‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
చెట్లమీది పూలన్నీ బతుకమ్మల పేరంటానికి ఇండ్లకు చేరినట్లు.. పొద్దుగూకే వేళ పక్షులన్నీ చెట్లమీదికి చేరుకున్నట్లు.. అత్తగారిండ్లకు పోయిన ఆడబిడ్డలు బతుకమ్మ పండుగకు తల్లిగారిండ్లకు చేరుకుంటరు. ఆడబిడ్డల రాకతో.. ఊరినిండా రంగురంగుల సీతాకోక చిలకలు వాలినట్లు, నగల ధగధగలతో, గాజుల గలగలలతో, గజ్జెల చప్పుళ్లతో, గంధపు సువాసనలతో.. ఊరు కొత్త పెండ్లికూతురులా ముస్తాబై మురిసిపోతది.
ఇక చిన్ననాటి ముచ్చట్లతో అరుగులు, బతుకు కష్టాల వలపోతతో మంచినీటి బావులు, మసక చీకట్లో వాకిట మంచాలమీద కూర్చోని పంచుకునే మాటల మూటలు, గుండెలనిండా దాగిన జ్ఞాపకాలను ఒంపుకొంటూ, గుండెచాటు గాయాలను తడిమి చూసుకుంటూ.. సంతోషాల పల్లకిలో ఊరేగుతూ, మనసు పొరల ఒరిపిడికి ఇంకిన కన్నీళ్లను ఓదార్చుకుంటూ.. ఇలా పసందైన మాటలతో, ఘాటెక్కిన వాదనలతో, మసాలా సంగతులతో ఊరంతా కుతకుతలాడుతది.
“అమ్మక్కో.. ఓ భూలచ్చిమి.. గౌరక్కా.. ఇంకా లేవలేదానే!? మబ్బుల్నే లేసి గాయిగాయి గత్తరగత్తర సేసేటిదిగాదె నీ ముద్దుల బిడ్డ! అవ్వల్లో ఇంకా లేవనే లేదా!? అవునుగాదు!? మరిసేపోయిన! ఇగ అక్క ఊరికొత్తాందని రాత్రి మా బావ గౌరక్కని నిద్రపోనిచ్చినట్లు లేదు! అందుకే మస్తుగ నిద్రవోతాంది” అంది గౌరి వాళ్ల పిన్ని బిడ్డ సీత.
“ఓ పొల్లా.. ఏం మాటలే గవి? పోయి మీ అక్కని లేపుకోరాదే? ఈ పోరికి పెండ్లయినా ఇవురం రాలేదు. దీని మొగడు ఎట్లేగుతాండో ఏందో దీంతోని!?” అంది.. వాకిలి ఊడుస్తున్న గౌరి తల్లి భూలక్ష్మి. “అమ్మక్కా.. తమ్మున్ని సుత తోల్కపోతానం పూలు తెంపనీకి, గౌరక్కని లేపకులే.. దానిగ్గూడా మేమే కోసుకొత్తంతీ! పాపం దాన్ని పండనీయి” అంటూ గిరుక్కున మళ్లిపోయింది సీత. గొడ్లకొట్టంలో పెండకళ్లు తీస్తున్న సీత తండ్రి వెంకన్న..
“ఇగో.. నిన్నేనే?.. ఓపాలిట్రా?” అని వాకిట్ల అలుకు జల్లుతున్న భార్యను పిలిచిండు. “ఏందయ్యా..! అగ్గో.. గట్ల ఏడవబడ్తివి! పానం గిట్ల మంచిగలేదా ఏంది! జర్రుండు జప్పున గిన్ని మంచినీల్లు తెత్త”.. అంటున్న భార్యను ఆగమని చెయ్యితో ఇషారా చేసి.. పెండ్లాం దగ్గరికి వచ్చిండు వెంకన్న.
“నిన్న గౌరవ్వను తోల్కరాను బోయిన గదనే.. ఆళ్ల అత్త బిడ్డను సాగనంపుకొంట అనరాని మాటలన్నదే! ‘లగ్గమై గిన్నొద్దులైనా పిల్లాజెల్లా లేని గొడ్డుబోతు దానివి! మాకేడ దాపురించినవే!’ అని శాపనార్థాలు వెట్టిందే. ‘ఈపాలి మీ అవ్వకు జెప్పి డాక్టరుకు జూపించుకొని రా! రొండ్నెల్లల్ల కడుపున కాయబడకుంటే.. నా కొడుక్కు ఇంకో లగ్గంజేత్త! ఇగ నువ్వు మీ అవ్వగారింటికి బోతవో.. అడక్క తింటవో నీ ఇట్టం!’ అని పిల్లను ఎట్లబడితే గట్లన్నదే! ఆ మాటలింటాంటే పానం సచ్చిపోయిందే! ఇగ గౌరవ్వ దారిపొంటంతా ముదాం ఏడుత్తనే ఉందే! భగమంతుడు కట్టాలన్నీ మనకే బెట్టినట్టుండే!” అంటూ.. కండ్లనీళ్లు తుండుగుడ్డతో తూడ్సుకుంటా..
“సరెతీ.. పదిల పదకొండు అప్పోసప్పో జేద్దాం గని, బిడ్డను ఇయ్యల్నో రేపో పట్నం దోల్కపోయి మంచి డాట్టర్కు చూపించే!” అన్నడు వెంకన్న పెండకళ్లను తట్టలకు ఎత్తుకుంటూ.
“దాన్నోట్లె మన్నువడ! దాని తలపండు వలుగ! దొంగముండ.. బిడ్డను రాసి రంపాన వెడ్తానట్లుంది. దాని నోటికి జడిసి బిడ్డ బువ్వగూడా సక్కంగ తింటానట్లు లేదు. పోరి దవుడలన్నీ గుంజుకపోయి చెంపలు లొట్టలువడి, యాడికాడికి ఎండుకపోయింది. బతుకమ్మ పండుగంటే బిడ్డకు పానం లెక్కుండేది. ఊల్లె పూలు, సెర్ల పూలు కోలుముందే తెంపి తెస్తుండె బిడ్డ. ఇప్పుడు పండుగన్న కయాలే లేకుండ బోయింది బిడ్డకు. ఈ పెండ్లిమీద మన్నువడ.. పెండ్లి దాని నెత్తిన నిప్పులు వోసి.. సంతోషాన్ని దిగమింగింది! అయినా దొంగబొడ్డి.. అదిగూడా ఆడిదేగదా! నాలుగొద్దులు ఆల్సమైతే గొడ్డుబోతని పేర్ల వెడతదా? ముందు దాని కొడుకును దవఖానాల జూపుమను. దుక్కిదున్నంగనే పంట పండుద్దా!? ఇచ్చాంత్రం గాకుంటే.. గట్టి ఇత్తనం పడొద్దా ఏంది?”
అని కాసేపు దమ్ము దీసి..
“నువ్వు సూత నామాట ఇన్నవా? వద్దయ్యా! పట్నపోళ్ల సంబంధం అంటే ఇనకపోతివి. ‘బిడ్డ కట్టపడొద్దే.. మనలెక్క మట్టి పిసుకద్దే!’ అని తన్లాడితివి. ఇప్పుడు జూడు దాని గతేమైందో!?..” అని వలవల ఏడ్చింది భూలక్ష్మి.
కండ్లు నలుపుకొంట వాకిట్లకొచ్చిన బిడ్డను జూసి.. పెండ్లాం మొగలిద్దరు ఏం తెలియనట్లు మాట మడతబెట్టిండ్రు.
“అవ్వా! నేను ముగ్గెయ్యనానే?” అంది గౌరి.
“అద్దుతీ బిడ్డ! నువ్ బోయి మొఖం గడుగు. నేను చాయివెడ్త” అంది భూలక్ష్మి.
బాయి గట్టున కూసోని ఆలోచనల్లో మునిగింది గౌరి. ఎట్లాంటి బతుకు.. ఎట్లయిపాయే! పది అయిపోంగనే.. ‘ఇగ సాల్తీ!’ అని సదువకుండ జేసిరి. మంచి సంబంధం, పిల్లగానికి పట్నంల నౌకరని.. అప్పులు జేసి, ఉన్నదమ్మి కట్నం పోసి లగ్గం జేసిరి. తమ్ముడు జూడ చిన్నపోరడు. అమ్మ నాయినలు తిని తినక రెక్కలు ముక్కలు జేసుకొన్నా.. సాలి సాలని బతుకులు. ఆడ జూద్దమా.. అత్త జూస్తే రాకాసి. మామ ఉన్నా లేనట్లే! ఇగ ఆన్ని మొగడన్నా మొద్దన్నా ఒకటే! పెండ్లాం పక్కలపంటే పక్కకు మల్లి పంటడు. ఇప్పటిదాక పెయిమీన సెయ్యేసి ఎరగడు. ఇగ పిల్లలు పిల్లలని అంటే నీనేడతెద్దు!? ఏం జేద్దు?.. అని గుడ్లల్ల నీళ్లు నింపుకొన్నది.
వాన్ని నిలదీస్తే బెదిరిత్తాండు. ‘బైటికి జెప్తే నీ ఖాందాన్ మొత్తాన్ని నడిబజార్ల నరుకుత!’ అని బయపెడ్తాండు. మరి పిల్లల సంగతి ఎత్తొద్దని మీ అవ్వకు జెప్పుమంటే.. ‘నేం జెప్పను! ఎవని దగ్గరన్న పండి పిల్లలను గను!’ అని గలీజు మాటలంటాండు. అమ్మ నాయినలకు ఏం జెప్పాల్నో, ఎట్ల జెప్పాల్నో తోస్తలేదు. చెప్తె యాడ గుండె పగుల్తరోనని బుగులైతాంది. ఇగ దేవుడు నాకు సావురాతే రాసిండేమో! ఈ పండుగెల్లుడు నా పీనుగెల్లుడు ఒకటే గావాలె! గంతకన్నా తోవలేదు.. అని తీర్మానించుకుంది. కానీ, ఇగ ఉన్నన్ని రోజులు నా బాధ అమ్మ నాయినలకు తెల్వనీయొద్దు! సంతోషంగా ఆఖరి బతకమ్మ ఆడి.. గౌరమ్మ గంగలో కలిసినట్లు నేనుసుత ఆ గంగల్నే కలిసిపోత! అనుకుంది గౌరి..
“గౌరవ్వా! ఎంతసేపే? చాయి సల్లార్తాంది జప్పున రా బిడ్డా!” అన్న తల్లి మాటలతో… ఆలోచనలు బందువెట్టి..
“ఆ.. అత్తాన్నే” అంటూ గబగబా మొఖం కడుక్కొని పోయింది గౌరి. అవ్వ కొంగుతో మొఖం తూడ్సుకుంటాంటే.. చిన్నతనం యాదికొచ్చింది. అవ్వ కొంగంటే పిల్లలకు దాపుడు పెట్టె. ఎక్కడ తినేది దొరికినా అవ్వ చెంగున ముడేసి పిల్లపచ్చులకు తల్లి పచ్చి తెచ్చినట్లు తెచ్చిపెట్టేది. కాయో, పండో, అప్పాలో.. చివరకు చిల్లర పైసలుసుత అవ్వ కొంగున్నే దొరికేయి. అవ్వ కొంగు అక్షయపాత్ర. ఆ కొంగు ఎండకు వానకు గొడుగు పట్టేది. జరమొచ్చినా, పడిశంపట్టినా అవ్వకొంగే ఆసరా అయ్యేది.. ఇప్పుడు సుత గుడ్లనీళ్లు కనపడకుండా అవ్వకొంగే కాపాడింది అనుకుంది గౌరీ.
అవ్వ ఇచ్చిన చాయి అమృతం కన్నా ఎక్కువే!
“అవ్వా! చాయిల గిన్ని కారపు సుట్టలు పోయరాదే!” అంది గౌరి.
“మాపటేల తిందువులే బిడ్డా! ఇయ్యాల ఎంగిలిపూలు. ఒక్కపొద్దుండి బతుకమ్మ పేర్వు! తమ్ముడు తంగెడుపూలకు పోయిండు. జప్పన్నే అత్తడుతీ!” అంది భూలక్ష్మి. తలదీపార స్నానం చేసి, కొత్తచీర కట్టుకొని, నిండుగా అలంకరించుకొని, నట్టింట్ల సాపేసి, సిబ్బిల బీరాకులు పరిసి.. తంగేడుపూలతో బతుకమ్మ పేర్చి.. దేవుని ముందు పెట్టి పూజించి, అగరొత్తులు అంటించి, కొబ్బరికాయ గొట్టి, నీల్లారబోసి దండం బెట్టుకుంది గౌరి.
“మంచిగ మొక్కుకో బిడ్డా! అచ్చే ఏడు సంకల బిడ్డతోని బతుకమ్మను ఆడిపియ్యమని గౌరిదేవికి మొక్కుబిడ్డ” అంది భూలక్ష్మి.
‘పిచ్చితల్లి.. కాపురం జేయని మొగనితోని పిల్లల గనుమంటే దేవుడేంజేత్తడు? మన తలరాతే సక్కగ లేనప్పుడు ఎంతమొక్కితే ఏమొస్తది?’ అని మతిల అనికోని, కండ్లు మూసుకొని..
‘ఏ బాధ లేకుండా.. ఎవ్వరినీ బాధవెట్టకుండ నువ్వు గంగలో కరిగినట్లు, నన్ను నీలో కలుపుకో తల్లీ! మా అవ్వను, బాపును, తమ్ముణ్ని సల్లంగా సూడమ్మా!’ అని మొక్కింది గౌరి. గుండె దిటవు చేసుకున్నాక ధైర్యం తెచ్చుకొని, ఉన్న నాలుగురోజులు సంతోషంగా ఉండాలె అనుకున్నది గౌరి.
* * *
ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నాన బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ (ఆరో రోజు బతుకమ్మ ఆడరు), వేపకాయ బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ.. పండగన్ని రోజులు తీరొక్క చీరగట్టింది. రంగు రంగుల పూలతోని భక్తిగా బతుకమ్మను పేర్చింది. రోజుకో నైవేద్యం పెట్టింది. తమ్మునికి బుద్ధిమాటలు చెప్పింది. నాయిన కాళ్లు పట్టింది. అమ్మ తలకు నూనెరాసి కొప్పుపెట్టింది. అందరితో ప్రేమగా మాట్లాడింది. ఆట పాటలతో అందరినీ సంతోషపెట్టింది. కానీ, గుండెల్లో రగిలే నిప్పుల కొలిమిని, మనసులో ఆగని దుఃఖపు ముసురును, మళ్లీ ఆడలేని బతుకమ్మను, ఆడకుండానే ఓడిపోయిన బతుకును.. తలచినప్పుడల్లా రంగులు మారే మొఖాన్ని, నవ్వుల బుర్ఖా చాటుకు నెట్టేసింది గౌరి.
“బిడ్డా.. దవాఖానకు పోదామానే?” అని తల్లి ఎన్నిసార్లన్నా..
“సద్దుల బతుకమ్మ తెల్లారి పోదాంతీ!”.. అని నచ్చచెప్పింది గౌరి.
ఆ ఖర్చు సుత తన ఆఖరి పయానానికి అక్కరకొత్తయని మదిల తలిచింది. ఆరోజు సద్దుల బతుకమ్మ. అందని కొమ్మల తంగేడు పూలు, అంతులేని లోతుల తామరలు, కలువలు, గౌరమ్మకు ఇష్టమైన గుమ్మడిపూలు, దేవుండ్లకు ఇష్టమైన మందారాలు, పొన్నలు, పొగడలు, సీతమ్మ జడలు, గునుగుపూలు, బంతులు, చేమంతులు, గోరింటలు.. అన్నిటిని బీరాకులు పరిచిన పెద్ద తాంబాళంలో దొంతులుగా పెట్టి.. బతుకమ్మను పేర్చి, బతుకమ్మ శిఖరాన పసుపుతో గౌరమ్మను చేసి అలంకరించింది. దేవుని దగ్గర బతుకమ్మను పెట్టి సత్తుపిండి, పెరుగన్నం, పులిహోర, మలీద ముద్దలు, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యంగా పెట్టి, కొబ్బరికాయ కొట్టి హారతిచ్చింది గౌరి.
అమ్మ, నాయినల కాళ్లకు మనసారా మొక్కింది. ‘అమ్మ, నాయినల రుణం తీర్చుకోకుండానే ఎల్లిపోతాన! మళ్లీ జన్ముంటే కొడుగ్గానో, ఎద్దుగానో, నాగలిగానో మీ ఇంట్ల పుట్టి రుణం తీర్చుకుంట!’ అనుకుంది. గౌరిని చూసిన తల్లి.. తనదిష్టే బిడ్డకు తగుల్తదని, గౌరి అరికాలికి దిష్టిబొట్టు పెట్టింది. రెండుచేతులతో తల నిమిరి మెటికలు విరిచింది. వేళ్లు పటుక్కున విరిగాయి.
గౌరి పేర్చిన బతుకమ్మ సద్దుల పండుగకే వన్నె తెచ్చింది. ఈఏడు ఊళ్లె గౌరిదే పెద్ద బతుకమ్మ. భూలక్ష్మి పిల్ల బతుకమ్మను, గౌరి తల్లి బతుకమ్మను తలకెత్తుకున్నారు. నైవేద్యాల గిన్నెతో తమ్ముడు తోడునడవంగా.. డప్పు చప్పుళ్లతో, వాడకట్టు బతుకమ్మలన్నీ వెంట నడువంగ.. దివినుండి దిగిన అప్సరసలా నడుస్తూ.. దేవునిగుడి దగ్గర సద్దుల బతుకమ్మ ఆఖరి ఆటకు బైలెల్లింది గౌరి.
డప్పు చప్పుళ్లు, చుట్టూ జనాలు.. రేపుకూడా ఇంతేగా..? ఇప్పుడు సంతోషంగా నడిచే ఈళ్లందరూ రేపు నన్ను గుర్తు చేసుకుంటూ.. ఏడుస్తూ నడుస్తరు. నాయిన నా ముంగట నడుస్తడు. ఇవన్నీ అప్పుడు నాకు అగుపడవు.. ఈ ఆలోచనలు మనసులో ముసరగానే గౌరి కండ్లు నీటి చెలిమలైనయి.
ఆ పొద్దు ఎన్నడూ ఆడని బతుకమ్మ ఆడింది గౌరి. ఎప్పుడూ గొంతిప్పని గౌరి.. ఎన్నెన్ని పాటలు పాడిందో! దోస్తులతో కూడి దస్తిబిస్తి ఆడింది. చెమ్మచెక్కలాడింది. జంటలుగా విడిపోయి ఎదురుకోళ్లాడింది. కూసోని కాళ్లతో ఆడే తుమ్మిస ఆడింది. అలిసిపోయేదాక ఆడిపాడి.. అందరితో కలిసి బతుకమ్మను సాగనంపనీకి పెద్ద చెరువుకు చేరుకుంది గౌరి.
అమ్మా, నాయిన, తమ్ముడు సాయం పట్టంగా.. బతుకమ్మతో చెర్ల దిగింది. పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా.. ఇచ్చుకుంట వాయినం, పుచ్చుకుంటి వాయినం.. జోరుగా సాగే బతుకమ్మ పాటలు, మంగళహారతులు, వాయినాల పాటలతో రేవంతా సందడిగా ఉంది. దీపాలతో తేలే బతుకమ్మలతో చెరువు వెలుగుపూల తోటలా కనిపిస్తాంది. పిల్ల బతుకమ్మను విడిచి, అందరూ కలిసి పెద్ద బతుకమ్మను కొంచెం లోతుకు వెళ్లి విడిచి పెడుతున్నారు.
‘గౌరమ్మా.. నీతోపాటు నన్నూ గంగలో కలుపు తల్లీ!’ అని గౌరమ్మకు మొక్కి..
‘నీ దీపం కొండెక్కక ముందే.. నా దీపాన్ని కొండెక్కించు తల్లీ!’ అని మనసులో చివరిసారి మొక్కుకుంది. అవ్వ మొఖం చూసింది. పిచ్చితల్లి బిడ్డ చానా సంతోషంగా ఉందని అమాయకంగా మురిసిపోతాంది. తండ్రి కళ్లల్లో ఎన్నడూ కనపడని సంబురం, తమ్మునిది ఆటగోలు పసితనం అయినా.. నీనేడ పడ్తనోనని చేయి గట్టిగా పట్టుకుండు. భర్త గుర్తొచ్చిండు.. ‘అరేయి.. లం… కొడుక! నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసినవురా!’ అని గట్టిగా అరవాలనిపించింది.
‘సంసారానికి పనికి రానోనివి ఆడపిల్ల జీవితంతోని ఎందుకు ఆడుకుంటున్నవురా?’ అని అడగాలనిపించింది.
‘అవునూ.. నేను చస్తెనే ఈ సమస్య తీరిపోద్దా?.. నా దినాలు తిరగకముందే వాడు మళ్లో పెళ్లి చేసుకుంటడు. పిల్లలు పుట్టరని బాధతో ఆత్మహత్య చేసుకుందని నామీద నిందమోపుతడు. అందరూ గదే నిజమని నమ్ముతరు. ఆ తరువాత ఇంకో అమాయకురాలు బలిపీఠం ఎక్కుతది. దాని బతుకూ గింతే. మరివాడు ఆడేసులోడైనా.. మొగేశం ఏసుకొని దొరలా బతుకుతడు. మరి ఆని తప్పులకు శిక్షలేదా!? తప్పు చేసినోడేమో తలెగరేసి పొగరుతోని బతుకుతుంటే.. ఏ తప్పూ చేయని నేనెందుకు సావాలి? లేదు.. లేదు.. సావొద్దు! తెగబడి కొట్లాడ్తా? ఆడదంటే నీళ్లల్ల కరిగిపోయే గౌరమ్మ గాదు.. నీళ్లల్ల సుత మంటలు పుట్టించే భద్రకాళి అనిపిస్తా! గిట్ల భయపడి నిందలు మోసి సావడానికేనా నేను పుట్టింది!? లేదు.. నేను బతుకుతా! నన్ను ఏడిపించిన అందరినీ నలుగుట్లెకు గుంజుతా! ఆల్లందరి అసలు రంగు బైటికి ఇగ్గి సూపెడ్తా!’ అనుకుంది.
ఇట్ల గౌరి మనసులో ఆలోచనల తర్కం చావునుండి బతుకు మీదికి మళ్లింది. ఇది చాలు.. చచ్చిపోవాలి అనుకున్నవారికి ఒక్కక్షణం ఆలోచన మారితే ఇక చావమన్నా చావరు! అదే జరిగింది ఇక్కడ. ‘లేదు! ఈ నీళ్లలో పడి కుళ్లిపోయి సావడం కంటే.. కోట్లాడి సస్తా! అమ్మకు, నాయినకు తోడై.. తమ్ముణ్ని గొప్పోణ్ని చేసి కుటుంబాన్ని రేవుకు తెస్తా!’..
ఈ ఆలోచన రాగానే గౌరి గుండె వేగం తగ్గింది. కాలు వెనక్కి పడింది. తల్లి బతుకమ్మ నీటి తెమ్మెరలపై తూగుతూ.. ఊయలలూగుతూ నిశ్చలంగా నదిలో పోతాంది. గౌరి మనసు కూడా ఆలోచన బరువులను దులుపుకొని నిమ్మలపడుతాంది. తమ్ముడు చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు.
‘ఏదెట్లయినా.. ఇగ అన్యాయానికి ఎదురుమళ్లుతా! అవసరమైతే ఊరిని, తనవాళ్లను కూడగట్టుకొని ధైర్యంగా నిలబడి కొట్లాడుతా! మాంటే పానం పోతది గంతే! అట్లా సచ్చే బదులు గిట్ల సస్తా! సావుకు భయపడి రోజు సావడం కంటే.. సంపుతా అన్నోణ్నే సంపి బొంద పెడ్త! మొగని ముసుగేసుకున్న మొగోడుకాని ఆనికి బుద్ధి చెప్తా!’ అని ధైర్యంగా ముందడుగు వేయడానికి నిశ్చయించుకొని, నీళ్లలో వెనకడుగు వేసింది గౌరి.
ముందుకు నడుస్తున్న తండ్రి చేయిని గట్టిగా పట్టుకుంది. ‘నాయినా! నన్నే నీ పెద్ద కొడుకుననుకో!’ అనుకుంది.
నీళ్లలో నెమ్మదిగా నడిచే అమ్మ భుజం చుట్టూ చెయ్యివేసి ఆసరాగా తోడై నడిచింది. తమ్ముడు గెంతుతూ ముందు నడుస్తున్నాడు.
ఎక్కడలేని ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఇంటివైపు అడుగులు వేసింది గౌరి. దూరంగా కదిలే పెద్ద బతుకమ్మ అటూఇటూ ఊగుతూ.. ఆశీర్వదిస్తున్నట్లు, కొండెక్కని గౌరమ్మ దీపం చీకట్లో దారి చూపిస్తున్నట్లు తోచింది.
మౌనిక సుదర్శనం
సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప.. భయపడి చావడం పరిష్కారం కాదని ‘కొండెక్కని దీపం’ కథ ద్వారా సందేశం ఇస్తున్నారు యువ రచయిత్రి మౌనిక సుదర్శనం. వీరి స్వస్థలం హైదరాబాద్. ఎంఎస్ (ఐటీ) చేశారు. ప్రస్తుతం జేపీ మోర్గాన్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నారు. తండ్రి ప్రముఖ రచయిత రంగనాథ్ సుదర్శనం. ఆయన కథలకు తనే మొదటి పాఠకురాలు. ఆ ప్రభావంతోనే రచనా రంగంలోకి వచ్చారు. ‘కొండెక్కని దీపం’.. వీరి తొలి కథ. ఈ రచనకు ఆలోచన మాత్రమే తనదనీ, కథకు బతుకమ్మ పండుగ నేపథ్యంతోపాటు తెలంగాణ మాండలికంలో తీసుకురావడం వెనక తన తండ్రి కృషి ఎంతో ఉన్నదని చెబుతున్నారు రచయిత్రి. ఈ కథ క్రెడిట్ మొత్తం ఆయనదేనని అంటున్నారు. తొలికథకు బహుమతి అందించి ప్రోత్సహించిన నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీ నిర్వాహకులకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
– మౌనిక సుదర్శనం
70266 27444