ఈ రోజుల్లో పిల్లలు అన్నప్రాశన నాడు కూడా మొబైల్ ఫోన్ అందుకుంటున్నారు! పసితనంలోనే మొబైల్‌తో దోస్తీ చేస్తున్నారు. బడి పాఠాలు కూడా స్మార్ట్‌ఫోన్ ద్వారానే అర్థం చేసుకుంటున్నారు! ఆటలు, పాటలు అన్నిటికీ ఆ స్మార్ట్ఫోనే ఆధారం! టీవీలు, సినిమాలు సరేసరి!! ఈ క్రమంలో నేటి తరం పుస్తక పఠనం అంటే ఏంటో తెలియకుండా పెరుగుతున్నది. కానీ, చదవడం వల్ల మనిషి ఊహాశక్తి పెరుగుతుంది. సృజనాత్మక కలుగుతుంది. కథలు చదువుతుంటే ఆ పాత్రలు, సన్నివేశాలు కండ్లల్లో మెదులుతాయి. మనో ఫలకంపై స్క్రీన్‌ప్లే కొనసాగుతుంటుంది. ముఖ్యంగా బడీడు పిల్లలకు కథలు చదవడం అలవాటు చేస్తే… వారిలో గ్రహణ శక్తి కూడా పెరుగుతుంది.
అలాంటి సాహిత్యం ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అంటారా! ఈ రోజుల్లోనూ బాల సాహిత్యాన్ని చక్కగా అందిస్తున్న రచయితలు ఉన్నారు. వారిలో ఒకరు ఆర్సీ కృష్ణస్వామి రాజు. ఎన్నెన్నో చిట్టికథలు, పెద్ద కథలు రాసిన ఆయన.. పిల్లల సాహిత్యంపై తనదైన ముద్రవేశారు. ఆయన వెలువరించిన అందమైన బాలల నవలే ‘మునికిష్టడి మాణిక్యం’. సహజంగా పిల్లలకు పశువులు, పక్షులు అంటే ఇష్టం ఉంటుంది. ఇక తాము పెంచుకునే జంతువులు అంటే వల్లమానిన అభిమానం ఉంటుంది. ఈ నవలలో బాల కథానాయకుడు మునికిష్టడూ అదే కోవకు చెందుతాడు. మాణిక్యం అనే కోడిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. ప్రతిరోజూ తన మాణిక్యం కూతతో నిద్రలేస్తాడు మునికిష్టడు.
ఓ ఆదివారం మాణిక్యం కూత వినబడదు. ఎంత వెతికినా దాని జాడ దొరకదు. తనకిష్టమైన కోడికి ఏ కష్టం వచ్చిందో అనుకుంటాడు మునికిష్టడు. బెంగతో దాన్ని వెతికే పనిలో పడతాడు. తన మిత్రబృందం సాయంతో ఊరంతా గాలిస్తాడు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సన్నివేశాలు మనసుకు హాయినిస్తాయి. అదే సమయంలో కిష్టడికి కోడి దొరుకుతుందా, లేదా అనే ఉత్సుకత పాఠకులకూ కలుగుతుంది. అసలు మాణిక్యం మునికిష్టడిని ఎందుకు వదిలి వెళ్లిందో ఈ చిట్టి నవల చదివితే మీకే తెలుస్తుంది. తన కోడి కోసం మునికిష్టడు సాగించిన అన్వేషణ.. పాఠకుల్లో తెలుగు భాషపై మమకారాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా అమ్మభాషకు దూరమవుతున్న ఈ తరం పిల్లలకు.. మన భాష ఎంత సరళమైనదో, ఇంకెంత మనోహరమైనదో తెలియజేస్తుంది.
రచయిత: ఆర్సీ కృష్ణస్వామి రాజు
పేజీలు: 80, ధర: రూ. 50
ప్రతులకు: తానా ప్రచురణలు ,www.manchipustakam.in ,94907 46614