‘డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా!’ అనే మాట అప్పుడప్పుడూ వింటాం. డబ్బు కంటే ఖరీదైన బంగారం చెట్లకు కాస్తున్నది! ఏ చెట్టుకంటారా? మన జామాయిల్ చెట్లకు పుత్తడి పూస్తున్నదట. ఈ చెట్టు వేళ్లు భూమిలో చాలా లోతుకు పాతుకుపోతాయి. అయితే.. బంగారు ఖనిజాలున్న భూమిపొరల్లోకి ఈ చెట్టు వేళ్లు పోయి నీటితోపాటు అందులోని బంగారు అణువులను సైతం పీల్చుకుంటాయి. అలా వాటి ఆకుల్లో బంగారు అణువులు చేరుతాయట. బంగారు గనులు మన దగ్గర లేవు కాబట్టి, మన ప్రాంతాల్లో పెరిగే జామాయిల్ చెట్ల ఆకుల్లో బంగారం కోసం అన్వేషించడం వృథా ప్రయత్నమే అవుతుంది.
మన దేశంలో జామాయిల్ చెట్టు కనిపించని ఊరు ఉండదు. దీనిని నీలగిరి, యూకలిప్టస్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే వేగంగా పెరిగే చెట్టు. డబ్బు అయిదు మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతుంది. ఇది సతత హరిత వృక్షం. ఆస్ట్రేలియా దీని పుట్టిల్లు. యూకలిప్టస్ కొమ్మలు దృఢంగా ఉండవు. ఎలాంటి నేలలోనైనా ఇట్టే పెరుగుతాయి. నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడతాయి. కాబట్టి బంజరు భూముల్లో సైతం వీటిని సులువుగా పెంచుకోవచ్చు. ఈ చెట్లను అడవుల పెంపకంలో భాగంగా నాటుతుంటారు. నాలుగు సంవత్సరాలకు కోతకు వస్తుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్నిస్తుంది. కాగితపు పరిశ్రమలో దీని కలపను ప్రధానంగా వాడతారు. ఈ చెట్టు ‘కోనోస్’ అనే విలువైన బంకను స్రవిస్తుంది. జామాయిల్ చెట్టుకు క్రీమ్ కలర్ పూలు పూస్తాయి. మొగ్గలు బొంగరం ఆకారంలో ఉంటాయి. కాయలో అయిదు నుంచి ఆరు విత్తనాలుంటాయి.
జామాయిల్ ఆకులు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆకులు పొడవుగా, సన్నగా, బల్లెం ఆకారంలో ఉంటాయి. జామాయిల్ చెట్ల ఆకుల నుంచి నూనె తయారు చేస్తారు. ఈ నూనెను మసిలే నీళ్లలో వేసి, ఆవిరి పడితే శ్లేష్మం, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆకును నలిపి వాసన చూసినా మంచి గుణం కనిపిస్తుంది. ఆ వాసన వల్ల ముక్కుపుటాలు తెరచుకుంటాయి, శరీరం తేలికపడ్డ అనుభూతి కలుగుతుంది. జామాయిల్ని యాంటి బ్యాక్టీరియల్, యాంటి వైరల్గా ఉపయోగిస్తారు. మలేరియా చికిత్సలో ఉపయోగపడుతుంది. దీన్ని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో విరివిగా వాడతారు. పంటలను ఆశించే నల్లిపురుగు, బ్యాక్టీరియాల నివారణకు రైతులు జామాయిల్ ఉపయోగిస్తున్నారు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు