ఓ వైపు నల్లమల ప్రకృతి అందాలు.. మరోవైపు కృష్ణమ్మ జల‘కళ’. ఈ రెండిటి మధ్య.. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఏకంగా సప్తనదుల సంగమ ప్రాంతంలో లలితా సంగమేశ్వర ఆలయం వెలిసింది. భక్తి తరంగాలకు నెలవుగా మారిన కృష్ణాతీరంలో నెలకొన్న ఈ ఆలయం ఆధ్యాత్మికతకు ఆలవాలం. ఎందరో మునులు తపస్సు ఆచరించిన పుణ్యతీర్థం. ఏడాదిలో ఎనిమిది నెలలపాటు నీటమునిగి ఉండే ఈ కోవెలను నాలుగు నెలలు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులెత్తి వచ్చిన వేళ… సంగమేశ్వరుడు గంగమ్మ కౌగిట్లోకి చేరుకున్నాడు.
సోమశిల సమీపంలో కృష్ణమ్మ నడిబొడ్డున ఉన్న ఈ సంగమేశ్వరాలయానికి పౌరాణిక, చారిత్రక ప్రశస్తి ఉంది. ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడికి వచ్చారట. సప్తనదుల సంగమంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భావించారట. ఈ క్రమంలో ముహూర్తం నిర్ణయించి, కాశీ నుంచి మహాలింగం తేవాల్సిందిగా.. భీమసేనుణ్ని పంపారట. వారణాసికి వెళ్లిన భీముడు రోజులు గడుస్తున్నా రాలేదట.
ఇంతలో ముహూర్తం సమీపించడంతో అక్కడికి సమీపంలో ఉన్న వేపచెట్టును నరికి.. ఆ దారువును శివలింగంగా ప్రతిష్ఠించారట. ఇంతలో కాశీ నుంచి లింగాన్ని తెచ్చిన భీముడు.. అప్పటికే ప్రతిష్ఠ అయిపోవడంతో కోపంతో ఊగిపోయాట. తాను తెచ్చిన లింగాలను గాల్లోకి విసిరేశాడట. అలా భీముడు విసిరిన లింగాలు మల్లేశ్వరం, అమరగిరేశ్వరం, కపిలేశ్వరం, సిద్ధేశ్వరం ప్రదేశాల్లో పడినట్లు స్థలపురాణం. కాలక్రమంలో 9వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు సంగమేశ్వర ఆలయాన్ని నిర్మించారు.
సంగమేశ్వర క్షేత్రంలో ఏడు నదులు సంగమించడం గొప్ప విషయం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మలాపహరిణి (మలప్రభ), భీమ, భవనాశి ఏడు నదులు వివిధ ప్రదేశాల్లో కలుస్తాయి. ఆ నదుల నీళ్లలో వెలిసింది కాబట్టి ఈ ప్రదేశానికి సప్తనదుల సంగమం అనిపేరు. వీటిలో భవనాశి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే.. మిగతా నదులు పడమటి నుంచి తూర్పునకు పారుతుంటాయి. ఇవన్నీ కృష్ణా, తుంగభద్ర నదుల్లో భాగంగా ప్రవహిస్తాయి. ఆలయం సాదాసీదాగా ఉంటుంది. ముఖమంటపం పూర్తిగా శిథిలమైంది. అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే భక్తుల దర్శనానికి అనువుగా మిగిలాయి.
ఇవన్నీ ఎలా ఉన్నా.. ఇక్కడ ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపదారు లింగాన్ని ఎంతో మహిమాన్వితంగా భావిస్తారు భక్తులు. ఏడాదిలో సింహభాగం నీళ్లలోనే ఉన్నా.. వేపదారు లింగం నేటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రారంభమై, గర్భగుడిలోకి నీళ్లొచ్చే సమయానికి అర్చకులు సంగమేశ్వరుడికి చివరి పూజలు చేస్తారు. మళ్లీ వరద తగ్గి.. ఆలయం నీళ్ల నుంచి బయల్పడ్డాక ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు.
కృష్ణవేణి ఉప్పొంగడంతో.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో జూలై చివరి వారం సంగమేశ్వరుడు కృష్ణాజలాల్లో మునకేశాడు. దాదాపు ఆరేడు మాసాలు నదీ గర్భంలోనే ఉండనున్నాడు. అప్పటివరకు సంగమేశ్వరుడి దర్శన భాగ్యం దక్కదు. జటలో గంగను దాచుకున్న శివుడు.. అదే గంగలో సేదతీరడం ఇక్కడి విశేషం. సోమశిలకు వచ్చిన పర్యాటకులు మాత్రం… దూరం నుంచే.. సంగమేశ్వరుడి కోవెల ఉన్న ప్రదేశాన్ని చూస్తూ భక్తిప్రపత్తులు చాటుకుంటారు. శివరాత్రి పర్వదినం నాటికి ఆలయం నది నుంచి బయల్పడుతుంది. ఒక్కోసారి ఏప్రిల్ వరకు ఆలయం నీటిలోనే ఉండిపోతుంది. వేసవి నాటికి పూర్తిస్థాయిలో బయటపడుతుంది. ఈ సందర్భంగా రోజూ వందల సంఖ్యలో పర్యాటకులు వచ్చి ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు.
హైదరాబాద్ నుంచి సోమశిలకు దాదాపు 180 కిలోమీటర్లు ఉంటుంది. రాజధాని నుంచి రెండు మార్గాల్లో చేరుకోవచ్చు. కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్ (కల్వకుర్తి-నంద్యాల కొత్త హైవే) దారిలో వెళ్లొచ్చు. షాద్నగర్, జడ్చర్ల, నాగర్కర్నూల్, కొల్లాపూర్ మీదుగానూ సోమశిల వెళ్లొచ్చు. అక్కడినుంచి కృష్ణానదిలో మరబోట్లు, పడవల్లో 2 కిలోమీటర్ల దూరం 10 నుంచి 15 నిమిషాలు ప్రయాణిస్తే సంగమేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు.
– సూగూర్ నరేష్కుమార్