అవి కొవిడ్ ఉధృతంగా ఉన్న రోజులు. వృద్ధుల మీద దాని ప్రభావం మరీ ప్రతికూలంగా ఉంటుందని భయపడుతున్న సందర్భం. ఒకవైపు మృత్యుభయం, మరోవైపు లాక్డౌన్. ఈ నేపథ్యంలో, అమెరికాలో చాలామంది వృద్ధులు డీలాపడిపోయారు. నా అనేవారు లేని, మీరెలా ఉన్నారనే పలకరింపే వినిపించని… ఒంటరితనం వారిది. ఇలా ఉంటే కుక్కనో పిల్లినో పెంచుకుందామా అంటే దానిని చూసుకోలేని అలసట. ఈ పరిస్థితిని గమనించిన అలబామా రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు వారి స్పర్శకు, మాటకు స్పందించే చిన్నచిన్న రోబోలను రూపొందించి ఇచ్చారు.
ఈ సాయంతో ఆ వృద్ధుల జీవితాల్లో ఒంటరితనం చాలావరకు తగ్గినట్టు తేలింది. ఇది జరిగి చాలా రోజులు గడిచింది. ఇప్పుడు కొవిడ్ లేకపోవచ్చు. కానీ మనుషుల మధ్య లాక్డౌన్ మాత్రం అంతకంటే తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. నాలుగు గోడల మధ్య… కంప్యూటర్ సంకెళ్లు తగిలించుకుని, టార్గెట్ల మీద చూపులు బిగించిన లాక్డౌన్ ఇది. ఇంట్లో భౌతికంగా ఉన్నా, మెదడును మొబైల్లో దూర్చేసిన లాక్డౌన్ ఇది. ఆవేదన వస్తే ఆత్మహత్యే శరణ్యమనీ, పరాజయంలో బతుకు నుంచి పలాయనమే మంత్రమనీ దిక్కుతోచని లాక్డౌన్ ఇది. మనసుకు పట్టిన ఈ మబ్బు వీడాలంటే… మనిషికి మనిషి తోడును గుర్తించాలి. అందుకు అనువైన సమయం ఫ్రెండ్షిప్ డే!
మనిషి ఒంటరిగా బతకలేడు. బాల్యంలో మరీనూ! అన్నం కోసం అమ్మ, రక్షణ కోసం నాన్న… ఇలా ఏదో ఒక తోడు కావాల్సిందే. ఊహ తెలుస్తున్న కొద్దీ… తన ఈడువాళ్లతో కలిసే లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆటపాటలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, కాలక్షేపం, చదువు… ఇలా అన్నిటిలోనూ ఎవరో ఒక వ్యక్తితో కలిసే అడుగు ముందుకు వేస్తాడు. అందుకే రెండేళ్ల వయసుకే స్నేహాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు సైకాలజిస్టులు. ‘ఆడుకుందామా!’ అన్న మాటతోనే ఆ అనుబంధాలు మొదలవుతాయి. ఈ వయసులో కలసి కాలం గడపడమే కానీ స్పర్థ కనిపించదు. కానీ కాస్త వయసు పెరుగుతున్న కొద్దీ స్నేహం సంక్లిష్టం అవుతుంది. ఒకరిపై మరొకరు ఆధిపత్యం చూపించే ప్రయత్నం, చిన్నచిన్న గొడవలు మొదలైపోతాయి. వాటిని దాటుకుని ఫ్రెండ్-షిప్ సాగుతుంది.
బడిలో ఒక్కో తరగతి దాటేకొద్దీ స్నేహంలోనూ మార్పులు వస్తాయి. తనకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకున్నాక… దానికి నప్పేవారినే స్నేహితులుగా ఎంచుకుంటారు. తల్లిదండ్రుల ప్రభావానికి దీటుగా, స్నేహితుల పాత్ర ఉంటుంది. ఇక టీనేజీలోకి వచ్చిన తర్వాత స్నేహితులదే పైచేయిగా మారుతుంది. ప్రతిదాన్నీ ప్రశ్నించాలి, ఎదురు తిరగాలి అనే తత్వంలో తమకు ఏదన్నా సమస్య వచ్చినా, బాధ కలిగినా స్నేహితులనే ముందుగా సంప్రదిస్తారు టీనేజర్లు. అది తప్పోఒప్పో కాదు… హార్మోన్ల ప్రభావం! ఇక జీవితంలో స్థిరపడిన తర్వాత స్నేహితుల సంఖ్య, చటుక్కున మిత్రులను చేసుకునే అలవాటు తగ్గిపోతుంది.
ఉన్నత చదువులు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, కెరీర్… గోల మధ్య పాతమిత్రులు కూడా క్రమంగా దూరమవుతారు. వైవాహిక బంధానికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని స్త్రీపురుషుల మధ్య స్నేహాలు కూడా కొంచెం పలచబడతాయి. ఇక జీవిత చరమాంకంలో స్నేహితుల ప్రాముఖ్యం మరింత పెరుగుతుంది. పిల్లలు, ఉద్యోగం దూరమైన ఒంటరితనం; జీవిత భాగస్వామి దూరం కావడం లాంటి సందర్భాలు గోడు పంచుకునే తోడు ఉంటే బాగుండు అనిపిస్తాయి.ఇవన్నీ కూడా ఉజ్జాయింపుగా చెప్పుకొన్న మాటలు కాదు. మానవ బంధాలను పరిశీలించిన పరిశోధకుల విశ్లేషణ. మన బతుకుబాటలో స్నేహం తీరును గుర్తుచేసుకునే ప్రయత్నం. కానీ స్నేహితుల సంఖ్య ఒకప్పటిలా ఉండటం లేదు అన్నది తాజా వాస్తవం.
స్నేహితులే లేరు!!!
2019లో YouGov అనే సంస్థ చేసిన సర్వేలో ఇప్పటి తరం కుర్రాళ్లలో 30 శాతం మంది తాము ఒంటరితనాన్ని అనుభవిస్తున్నామని చెప్పారు. అందుకు ముఖ్య కారణం స్నేహితులు లేకపోవడమేనట. 27 శాతం మంది తమకు దగ్గరి స్నేహితులు లేరు అని చెప్పడమే ఆశ్చర్యం అనుకుంటే… ఒక 22 శాతం మంది తమకు అసలు స్నేహితులే లేరని చెప్పారు. ఈ సర్వేకు పరిమితులు ఉండవచ్చు. కానీ ఇప్పటి తరంలో మిత్రుల సంఖ్య తగ్గిపోతుందన్నది అన్నిచోట్లా కనిపిస్తున్నదే. ఇందుకు చాలా కారణాలే ఉండవచ్చు. నగరీకరణ, చదువు ఒత్తిడి లాంటి సందర్భాలతోపాటు…
సోషల్ మీడియాది ముఖ్యపాత్ర అని తెలుస్తున్నది. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా వల్ల పిల్లల్లో చురుకుదనం తగ్గిపోతున్నదనీ… మొబైల్ వ్యసనం వారి మెదడు పనితీరునే దెబ్బతీస్తున్నదని చాలా పరిశోధనలే చెబుతున్నాయి. దీంతోపాటుగా ఆన్లైన్లో అజ్ఞాత ‘ఫ్రెండ్స్’ పెరుగుతున్న కొద్దీ, నిజమైన మిత్రులు తగ్గిపోతున్నారట. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం చేసిన ఒక పరిశోధనలో సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న కొద్దీ ఒంటరితనం కూడా పెరుగుతున్నట్టు గమనించారు. విచిత్రం ఏమిటంటే 52 శాతం కుర్రాళ్లు తమ మిత్రులను కలుసుకున్నా కూడా… వారితో మాట్లాడటం కంటే, పక్కపక్కనే కూర్చుని ఫోన్లో తలదూర్చి కాలాన్ని గడుపుతున్నారని కాన్వే మెడికల్ సెంటర్ పేర్కొంటున్నది. ఆ మాటకు వస్తే ఇతరులతో ముఖాముఖి మాట్లాడగలిగే సామాజిక నైపుణ్యాలు సైతం ఈ సోషల్ మీడియా వల్ల దెబ్బతింటున్నాయనీ, మిత్రులతో కూడా నేరుగా కాకుండా ఆన్లైన్లోనే మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారనీ ఈ సంస్థ చెబుతున్నది.
ఫ్రెండ్షిప్ మాంద్యం!
మీరు చదివింది నిజమే. ఉద్యోగాల్లోనూ, ఆర్థిక వ్యవస్థలోనూ మాంద్యాన్ని (రిసెషన్) చూశాం కానీ ప్రస్తుతం ఫ్రెండ్షిప్ మాంద్యం నడుస్తున్నదని సర్వేలు వాపోతున్నాయి. 20వ శతాబ్దపు చివరినుంచే ఈ పరిస్థితులు కనిపిస్తున్నా… గత రెండుమూడేళ్లలో గణాంకాలు దారుణంగా మారాయి. ఉదాహరణకు అమెరికన్ పర్స్పెక్టివ్స్ సర్వే ప్రకారం…
చేజేతులా!
ముందు చెప్పుకొన్నట్టుగా కెరీర్, చదువుల చుట్టూ అల్లుకున్న జీవితమే మిత్రుల ప్రాధాన్యత తగ్గడానికి ముఖ్య కారణం. దీంతోపాటు సోషల్ మీడియా, నగరీకరణ కూడా స్నేహాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కొవిడ్ వచ్చి ఆఖరి దెబ్బతీసింది. నట్టింట్లోనే వినోదాన్ని పంచే ఓటీటీలు, వర్క్ ఫ్రమ్ హోమ్ తీరు, ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే అన్నీ తెప్పించుకునే సౌలభ్యం… ఇవన్నీ లాక్‌డౌన్‌తోనే అలవాటయ్యాయి. ఫలితంగా మనిషికున్న సామాజిక నైపుణ్యాలు అవసరం లేకుండా పోయాయి.
జాబ్ సేజ్ అనే సంస్థ 25 శాతం మంది, తాము ఇప్పటివరకూ భౌతికంగా కలవని సహోద్యోగులతో పనిచేస్తున్నట్టు చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో, అంతా ఆన్లైన్లోనే సాధ్యం అనిపించే మనస్తత్వం అలవడింది. కొవిడ్ సమయంలో ఏర్పడిన చిరాకులు, భయాలు, అభిప్రాయాలతో కూడా మిత్రులతో గొడవపెట్టుకుని దూరమైన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయని సైకాలజిస్టులు చెప్పుకొస్తున్నారు. ఇక కొవిడ్, కెరీర్లతోపాటుగా మన మిత్రత్వం మంటగలిసేందుకు దోహద పడుతున్న మరో చిత్రమైన కారణం ఉంది. అదే థర్డ్ ప్లేస్!
ఏమిటీ థర్డ్ ప్లేస్?
ఊళ్లో ఇప్పటికీ బంధాలు ఎలా నిలిచి ఉన్నాయో గుర్తుచేసుకుంటే ఈ థర్డ్ ప్లేస్ ఏమిటో అర్థం అవుతుంది. ఊరి జనం రోజులో కాసేపు రచ్చబండ మీదో, వాగు దగ్గరో, అరుగుల మీదనో కలుసుకుని కబుర్లు కలబోసుకుంటారు. కొన్నాళ్ల క్రితం మిత్రులంతా ఇలాగే కలుసుకునేవారు. బడ్డీ కొట్ల దగ్గరా, లైబ్రరీల ముందు, ప్లే గ్రౌండులో, డాబాల మీదా, నాలుగు వీధుల కూడళ్లలో… ఇలాంటి ఏ ప్రదేశాన్ని చూసినా కుర్రాళ్ల నవ్వులు వినిపించేవి.
ఇల్లు, పని చేసే చోటు కాకుండా ఒక వ్యక్తి స్వేచ్ఛగా మెసలగలిగే చోటే ఇలాంటి థర్డ్ ప్లేస్. మనిషి నాగరికతలో వీటిది చాలా ముఖ్యమైన పాత్ర అంటారు శాస్త్రవేత్తలు. స్నేహాలు బలపడేందుకు, మంచిచెడులను చర్చించుకునేందుకు, కష్టాలను ఇతరులు పంచుకునేందుకు… ఇలా అన్నిరకాల సామాజిక అవసరాలకు ఆలంబనగా ఈ థర్డ్ ప్లేసెస్ ఉండేవి. అవి గ్రీకుల స్నానఘట్టాలు కావచ్చు, మన రంగస్థలాలు కావచ్చు… మిత్రత్వం నుంచి రాజకీయ చర్చల వరకు వేదికలుగా ఉండేవి. ఈ థర్డ్ ప్లేస్ ఎలా ఉండాలి అనేదానికి కూడా చాలా నిర్వచనాలే కనిపిస్తాయి.
అది ఒక తటస్థ వేదికగా ఉండాలి, హోదాల ప్రసక్తి ఉండకూడదు, సరదా వాతావరణంలో ఉండాలి, తొందరగా వెళ్లి కాసేపు గడిపేలా ఉండాలి, సంభాషణకే అక్కడ ప్రాధాన్యత కనిపించాలి, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోని ప్రదేశమై ఉండాలి… లాంటి లక్షణాలతో ఓ థర్డ్ ప్లేస్ ఉండాలని చెబుతారు. మనం ముందు చెప్పుకొన్న ప్రదేశాలన్నీ ఇలాంటివే! మరి ఇప్పుడు మనం అలాంటి చోట్లకు వెళ్తున్నామా అంటే లేదని ఒప్పుకోవాల్సిందే. రోజు మొత్తంలో ఖాళీ దొరకదు. ఒకవేళ కుదిరినా మొబైల్ ఆ సమయాన్ని మింగేస్తుంది, ఓటీటీలు మన కళ్లను సొంతం చేసుకుంటాయి, వారాంతపు సెలవులు ఊరు చుట్టుపక్కల చూసి రమ్మని ఊరిస్తాయి. ఇక థర్డ్ ప్లేస్ ఎక్కడ మిగిలింది?
స్నేహం లేకపోతే శూన్యమే!
జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కెరీర్ అద్భుతంగా సాగిపోతున్నది. ఏది కావాలంటే అది కొనుక్కోగలుగుతున్నారు. డబ్బులు పెడితే పని జరిగిపోతున్నది. మరి ఇలాంటప్పుడు స్నేహితులు తగ్గిపోతున్నారనే భయం ఎందుకు? అన్న ప్రశ్నకు చాలా జవాబులే వినిపిస్తాయి. చిన్నతనంలో స్నేహంతోనే సామాజిక నైపుణ్యాలు అలవడతాయి. ఇచ్చిపుచ్చుకోవడం, కలిసి కాలం గడపడం, చూసి నేర్చుకోవడం, సంభాషణ… అన్నీ స్నేహంతోనే సాధ్యమవుతాయి. స్కూల్లో సరైన స్నేహితులు లేనివారు చదువులో వెనకబడటం, వ్యసనాల బారినపడటం, నేర ప్రవృత్తి పెంచుకోవడం లాంటి సమస్యలకు లోనవుతారని తేలింది.
ఎదుగుతున్న కొద్దీ కూడా స్నేహం వల్ల ఏర్పడే సంతోషం, సంతృప్తి మన హార్మోన్ల మీద చాలా సానుకూలమైన ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు సాధికారికంగా నిరూపిస్తున్నారు. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యాలకు ఒక వ్యాక్సిన్లాగా పనిచేస్తుందని చెబుతున్నారు. మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లు, నిరాశకు దూరంగా ఉండటం, కెరీర్లో ఎదగడం అన్నిటిలోనూ స్నేహితుల పాత్ర స్పష్టం. స్నేహితులు ఉన్నవారు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
వారు ఇతరుల కంటే మరింత సంతోషంగా ఉంటారని వరల్డ్ హ్యాపీనెస్ డేటాబేస్ చెబుతున్నది. జలుబు లాంటి సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ల దగ్గరనుంచీ గుండెజబ్బుల వరకూ… స్నేహితులు ఉన్నవారిలో ఆరోగ్య సమస్యలు తక్కువనీ వందల పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అన్నిటికీ మించి… మనిషి సంఘజీవి. సమాజంలో బతుకుతూ ఒంటరిగా ఉంటున్నాడంటే దానర్థం ఏదో సమస్య ఉందనే. తన గుండెల్లోని ఆ గుబులు నుంచి బయటపడేసేవాడే స్నేహితుడు. స్నేహం అంటే సౌకర్యమో, సామాజిక హోదానో కాదు… అత్యవసరం!
స్నేహం ఎంత గొప్పదో ఓసారి గుర్తుచేసుకున్నామే కానీ… దాని ప్రాముఖ్యం మనకు తెలియక కాదు. కాబట్టి ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అయినా ఓసారి మన మిత్రులను పలకరిద్దాం. ఆ పలకరింపు ఓ లాంఛనంగా మిగిలిపోకుండా తరచూ తల్చుకుందాం. వీలైతే… కాదు కాదు.. వీలు చేసుకుని ఒకసారి వ్యక్తిగతంగా కలుద్దాం. అలాగని ప్రతి బంధాన్నీ స్నేహంగా, ప్రతి స్నేహాన్నీ శాశ్వతంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు.
కొందరు నచ్చకపోవచ్చు, కొందరి ప్రవర్తన బాధపెట్టవచ్చు. అలాంటప్పుడు అంతే నిశ్శబ్దంగా వారి జీవితం నుంచి తప్పుకొందాం. మరో స్నేహాన్ని వెతుక్కుందాం. గిరి గీసుకుంటే ఒంటరితనం కానీ… చిరునవ్వుతో అడుగు వేస్తే స్నేహితులు తారసిల్లక పోతారా! అన్నిటికీ మించి మన పిల్లల జీవితాల్లో కనుక స్నేహితులు లేరన్న విషయాన్ని గమనిస్తే అశ్రద్ధ కూడదు. వాళ్లకు స్నేహం విలువ, స్నేహితుల్ని చేసుకునే తీరు తెలియచేద్దాం. మళ్లీ స్నేహితుల దినోత్సవం నాటికి వాళ్ల జీవితాల్లో, మన జీవితాల్లో స్నేహం విలువ పెరిగిందేమో గమనిద్దాం!
కబుర్లు కలబోసుకునేలా
మాతృదినోత్సవం, పితృదినోత్సవం లాంటి రోజుల వెనుక ఏదో ఒక మనసును కదిలించే కథ వినిపిస్తుంది. కానీ స్నేహితుల దినోత్సవాన్ని ఫక్తు వ్యాపార ధోరణితోనే ప్రోత్సహించిన దాఖలాలు ఉన్నాయి. హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డుల యజమాని జోస్ హాల్ మొదలుపెట్టిన ఆలోచన ఇది. దాన్ని మొదట్లో చిన్నచిన్న సంస్థలే ప్రోత్సహించినా… కొన్నాళ్లకు ఏకంగా ఐక్యరాజ్యసమితి ఆమోదించడంతో ప్రపంచాన్ని చుట్టేసింది. ఈ స్నేహితుల దినోత్సవాన్ని వేర్వేరు దేశాలు వేర్వేరు సమయాల్లో పాటిస్తాయి. ప్రేమికుల దినోత్సవం రోజునే స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించే దేశాలూ ఉన్నాయి. మనం మాత్రం ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితులను తల్చుకునేందుకు కేటాయించేశాం. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని కంపెనీలూ ఫ్రెండ్షిప్ డేను అమ్మకాల కోసం వాడుకోవచ్చు గాక. కానీ స్నేహానికి వ్యాపారం అంటుకోదు కదా! అందుకే మిత్రులంతా కలసిమెలసి కబుర్లు కలబోసుకునేలా ఈ రోజు ప్రోత్సహిస్తుంది.
మనవాళ్లు కాస్త నయం
ప్రపంచవ్యాప్తంగా స్నేహాలు పల్చబడుతూ, దాని పర్యవసానం మన దేశంలోనూ కనిపిస్తున్నా… ఇతరులతో పోల్చుకుంటే మన పరిస్థితి అంత దారుణంగా లేదు. కుటుంబానికీ, బంధాలకు భారతీయులు ఇచ్చే విలువే ఇందుకు కారణం కావచ్చు. ఉదాహరణకు IPSOS అనే సంస్థ చేపట్టిన సర్వేలో స్నేహితుల వల్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని ఏకంగా 44 శాతం మంది ఒప్పుకొన్నారు. జపాన్‌లో ఇది కేవలం 14 శాతమే ఉండటం విచిత్రం. Snap Inc. అనే సంస్థ చేసిన మరో సర్వేలో భారతీయులు సగటున ఆరుగురు ప్రాణ స్నేహితులతో చాలా దేశాల కంటే ముందంజలో ఉన్నారని తేలింది. అంతేకాదు! చాలామందితో పోలిస్తే భారతీయులు చాలా త్వరగా స్నేహాన్ని పెంచుకోగలరట. తొలి సంభాషణతోనే ఓ వ్యక్తిని మిత్రుడిగా మార్చుకునే అవకాశం మన దగ్గర 23 శాతం కనిపించినట్టు చెబుతున్నదీ సంస్థ.
ఎంతమంది స్నేహితులు ఉండాలి?
ఓ సినిమాలో డైలాగ్ వినిపిస్తుంది. ‘నాకు ఇప్పటికే చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్లలో ఎవరన్నా తగ్గితే అప్పుడు నీతో పరిచయం పెంచుకుంటాను’ అని అర్థం వచ్చేలా! నిజంగానే ఓ వ్యక్తి ఎంతమంది స్నేహితులతో అనుబంధాన్ని పంచుకోగలడు అనే ప్రశ్న చాలాకాలం నుంచి శాస్త్రవేత్తలను వేధిస్తున్నది. బ్రిటిష్ ఆంత్రపాలజిస్ట్ డన్బర్ చెప్పిన సూత్రానికి ఈ విషయంలో ప్రాధాన్యత ఎక్కువ. మనిషి మెదడుకు ఉండే సామర్థ్యంతో తను 150 బంధాలను నిర్వహించగలడు అంటాడు డన్బర్. ప్రాచీన కాలంలో ఉన్న తెగల నుంచి నేటి బెటాలియన్ల వరకు ఒక గుంపులోని సంఖ్య 150కి అటూఇటూగా ఉండటానికి ఇదే ముఖ్య కారణం అని చెబుతాడు.
ఈ 150 మందిలో కూడా 50 మంది మిత్రులు ఉంటారనీ, అందులో 15 మందితో గాఢమైన స్నేహం ఉంటుందనీ, అందులోనూ అయిదుగురిలో ప్రాణస్నేహం ఉంటుందనీ అంటాడు డన్బర్. ఈ సంఖ్య తగ్గవచ్చు కానీ పరిమితి అయితే ఇంతే అని కుండబద్దలు కొట్టేస్తాడు. ఆధునిక శాస్త్రవేత్తలలో చాలామంది డన్బర్ సంఖ్యతో ఏకీభవిస్తున్నప్పటికీ ఈ పరిమితి 250 నుంచి 290 వరకూ ఉండే అవకాశం ఉందని వాదించేవారూ లేకపోలేదు. మరొక వాదన ఏమిటంటే ఈ 150లోని 50 మంది మిత్రుల స్థానాన్నీ సోషల్ మీడియా ‘ఫ్రెండ్స్’ ఆక్రమించడం వల్ల నిజమైన స్నేహితులకు చోటు ఉండటం లేదని. ఆలోచించాల్సిందే!
స్నేహితులలో BFF వేరయా!
ఒక సీరియల్లో మొదలైన మాట ఆక్స్ఫర్డ్ నిఘంటువులో కూడా చోటు చేసుకోవడం విచిత్రమే! అదే BFF – Best Friends Forever. వీళ్లు మన చుట్టూనే ఉండాలని లేదు. కానీ చిన్నప్పుడు చదువు తర్వాత విడిపోవచ్చు, ఖండాలను దాటిపోవచ్చు. కానీ కష్టం వచ్చిందని తెలిస్తే పంచుకునేందుకు నేనున్నానే భరోసా ఇస్తారు. నువ్వుంటే బాగుండు అనగానే రెక్కలు కట్టుకుని వాలిపోతారు. ఇదే BFF కి నిర్వచనం.
…? కె.ఎల్. సూర్య