జగమంతా రామమయం అన్నాడు కంచర్ల గోపన్న. పోసే నారు, పట్టే నీరు, ఎదిగే పైరు, కోసే పంట, వేసే కుప్ప.. అంతటా రాముడే! దున్నకం మొదలుకొని నూర్పిళ్ల వరకు అంతా రామమయమే!! రామానుగ్రహంగా దక్కిన ధాన్యాన్ని గోటితో ఒలిచి.. కోటి తలంబ్రాలుగా మలిచి.. భద్రాద్రి రాములోరి కల్యాణానికి పంపే సంప్రదాయం ఉంది. పద్నాలుగేండ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారం రామనవమి వేడుకకు ప్రత్యేకం. కోలాహలంగా సాగే కోదండరాముడి కల్యాణ ప్రసాదంగా అందుకునే కో(గో)టి తలంబ్రాల కథ ఆద్యంతం ఆసక్తికరం.
తెలంగాణ వేదికగా జరిగే.. తెలుగింటి వేడుక సీతారాముల కల్యాణం. శ్రీరామనవమి వేళ మన భద్రగిరి.. అయోధ్యాపురిలా అలరారుతుంది. స్వామివారి వివాహం జరిగే మిథిలా మంటపం… జనక మహారాజు కొలువుకూటమై విరాజిల్లుతుంది. ఈ లోక కల్యాణాన్ని కన్నుల పండువగా తిలకించిన భక్తులు పొందే అనుగ్రహం.. జానకిరాములు ముచ్చటగా పోసుకున్న తలంబ్రాలే! రాములోరి కరస్పర్శతో నీలమణులుగా మారిన మేలిమి ముత్యాలు, సీతమ్మ చేయి తగలగానే కెంపులై పులకించే అక్షతలను ఆర్తిగా అందుకొని పులకించిపోతారు భక్తులు. వాటిని శిరస్సున చల్లుకుని పొంగిపోతారు. ఈ పరవశంలో పద్నాలుగేండ్లుగా తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తకోటి బృంద సభ్యులు. జిల్లాలోని కోరుకొండ సమీపంలోని అచ్యుతాపురానికి చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు ఏటా తన పొలంలో ఒక ఎకరంలో తలంబ్రాల వడ్లు పండిస్తున్నాడు. 2011 నుంచి ఈ తలంబ్రాల యజ్ఞం నిరాటంకంగా కొనసాగుతున్నది.
ఏటా నాట్ల సమయానికి విత్తనాలను భద్రాచలం తీసుకొచ్చి సీతారాముల పాదాల దగ్గర ఉంచి పూజలు చేస్తారు. రామనామం స్మరిస్తూ నారు పోస్తారు. భక్తులంతా సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు, జాంబవంతుడు ఇలా రామాయణ పాత్రలు ధరించి.. పొలం దున్నుతారు, నాట్లు వేస్తారు. పంట కోసేటప్పుడు, కుప్ప నూర్పిళ్లలోనూ ఇదే పద్ధతిని పాటిస్తారు. ఆయా పాత్రధారులు పొలంలోకి దిగినప్పుడు ఊరంతా కోలాహలమే! భక్తులంతా వచ్చి ఈ తంతునంతా శ్రద్ధగా గమనిస్తారు. రామనామం స్మరిస్తూ మైమరచిపోతారు. అలా రామప్రసాదంగా చేతికొచ్చిన వడ్లను తలంబ్రాలకు వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన నాలుగువేల మంది మహిళలకు ఏటా డిసెంబర్ 15న వీటిని తరలిస్తారు. అప్పటినుంచి ఆ భక్తులందరూ రామనామ స్మరణతో ఒక్కో వడ్లగింజను గోటితో ఒలుస్తారు. అలా కోటి తల్రంబాలను సిద్ధం చేస్తారు. ఇలా సుమారు 800 కిలోల గోటి తలంబ్రాలను సిద్ధం చేసి సీతారాముల కల్యాణ సమయానికి అచ్యుతాపురానికి తీసుకొస్తారు. వీటిని రంగవల్లులు తీర్చిదిద్దిన కుండల్లో పోస్తారు. ఆ కుండలను మహిళలు తలపై పట్టుకొని, పురుషులు కావడిలో పెట్టుకొని పాదయాత్రగా రాములోరి పెండ్లికి ముందే భద్రాచలం చేరుకుంటారు. దేవస్థానం అధికారులు వారిని సాదరంగా స్వాగతిస్తారు. అక్షతలు ఉన్న కుండలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వాటిలోని గోటి అక్షతలను ఒక దగ్గర పోసి వేద పండితుల సమక్షంలో తలంబ్రాలుగా కలుపుతారు.
ఏ దేవతామూర్తుల తలంబ్రాలైనా పసుపురంగులో మాత్రమే ఉంటాయి. కానీ.. భద్రాద్రి సీతారాముల తలంబ్రాలు మాత్రం ఎరుపురంగులో ఉంటాయి. భక్త రామదాసు కాలంలో సీతారాముల కల్యాణానికి తానీషా ప్రభువు ముత్యాల తలంబ్రాలు సమర్పించేవాడు. గులాల్ కలపడంతో తెల్లని ముత్యాలు ఎర్రని మాణిక్యాల్లా మెరిసిపోయేవి. అలా ఆనాటి నుంచి స్వామికి ఎర్రని తలంబ్రాలు సమర్పించే ఆచారం మొదలైంది. ప్రస్తుతం పసుపు, కుంకుమ, నెయ్యి, గులాల్, బుక్క, ముత్యాలు, అత్తరు, పన్నీరు కలిపి స్వామివారి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. కల్యాణ క్రతువు ముగిసిన తర్వాత వీటిని భక్తులకు ప్రసాదంగా సమర్పిస్తారు. పెండ్లికాని యువతీ యువకులు స్వామివారి తలంబ్రాలను శిరస్సున ధరిస్తే… కల్యాణం జరుగుతుందనీ, వివాహితులు ధరిస్తే.. సంసారం సజావుగా సాగుతుందనీ విశ్వసిస్తారు.
-బండారి మహేశ్, భద్రాచలం