సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : పాస్‌పోర్టు కార్యాలయాలు మరో చోటుకు మారనున్నాయి. ప్రజా సేవలను మరింత విస్తరించడంలో భాగంగా పాస్‌పోర్టు కార్యాలయాల్లో కౌంటర్ల సంఖ్య పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పాస్‌పోర్టు దరఖాస్తుల సంఖ్య పెరగడం, వివిధ సేవల కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మరింత వేగంగా సేవలందించేందుకు అన్ని మౌలిక వసతులతో కూడిన పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న కొన్ని కార్యాలయాలు ఇరుకుగా, కౌంటర్ల సంఖ్య పెంచేందుకు వీలుగా లేవు.
దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో కొన్ని కార్యాలయాలను గుర్తించి విశాలమైన భవనాల్లోకి మారుస్తున్నారు. ఇప్పటి వరకు అమీర్‌పేటలోని పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఈనెల 16న ఎంబీబీఎస్ మెట్రో స్టేషన్లోకి.. అదే రోజున టోలిచౌకిలో ఉన్న కేంద్రాన్ని రాయదుర్గంలోని సిరి బిల్డింగ్‌లోకి మారుస్తున్నారు. అదే రోజున సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అలాగే కరీంనగర్‌లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని సాయినగర్ ఫార్చున్మాల్లోకి తరలించి.. అదే రోజు సేవలు ప్రారంభిస్తామన్నారు.