‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2023/24’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.
కూర్చున్న చోటునుంచి ఇంచుకూడా పక్కకి జరగడంలేదు నాగమ్మ. తాటిచాప పరిచినట్టున్న ఆ మట్టినేల మీద ఒక కాలు చాపుకొని, ఇంకో కాలు దగ్గరికి మడిచి పెట్టుకుని.. ఒక చిన్న కర్రముక్కతో అదేపనిగా మట్టిని తవ్వుతూ ఉంది.
జుట్టంతా రేగిపోతూ, చెవుల్లో గులకరాళ్లేసి ఆడిస్తున్నట్లు బలంగా వీస్తున్న గాలులు ఆమెను విసిగిస్తున్నాయి. దానికి తోడు నడినెత్తికెక్కిన నిప్పురవ్వ మరింత చికాకు పుట్టిస్తున్నాడు. చేదు తిన్నట్టు మొఖమంతా చిట్లించి పైటకొంగును తలకు ముసుగులాగ చుట్టుకుంది.
పొద్దున మొదలుపెడితే మధ్యాహ్నం కావొస్తున్నది.. తవ్విన చోటంతా చిన్న గుంతలాగా ఏర్పడింది. వదులుగా అయిన మట్టినంతా కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుని కళ్లతోనే జల్లెడ పడుతున్నది.
దమ్మొస్తున్నది. దూపైతున్నది. వెంట తెచ్చుకున్న నీళ్ల బాటిల్ అందుకుని, ఉన్న ఆ గుక్కెడు నీళ్లూ గొంతులో పోసుకున్నది. దప్పిక తీరలేదు. యాష్టకొస్తున్నది.
అసహనంగా మట్టిని గుప్పెట్లోకి తీసుకుంది. కొంత ఆవేదన, కొంత బాధ, ఇంకొంత.. నిస్సహాయత ఆమెను ఆవహించి ఉన్నాయి.
“వో క్కా! ఏమన్న గానొచ్చెనా?”..
అక్కడికి కొద్ది దూరంలో ఉన్న తిరుమలమ్మ గట్టిగా కేకేస్తూ నాగమ్మ ఉన్న వైపు నడిచొచ్చింది.
చేతిలోని మట్టి దిక్కే తీక్షణంగా చూస్తున్నదల్లా చివ్వున తల పైకెత్తి.. ‘ఏం కనిపించలేదు!’ అన్నట్లు తలను అడ్డంగా అటూఇటూ ఊపింది నాగమ్మ.
తిరుమలమ్మ.. “నాగ్గూడ!” అని..
“ఈడికి నాల్గు దినాలైపాయే. బిడ్డతానికి వొయ్యోస్తంటాని జెప్పొస్తి ఇంట్ల. ఆయిమెనేమో.. ‘తమ్మున్కి దెలుస్తే నీతోపాటు నన్ను గిట్ట పొట్టుపొట్టు తిట్టిపెడ్తడు. దేవులాడిన కాడికి సాల్ గాని.. ఇగ బయల్దేరు ఆడికెల్లి. అవల్ల నమ్మొద్దంట చెప్తుంటే గుడంగ వోతివి. ఇంట్ల పరిస్థితి తెల్సే తెల్సు. ఇప్పుడిగ ఉన్నది వాయే.. ఉంచుకున్నది వాయే! అన్నట్లున్నది నీ కత. అసలాడ ఏందింటున్నవో ఏడుంటున్నవో.. నాకైతే ఈడ మస్తు పర్శానైతున్నది!’
అని పొద్దట్సంది ఒకటే పోన్ల మీన పోన్లు జేస్తుండది. ఈడ జూస్తెనేమో మూల్గు మునుపటోలెనే.. తిండి ఎప్పటోలెనే అన్నట్లుండది. ‘ఇదొక్కరోజు సూశి రేపొస్తలే బిడ్డ!’ అంట జెప్పి.. ఈ పూటకెట్లనో ఓలాగ ఒప్పిస్తి!” అన్నది.. ఎండకు ముడుచుకుపోయిన లేత చిగురాకులా మొఖమంత దగ్గరికి చేసుకొని.
నాగమ్మ నిర్వికారంగా నవ్వి..
“కిస్మతక్కా అంతే! మన ప్రాప్తమెట్లుంటే అట్ల. అగో.. ఇప్పుడు నీ కొరకంత మాత్రమన్న బెంగటిల్లెటోళ్లు ఉన్నరు. మల్ల నాకు? వొచ్చినప్పట్సంది సూస్తుండవు గదా.. ఇంతవరకు ఆ మనిషి యాడున్నదో, తిన్నదో లేదో, అసలుండదో పోయిందో అన్న ఖాయిష్ గుడ్క లేకపాయే మా వోళ్లకు!” అని శూన్యంలోకి చూసింది.
చిన్నప్పుడు ఇసుక కనిపిస్తే చాలు.. కర్రముక్కతో ఇలానే మట్టిని గెలుకుతూ ఆడుకునేవాడు ఆమె పెద్ద కొడుకు. ఆ రోజులన్నీ బొంగరం తిరిగినట్టు కళ్ల ముందు గిర్రున తిరిగాయి నాగమ్మకు.
కొడుకు చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలన్నీ ఇంటి వెనకాల గోడనిండా అల్లుకున్న బచ్చలి తీగల్లా ఆమెను గట్టిగా చుట్టేయగానే.. ఒక్కసారిగా గుడ్ల నిండా నీళ్లూరినయి ఆమెకు. తమాయించుకొని తిరిగి మళ్లీ పనిలో పడింది.
కొండంచున తపస్సు చేస్తున్న మౌన మునిలాగ ఉన్నాడు సూర్యుడు. ఆకాశమంతటా పరిచిన తన కాషాయాన్నంతా మెల్లిమెల్లిగా లాగేసుకుంటూ కొండల్లోకి జారిపోతున్నాడు.
“మబ్బైతుంది. ఏం గానొస్తలేదు. పోదం పా క్కా!”.. ఆ మబ్బులో కూడా వెలుగుని వెతుక్కుంటున్న తిరుమలమ్మతో అన్నది నాగమ్మ.
“వొస్తున్నక్కా! ఇగో గీ తొవ్విన మట్టికాడికి సూషొస్త. నిన్న ఒకాయిమెకు ఎట్లాయే! పాపం అంతసేపు దేవులాడ్తె కండ్లవడలేదు గాని, గదే కుప్పలకేంచి ఇంగొకాయిమెకు జెర్రంత సేపట్లనే ఎట్ల దొర్కే! నిజంగనే నీవన్నట్టు కిస్మత్.. అంతే!” అని, పావుగంటసేపు వెతికి, ఇక లాభం లేదని అర్థమయ్యి పైకి లేచి,చీరకంటుకున్న మట్టినంతా దులుపుకొన్నది తిరుమలమ్మ.
ఆ తర్వాత అక్కణ్నుంచి నడిచి రోడ్డెక్కి, దగ్గర్లోని ఊళ్లోకి చేరుకున్నారిద్దరు.
తెచ్చుకున్న డబ్బులు అయిపోవొస్తుండటంతో, వాళ్లు రోజూ రాత్రి పడుకోడానికి వెళ్లే హనుమంతుడి గుడిలో పెట్టిన ప్రసాదం తిని సర్దుకున్నారు ఆ పూటకి.
కానీ, నదిలో కలిసిపోయిన కాలువలా, సముద్రంలో తప్పిపోయిన నదిలా.. ఆ ప్రసాదం ముద్ద వాళ్ల కడుపుల్లో ఏ మూలకో వెళ్లి నక్కి కాసేపటికే అక్కణ్నుంచి మాయమైపోయింది. నాలుగు రోజులనుంచి సరిగా తిండీ తిప్పలు లేకుండా తిరుగుతుండటంతో నాగమ్మకు ఏదోలాగ అయిపోయింది. తిన్న ఆయింత ముద్ద ఏ పాటికీ కాలేదు. మరోపక్క ఆమె మెదడు నిండా నిండిపోతున్న ఆలోచనల ప్రవాహాన్ని నియంత్రించలేక పోతున్నది.
ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. తల పగిలిపోతున్నది.
కళ్లు బైర్లు కమ్ముకుంటున్నాయి. నిలబడిన చోటే కూలబడిపోయి.. ‘లేవలేను!’ అన్నట్లుగా సైగ చేసింది.
తిరుమలమ్మకు కాళ్లూ చేతులాడలేదు. సాయం కోసం చూసింది. ఎదురుగా ఉన్న షాపులోని యజమాని వాళ్లను గమనించి పరుగున వచ్చి విషయం కనుక్కున్నాడు. వెంటనే వెళ్లి అతను ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని పట్టుకొచ్చి వాళ్లకిచ్చాడు.
ఆ తర్వాత వాళ్ల వివరాలు కనుక్కుని..
“ఏంటికమ్మా మీకీ తిప్పలు. అయ్యన్ని జరిగే పనులు కావు. నూటికో కోటికో ఎవురో ఒకరికి.. అంతే! అనోసరంగా ఆశలు పెట్టుకోమాకండి. మీలాగే చానామంది ఆళ్ల పనులు ఇడిసిపెట్టుకుని ఈడకు వొస్తారు. వారం పది దినాలు ఈడే ఉంటారు. తిండికి, రేత్రి పొద్దు పండుకోనీకి నానా తంటాలు పడతాంటరు. అవొసరం, ఆశ మనిషిని ఎంత దూరమైనా తీసుకపోతయి.. ఏమైనా చేయిస్తయి. ఆశపడ్డట్లు దొరికితే అది యేరే ఇసయం, ల్యాకపోతే..? అందుకే మీకింత ఇదిగా చెబుతాండ. సరే.. ఈ పొద్దుకి ఈడే పండుకోండి. పొద్దున్నే మిమ్మల్ని బస్టాండ్‌కి తోల్కపోతా. హాయిగా ఇంటికి పోండి. మీ ఇంటోళ్లు ఎంత బుగులు పడతాంటరో ఏమో!” అని అతను చెప్తుంటే.. ఆ చివరి మాటకు మనసులోనే పిచ్చిగా నవ్వుకున్నది నాగమ్మ.
“రేపొక్కటి సూశి పోతం సారు!”అన్నది తిరుమలమ్మ.
అతనిక ఏమీ అనలేక, వొద్దంటున్నా ఖర్చులకు కొంత డబ్బిచ్చి వెళ్లిపోయాడు.
“అసలే తెల్వని ఊరాయే! గా సారెవరో టయానికి దేవుడ్లాగొచ్చిండు. లేకుంటే మన గతేమైతుండెనో!” అతను వెళ్తున్న దిక్కే చూస్తూ అన్నది తిరుమలమ్మ.
“దునియల మంచితనమింగా ఉన్నదంటే నమ్మబుద్ధయితలేదు. ఆపత్కాలంల పక్కోని కష్టం తెల్సుకొని మరీ సాయం జేశేటోళ్లింకా ఉన్నరంటే దునియ కొత్తగ్గానొస్తున్నది నాకు!”.. తల్లిదండ్రులతోనే ప్రేమాప్యాయతలకు దూరమైన ఆమెకు, ఇప్పుడు తనకోసం ఆలోచిస్తున్న తిరుమలమ్మను, తను కుదుటపడేవరకు కంగారు పడిపోయిన షాపు యజమానిని చూస్తుంటే.. అదేదో జీవితంలో ఎప్పుడూ చూడని వింతను దగ్గరగా చూస్తున్నట్లుంది నాగమ్మకు. అర్ధరాత్రి వేళ మూగబోయిన అడవిలా మౌనంగా ఉండిపోయింది.
ఆ రాత్రంతా పడుకోకుండా నల్లని ఆకాశంలోకే చూస్తూ ఉంది. ఆమె పెండ్లప్పుడు తల్లిగారింటి నుంచి తెచ్చుకున్న నల్లజాడి మీద చిన్న మన్మరాలు తన గౌనుకున్న చమ్కీలను పీకి పారేసినట్లున్న చుక్కల వంకే తీక్షణంగా చూస్తూ ఉంది. వాటిలోంచి కనీసం ఒక్కటైనా.. పోనీ ఒక చిన్న తునకైనా నేల రాలిపడితే ఎంత బాగుండునో!? అప్పుడిక తన సమస్యలన్నీ తీరిపోతాయన్న వెర్రి ఊహతో వాటివైపే చూస్తూ ఉంది.
“రోజంత క్యాబ్ నడుపుకొని మల్ల రూముకొచ్చి వొండుకొని తినాల్నంటే బేజారొచ్చిపోతున్నది. అందుకే ఈసారి సరస్వతిని, పిల్లలను గూడ నా ఎంబడి తీస్కపోదమన్కుంటున్న” అన్నాడోరోజు నాగమ్మ పెద్దకొడుకు యాదగిరి.
‘సరిగ్గనే విన్ననా!?’ అని ఆమె కనుబొమలు ముడేసి..
“మల్ల.. నేను? నన్ను గిట్ట దోల్కపోరా?”
అన్నది నాగమ్మ.
ఒక్కసారిగా ఆమె ముఖం ప్రశ్నాపత్రంగా మారిపోయింది. అందులో కొడుకేం సమాధానం రాస్తాడోనని ఆతృతగా అతని కళ్లలోకి చూసింది.
“అట్ల గాదే.. ఆడ నేనింకా ఇల్లు గిట్ల ఏం చూస్కోలేదు. ఇప్పుడుంటున్న రూము మా దోస్తుగాన్ది. వాడిప్పుడు ఊరికి వొయిండు. రానికే జెర టైం పడ్తదన్నడు. అందుకే ముందు వీళ్లను తోల్కపోత! ఓ వారం పది రోజులల్ల వేరే ఇల్లు చూస్కున్నంక నిన్ను గుడ్క తీస్కపోత. ఇప్పుడు అందరం వొయి ఆడుంటే ఇబ్బందైతది!” అని చెప్తున్నప్పుడు.. అతని కళ్లలోని అబద్ధం నిజమవుతుందేమోనని లోలోపలే బుగులైంది నాగమ్మకు.
‘నేనొక్కదాన్నే ఎక్వైతినా? ఏంగాదులే.. కష్టమో నష్టమో ఎట్లనన్న సదుర్కుందం. ఎన్ని సూశొచ్చిందాన్ని.. నాకిదో లెక్కనా!’ అనబోయి ఎందుకో మాట గొంతులోనే ఇరుక్కుపోయింది ఆమెకు.
కొడుకు పిల్లోడిగా ఉన్నప్పుడు తను పనికెళ్లే సమయానికి రోజూ ‘నేనొస్తా!’ అంటూ వెంటపడేవాడు.
‘వొద్దు’ అని ఎంత చెప్పినా ఆమెని వెళ్లనివ్వకుండా చీర చెంగులు పట్టి గుంజుతూ గట్టిగా ఏడ్చేవాడు. పెద్దోణ్ని చూసి చిన్నోడు కూడా వెంటపడేవాడు. పిల్లలట్లా ఏడుస్తుంటే అడుగు ముందుకు పడేదికాదు ఆమెకు.
వాళ్లకు మాత్రం ఇంకెవరున్నారు? వాళ్లకన్నీ అమ్మేగా! అమ్మ వెంటుంటే చాలు!
అందుకే కాదనలేక వెంట తీసుకెళ్లేది.
ఇప్పుడు తన పరిస్థితి కూడా సరిగ్గా అలానే ఉందేమో అనిపిస్తున్నది నాగమ్మకు. కానీ
‘అమ్మకు మాత్రం ఎవరున్నారు. నేనొక్కణ్నే గదా!’ అని తనలా కొడుకెందుకు అనుకోవడం లేదన్న ఆలోచనకు ఆమె మనసు బీడు వారిపోయింది. ఈ విషయంలో కోడలు కూడా కలగజేసుకోకపోవడం ఆమెను మరింత వ్యధకు గురిచేస్తున్నది.
చెప్పినట్టుగానే కొడుకు ‘తన’ కుటుంబాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. వారం పది రోజుల్లో వచ్చి తనను కూడా తీస్కెళ్తానన్న వాడు, మొహం చాటేశాడు. చివరికి ఆమె ఫోన్‌చేస్తే ఎత్తడం కూడా మానేశాడు. నాగమ్మకు గుండెల్లో సన్నని బెరుకు మొదలైంది. వాళ్లు తననిక వొద్దనుకుంటున్నారన్న విషయం మెల్లిమెల్లిగా అర్థమవుతున్నది. ఇటు చూస్తే, వారం రోజుల్లో కిరాయి కట్టకుంటే ఇల్లు ఖాళీ చేయమని ఇంటి ఓనరు పెట్టే పోరు పడలేకపోతున్నది.
“చేతిల చిల్లి గవ్వ లేన్నాడు గూడ నా బిడ్డలను పోషించుకున్న. అంతేగాని ఏనాడూ ‘మీ సావు మీరు సావండి’ అని వాళ్లను ఇడిసిపెట్టి నా సుఖం నేను జూస్కోలేదు గదా! మల్ల నా కొడుక్కు నేనెట్ల భారమైతి. నా కిస్మతి ఇట్లెందుకున్నదో!” అని ఒంటరి పక్షిలా రాత్రుళ్లు గోడలతో చెప్పుకొని ఏడ్చేది.
తల్లి, తండ్రి లేని పిల్ల అని.. ఆమెను చూసుకోవడం భారమని నాగమ్మ మేనత్త ఆమెకు పదమూడేళ్లకే తెలిసిన మంచి సంబంధమని చెప్పి పెళ్లి చేసేసింది. నాగమ్మకు, ఆమె భర్తకు వయసులో పదిహేనేళ్ల తేడా. పైగా అతనికి లేని అలవాటంటూ లేదు. మరీ ముఖ్యంగా మందే మంచినీళ్లతనికి. తాగొచ్చి నాగమ్మను రోజూ ఏదో ఒకదానికి కొడుతూండేవాడు. పెళ్లి తరువాత ఆమె పుట్టింటి వాళ్లు ఇటువైపు కనీసం తొంగి కూడా చూడకపోడం అతనికి మరింత ధీమాగా ఉండేది.
భర్త విషయంలో కన్నీళ్లు పెట్టి పెట్టి ఆఖరికి తన ఒంట్లో ఇక కన్నీరే మిగల్లేదేమో అన్నంతలా మొద్దుబారిపోయింది. చివరికి ఆ తాగుడే అతణ్ని తీస్కెళ్లిపోయినా.. ఆమెలో ఏ చలనం లేకుండా ఉండింది.
అప్పటికే ఇద్దరు పసివాళ్లున్న నాగమ్మను కొన్నిరోజులకు అత్తింటి వాళ్లు వదిలించుకున్నా.. మౌనంగా, నిస్సహాయంగా తప్పుకొన్నదే కానీ అడ్డుపడి ఒక్కమాట కూడా అడగలేదు, అనలేదు.
ఇటు పుట్టింటి వాళ్లూ ఆమెను ఎప్పటిలాగే చూశారు. దాంతో రోడ్డున పడింది.
పొట్ట కూటి కోసం తిరిగితిరిగి వాళ్లను వీళ్లను అడిగి దొరికిన పనల్లా చేసుకునేది.
అంత కష్టంలోనూ మొండిగానే ఉన్న నాగమ్మకు.. మెదడు సరిగాలేని తన చిన్నకొడుకు ఇంట్లోంచి ఎటో వెళ్లిపోయి తప్పిపోయినప్పుడు తడైన ఆమె కళ్లు చాలా ఏళ్లవరకు తడిగానే ఉండిపోయాయి.
ఇక తనకంటూ మిగిలిన పెద్ద కొడుకే ఆమెకు వెన్ను ముక్కనుకుని బతుకుతుంటే.. ఇప్పుడతను తనను వొద్దనుకుంటున్నాడని అర్థమయ్యాక ఆమె గుండెను ఎవరో కాళ్లకిందేసి తొక్కి, రంపంతో కోస్తున్నట్లుంది.
వారమైపోయింది. ఓనర్‌తో ఇక మాటలు పడలేక.. ఆమెకొచ్చే పింఛన్లో నెలనెలా కొంత డబ్బును పక్కకు తీసి, తన ముగ్గురు మన్మరాళ్లకు పండక్కి బట్టలు కొనిద్దామని ఎప్పట్నుంచో జమ చేసుకున్న పైసలతో కిరాయి కట్టింది. ఆ తర్వాత అక్కణ్నుంచి వచ్చేసి దిక్కు తోచక బస్టాండ్‌లో కూర్చుంది.
“నీవు తమ్మునికి ఇప్పుడేం జెప్పకు. రెండ్రోజులల్ల వొస్త. ఏమో.. మన అదృష్టం బాగుంటే దొర్కుతది. టీవీలల్ల అంతగానం సూపుతున్నరు! ఒకాయినకు రెండు దొరికే! అరవై లచ్చలంట అవిటికి. ఇంగొకాయిమెకు పదారు లచ్చలు. ఎవరికో కోటిన్నరంట. అట్ల మస్తుమందికి దొర్కవట్టే! నీవు నా గురించేం ఫికర్ జేయకు. నేను మంచిగనే ఉంటలే. ఉంట మల్ల.. శార్జింగు మూడు పుల్లలే ఉంది!”.. తన పక్కనే కూర్చున్న తిరుమలమ్మ ఫోన్లో కూతురితో మాట్లాడిన మాటలు నాగమ్మను ఆశ్చర్యానికి గురిచేశాయి.
“ఏందక్కా.. ఏంటివో ‘లచ్చలు, కోట్లు దొరికినయ్!’ అంటుండవు. యాడ? అసలు పైసల్ దొరుకుడేంది!?” అని ఆమెను అడక్కుండా ఉండలేకపోయింది.
“పైసల్ గాదక్కా.. వొజ్రాలు! ఆడ కర్నూల్ దిక్కు.. నీకు దెల్వదా! టీవిలల్ల మస్తుగ సూపుతున్నరు”.
“తెల్వదక్కా.. ఎప్పుడు ఇనలే, సూడలే!”.
“నేను మొన్న టీవిల సూశి వొచ్చినక్కా!” అని చెప్పి..
“నాకిద్దరు కొడుకులు, ఒక బిడ్డక్కా! నా పెద్దకొడుకు మొన్న గా కరోన రోగమని వొచ్చే గద.. అప్పుడు సచ్చిపోయిండు. ఇగ అప్పట్సంది అందరం చిన్న కొడ్కుతాననే ఉండుకమయ్యింది. వాడొక్కడే మాకు ఆదరవు. కానీ, మా గాచారం ఎట్లున్నదో సూడు.. వాన్కి రెండు కిడ్నీలల్ల ప్రాబ్లమున్నదంట. మస్తు ఖర్చొస్తున్నది. కోడండ్లే అట్లిట్ల తిప్పలు వడ్తున్నరు. అందుకే.. ఎట్లయితే అట్లయిందని ఈడ నాగర్ కర్నూల్ల ఉండే నా బిడ్డతానికి వొయ్యొస్తాంట జెప్పి.. వొజ్రాలు దేవులాడనీకే కర్నూల్ వోతుండ! తెలుస్తే మల్ల నా కొడుకు గరమైతడని! ఇగ మా అదృష్టమెట్లుంటే అట్ల!” అంటూ తన కథంతా చెప్పుకొచ్చింది తిరుమలమ్మ.
ఆమె కథ విన్నాక తన పెద్ద కొడుకును గురించి గుర్తుచేసుకొని బాధపడుతూ.. తనుకూడా తన కథనంతా చెప్పుకొచ్చింది నాగమ్మ. ఆమె పరిస్థితి తెలుసుకున్నాక తిరుమలమ్మకు మనసంతా అదోలా అయిపోయింది. ఆమెను కూడా తనవెంట రమ్మన్నది. ఒకవేళ నిజంగానే వజ్రాలు దొరికితే తన సమస్య తీరుతుందేమోనన్న ఆశతో ఆమెతోపాటు నాగమ్మ కూడా పయనమయ్యొచ్చింది.
మరుసటిరోజు పొద్దున్నే నాగమ్మ, తిరుమలమ్మ తిరిగి మళ్లీ తమ వజ్రాల వేట.. కాదు బతుకువేట కోసం సిద్ధమయ్యారు.
తొలకరి జల్లులకు మొలకలెత్తిన గింజల్లా ఉన్నారు.. ఆ పొలంలో వజ్రాలను వెతికేందుకు వచ్చిన జనాన్ని చూస్తుంటే! ప్రతొక్కరి వెనుక ఏదో ఒక కథ. ఊరికే.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వచ్చిన వాళ్లూ ఉన్నారు.
నాగమ్మ, తిరుమలమ్మ రోజులా కాకుండా షాపతను చెప్పినట్టుగా కొంచెం చిన్నగా, తెల్లగా, నునుపుగా
మెరుస్తున్నట్లుండి.. ప్రత్యేకంగా అనిపించిన రాళ్లను ఏరుకున్నారు.
సాయంత్రమైంది! ఇక అంతటితో ఆట ముగిసింది.
ఏడాదంతా కష్టపడి చదివి పరీక్షలు రాశాక ఫలితాల కోసం ఎదురుచూస్తున్న పదో తరగతి పిల్లల్లా, అక్కడున్న వాళ్ల సాయంతో ఆ రాళ్లను పరీక్షకు ఇచ్చి ఆతృతగాచూస్తున్నారిద్దరు.
తిరుమలమ్మ రాళ్లల్లో ఒక్క వజ్రమూ లేకపోడంతో ఆమె చెంపలు అప్రమేయంగా తడిసిపోయాయి. ఎన్ని కష్టాలున్నా ధైర్యంగా ఉండేది. మొదటిసారిలా డీలా పడిపోయింది.
ఇక నాగమ్మ రాళ్లను పరీక్షిస్తుంటే ఆమె ధ్యాసంతా కొడుకు మీదే ఉంది. ఇప్పుడు ఈ రాళ్లే తన గమ్యాన్ని శాసిస్తున్నట్లుగా ఉందామెకు. తన పయనం కొడుకు వెంటా..? లేక తన నీడ వెంటా..? అని తలచుకుంటుంటే అరచేతులు చల్లగా అయిపోయాయి.
“మిషను పన్నెండు పాయింట్లు చూపిస్తుందమ్మా.. ఇది వజ్రమే! ఇంచుమించు పన్నెండు లక్షల దాకా వస్తాయేమో!” అన్న మాట వినగానే.. నాగమ్మ ఊపిరి పీల్చుకుంది. ఒకవైపు పట్టరాని సంతోషం, మరోవైపు తెలియని దుఃఖం ఆమెను చుట్టుముట్టేశాయి.
“కిస్మతక్కా! నీకంత మంచే పో! ఇగ నీ కొడుకు, కోడలు నిన్ను నెత్తిన వెట్టుకుంటరు. మస్తు ఖుషైతుందక్కా నాకైతే!” ఒకవైపు తనచుట్టూ ఉన్న సమస్యల ఊబిలోకి జారిపోతున్న బాధలో ఉన్నా.. స్నేహితురాలి బతుక్కి ఓ దారి చూపగలిగినందుకు సంతోషంగా ఉంది తిరుమలమ్మకు. కల్మషం లేని ఆమె స్నేహానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కాలేదు నాగమ్మకు.
ఒకరు కొండంత ఆశతో, మరొకరు గుండెనిండా నిరాశతో తిరుగు ప్రయాణమయ్యారు.
“తిరుమలమ్మ ఇల్లు ఇదేనా?” అన్న మాట విని, గుమ్మం బయట పరధ్యానంగా కూర్చుని ఉన్న తిరుమలమ్మ ఉలికిపాటుగా చూసి..
“నేనే తిరుమలమ్మని. మీరెవరు?” అన్నది.
“నాగమ్మ..” అతని మాట పూర్తి కాకముందే.. ‘నాగమ్మ’ అన్న పేరు వినపడగానే..
“ఎవరూ.. నాగమ్మనా? ఎట్లున్నది? కొడ్కుకాడికి వొయిందా? పోన్లే మంచిగుంటే అంతే సాలు! ఇంతకీ నీవెవరు? నాగమ్మ కొడ్కువి నీవేనా ఎట్ల?” అంటూ పైకిలేచి విప్పారిన ముఖంతో అతణ్ని సమీపించింది.
“కాదమ్మా! నేను కర్నూల్‌నుంచి వచ్చినాను. నాగమ్మగారు పదిరోజుల క్రితమే మా ఆశ్రమంలో చేరినారు. తన స్నేహితురాలు తిరుమలమ్మ కుటుంబం కష్టాల్లో ఉన్నదనీ, ఆమెకు ఈ డబ్బును ఎలాగైనా అందజేయాలని మమ్మల్ని కోరారు. ఆవిడిచ్చిన మీ నెంబరుకి ఫోన్ చేస్తే కలవలేదు. ఇక ఆ నెంబర్ ద్వారా మీ అడ్రస్ కనుక్కుని వచ్చినాము. ఇదిగోండి మీ డబ్బు.. మొత్తం పన్నెండు లక్షలు” అని ఆ డబ్బును తిరుమలమ్మ చేతుల్లో పెట్టి ఆశ్రమం నెంబర్ ఇచ్చాడు.
“ఈరోజుల్లో కూడా అట్లాంటి స్నేహితురాలు ఉండటం మీ అదృష్టమమ్మా!” అని చెప్పి అతను సెలవు తీసుకున్నాడు.
ముందు గదిలో మంచంపై పడుకుని ఉన్న తిరుమలమ్మ కొడుకు వెంకట్రాములు వాళ్ల మాటలు విని అయోమయంలో పడ్డాడు. తిరుమలమ్మ లోపలికొచ్చి జరిగిందంతా వివరంగా చెప్పింది.
వెంకట్రాములుకు నోట మాట రాలేదు. వెంటనే అతనిచ్చిన నెంబర్‌కు ఫోన్ కలిపాడు. నాగమ్మతో మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. అక్కడుండే బదులు తమ దగ్గరే ఉండమని బతిమిలాడాడు. కానీ, ఆమె నిరాకరించింది.
“నాగమ్మా! నీవు ఆశ్రమంల జేరినవంట? ఎందుకట్ల జేశ్నవ్? మంచిగ కొడుకుతోనుండక గిదేం పని? అయినా నీకు తగిలిన అదృష్టాన్ని మాకెందుకిచ్చినవ్? నాకైతే ఏమర్థమైతలేదు” అన్నది తిరుమలమ్మ.
నాగమ్మ ఎన్నో రహస్యాలను తన కడుపులో దాచుకున్న నిశ్శబ్ద అరణ్యంలా మౌనంగా ఉండిపోయింది.
‘వజ్రం దొరికిందంట కదమ్మా! టీవిల గనవడ్డవని నీ కోడలు జెప్పింది. ఇగ మన కష్టాలన్నీ తీరిపోయినట్టే!’.. ఇంటి ముఖం చూసి ఆరు నెలలైనా.. ఫోన్ చేసినా ఎత్తని పెద్దకొడుకు.. ఆమెకు వజ్రం దొరికిందని తెలియగానే తనంతట తానే ఫోన్ చేసి, అరువు తెచ్చుకున్న ప్రేమనంతా ఒలకబోస్తుంటే.. ఆమెలోని తల్లి మనసు ఆమెను కొద్దిసేపటి వరకు వెర్రిదాన్ని చేసింది. ఆ మాయలోపడి సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది నాగమ్మ.
కానీ.. ఆ తరువాత తిరుమలమ్మ గుర్తొచ్చింది. ప్రతీది డబ్బుతో ముడిపెట్టే తన కుటుంబానికి, డబ్బుకంటే మనిషి ముఖ్యం, ఆ మనిషితో తనకున్న అనుబంధం ముఖ్యం అనుకునే తిరుమలమ్మ కుటుంబానికీ.. నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా కనిపించింది.
ఈరోజు తన దగ్గర డబ్బుందని కొడుకు తిరిగి ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. అదే ఆ డబ్బంతా అయిపోయిన రోజున తన పరిస్థితి మళ్లీ రోడ్డెక్కొచ్చు. ఏ బంధమూ శాశ్వతం కాదు.. ఏదీ తనవెంట రాదన్న సత్యాన్ని మెల్లిమెల్లిగా గ్రహించగలిగింది.
అంతే.. ఊరికి తిరిగొచ్చినదల్లా తిరిగి కర్నూలు వెళ్లింది. ఇదివరకు తనకు సాయం చేసిన షాపు యజమాని ద్వారా అక్కడే ఓ వృద్ధాశ్రమంలో చేరింది. ఇప్పుడదే తన గమ్యస్థలం.
“అడుగుతుంటే ఏం జెప్పవేంది నాగమ్మా?”..
తిరుమలమ్మ మళ్లీ అడిగింది.
“కిస్మత్.. అక్కా!” అని చెప్పి.. నిశ్శబ్దంగా నవ్వింది నాగమ్మ.
స్ఫూర్తి కందివనం
‘డబ్బు’ అన్న రెండక్షరాలే.. బంధాలను, బంధుత్వాలనూ శాసిస్తున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేక.. ఎన్నో జీవితాలు మోడువారి పోతున్నాయి. తొలకరి జల్లులతోనైనా తమ జీవితాలు కొత్తచిగుళ్లు తొడుగుతాయన్న ఆశతో.. ఎంతోమంది ఇప్పుడు సీమబాట పడుతున్నారు. అక్కడ నానా తంటాలు పడుతూ.. తమ అదృష్టం కోసం అన్వేషిస్తున్నారు. అలాంటి ఓ అభాగ్యురాలి కథే.. ఈ కిస్మత్! తండ్రి కందివనం రఘురామయ్య స్ఫూర్తితో.. సాహిత్యంవైపు అడుగులు వేశారు స్ఫూర్తి కందివనం. వీరి స్వస్థలం మహబూబ్‌నగర్. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. బయోటెక్నాలజీలో పీజీ చేశారు. ప్రస్తుతం సైంటిఫిక్ ఈ-జర్నల్స్ పబ్లిషింగ్ సంస్థలో ఎడిటోరియల్ అసిస్టెంట్‌గా సేవలు అందిస్తున్నారు.
2019 నుంచి రచనలు చేస్తున్నారు. ఇప్పటివరకూ 30కి పైగా కథలు, 3 నవలలు రాశారు. నమస్తే తెలంగాణ – ముల్కనూరు సాహితీ పీఠం కథల పోటీల్లో ‘డిమ్కి’ కథకు ప్రథమ బహుమతి (2021), ‘ముసురు’ కథకు తృతీయ బహుమతి (2022) అందుకున్నారు. ‘నాయన చెప్పిన అబద్ధం’, ‘డిమ్కి’, ‘నల్ల చీమలు’, ‘ముసురు’, ‘చీకటి వెలుగులు’ కథలు అత్యంత పాఠకాదరణ పొంది.. రచయిత్రికి మంచి గుర్తింపునిచ్చాయి. ‘చైత్ర’ నవలకు తెలంగాణ సారస్వత పరిషత్తు యువ పురస్కారం, అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ ప్రథమ నవలా పురస్కారం దక్కింది. ఇటీవలే వెలువడ్డ తొలి కథా సంపుటి ‘డిమ్కి’కి ‘కందికొండ రామస్వామి స్మారక జాతీయస్థాయి పురస్కారం’ అందుకున్నారు.
స్ఫూర్తి కందివనం
96527 45117