‘హలో’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన చెన్నై చిన్నది కళ్యాణీ ప్రియదర్శన్. న్యూయార్క్‌లో ఆర్కిటెక్చర్ చదివిన ఆమె అసిస్టెంట్ డిజైనర్‌గా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళ సినిమాల్లో నటిస్తూనే వరుస వెబ్‌సిరీస్‌లతో ఓటీటీలోనూ అలరిస్తున్నది. తాజాగా ‘కొత్త లోక-చాప్టర్ 1’ సినిమాలో సూపర్ పవర్స్ ఉన్న పాత్రతో ప్రేక్షకులను పలకరించింది. విభిన్న తరహా పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలని ఉందని చెబుతున్న కళ్యాణీ ప్రియదర్శన్ పంచుకున్న కబుర్లు..
ఖాళీ దొరికితే పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, ట్రావెల్ చేయడం ఇష్టం. ప్రకృతి అందాల మధ్య సమయం గడపడం చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. కేరళలోని మున్నార్ నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. అక్కడి పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం నాకు భలేగా అనిపిస్తుంది.
అసిస్టెంట్ డిజైనర్‌గా పనిచేస్తున్నప్పుడు, ‘హలో’ సినిమా అవకాశం వచ్చింది. అలా నా నటనా ప్రయాణం మొదలైంది. అఖిల్ అక్కినేనితో కలిసి నటించడం భలే అనిపించింది. ముఖ్యంగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆ సినిమాకు సైమా బెస్ట్ డెబ్యూ నటిగా అవార్డు అందుకున్నాను. ఆ క్షణం ఎన్నటికీ మరచిపోలేను.
నాకు ఇడ్లీ, సాంబార్, కేరళ స్టయిల్ ఫిష్ కర్రీ చాలా ఇష్టం. అప్పుడప్పుడూ పిజ్జా, బర్గర్లు కూడా తింటాను! ఇన్‌స్టాగ్రామ్‌లో నా అభిమానులతో నా జీవితంలోని చిన్నచిన్న క్షణాలను పంచుకుంటాను. వారి కామెంట్స్, మెసేజ్‌లు చదవడం చాలా ఇష్టం.
అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేయడం నాకు సినిమా నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో సాయపడింది. సెట్ డిజైన్, ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల నటనపై మరింత గౌరవం ఏర్పడింది. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాను. కథలో బలం, నా పాత్రకి ఉండే ప్రాధాన్యం ఆధారంగా సినిమా ఎంచుకుంటాను. పాత్ర సవాలుగా, ఆసక్తికరంగా ఉండాలి. నటనతో పాటు ఫిల్మ్‌మేకింగ్‌లో కూడా ఆసక్తి ఉంది. భవిష్యత్తులో ఒక సినిమాను నిర్మించడం లేదా దర్శకత్వం చేయడం నా లక్ష్యం.
నాన్నతోనూ సినిమా చేయాలని ఉంది. కానీ, ఆయన చాలా కఠినమైన దర్శకుడు. ఆయన సెట్లో నేను ఒత్తిడి భరించగలనా అని కొంచెం భయం ఉంది! కానీ, ఆ అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తాను. నాకు ‘బాహుబలి’ సినిమా చాలా ఇష్టం. ఆ సినిమా గ్రాండ్ విజన్, కథ చెప్పిన తీరు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. అలాగే, హాలీవుడ్లో ‘ఇన్సెప్షన్’ నా ఫేవరెట్ మూవీ.
ప్రతి భాషా దేనికదే ప్రత్యేకమైనది. తెలుగులో నటించడం నాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. తెలుగువారితో మంచి అనుబంధం ఉంది. కానీ, మలయాళం, తమిళం సినిమాలు కూడా నాకు కొత్త అనుభవాలను ఇచ్చాయి. ‘రణరంగం’లో చేసిన పాత్ర నాలో కొత్త కోణాన్ని చూపించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో నటనకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను.
నా బాల్యం చెన్నైలో చాలా సరదాగా, సాధారణంగా గడిచింది. నా తల్లిదండ్రులు (దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజి) సినిమా రంగంలో ఉన్నప్పటికీ ఆ ప్రభావం మామీద పడకుండా చూసుకున్నారు. స్కూల్, స్నేహితులతో ఆటలు, సినిమాలు చూడటం… నా బాల్య జ్ఞాపకాలు. నాకు మొదట సినిమాల్లో నటించాలనే ఆలోచన లేదు. ఆర్కిటెక్చర్ పూర్తి చేసిన తర్వాత, ఫిల్మ్‌మేకింగ్‌పై ఆసక్తి ఏర్పడింది.