కొత్తింటికి ముచ్చటైన తలుపులు చేయిస్తే.. టేకువేనా అని అడుగుతారు! కొత్త మంచం కొనుగోలు చేస్తే.. టేక్దేనా అంటారు! ఏ ఫర్నిచర్ అయినా టేకుతో చేసిందని చెబితేనే.. దాన్ని అబ్బురంగా చూస్తారు! కలపలో కల్పతరువు అన్నమాట టేక్ అంటే! దీని కలప చాలా దృఢంగా ఉంటుంది. పదికాలాల నిలిచి ఉంటుంది. టేకు విలువైన చెట్టు. కొమ్మలు కత్తిరించినా నిటారుగా 40 మీటర్ల వరకు పెరుగుతుంది! దీని ఆకులు దీర్ఘ వృత్తాకారంలో విశాలంగా ఉంటాయి. తెల్లని పూలు చిన్నగా, గుత్తులుగా ఉంటాయి. ఈ పూలగుత్తి గుండ్రంగా బంతి ఆకారంలో ఉంటుంది. ఈ పూలు సువాసన కలిగి ఉంటాయి.
అడవుల్లో సహజంగానే టేకు పెరుగుతుంది. మన దేశంతోపాటు ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, బంగ్లాదేశ్లలో సహజ సిద్ధంగానే టేకు చెట్లు పెరిగే అడవులు ఉన్నాయి. వాణిజ్యపరంగానూ సాగుచేస్తున్నారు. మన దేశంలో టేకు చెట్లను అటవీ శాఖ బాగా పెంచుతున్నది. బర్మాలో ప్రపంచంలోనే అతిపెద్ద పెద్ద టేకు అడవి ఉంది. కేరళ రాష్ట్రం పాలక్కడ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న 47.5 మీటర్ల టేకు చెట్టు మన దేశంలో అతిపెద్దదిగా రికార్డు కలిగి ఉంది. దీని వయసు 500 ఏండ్లకు పైమాటే!
టేకు చెట్టు పూర్తిగా పెరిగి కోతకు రావాలంటే దాదాపు పాతిక సంవత్సరాలు పడుతుంది. కొత్త టేకు కర్రను కోసినప్పుడు తోలు వాసన వస్తుంది. టేకు చెక్క చెదలు తినలేనంత దృఢంగా ఉంటుంది. అందుకే ఇంటి తలుపులు, కిటికీలు, దూలాలు, స్తంభాల తయారీకి టేకు ఉపయోగిస్తారు. గృహోపకరణాలు, కుర్చీలు, బల్లలు మొదలైనవి దీంతో చేయిస్తే మన్నికగా ఉంటాయి. టేకు కలపను చదరపు అడుగుల్లో కొలుస్తారు. కలప గ్రేడ్, పరిమాణాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు.
శిలను ఉలితో శిల్పంగా మలిచినట్టు, దృఢమైన టేకు కలపను కూడా ఉలితో కొట్టి ఆకృతులు తీర్చిదిద్దుతారు. టేకు కలప ఎర్రమట్టి రంగులో ఉంటుంది. అందమైన ఫర్నీచర్ తయారీకి టేకునే ఎంచుకోవడానికి దృఢత్వంతోపాటు దీని రంగు కూడా కారణమే. మా తాతగారు ఇంటి పైకప్పు కోసం టేకు కలపను ఉపయోగించారు. పాత టేకు మంచిదంటారు. అందుకే నేను కట్టిన ఇంటికి కావాల్సిన తలుపులు, దర్వాజలు, కిటికీలకు మా తాతగారి ఇంటి కలపను వాడాను. ఇది దాదాపు వందేళ్ల నాటిది. అందుకే ‘టేక్ ఈజ్ కింగ్ ఆఫ్ ఉడ్’ అని అంటారు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు