గొల్ల, కురుమల జీవితం గొర్రెలు, మేకలు కాయడంతో పెనవేసుకుని ఉంటుంది. అయితే, గొల్ల కురుమలంటే కేవలం పశుపాలకులుగా మాత్రమే కాకుండా… భారతదేశ చరిత్రలో ప్రసిద్ధిగాంచిన విజయనగర సామ్రాజ్య నిర్మాతలైన హరిహర బుక్కరాయలు, ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ లాంటివాళ్లు రాజ్యతంత్రాన్నీ నడిపించినట్టు తెలుస్తుంది. కానీ, మామూలు గొర్రెలు, మేకల కాపరుల జీవితం ఎంతో వేదనతో నిండి ఉంటుంది. నిజాం జమానా కావచ్చు, సమకాలీనం కావచ్చు జీవాలున్న వాళ్లు అడవిలో తోడేళ్లకు ఎంత భయపడేవాళ్లో… సాటి మనుషుల అధికారానికి, మోసానికి అంతే హడలిపోయారు. అలాంటివారి జీవితానికి వివిధ కథకులు అక్షర రూపం ఇచ్చారు. అలాంటి పద్దెనిమిది కథలను ‘గొంగడి’ పేరుతో గొల్ల కురుమల అస్తిత్వాన్ని ప్రపంచానికి వెల్లడిస్తూ ఫోరమ్ ఫర్ కన్సర్న్డ్ బీసీస్ వేదిక సంకలనంగా తీసుకువచ్చింది. ఇందులో మొదటి కథ బండి నారాయణ స్వామి రాసిన ‘అవశేషం’ కథ కాలానుగుణంగా వచ్చే మార్పులకు పాత సంప్రదాయాలు కూడా లోనుకావాల్సి ఉంటుందని చాటుతుంది. ఈ కథ కురుమల పెద్దపండుగకు పూజారప్ప ఎంపిక నేపథ్యంలో సాగుతుంది. మారుతున్న కాలంలో ఈ వ్యవస్థలో నెలకొన్న గందరగోళాన్ని కండ్లకు కడుతుంది. నందిని సిధారెడ్డి రాసిన ‘పుల్లర’ కథ బతుకుదెరువు కోసం అడవిలో జీవాలను మేపుకొనే సామాన్యులపై అటవీ అధికారుల వేధింపుల ఇతివృత్తంతో నడుస్తుంది.
బోయ జంగయ్య ‘తోడేళ్లు’ కథ నిజాం హయాంలో గొర్రెల కాపర్ల మీద దొరల ఆగడాలను ఆర్ద్రంగా వివరిస్తుంది. దసరా పండుగ కట్టుబాటు నెపంతో ఊళ్లో బలివ్వాలనుకున్న పొట్టేలును అడవిలో విడిచిపెట్టిన కాపరి కథ ‘ఇగురం’. మనుషుల కంటే తోడేళ్లే నయం అనుకోవాల్సిన ఇతివృత్తంతో నడిచిన ఈ కథను పెద్దింటి అశోక్ కుమార్ రచించారు. విచ్చలవిడితనంతో వస్తున్న విలువలు లేని సినిమాలు, సీరియళ్ల కంటే ఒగ్గుకథ లాంటి జానపద కళలే మేలని చిల్ల మల్లేశం ‘ఒగ్గుకథ’లో చిత్రించారు. గొరవయ్యల ఆవిర్భావం, ఇప్పుడు ఆ సంప్రదాయం తమకు కూడు పెట్టటం లేదన్న గొరవయ్యల ఆవేదనతో సాగే కథ వి.ఆర్.రాసాని రాసిన ‘మల్లేశుకుక్క’. గొల్ల కురుమ పూజారి వ్యవస్థలోకి బ్రాహ్మణ పూజారుల ప్రవేశాన్ని ప్రశ్నిస్తూ ఈ కథ సాగుతుంది. ఇక మంచి చేయాలంటే బతికి ఉన్నప్పుడే చేయాలి కానీ, చనిపోయిన తర్వాత ఏం చేసినా లాభం ఉండదనే సందేశంతో ‘కుక్కసద్ది’ కథ సాగుతుంది. దీన్ని కాలువ మల్లయ్య రచించారు. ఈ సంపుటిలో ప్రసిద్ధ కథకులతోపాటు అట్టెం దత్తయ్య, సాగర్ల సత్తయ్య లాంటి నవతరం రచయితల కథలు కూడా ఉన్నాయి. జీవాల్ని పోషించి బతికేవారి జీవితాల్ని, వారి వేదనల్ని, ఆవేదనల్ని చిత్రించిన ఈ ‘గొంగడి’ సంకలనం సమాజంలో గొల్ల కురుమల అస్తిత్తాన్ని గురించి తెలుసుకునేందుకు దోహదపడుతుంది.
సంపాదకులు: డా.మహేందర్ బర్ల, డా.సంగిశెట్టి శ్రీనివాస్
పేజీలు: 184; ధర: రూ. 150
ప్రచురణ: ఫోరమ్ ఫర్ కన్సర్న్డ్ బీసీస్
ప్రతులకు: ఫోన్: 98492 20321