తినే తిండిలో విషం లేనిది ఏదైనా ఉందాని వెతుక్కుంటూ పోతే.. రసాయనాలతో కల్తీ కానిదేదీ కనిపించలేదు. మంచి తిండే లేని చోట బిడ్డల్ని పెంచడం ద్రోహమే అనిపించింది అతనికి.సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొలువుని, విలాసాల నగరాన్ని వదిలి సొంతూరుకు బయలెల్లాడు. వ్యవసాయం మొదలుపెట్టాడు. విఫలమయ్యాడు. నష్టపోయాడు. మళ్లీ మళ్లీ ప్రయత్నించి సఫలమయ్యాడు. నేలను, తిండిని విషతుల్యం చేస్తున్న రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా లాభసాటి సేంద్రియ పద్ధతులకు దారి వేశాడు. ఆ చాళ్లలో పెరిగిన పైరు రైతులకు లాభసాటి మార్గమైంది. శాస్త్రవేత్తలకు ఒక పాఠమైంది. ఆ రైతును ఫెలో ఫార్మర్ అవార్డ్ విజేతని చేసింది. ఈ అవార్డుకు ఎంపికైన ఆరుగురిలో దక్షిణ భారత దేశం నుంచి ఎంపికైన ఒకే ఒక్కడు మావురం మల్లికార్జున్ రెడ్డి. అతను రైతుబిడ్డే కాదు, తెలంగాణ
ముద్దుబిడ్డ కూడా!
మాది వ్యవసాయ కుటుంబం. కరీంనగర్ జిల్లా పెద్దకుర్మపల్లి మా ఊరు. మాకు పదహారు ఎకరాల భూమి ఉంది. మా నాన్న మావురం లక్ష్మారెడ్డి ఆదర్శ రైతు. కొత్త పద్ధతుల్లో పత్తి సాగు చేసి అధిక దిగుబడి తీశారు. సేద్యం కోసం చాలా రకాల పనిముట్లను తయారుచేశారు. పొద్దుతిరుగుడు, మిరప, అరటి సాగులో అనేక ప్రయోగాలు చేశారు. రెండు కిలోల విత్తనాలతో శ్రీవరి సాగు చేసి ఎకరానికి 42 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. నాన్న శ్రమను ప్రభుత్వం గుర్తించింది. కరీంనగర్ కలెక్టర్ ఉత్తమ రైతు అవార్డు ప్రదానం చేశారు. పాలేర్లు, కూలీలు ఉండటం వల్ల చిన్నప్పుడు వ్యవసాయం చేయలేదు. చూశానంతే. వరంగల్లులో బీటెక్ చదివాను.
దారి చూపమన్నోళ్లే దారి చూపారు ఉద్యోగం కోసం ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్ చేరాను. తెలిసినవాళ్లు హాస్పిటల్ పని మీద హైదరాబాద్ వచ్చేవాళ్లు. ఎటు పోవాలో, ఎట్ల పోవాలో అర్థం కాక తోడు రమ్మనేవాళ్లు. చాలామందిని సిటీలోని పెద్ద హాస్పిటల్స్‌కి తీసుకుపోయాను. వచ్చేవాళ్లలో క్యాన్సర్, మరికొన్ని ప్రమాదకరమైన జబ్బులున్నవాళ్లే ఎక్కువ. ఆరుగురు క్యాన్సర్ పేషెంట్లకు వైద్యం చేయించాను. రోగి సమస్యలు, డాక్టర్ సలహాలు వినడం వల్ల క్యాన్సర్ గురించి కొంచెం అవగాహన ఏర్పడింది. రసాయనాలతో కలుషితమైన ఆహారం తినడం వల్ల ఎక్కువమంది క్యాన్సర్ బారినపడుతున్నారని డాక్టర్లు చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడం వల్ల నాకు ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తితో ఇంటర్నెట్లో క్యాన్సర్ మూలాలేమిటో తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఓసారి తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక నివేదిక ఇచ్చింది. ప్రపంచంలో తినే ఆహారంలో ఎంతెంత విషం ఉందని చేసిన ఓ అధ్యయనంలో మనిషి ఆహారంతోపాటు ఎంత విషం తింటున్నాడో పరిశీలించింది. ఒక భారతీయుడు రోజుకు సగటున 354 మిల్లీ గ్రాముల విషాన్ని తింటున్నాడని తేలింది. అదే అమెరికాలో ఒక వ్యక్తి సగటున రోజుకు 7 మిల్లీ గ్రాములు. కూరగాయలు, ఆహార పంటల సాగులో వాడే పెస్టిసైడ్స్ వల్ల ఇంత విషం మనం తినాల్సి వస్తోందని నాకు అర్థమైంది. ‘సత్యమేవ జయతే’ అనే టీవీ కార్యక్రమంలో… ‘మీరు రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారం విదేశాలకు అమ్ముతున్నారు. రసాయన పురుగు మందులను ఇక్కడి రైతులకు అమ్మతున్నారు. ఇదేమి ద్వంద్వ నీతి’ అని ఒక పెస్టిసైడ్స్ కంపెనీ అధిపతిని వ్యాఖ్యాత అమీర్ ఖాన్ ప్రశ్నించారు. ‘డిమాండ్‌ని బట్టి బిజినెస్ చేస్తాం. రైతులు కావాలని అడుగుతున్నారు కాబట్టి పురుగు మందులు అమ్ముతున్నాం’ అని ఆయన సమాధానం చెప్పారు. అప్పుడు మనం ఎంత తప్పుడు మార్గంలో వ్యవసాయం చేస్తున్నామో అర్థమైంది.
సత్యం తెలిపిన పాలేకర్
వైద్యానికి సహకరించిన ఆరుగురు క్యాన్సర్ బాధితుల్లో నలుగురు చనిపోయారు. అల్లోపతి డాక్టర్లు చనిపోతారని చెప్పిన ఇద్దరు ఆయుర్వేద వైద్యం వల్ల బతికారు. క్యాన్సర్ బారిన పడకుండా నలుగురికి మంచి విషయాలు చెబుదామని ఇంకా అధ్యయనం చేస్తూ పోయాను. సుభాష్ పాలేకర్ ప్రసంగాలు విన్నాను. తెగుళ్లు, కీటకాల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఆయన రసాయనాలు లేని పద్ధతులు చెబుతున్నాడు. ఆచరిస్తున్నాడు. భూమిలో సారం లేక పంటమొక్కలు బలహీనం అవుతున్నాయి. అందుకే తెగుళ్లను తట్టుకోలేకపోతున్నాయని, భూమిని బలోపేతం చేయాలని ఆయన చెబుతున్నాడు. పాడి పంట జంటగా సాగాలనేది పాలేకర్ వాదన. తర్వాత వ్యవసాయ శాస్త్రవేత్తలను కలిశాను. పశువులు, పెంట లేకపోవడం వల్ల రైతులు రసాయన ఎరువులను ఉపయోగిస్తున్నారు. అధిక దిగుబడి వచ్చినా, ఆ తర్వాత భూసారం కోల్పోయి నష్టపోతున్నారని వాళ్లుచెప్పారు. పాలేకర్ చెప్పేది సత్యమని అర్థమైంది.
గుండెలపై ఆడించిన అనురాగం
నా స్నేహితుడు రాజా రామ్ బస్వపత్రి బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. తన ఆరేళ్ల బిడ్డ క్యాన్సర్ బారినపడిందని చెప్పాడు. ఇద్దరం క్యాన్సర్ గురించి ప్రతి విషయాన్నీ తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో వెదికాం. చివరికి తన బిడ్డకు క్యాన్సర్‌కి కారణం ఏమిటో తేల్చుకున్నాం. బెంగళూరులో వాళ్లు తింటున్న ఆహారాన్ని ల్యాబ్‌లలో టెస్ట్ చేయించాడు. నూనె, పాలు, కొబ్బరినీళ్లు కలుషితమని తేలింది. కొబ్బరిచెట్టుపై ఉండే కొమ్ము పురుగుని చంపడం కోసం మోనోక్రోటోపాస్ని చెట్టు వేర్ల దగ్గర పెడుతున్నారు. అయితే, కొబ్బరినీళ్లు పోసుకునే సమయంలో ఇలా చేయకూడదు. తెలిసినా లాభాల కోసం రైతులు ఇలా చేస్తున్నారు. ఆ కొబ్బరి నీళ్లలో చేరిన కెమికల్స్ వల్ల ఆ పాప క్యాన్సర్ బారిన పడిందని అర్థమైంది. ఎంత ప్రయత్నించినా ఆ బిడ్డను కాపాడుకోలేకపోయాం.
జీవామృతమే అమృతం
సమగ్ర వ్యవసాయ విధానం ఎంచుకుని పని మొదలుపెట్టాను. కొత్త ఒరవడిలో వ్యవసాయం చేయాలని ప్రయోగాలు చేశాను. పాడి, పంట పద్ధతిలో వ్యవసాయానికి పశుపోషణని అనుబంధం చేశాను. సేంద్రియ పద్ధతిలో నేల ఒక్కసారిగా మారదు. చీడ పీడల్ని పైరు తట్టుకోలేకపోయింది. కాబట్టి దిగుబడి అనుకున్నంత రాలేదు. నేల గుల్లబారుతుందని డ్రిప్ ఇరిగేషన్ ఎంచుకున్నాను. నేలలోకి పేడ పురుగు వచ్చింది. ఎలుకలు చేరాయి. జీవాల (ఆవులు, మేకలు, కోళ్లు) పెంపకంలో నష్టం రాలేదు. పాడి బాగానే ఉన్నా పంట దిగుబడి అంచనాలు తప్పాయి. ఆ దెబ్బకు బాగా నష్టపోయాను. బాధపడలేదు. ఎక్కడ తప్పు చేశానో తెలుసుకున్నాను. మా నాన్న సహకారంతో మార్పులు చేశాను. ఖర్చులు తగ్గించుకునేందుకు కొన్ని మార్పులు చేశాను. ఆదర్శ రైతులను కలిశాను. వాళ్ల అనుభవాలు విన్నాను. వాళ్ల సాగు పద్ధతులు దగ్గరగా చూశాను. ఏటా భూసారం తగ్గుతూ ఉంటుంది. మా పొలంలో మట్టిని పరీక్షిస్తే కర్బన శాతం తక్కువగా ఉంది. భూసారాన్ని పెంచేందుకు చింతల వెంకటరెడ్డి, గోపాల్ బాయ్ సుతారియా, పాలేకర్ పద్ధతులు పాటించాను. గోకృపామృతం, దేశీ ఆవు మూత్రం, పేడ ద్వారా నాలుగు రకాల జీవ శిలీంధ్రాలను పెంచాను. పచ్చిరొట్ట, ఎరువులు వేసి నేలలో కర్బన శాతం పెంచాను. మట్టిలో సూక్ష్మజీవులను పెంచేందుకు వాటికి కావాల్సిన ఆహారం వేసి సారవంతం చేశాను. ఆ తర్వత దిగుబడితోపాటు లాభం వచ్చింది. ఇక వెనుదిరిగి చూడలేదు. ప్రయోగాలు, పరిశోధనతో అనేక పంటలు పండించాను. నా క్షేత్రంలో ఆచరించిన పద్ధతులు, వాటి ఫలితాలను తోటి రైతులకు, శాస్త్రవేత్తలకు చెబుతున్నాను. పంటలతోపాటు నేలను సారవంతం చేసే అవగాహనా పెంచుకున్నాను. హైదరాబాద్ సమీపంలోని క్షీరసాగర్ గ్రామంలో 100 ఎకరాల చౌడు భూమిని సారవంతంగా మార్చాను.
సాగుబాటలో విజయాలెన్నో
ఎదసాగు విధానంలో పొలంలో నేరుగా వరి విత్తనాలు నాటాను. సాధారణ నాటు వేసే పద్ధతిలో వరి సాగుకు ఎకరానికి 25 కేజీల విత్తనాలు అవసరం. ఎదసాగు పద్ధతిలో 15 కేజీలు సరిపోయాయి. ఎకరానికి పది కేజీల విత్తనాలు, నాటు కూలీ ఖర్చు తగ్గాయి. నా వ్యవసాయ విధానం చూడటానికి అప్పటి ఎంపీలు కల్వకుంట్ల కవిత, బోయినపల్లి వినోద్ కుమార్ సందర్శించారు. అభినందించారు. ఈ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకునేందుకు ప్రధానమంత్రి మోదీ నాలుగు సార్లు నాతో మాట్లాడారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో నాతో, నా కుటుంబంతో ఆయన ఎనిమిది నిమిషాలపాటు ముచ్చటించారు. నా అనుభవాలు పాఠాలుగా చెప్పాలని సూచించారు. అంతకుముందు రైతుల ఆదాయం రెట్టింపు కార్యక్రమంలో నాలుగు సార్లు ప్రధానిని కలిసి మాట్లాడాను. పంటకు కావాల్సిన సమగ్ర పోషకాలను అందించేలా నేలను సారవంతం చేయడం, తెగుళ్ల నివారణలో తోటి రైతులతో, శాస్త్రవేత్తలతో నా అనుభవాలు పంచుకుంటున్నాను. ఈ కృషికిగాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ 2021లో ఇన్నొవేటివ్ ఫార్మర్ అవార్డ్ ప్రదానం చేసింది. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫెలో ఫార్మర్ అవార్డ్ ప్రకటించింది. పంట చేతికొచ్చినంత సంతోషంగా ఉంది. పల్లెకు పోదాం..
సేద్యం చేద్దాం
హైదరాబాద్‌లో పెరుగు జిగటగా ఉండేది. పాల కల్తీని అధికారులు గుర్తించారు. అరె నేను కూడా కల్తీ ఆహారం తింటున్నానే అని బాధపడ్డా. కొన్నాళ్లకు కల్తీ చేసిన వ్యక్తి మళ్లీ పాలు అమ్మడం మొదలుపెట్లాడు. తినేవన్నీ కల్తీ అయినప్పుడు ఇక్కడే ఉంటూ ఇవే తింటూ, ఎందుకు బతకాలి అనుకున్నాను. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని అధ్యయనం మొదలుపెట్టాను. ఆరోగ్యవంతమైన సమాజం చూడాలని వ్యవసాయం చేయాలనుకున్నాను. ఊరికి పోయి, వ్యవసాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయం మొదట మా ఆవిడకు చెప్పాను. తను ఒప్పుకొన్నాక మా నాన్నకు, మామయ్యకు చెప్పాను. ఇది కష్టమైన పని వద్దన్నారు. నేను బలంగా నిర్ణయించుకున్నాను. కష్టమైనా ఫర్వాలేదు ఓర్చుకుంటానని చెప్పాను. ఈ రకంగా చేస్తే ఇంత ఆదాయం వస్తుందని ఒక ప్రణాళిక ముందే వేసుకున్నానని వాళ్లకు చెప్పి ఒప్పించాను.
క్షేత్రమే నా ఏటీఎం
సమగ్ర వ్యవసాయ విధానంలోనా వ్యవసాయ క్షేత్రాన్ని ఏటీఎంలా తయారు చేసుకున్నాను. నా కుటుంబానికి కావాల్సిన ఆహార అవసరాలన్నీ వ్యవసాయ క్షేత్రమే తీరుస్తున్నది. ఆహారంతోపాటు ఆదాయం సమకూరే స్థాయిలో ప్రణాళికలు వేసుకున్నాను. వరితోపాటు పప్పులు, కూరగాయలు, ఇతర పంటలు సాగు చేశాను. వ్యవసాయానికి అనుబంధంగా ఆవులు, మేకలు, కోళ్లు, వ్యవసాయ బావిలో చేపల పెంపకం చేపట్టాను. పశువుల పేడ, కోళ్ల పెంట భూమికి ఎరువుగా ఉపయోగపడతాయి. క్షేత్రంలోనే జీవామృతం, ఇతర శిలీంధ్ర, కీటక నాశకాలను తయారు చేసుకున్నాను. ఆవులు ఇంటికి సరిపోయేకంటే ఎక్కువ పాలిచ్చేవి. వాటిని మార్కెట్లో అమ్మాను. దేశీ కోళ్లతో సంకర పరిచిన సోనాలి, గిరిరాజా, వనరాజా కోళ్లను పెంచాను. ఈ కోళ్లు ఆరు నెలల వయసులో గుడ్డు పెట్టడం మొదలుపెడతాయి. పాడి కోసం ఎక్కువ పాలు ఇచ్చే గిర్ జాతి ఆవులు తెచ్చుకున్నాను. పొలంలో కొంత స్థలంలో పశుగ్రాసం పెంపకానికి కేటాయిస్తాను. వాన నీటిని బావిలోకి మళ్లించుకున్నాను. బావి నీటినే సాగుకు ఉపయోగిస్తున్నాను. ఇందులో రకరకాల చేపలు పెంచుకుంటున్నాను.