రెండు రోజులు సెలవులో ఉన్న ఇన్స్పెక్టర్ రుద్ర.. బుధవారం స్టేషన్‌కు వచ్చాడు. తన టేబుల్ మీద న్యూస్పేపర్ల కట్ట ఉండటం చూసి చిరాకొచ్చింది. వెంటనే, హెడ్ కానిస్టేబుల్ రామస్వామిని పిలిచి.. ‘ఈ పేపర్ల కట్ట ఏంటి?’ అని గద్దించినంత పనిచేశాడు. ‘సార్! నిన్న.. మొన్న.. మీరు స్టేషన్‌కు రాలేదు కదా! సిటీలో ఏమేం జరిగాయో మీకు తెలియాలని రెండు రోజుల పేపర్లను ఉంచాం’ అంటూ రామస్వామి చెప్పాడు. ‘క్షమించు బాబాయ్! తొందరపడ్డాను’ అని రామస్వామితో అన్నాడు రుద్ర.
కాసేపటికి ఓ కేసు ఫైల్ తిరగేస్తున్నాడు రుద్ర. సండే మ్యాగజైన్లో ప్రచురితమైన ఓ క్రైమ్ స్టోరీని రుద్రకు చూపించాడు రామస్వామి. ‘ఏంటి బాబాయ్?’ అని ప్రశ్నించాడు రుద్ర. ‘ఏం లేదు సార్.. ఈ క్రైమ్స్టోరీలో కిల్లర్‌ను డెటెక్టివ్ భలేగా పట్టుకొన్నాడు. మొన్న సండే రోజే వచ్చింది’ అంటూ ఉత్సాహంగా చూపించాడు. అది చూద్దాం అనుకున్నంతలో రుద్ర మొబైల్ రింగ్ అయింది. ‘సార్.. ఇక్కడ ఇంట్లో హత్య జరిగింది. వెంటనే రావాలి’ అని అడ్రస్ వివరాలు చెప్పాడు అవతలి వ్యక్తి. వెంటనే కానిస్టేబుల్స్‌తో కలిసి హత్య జరిగిన ఇంటికి వెళ్లాడు రుద్ర.
ఇంట్లోకి వెళ్లేముందు తనకు ఎవరు ఫోన్ చేశారని వాకబు చేశాడు రుద్ర. ‘సార్.. నేనే మీకు ఫోన్ చేశా. నా పేరు గౌతమ్. పక్కింట్లోనే ఉంటాను’ అంటూ తనను పరిచయం చేసుకొన్నాడు. ‘అసలేం జరిగింది?’ రుద్ర ప్రశ్నించాడు. ‘ఈ ఇంట్లో తండ్రి, కొడుకు ఇద్దరే ఉంటారు సార్. కొడుకు పేరు సుగంధ్. వాడు నా ఫ్రెండే. ఆఫీసు పనిమీద ఐదు రోజుల కిందట బెంగళూరు వెళ్లాడు. నాన్న జాగ్రత్త! అని మరీమరీ చెప్పాడు. కానీ, బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉందని.. ఆదివారం ఉదయం నేను వెళ్లా సార్. ఈ రోజు ఉదయాన్నే సిటీకి వచ్చా. మా ఇంటికి రాగానే అంకుల్ ఎలా ఉన్నారోనని ఫోన్ చేశా. మొబైల్ స్విచ్చాఫ్. దీంతో ఇక్కడికి వచ్చా. తలుపులన్నీ మూసి ఉన్నాయి. ఏమైందోనని ఎలాగోలా కిటికీ రెక్క తెరిచి లోపల చూశా. అంకుల్ రక్తపు మడుగులో కనిపించారు. దీంతో మీకు ఫోన్ చేశా’ అని ఎమోషన్ అయ్యాడు గౌతమ్. రుద్ర అతణ్ని ఓదారుస్తూ.. ‘మరి, మీరు ఫంక్షన్‌కు వెళ్తున్నానని మీ ఫ్రెండ్‌కు చెప్పలేదా?’ ప్రశ్నించాడు. ‘ఫంక్షన్‌కు వెళ్లేముందు సుగంధ్కు ఫోన్ చేశాను సార్. ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకూ చాలాసార్లు ట్రై చేశా. స్విచ్చాఫ్ అనే వస్తున్నది’ చెప్పాడు గౌతమ్.
‘అంటే తండ్రి చనిపోయాడన్న సంగతి సుగంధ్కు ఇంకా తెలియదా?’ అని ఆశ్చర్యపోయిన రుద్ర.. సుగంధ్ పనిచేసే ఆఫీసు వివరాలు తీసుకోమని ఓ కానిస్టేబుల్‌ను పురమాయించాడు. గౌతమ్‌తోపాటు ఇరుగుపొరుగు వారిని మిగతా కానిస్టేబుల్స్ ఎంక్వయిరీ చేస్తున్నారు. రామస్వామితోపాటు ఇంట్లోకి వెళ్తున్న రుద్ర.. ‘ఏంటి బాబాయ్.. ఈ కేసు? ఇక్కడ తండ్రి చనిపోయాడు. అక్కడ కొడుకు ఫోన్ స్విచ్చాఫ్. ఫ్రెండ్ ఏమో ఫంక్షన్ అంటూ వెళ్లాడు.. ఇదేదో మిస్టరీగా ఉందే!’ అన్నాడు రుద్ర. ‘నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్’ అని బదులిచ్చిన రామస్వామి ఒక్కసారిగా.. ‘సార్.. క్రైమ్‌స్టోరీ’ అంటూ అరిచాడు. కాస్త ఉలిక్కిపడ్డ రుద్ర.. ‘ఏమైంది బాబాయ్! ఎందుకు అలా అరిచావ్?’ అంటూ కాస్త కోపంగా అడిగాడు.
‘సారీ.. సార్.. మార్నింగ్ చెప్పిన సండే మ్యాగజైన్ మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్లీ వచ్చేసింది’ అని నవ్వుతూ అన్నాడు రామస్వామి. ‘బాబాయ్.. హత్య ప్లేస్‌లో మీ జోక్స్ ఏంటి?’ అని కాస్త హెచ్చరించిన రుద్ర.. డోర్‌కు తగిలించిన సంచీలో సండే పేపర్, రెండు ఉత్తరాలు ఉండటాన్ని గమనించాడు. వాటిని తీసుకొని జాగ్రత్త చేయమని సిబ్బందిని ఆదేశించాడు. ఆ తర్వాత తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లాడు. రాడ్డుతో తల పగలగొట్టడంతో ముసలాయన ఒక్కదెబ్బకే చనిపోయినట్టు అర్థమవుతున్నది. ఫోరెన్సిక్ టీమ్ వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. ఇంతలో రామస్వామి.. రుద్రతో ‘సార్! మ్యాగజైన్‌లోని క్రైమ్ స్టోరీలో కూడా హత్య ఇలాగే జరిగింది. ఒకసారి చదవండి. మీకు ఉపయోగపడొచ్చు’ అని సలహా ఇచ్చాడు. చిరుకోపంతో చూసిన రుద్ర.. సిబ్బందితో కలిసి స్టేషన్‌కు తిరిగి ప్రయాణమయ్యాడు.
గౌతమ్ ఫంక్షన్‌కు వెళ్లడం, సుగంధ్ ఫోన్ స్విచ్చాఫ్ అవ్వడం, ముసలాయన చనిపోవడం.. ఇదంతా రుద్రకు ఓ కుట్రగా అనిపించింది. గౌతమ్ లేదా సుగంధ్ ఇద్దరిలో ఎవరో ఒకరు, లేదా ఇద్దరూ కలిసి ముసలాయనను హత్య చేసి ఉంటారని రుద్ర అనుమానించాడు. వెంటనే స్టేషన్ మెట్లు ఎక్కుతూనే.. గౌతమ్‌ను స్టేషన్‌కు తీసుకురమ్మని ఓ కానిస్టేబుల్‌ను పురమాయించాడు. సుగంధ్ స్టేటస్ ఏంటో తెలుసుకోమని మరొకరికి చెప్పాడు. ఇంతలో ఫోరెన్సిక్ టీమ్ నుంచి కాల్.. ‘సార్.. హత్య ఆదివారం రాత్రి జరిగింది’ అంటూ అటువైపు నుంచి సమాచారం.
స్టేషన్లోకి ఎంటరైన రుద్రకు తన టేబుల్ మీద ఉన్న పేపర్లు ఓ పెద్ద క్లూ ఇచ్చినట్టు అనిపించింది. వెంటనే, రామస్వామిని హగ్ చేసుకొని.. ‘బాబాయ్.. ఈ కేసును మీరే సాల్వ్ చేశారు’ అంటూ సంబురంగా అరిచాడు. అర్థం కాకుండా చూశాడు రామస్వామి. ‘అదెలా.. సార్!’ అంటూ ఆశ్చర్యపోయాడు రామస్వామి. ‘హంతకుడు.. పేపర్‌బోయ్’ అని తేల్చేశాడు రుద్ర. ఇంతలో పరుగు పరుగున వచ్చిన కానిస్టేబుల్ బెంగళూరులో సుగంధ్ హత్యకు గురైనట్టు చెప్పాడు. దీంతో రుద్ర, రామస్వామి ఒకరి మొహాలు ఒకరు చూసుకొన్నారు. మర్డర్ కేసు సాల్వ్ అయ్యిందనుకొంటే ఈ కొత్త ట్విస్ట్ ఏంటని? తల పట్టుకొన్నారు. అది పక్కనబెడితే, ముసలాయన్ని పేపర్‌బోయ్ హత్య చేసినట్టు రుద్ర అంత కరెక్ట్‌గా ఎలా కనిపెట్టాడో చెప్పగలరా?
సమాధానం: రామస్వామితో రుద్ర మర్డర్ జరిగిన ఇంట్లోకి వెళ్లేముందు తలుపు గొళ్లానికి వేలాడదీసిన రెండు ఉత్తరాలు, సండే పేపర్ ఉన్నట్టు గమనించాడు. ముసలాయన హత్య ఆదివారం రాత్రి జరిగినట్టు ఫోరెన్సిక్ టీమ్ నిర్ధారించింది. అంటే, ఆదివారం పేపర్ వేసిన ఆ పేపర్‌బోయ్ రాత్రి ముసలాయన్ని చంపాడు. ముసలాయన ఎలాగూ చచ్చాడు గనుక, పేపర్ వేయడం ఎందుకు దండుగ అని.. సోమ, మంగళ, బుధవారాలు పేపర్ వేయలేదు. హత్య గురించి తెలియని పోస్ట్‌మ్యాన్ తన డ్యూటీ చేసుకుపోయాడు. తన టేబుల్ మీద పాత పేపర్లను చూసిన రుద్రకు వెంటనే ఇది స్ఫురణకు వచ్చింది. కాగా, సుగంధ్‌ను ఎవరు చంపారన్న దానిపై రుద్ర ఇప్పుడు దృష్టి సారించాడు.