బంజారాహిల్స్, సెప్టెంబర్ 13: నోటిఫికేషన్ జారీ కానుండటంతో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ జారీ కానుండడంతో నెలరోజులుగా ఎక్కడపడితే అక్కడ అభివృద్ధి పనుల కోసం ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, వివేక్ వెంకటస్వామి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేస్తున్నారు. యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, ఎర్రగడ్డ, బోరబండ, షేక్‌పేట డివిజన్ల పరిధిలో నెలరోజుల్లో సుమారు రూ. 80 కోట్ల మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు స్వయంగా మంత్రులు ప్రకటించారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్ ప్రధాన రహదారికి 100 మీటర్ల దూరంలో ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జవహర్ కాలనీలో పదేండ్ల కిందట అద్దె భవనంలో ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రంలో రోజూ వందలాది మందికి ఉచిత వైద్యసేవలు అందించేవారు.
గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు టీకాలు వేస్తుండేవారు. అయితే ఏడాదిన్నర కిందట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అద్దెను సకాలంలో చెల్లించకపోవడంతో భవనాన్ని ఖాళీ చేయాలంటూ ఆరు నెలల కిందటే జిల్లా వైద్యశాఖ అధికారులకు నోటీసులు అందజేశారు. సుమారు రెండున్నర లక్షల అద్దె బకాయి ఉండడంతో తనకు కిరాయి చెల్లించాలని, లేకుంటే ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు.
వేలకోట్ల నిధులను ప్రజారోగ్యంపై ఖర్చు చేస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించే రాష్ట్ర ప్రభుత్వం.. లక్షల కోట్ల నిధులను వైద్యరంగంపై ఖర్చు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రచారం చేసుకునే కేంద్ర ప్రభుత్వం.. రెండున్నర లక్షల అద్దె బకాయిని చెల్లించడంలో విఫలమైంది. దీంతో వారం రోజుల కిందట భవన యజమాని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఖాళీ చేయించారు. దీంతో జవహర్ కాలనీ ప్రాంతంలో వైద్యసేవలు నిలిచిపోయాయి.
అద్దె చెల్లించకపోవడంతో పేదలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఉప ఎన్నిక వస్తుండడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ. 80 కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర మంత్రులు.. పక్కనే ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గంలో రెండున్నర లక్షల అద్దె చెల్లించకపోవడం సిగ్గుచేటు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జవహర్ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి జిల్లా వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాటు బడ్జెట్ లేదంటూ ఏడాది నుంచి అద్దెను చెల్లించలేదు. బస్తీవాసులు, వైద్యసిబ్బంది ఈ విషయాన్ని గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. అద్దె ఇచ్చే పరిస్థితి లేదని, పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మూసేసి నాలుగు కిలోమీటర్ల దూరంలోని షౌకత్నగర్ ఆరోగ్య కేంద్రానికి తరలించాలని జిల్లా వైద్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమస్యపై ‘నమస్తే ’ వరుస కథనాలతో రెండునెలల పాటు ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. అయితే తనకు రావాల్సిన రెండున్నర లక్షల అద్దె చెల్లించకపోవడంతో వెంటనే ఖాళీ చేయాలంటూ ఇంటి యజమాని ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో జూబ్లీహిల్స్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ చొరవ తీసుకున్నారు.
ఇందిరానగర్‌లోని మహిళా మండలి సభ్యులతో మాట్లాడారు. బస్తీవాసులకు ఉపయోగపడే పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని వేరే చోటకు తరలిస్తే స్థానికులకు ఇబ్బందులు ఏర్పడతాయని వారికి వివరించారు. స్పందించిన మహిళా మండలి సభ్యులు తమ భవనంలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించారు. శాశ్వత భవనం నిర్మించేదాకా వైద్యసేవలు ఆగిపోతే ఎంతో మంది ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో మహిళా మండలి భవనాన్ని ఇచ్చిన మహిళలకు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ శనివారం సత్కరించడంతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణానగర్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ కాలనీలో ఉన్న పట్ణణ ఆరోగ్య కేంద్రానికి రెండున్నర లక్షల అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో వారం రోజుల కిందట ఇంటి యజమాని ఖాళీ చేయించారు. కాలనీలో వైద్యసేవలు నిలిచిపోవడంతో వేలాది మంది పేదలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు స్థానికులు. అద్దెకే దిక్కులేదు..అభివృద్ధి చేస్తారా.. అని ప్రశ్నిస్తున్నారు. ‘ఉపఎన్నిక’ వేళ.. ఇదేక్కడి ఓట్ల రాజకీయమంటూ మండిపడుతున్నారు.
‘జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 80 కోట్ల మేర నిధులు మంజూరు చేయడంతో పాటు పనులు ప్రారంభించాం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు రూ.100 కోట్ల మేర నిధులు మంజూరు చేశాం’.. శనివారం కృష్ణానగర్ లేబర్ అడ్డాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, వివేక్ ప్రకటన ఇది.