విజయం ఎప్పుడూ ఆర్థిక, సామాజిక స్థితిగతులు చూడదు, పోరాటాన్ని మాత్రమే చూస్తుంది. పట్టుదలను అలవాటుగా మలుచుకున్నవారినే గెలుపు వరిస్తుంది. ఈ మాటలు పూణెకు చెందిన సన్నీ ఫుల్మాలికి అతికినట్టు సరిపోతాయి. మురికివాడలో పెరిగిన ఈ కుర్రాడు ఇప్పుడు అందరూ మెచ్చే యోధుడు. నిరంతర శ్రమ, అచంచలమైన విశ్వాసం అతని జీవితాన్నే మార్చేశాయి. ఇటీవల బెహ్రయిన్‌లో జరిగిన ఆసియన్ యూత్ గేమ్స్‌లో మల్లయుద్ధంలో బంగారు పతకం గెలిచిన సన్నీ ఫుల్మాలీ ప్రయాణమిది.
పూణెలోని లోహెగావ్ ప్రాంతమది. అక్కడో మురికివాడ. అందులోనూ విసిరేసినట్టుండే చోట ఓ గుడిసె. టార్పాలిన్ కవర్లతో కప్పి ఉండే ఆ గుడిసెలోనే ఉంటుంది సన్నీ కుటుంబం. కరెంట్ లేదు. నల్లా అసలే లేదు. ఉన్నదల్లా పేదరికమే! సన్నీ తండ్రి సుభాష్ది మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని అష్టి అనే కుగ్రామం. అక్కడ బతుకుదెరువు కరువై పదిహేనేండ్ల కిందట భార్య, ముగ్గురు కొడుకులతో పూణెలో అడుగుపెట్టాడాయన. సుభాష్ గంగిరెద్దును ఆడిస్తూ ఏదో సంపాదించేవాడు. అతని భార్య గాజులు, పూసల దండలు అమ్ముతూ ఇంత ఆదాయం తెచ్చేది. ఇద్దరు రోజంతా కష్టపడినా.. ఆ ఇంట్లో ఒకపూట పస్తు ఉండాల్సిన దుస్థితే! ముగ్గురు కొడుకుల్లో చిన్నవాడు సన్నీ.
సన్నీ తాతలు మల్లయోధులు. తండ్రి కూడా రెజ్లింగ్‌లో ప్రవేశం ఉన్నవాడే. కుస్తీ పట్టడం వారికి వెన్నతో పెట్టిన విద్య. తన కొడుకులను కూడా మల్లయోధులుగా తయారు చేయాలని భావించేవాడు సుభాష్. ఇంటి పక్కనే ఖాళీ స్థలం చదును చేసి, కుస్తీ పట్టడం నేర్పించాడు. పెద్దవాళ్లిద్దరూ పెద్దగా రాణించకపోయినా.. సన్నీ మాత్రం ఆటలో మెలకువలు ఇట్టే ఒడిసిపట్టాడు. స్థానికంగా జరిగే పోటీలకు వెళ్తూ ఉండేవాడు. ఉడుం పట్టు పట్టి.. ప్రత్యర్థిని ఇట్టే మట్టి కరిపించేవాడు. ఆటలో ఎంత పాటవం ప్రదర్శించినా.. అంతకుమించి ముందడుగు వేయలేని పరిస్థితి. కండలు తిరగాలంటే కడుపునిండా తిండెక్కడిది. ఉన్నంతలో సన్నీకి కాస్త పోషకాహారం అందించే ప్రయత్నమే చేశారు ఆ తల్లిదండ్రులు. రెజ్లింగ్ పోటీల్లో ఈ కుర్రాడి ప్రదర్శన చూసి స్థానిక కోచ్‌లు సోమనాథ్, సదాశివ్ ఆశ్చర్యపోయారు. అతణ్ని చేరదీసి, సరైన శిక్షణ అందిస్తే గొప్పగా ఎదుగుతాడని భావించారు. అనుకుందే తడవుగా సన్నీని ఆదరించి, శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు లోకల్ స్టార్ కాస్తా.. జిల్లా లెవల్ దాటాడు. రాష్ట్ర స్థాయి ఈవెంట్లలోనూ మెరిశాడు. ఆ కుర్రాడి ప్రతిభకు ముగ్ధుడైన రెజ్లింగ్ కోచ్ సందీప్ భోండ్వే సన్నీని దత్తత తీసుకున్నాడు. లోనికంద్లోని తన జనతా రాజా రెజ్లింగ్ సెంటర్లో చేర్చుకొని మెరుగైన శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన పర్యవేక్షణలో సన్నీ జాతీయ స్థాయి ఈవెంట్లలోనూ విజయాలు సాధించాడు. అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చాటడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గత అక్టోబర్‌లో బెహ్రయిన్‌లో జరిగిన ఆసియన్ యూత్ గేమ్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు సన్నీ. రెజ్లింగ్ పోటీల్లో అండర్ 17- 60 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఫైనల్ పోరులో ఇరాన్‌కు చెందిన ప్రత్యర్థిని ఓడించి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు.

బెహ్రయిన్‌లో సన్నీ సాధించిన విజయం అతని జీవితాన్ని మార్చేసింది. ఈ కండల యోధుడికి అండగా ఉంటానంటూ మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా శాఖా మంత్రి చంద్రకాంత్ పాటిల్ ముందుకొచ్చారు. 300 గజాల స్థలంలో సకల సౌకర్యాలతో ఓ ఇల్లు కట్టిస్తానని వాగ్దానం చేశారు. అంతేకాదు, రెజ్లింగ్ సాధనకు, విద్యాభ్యాసానికి గానూ ఆరేండ్ల పాటు తన సొంత జీతం నుంచి నెలకు రూ.50 వేలు పంపుతానని ప్రకటించారు. తనను ఆదరించిన మంత్రికి విజయాలతో కృతజ్ఞతలు చెబుతానంటున్నాడు సన్నీ. ఒలింపిక్స్‌లో బంగారు పతకమే ధ్యేయంగా కష్టపడతానని చెబుతున్నాడు. ఈ యువ రెజ్లర్ తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలని మనమూ మనసారా ఆకాంక్షిద్దాం.
సన్నీ విజయంతో లోహెగావ్‌లోని పూరి గుడిసె ముందు సంబురాలు మిన్నంటాయి. ఎక్కడెక్కడి జనాలో.. బురద దారిలో నడుచుకుంటూ వచ్చి సన్నీని అభినందించారు. తన గురువు సందీప్ భోండ్వే సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందంటాడు సన్నీ. ‘మా గురువు అండ దొరకకుంటే.. నేను ఈ మురికివాడకే పరిమితం అయ్యేవాణ్ని. కొన్నేండ్లుగా నా పోషణంతా ఆయనే చూసుకున్నారు. తండ్రిలా ఆదరించారు. ఎక్కడ పోటీ ఉంటే.. అక్కడికి పంపేవారు. విదేశాల్లో జరిగే ఈవెంట్లకూ నన్ను పంపారు. నా కోసం ఆయన కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచేవారు. నాకు శిక్షణ ఇచ్చేవారు. ఆయన ఆదరణతోనే నేనీ స్థితికి చేరుకున్నాను’ అంటాడు సన్నీ.