలా ప్రతిరోజూ ఉపాహారం, రెండు పూటలా భోజనం పెడుతున్నారు.
ఉమారాణి ఉన్నత చదువులు చదివే ప్రయత్నంలో ఆమెకు డబ్బు అవసరమైంది. అప్పుడు అరణిలో ఆమె పొరుగున ఉండే ఓ పెద్దాయన తన పెన్షన్ నుంచి కొంత డబ్బిచ్చి సాయం చేశాడు. ఇది ఆమె జీవిత దృక్పథాన్ని మార్చివేసింది. ఇతరులకు సేవ చేయడం వల్ల జీవితానికి ఎంతో కొంత అర్థం ఉంటుందని తెలియజేసింది. అలా పదహారేండ్ల కింద నర్సింగ్ ట్యూటర్‌గా ఆమె సేవా ప్రయాణం మొదలుపెట్టారు. కొవిడ్ 19 కష్టకాలంలో ప్రజలు ఆకలితో బాధపడ్డ వైనం ఆమెను కలిచివేసింది. అప్పుడే అన్నార్తులకు ఆహారం ఉచితంగా అందించాలని ఉమారాణి నిర్ణయించుకున్నారు. ఇప్పుడది ఎంతోమందికి ఆసరా ఇస్తున్నది. తాను దాచుకున్న మొత్తంలోంచి, చెన్నై నగర శివార్లలో ఉన్న తన పాలియేటివ్ కేర్ సెంటర్ ద్వారా లభించే ఆదాయంతో ఆమె ఈ అన్నదానం నిర్వహిస్తున్నారు. కొంతమంది విరాళాలు కూడా ఇస్తున్నారు. అయితే, ఇది తన ఆహార సేవకు సరిపోవడం లేదంటారు ఉమారాణి.
ఇక తవమోళి అన్నదాన కూడం నుంచి ఆహారం అందుకునే వాళ్లలో ఇండల్లో పనిచేసేవాళ్లు, రోజుకూలీలు, అభాగ్యులు, కుటుంబాలు పట్టించుకోనివాళ్లు ప్రధానంగా ఉంటారు. ఆదాయం అంతంత మాత్రమే ఉండి పెద్దమొత్తంలో చెల్లించి భోజనం కొనుక్కోలేని వాళ్లకు ఉమారాణి ‘అన్నదాన కూడం’ అభయమిస్తున్నది. వంటపనిలో ఉమారాణికి ఆమె ఇద్దరు పిల్లలు సాయం చేస్తారు. కొన్నిసార్లు తెలిసినవాళ్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. అన్నార్తుల కడుపులు నింపుతున్నందుకు ఉమారాణిని స్థానికులు “అన్నపూర్ణ” అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. తవమోళి అన్నదాన కూడం అంటే… ఆకలితో వచ్చిన వాళ్లకు ప్రేమతో అన్నంపెట్టే చోటని అర్థం. నిజమే… అన్నదానం ప్రేమగా చిత్తశుద్ధితో చేయాల్సిన పని.