జీవితాల్ని వస్తువుగా తీసుకుని డాక్టర్ వి.ఆర్. రాసాని ‘వొలికల బీడు’ నవలకు ప్రాణం పోశారు. సమాజంలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న కాటి కాపరుల గురించి చదువుతుంటే గుండె చెరువు అవుతుంది. అణచివేతకు గురైన వర్గాలు సైతం దూరం పెట్టే సామాజిక వర్గం కాటికాపరులు. ‘చాలా శ్మశానాల గోడలపై హరిశ్చంద్రుడి బొమ్మ పెడతారు కానీ, అసలు పెట్టవలసింది హరిశ్చంద్రుడి లాంటి చక్రవర్తికి ఉపాధి కల్పించిన వాడు వీరబాహుడు.. అతని బొమ్మ పెట్టడం సమంజసం కదా’ అనిపిస్తారు ఒకపాత్రతో రచయిత. దీన్నిబట్టి రచయిత దృక్పథాన్ని, తాడితపీడిత వర్గాలపట్ల తనకుగల సానుభూతిని అర్థం చేసుకోవచ్చు. ఆధునిక కాలంలో శ్మశానాల మీద కాటికాపరుల హక్కులు కాంట్రాక్టర్ల పరం కావడంతో ‘సంపద ఒకడికి… చాకిరీ ఒకడికి’ అన్నట్టుగా మారింది. ఆ అన్యాయంపై పోరాటం చేయాలనుకుంటాడు కథానాయకుడు. ఈ నవలలో ఉలిగమ్మగా ముద్రవేసి పురుషుడిని సమాజం మీద వదిలేసే సామాజిక రుగ్మతను కూడా ఆసక్తికరంగా ప్రస్తావించారు. మన చుట్టూ ఉన్న సమాజంలోనే, మనకు తెలియని జీవితాల గురించి ఈ నవల తెలియజేస్తుంది. అందరూ చదివి తీరాల్సిన రచన ఇది.
రచన: డాక్టర్ వి.ఆర్. రాసాని
పేజీలు: 124; ధర: రూ. 150
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 98484 43610
భూమ్మీద తమ నేలను పాలించుకునే హక్కు తమకే ఉండాలని ప్రజా పోరాటం జరిగిన, జరుగుతున్న ప్రాంతాలు రెండు… ఒకటి తెలంగాణ, రెండోది పాలస్తీనా. విశాలాంధ్ర పేరుతో 1956లో ఆంధ్రతో తెలంగాణ విలీనమైంది. అప్పటినుంచి తెలంగాణ సమస్త వనరులు అన్యాక్రాంతం కావడం మొదలైంది. దాదాపు యాభై ఏండ్లపాటు సాగిన ఈ పర్వానికి 2014 జూన్ 2న తెరపడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఈ క్రమంలో తెలంగాణ అస్తిత్వాన్ని తెలియజేయడానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ‘సురవరం తెలంగాణం’ పేరుతో ఇప్పటివరకు రెండు సంపుటాలు అందుబాటులో ఉంచారు. ఇప్పుడు మూడో సంపుటం ప్రచురించారు. ఇందులో 2001 2014 మధ్యకాలంలో తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించిన వివరాలు పొందుపరిచారు. ప్రముఖుల వ్యాసాలు, ఉద్యమ క్రమాన్ని కండ్లముందు ఉంచే పేపర్ క్లిప్పింగ్‌లను ఇవ్వడం విశేషం. సురవరం ప్రతాపరెడ్డి ‘ప్రాథమిక స్వత్వములు’ రచనను ఇందులో చేర్చి సురవరానికి నివాళి అర్పించడం మూడో సంపుటి ప్రత్యేకత.
ప్రధాన సంపాదకులు: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
పేజీలు: 486, ధర: రూ. 1000
ప్రచురణ: ఎస్.ఎన్.ఆర్. పబ్లికేషన్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు