వ్యంగ్యం పదునైన కత్తి. రాజకీయ వ్యంగ్యం అయితే.. ఇక చెప్పేదేముంది? వ్యవస్థ మీద వ్యంగ్యాన్ని పట్టుకున్న కవి, రచయిత, కళాకారుడు ఎవరైనా ఆ కత్తిమీద సాము చెయ్యాల్సిందే. కవి కాళోజీ రచనలు నిత్యం మన వెన్నంటే ఉంటూ ఆ చురకలంటిస్తూనే ఉన్నాయి కదా! రావి శాస్త్రి, పతంజలి వంటి రచయితలు రాసిన కథలు మనల్ని ఉలిక్కిపడేట్టు చేస్తాయి. నటుడు, దర్శకుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి రాసిన ‘గార్దభాండం’ నాటిక ఆ కోవకు చెందినదే!
అదో దిబ్బరాజ్యం. రాజు అమాయక శిఖామణి. ఎంత అమాయకుడంటే?.. తన దేశం పేరే చెప్పలేనంత! ఈ విషయం ప్రారంభంలోనే తెలిసిపోతుంది. అన్నిటినీ అమాత్యుల వారే (మంత్రి) సెలవియ్యాలని రాజు కోరుకుంటాడు. మంత్రి భజనపరుడు. రాజు ఏది మాట్లాడినా ‘ఆహా.. అద్భుతం.. అమోఘం’ అంటూ డబ్బా కొడుతుంటాడు. రాజుకు ఇద్దరు భార్యలు! అయినా సంతానయోగం లేదు. పుత్రుడు లేకపోతే పున్నామ నరకానికి పోవాల్సి వస్తుందని అతని భయం. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని రాజు అనంతరం తన సుపుత్రుడికి పట్టాభిషేకం చేయాలని మంత్రి దుష్టపన్నాగం పన్నుతాడు. అందుకోసం ఓ అవధూతను (స్వామీజీ) నాటకీయంగా రప్పిస్తాడు. రాజుకు గాడిదతో పెళ్లి చేయాలని, యజ్ఞయాగాదులు నిర్వర్తించాలని, ఆ పుణ్యకార్య ఫలంగా గాడిద గుడ్డు పెడుతుందని, కొన్నాళ్లకు అందులోంచి ఎకాఎకీన యుక్తవయసు కలిగిన నవ మన్మథుడి లాంటి కొడుకు (మంత్రి కొడుకు) పుట్టుకొస్తాడని, అతనే ఈ రాజ్యానికి కాబోయే రాజు అని నమ్మబలికి ఈ భారీ క్రతువు చేయిస్తుంటాడు. ఈ తంతు నిర్వహణకు భారీగా ఖర్చు అవుతుంటుంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి బలవంతంగా శిస్తులు వసూలు చేస్తుంటారు రాజోద్యోగులు.
ఈ రాచరికపు దురాగతాలను ఓ యువ మేధావి వ్యతిరేకిస్తాడు. అతణ్ని బంధించి చెరసాలలో వేస్తారు. అయితే మంత్రి పాచిక నెరవేరదు. వేశ్యాలోలుడైన మంత్రి కొడుకు మత్తులో జోగుతూ నౌకా విహారం చేస్తుండగా అదికాస్తా మునిగిపోయి గల్లంతైపోతాడు. మంత్రి విషాదాన్ని దిగమింగుకుంటాడు. అపచారాల వల్ల గుడ్డు అర్ధంతరంగా పగిలిపోయి యజ్ఞయాగాలు విఫలమైనట్టు ప్రకటిస్తాడు. విషాద వార్తల పఠనం, సంతాప దినాల పాటింపు షరా మామూలే.
ఇక మేధావిపై తూతూ మంత్రపు న్యాయ విచారణ సాగించి గార్దభాండం (గాడిద గుడ్డు) పగలడానికి అతనే కారణమనే నెపంతో రాజద్రోహ నేరం మోపుతారు. ఉరిశిక్ష విధించడంతో నాటిక సమాప్తమవుతుంది. బట్టతలకు మోకాలుకి ముడిపెట్టడం అంటే ఇదే కదా… వంశపారంపర్య ఆధిపత్యం, అధికారం కోసం కుయుక్తులు, కుట్రలు, అశాస్త్ర యజ్ఞయాగాది క్రతువులు, అహేతుక శిస్తులు, రాజద్రోహ నేరం.. అన్నీ అసంబద్ధంగా తోచినా, ప్రజాస్వామ్య యుగంలోనూ ఇవన్నీ అతి సాధారణంగా సాగిపోతున్న వైనాన్ని మనం కాదనలేం.
‘సువర్ణ లిఖిత గత చరిత్రకు, భావి ఉషస్సుకు మధ్య వర్తమానపు అంధకారమే గార్దభాండం’ అని ప్రారంభంలో నేపథ్యం నుంచి వినిపించిన ప్రయోక్త కంఠం నాటికలో అడుగడుగునా మాటలతోనూ అలరిస్తూనే, ఆలోచింపజేస్తుంది. ‘గార్దభాండం బద్దలైంది. గార్దభాండం బద్దలైంది. ఫ్లాష్ న్యూస్ చెబుతూనే, రాత్రి అందరూ నిద్రపోయాక దేశ ప్రజలనుద్దేశించి రాజు గారు మాట్లాడతార’ని చెప్పడం రచయిత దార్శనికతకు అద్దం పడుతుంది. ఎందుకంటే ఈ నాటిక పుట్టి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతున్నది. అయినా ‘గార్దభాండం’ నాటిక నేటి సమాజానికి అన్వయం అవుతుంది అనడంలో సందేహం లేదు.
‘ఏ దేశంలో వేలిముద్రలు (అజ్ఞానులు) కిరీటాలు ధరిస్తాయో ఆ దేశపు ప్రతి అంగుళంలోనూ ఇలాంటి అరాచకపు పిశాచాలు విలయతాండవం చేస్తాయి’ నాటకంలో ఉరి తీసేముందు మేధావి చెప్పిన ఈ మాట, నేటి స్వార్థపూరిత రాజకీయ కఠోర వాస్తవానికి ఓ హెచ్చరికే. అందుకే చివరిగా ప్రయోక్త వ్యాఖ్య ‘ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడి ప్రజలది మాత్రం కానిదే ‘గార్దభాండం’ ఇదే(నా) నడుస్తున్న చరిత్ర. ఈ మాట ప్రేక్షకుల మస్తిష్కాలను వెంటాడుతుంది. రంగస్థల అలంకరణ, పాత్రల చిత్రణలో ఆధునికత.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.
నాటిక పేరు: గార్దభాండం
రచన : తనికెళ్ల భరణి
దర్శకత్వం : రత్నశేఖర్
నాటక సంస్థ : సమాహార్, హైదరాబాద్
పాత్రధారులు : చరితార్థ్, సోమశేఖర్, ప్రసన్న, గౌతమ్, భార్గవ్, అనురూప్.