ఒకప్పుడు మన చదువులన్నీ ప్రభుత్వ బళ్లలోనే సాగిపోయాయి. ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్దలు కూడా చాలావరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే! అయితే, ప్రస్తుతం ప్రైవేటు బడులు రాజ్యమేలుతున్నాయి. పిల్లలకు మంచి మార్కులు రావాలని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. ప్రభుత్వ బడి కన్నా.. ప్రైవేటులోనే వ్యక్తిగత శ్రద్ధ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పల్లెల్లోనూ ప్రైవేటు స్కూళ్లు వెలుస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలు కరువై, విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లా అడహలట్టి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలదీ ఇదే పరిస్థితి. ఇది అక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న సిద్దమల్ల ఖోట్ను కలవరపరిచింది. తన పర్యవేక్షణలోని పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆయన్ను బాధించింది.
ఈ క్రమంలో పిల్లల నమోదు పెంచడానికి ఆయన ఓ స్ఫూర్తిదాయకమైన చొరవ ప్రదర్శిస్తున్నారు. తమ బడిలో కొత్తగా చేరే ప్రతి విద్యార్థి పేరుమీదుగా ఓ వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. అదీ తన సొంత ఖాతాలోంచి కావడం విశేషం. ఇది పద్దెనిమిదేండ్లకు మెచ్యూర్ అవుతుంది. చిన్నమొత్తమే అయినప్పటికీ ఈ చొరవ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఆసక్తి చూపేలా చేస్తున్నది. అడహలట్టిలో 2005లో ఈ పాఠశాల మొదలైంది. 7వ తరగతి వరకు బోధన సాగుతుంది. 2015 వరకు అన్ని తరగతులకూ కలిపి 70 మంది విద్యార్థులు ఉంటే ఎక్కువ. ఆ తర్వాత ఉపాధ్యాయులు లేకపోవడం, మౌలిక వసతుల కొరత కారణంగా 2023 నాటికి ఈ సంఖ్య 18కి పడిపోయింది. బడి మూతపడే స్థితికి చేరుకుంది.
ఇలాంటి స్థితిలో 2023 జూలైలో సిద్దమల్ల ఖోట్ ఇక్కడికి హెడ్మాస్టర్గా వచ్చాడు. స్థానికులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించేలా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నగదు డిపాజిట్ ప్రోత్సాహంతోపాటు నెలనెలా క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నాడు. విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్నాడు. దీనికితోడు ఆ గ్రామ యువకులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి తనవంతు సహకారం అందిస్తున్నాడు. ఎండకాలం సెలవుల్లో పిల్లల చదువుకు బ్రేక్ పడకుండా, వచ్చే ఏడాది పాఠాలను ముందే చెప్పడానికి చొరవ చూపుతున్నాడు. దాతల విరాళాలతో బడిలో మౌలిక సదుపాయాలు పెంచే ప్రయత్నమూ మొదలుపెట్టాడు. “గతేడాది మా బడిలో ఒకటో తరగతిలో ఇద్దరే పిల్లలు చేరారు. ఈ ఏడాది తొమ్మిది మంది చేరారు. డిపాజిట్ చేస్తున్నది చిన్నమొత్తమే అయినప్పటికీ కొద్దిమందినైనా నా ప్రయత్నం కదిలించింది. కుటుంబసభ్యులు కూడా నా ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు” అని సిద్దమల్ల ఖోట్ సంతృప్తి చెందుతాడు.