సైకో ప్రశ్నలకు కరెక్ట్ జవాబులు చెప్పి కిడ్నాప్ అయిన ఐదుగురు పిల్లలను ఎలాగైనా విడిపించుకోవాలని ఇన్స్పెక్టర్ రుద్ర దృఢ నిశ్చయంతో ఉన్నాడు. మరోవైపు పిల్లలు బుధవారం కిడ్నాప్ అయితే పేరెంట్స్ శనివారం ఆలస్యంగా స్టేషన్‌కు రావడంపై హెడ్ కానిస్టేబుల్ రామస్వామి వాళ్లని నిలదీశాడు.
పిల్లలు కనిపించడం లేదని మరుసటి రోజునే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చామని, మూడు రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని వాళ్లు వాపోయారు. చివరికి ఈ స్టేషన్‌కు వెళ్లమంటూ తమను పోలీసులు పంపించిన విషయాన్ని చెప్పారు. అప్పటికే రాత్రి 9 గంటలు కావస్తున్నది. ఇంతలో స్టేషన్‌కు మరో నంబర్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. లెటర్‌ను తీసుకొన్న రామస్వామి సైకో పంపించినట్టు చెప్పాడు. అది విన్న పిల్లల పేరెంట్స్, ఇటు రుద్ర, పోలీసు సిబ్బంది హార్ట్‌బీట్ పెరగసాగింది. లెటర్‌ను చదవడం ప్రారంభించాడు రామస్వామి. ‘హలో రుద్రా! మొత్తానికి ట్రయల్ పజిల్‌ను సాల్వ్ చేశావ్. ఇక ఇప్పుడు అసలు ఆట మొదలుపెడుదాం.
ఈసారి నేను క్వశ్చన్ ఏమీ అడగడం లేదు. ఒక చిన్న టాస్క్ ఇస్తున్నా. దాన్ని నిమిషంలో నువ్వు కరెక్ట్‌గా పూర్తిచేస్తే.. మొదటి పిల్లవాడిని వదిలేస్తా. అయితే, నువ్వు ఆ టాస్క్‌ను నిజాయతీగా.. కరెక్ట్ టైమ్‌లో చేస్తున్నావో లేదో నాకు తెలియాలి కదా.. అందుకే.. ఆ టాస్క్ స్టార్ట్ చేసేకంటే ముందునుంచి.. టాస్క్ పూర్తయ్యేవరకూ ఆ తతంగాన్ని అంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ చేయాలి. టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే.. మొదటి పిల్లవాడిని వదిలేస్తా. టాస్క్ ఎలా చేయాలి? అనేదాన్ని రికార్డింగ్ చేసి పెన్‌డ్రైవ్‌లో ఆల్రెడీ స్టేషన్‌కు పంపించా. ఇప్పుడు టైమ్ రాత్రి 9.15 గంటలు అవుతున్నది. రాత్రి 9.30 గంటల నుంచి రాత్రి 9.31 వరకూ అంటే ఒక్క నిమిషంలో టాస్క్‌ను నువ్వు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయాలి. రాత్రి 9.20 నుంచే నీ లైవ్ టెలికాస్ట్ నాకు టీవీల్లో కనిపించాలి. టెలికాస్ట్ జరుగుతున్నప్పుడే ఆ పెన్‌డ్రైవ్ రికార్డింగ్‌ను నీతోపాటు రాష్ట్రమంతా వినాలి. అలా నేను ఫేమస్ అవ్వాలి. 5 నిమిషాల్లో అరేంజ్మెంట్స్ చేసుకో’ అంటూ ఆ ఫ్యాక్స్‌లో ఉంది. దీంతో సిబ్బందిని పురమాయించిన రుద్ర.. లైవ్ టెలికాస్ట్కు ఏర్పాట్లు చేశాడు.
రాత్రి 9.20 నిమిషాలకు అన్ని చానెల్స్‌లో లైవ్ టెలికాస్ట్ మొదలైంది. కాసేపటి కిందట.. ఏదో అర్థంకాని బ్రేకింగ్ న్యూస్.. ఇప్పుడేమో ఉన్నట్టుండి పోలీసు స్టేషన్లో జరుగుతున్న ఘటనపై లైవ్ టెలికాస్ట్.. అసలేం జరుగుతున్నదో టీవీలు చూస్తున్న ప్రజలకు అర్థంకావట్లేదు. ఈ సమయంలోనే రుద్ర పెన్‌డ్రైవ్‌ను సిస్టమ్‌కి కనెక్ట్ చేసి ప్లే చేశాడు. సైకో వాయిస్‌ను రుద్ర సహా టీవీల ద్వారా రాష్ట్రమంతా వింటున్నది. ‘రుద్రా.. నీ స్టేషన్‌కు ఓ ఫేక్ నోట్ల కట్టను పంపించా. అవి పిల్లలు ఆడుకొనే నోట్లు. ఆ కట్టలో రూ.50,000 ఉన్నాయి. ఇప్పుడు నీ టాస్క్ ఏమిటంటే.. ఆ కట్ట ఎలాగైతే ఉందో అచ్చం అలాగే ఉండే కట్టను నువ్వు ఏర్పాటుచేయాలి. అదీ ఒక్క నిమిషంలోనే. నువ్వు ఏర్పాటుచేసిన కట్టతోపాటు నేను పంపించిన కట్టను పక్కపక్కన పెట్టాలి. అది టీవీలో లైవ్ టెలికాస్ట్ కావాలి. ఒరిజినల్ నోట్లను పెడ్తావేమో.. అలాగైతే, గేమ్‌లో నువ్వు ఓడిపోయినట్టే. పిల్లలు ఆడుకొనే మరో రూ.50,000 నోట్ల కట్టను కొత్తది తెస్తావేమో.. అలా చేసినా నువ్వు ఓడిపోయినట్టే. నేను పంపిన నోట్ల మీద ఏవైతే నంబర్లు ఉన్నాయో.. అవే నంబర్లతో ఆ కట్ట కూడా ఉండాలి. ఒక్క నిమిషంలో టాస్క్ పూర్తి చెయ్యలేదో.. మొదటి పిల్లాడు చస్తాడు. టాస్క్ సరిగ్గా 9.30 గంటల నుంచి 9.31 గంటల మధ్య అంటే ఒక్క నిమిషంలో పూర్తవ్వాలి. ఆల్ ది బెస్ట్ రుద్రా’ అంటూ సైకో ముగించాడు. అది విన్న స్టేషన్‌లోని సిబ్బంది, పిల్లల పేరెంట్స్తోపాటు టీవీల్లో ఈ చాలెంజ్‌ను విన్న ప్రజల్లోనూ టెన్షన్ పెరగసాగింది.
అప్పటికే సమయం 9.27 గంటలు కావస్తున్నది. మరో మూడు నిమిషాల్లో టాస్క్ స్టార్ట్ చేయాలి. ఇంతలో రామస్వామి.. ‘సార్.. వీడు అలాంటి ఇలాంటి సైకో కానేకాదు. చాలా డేంజరస్‌గా ఉన్నాడు. ఇప్పుడు పిల్లలను కాపాడటం ఎలా?’ అంటూ భయపడిపోతూ అన్నాడు. ‘ఏమో.. బాబాయ్! నాకూ ఏమీ అర్థం కావట్లేదు’ అంటూ రుద్ర ఏదో ఆలోచిస్తున్నాడు. తమ పిల్లలను కాపాడాలంటూ పేరెంట్స్ ప్రాధేయపడుతున్నారు. స్టేషన్‌కు ఉన్నతాధికారుల నుంచి ఒకటే ఫోన్ కాల్స్. అవన్నిటినీ అటెండ్ చేసి మాట్లాడాల్సిందిగా రుద్ర అప్పటికే సిబ్బందికి చెప్పాడు. మరో నిమిషం మాత్రమే మిగిలి ఉంది. ఇంతలో రుద్ర తన పర్సనల్ క్యాబిన్‌కి వెళ్లాడు.
సమయం 9.32 గంటలు స్టేషన్‌లోని సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులతోపాటు టీవీల ముందు కూర్చున్న ప్రతీ ఒక్కరి పల్స్ రేటు పెరిగిపోయింది. రుద్ర అప్పటికే పూర్తిచేసిన టాస్క్.. విజయవంతమైందో లేదో తేలాల్సి ఉంది. కొందరు రుద్ర చేసిన టాస్క్ కరెక్ట్ అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతుండగా, మరికొందరు అనుమానంతోనే ఉన్నారు. ఏదేమైనా ఆ టాస్క్ కరెక్టో కాదో తేల్చాల్సింది సైకో. ఆ వ్యక్తి నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. ఇంతలో స్టేషన్‌కు ఓ మెసేజీ వచ్చింది. అది సైకో నుంచి వచ్చిన మెసేజీ. దాన్ని చదవమని రామస్వామికి చెప్పాడు రుద్ర. భయంతోనే మెసేజీని చదవడం ప్రారంభించాడు రామస్వామి.
‘మిస్టర్ రుద్రా. లిమిటెడ్ టైమ్‌లో నేను ఇచ్చిన టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా పరిష్కరించాలంటే ఒక్కటే మార్గం ఉంది. దాన్ని నువ్వు చాలా చక్కగా పట్టుకొన్నావ్. అయితే, ఇక్కడే నువ్వు పొరపాటు చేస్తావని నేను అనుకొన్నా. కానీ, చాలా తెలివిగా నువ్వు ఆ పొరపాటు చేయకుండా టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశావ్. సో.. ఇచ్చిన మాట ప్రకారం మొదటి పిల్లాడిని నేను వదిలేస్తా. అయితే.. ఆ పిల్లాడిని మామూలుగా వదిలేస్తే కిక్ ఏముంది చెప్పు?? హహహ్హ.. టెన్షన్ పడుతున్నావా రుద్రా? మరేం భయంలేదు. టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశావ్ కాబట్టి.. పిల్లాడిని తప్పకుండా వదిలేస్తా& అదే వది..లే&స్తా!!!! మిగతా వివరాలు కాసేపట్లో.. ఓకేనా??’ అంటూ ఆ మెసేజ్ సారాంశం.
‘ఆ పిల్లాడిని మామూలుగా వదిలేస్తే కిక్ ఏముంది చెప్పు??’ అన్న సైకో మాటలే రుద్ర మెదడులో గిర్రున తిరుగుతున్నాయ్. ఇంతలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద ఓ పిల్లాడు వేలాడుతున్నట్టు రుద్రకు సమాచారం వచ్చింది. దీంతో టీమ్‌తో అక్కడికి ప్రయాణమయ్యాడు రుద్ర. అదలా ఉంచితే, రూ.50,000 మరో నోట్ల కట్టను కేవలం ఒక్క నిమిషంలో రుద్ర ఎలా ఏర్పాటు చేసినట్టు? సైకో మెన్షన్ చేసిన ‘పొరపాటు’ ఏమిటీ? దాన్ని రుద్ర ఎలా అధిగమించాడు? మీరు కనిపెట్టారా?
సమాధానం:
తాను పంపిన రూ.50,000 నోట్ల కట్టలో ఏ నంబర్లు ఉన్నాయో అవే నంబర్లు ఉన్న మరో కట్టను పక్కపక్కన పెట్టి తనకు టీవీలో కనిపించేలా ఏర్పాటు చేయమన్నాడు సైకో. ఒక్క నిమిషంలో అలా ఏర్పాటుచేయడం ఎవరికీ సాధ్యంకాదు. దీంతో రుద్ర పర్సనల్ క్యాబిన్లోకి వెళ్లి రెండు అద్దాలను తీసుకొచ్చాడు. సైకో పంపిన నోట్ల కట్టను టేబుల్ మీద పెట్టి పక్కన ఆ అద్దాన్ని ఉంచాడు. ఆ అద్దంలో ఆ నోట్ల కట్ట ప్రతిబింబం పడింది. దీంతో రెండు నోట్లకట్టలు నిజంగానే పక్కపక్కన ఉన్నట్టు టీవీల్లో కనిపించింది. అయితే, నోట్ల కట్ట మీద ఉన్న నోటు నంబరు అద్దంలో రివర్స్‌గా కనిపిస్తున్నది. ఇది కనిపెట్టిన రుద్ర.. అప్పటికే తనతో తెచ్చిన మరో అద్దంలో ముందటి అద్దంలోని ప్రతిబింబం కనిపించేలా చేశాడు. దీంతో నంబర్ సరిగ్గా పడింది. అంటే సైకో పంపిన నోట్ల కట్ట లైవ్‌లో పర్ఫెక్ట్గా రెండుగా కనిపించింది. కాగా ఒక్క అద్దాన్ని తీసుకొచ్చి రుద్ర పొరపాటుపడతాడేమోనని సైకో భావించాడు. అయితే, అలా కాకుండా రుద్ర రెండు అద్దాలు తీసుకురావడంతో ఆ సైకో ‘రుద్ర పొరపాటు’ ఏమీ చేయలేదని అన్నాడు. కాగా దుర్గం చెరువు దగ్గర ఏమైందోనని రుద్ర అండ్ టీమ్ వాయువేగంతో కదిలారు.
-రాజశేఖర్ కడవేర్గు