ముఖంలో పల్లెటూరి అమాయకత్వం.. నటనలో అద్భుతం.. తెలుగమ్మాయి తేజస్వీ రావు సొంతం. కొట్టొచ్చే ఎక్స్ప్రెషన్స్, కట్టిపడేసే ఎమోషన్స్‌తో ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది. తన నటనతో దర్శకుల దృష్టిని ఆకర్షిస్తోంది ఈ నేచురల్ బ్యూటీ! ‘కమిటీ కుర్రోళ్లు’తో వెండితెరకు పరిచయమైన ఈ రాజమండ్రి అమ్మాయి.. తాజాగా, ‘రాజు వెడ్స్ రాంబాయి’తో సినిమాతో మరో హిట్ అందుకున్నది. ఈ సందర్భంగా తేజస్వీ పంచుకున్న సినీ కబుర్లు ఇవి.
నేను పుట్టింది.. పెరిగిందంతా రాజమండ్రిలోనే. చిన్నప్పుడే సినిమాల్లో నటించాలని అనుకున్నా. అనుకోకుండా అవకాశం వచ్చింది. ఆరేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్‌లో నటించా. ఆ తర్వాత చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశా. వెబ్ సిరీస్‌లలోనూ అవకాశం వచ్చింది. ఎన్ని చేసినా మొదట నటించిన షార్ట్ ఫిల్మ్.. నాకు ఎప్పటికీ మధురమైన జ్ఞాపకం.
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో తెలంగాణ యాసైనా తెలుగమ్మాయినే కాబట్టి ఇబ్బంది పడలేదు. నా రెండు సినిమాలు గ్రామీణ నేపథ్యంలోనే ఉంటాయి. వాటివల్ల పల్లెలంటే అభిమానం పెరిగింది. నేను నటించిన రాంబాయి పాత్ర ఊళ్లలోని అమ్మాయిలందరి కథలా ఉంటుంది. అమాయకమైన ప్రేమ, కుటుంబంతో ఉన్న అనుబంధం, ప్రేమలో ఉండే నియంత్రణలు ఈ సినిమాలో చూస్తారు. వీటన్నింటికీ నటనలో న్యాయం చేశాననే అనుకుంటున్నా.
షూటింగ్ లేనప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి ఇష్టమైన ప్రదేశాలు చూసేందుకు ప్రయాణాలు చేస్తా. నచ్చిన పుస్తకాలను ఎంత కష్టమైనా వెతికి మరీ కొనుక్కొని చదువుతా. ఈ రెండు అలవాట్లే నాకు కొత్త విషయాలు నేర్పుతాయి.
కెమెరా ముందు ఆర్టిఫిషియల్‌గా ఉండటం నాకు నచ్చదు. నేచురల్‌గా కనిపించేలా ప్రయత్నిస్తా.
షార్ట్ఫిల్మ్లలో నటించడం వల్ల కెమెరా అంటే భయం పోయింది. ఇక గంటల తరబడి మేకప్ అంటే బ్బందిగా ఫీలవుతా. సహజంగా ఉండటమే నాకిష్టం.
నిజం చెప్పాలంటే… సోషల్ మీడియానే నాకు సినిమా అవకాశాలు వచ్చేలా చేసింది. షార్ట్ ఫిల్మ్‌లలో
నా యాక్టింగ్ చూసి ‘కమిటీ కుర్రోళ్ళు’లో జ్యోతి పాత్ర నాకు సెట్ అవుతుందని అవకాశం కల్పించారు. వచ్చిన అవకాశం వదులుకోలేదు. మాది గోదావరి జిల్లా కాబట్టి ఆ సినిమాలో ఒదిగిపోయా. ఆ చిత్రంతోనే అందరికీ
తెలిసిపోయా. అలా నా టాలెంట్ వెలుగులోకి వచ్చింది.