Social Media Breaks | పొద్దున లేచిన దగ్గర్నుంచీ అర్ధరాత్రి వరకూ రాజేశ్‌కు సెల్‌ఫోనే ప్రపంచం. రాన్రాను ఆ వ్యసనం మరింత ముదిరిపోయింది. తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. వ్యాపారం, కుటుంబం, బాధ్యతల ఊసే లేదు. అతని భార్య మానస పరిస్థితి కూడా దాదాపుగా అలాంటిదే. ఆ ఇద్దరి దాంపత్య జీవితంలోనూ స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌గా చిచ్చుపెట్టింది. అనుమానాలు మొదలయ్యాయి. అన్యోన్యంగా సాగాల్సిన కాపురం విడాకులకు దారితీసింది. తల్లి దగ్గర ఒకరు, తండ్రి దగ్గర ఒకరు.. పిల్లలూ విడిపోయారు. రాజేశ్, మానస.. డిజిటల్ బ్రేక్ ఇవ్వకపోవడం వల్లే బ్రేకప్ చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చింది.
చాలామంది స్మార్ట్‌ఫోన్‌ను వాడాల్సిన దానికంటే ఎక్కువగా వాడుతున్నారు. ఫోన్ మోగితే చాలు.. ఎవరు మెసేజ్ చేశారా అని ఆదుర్దా పడుతున్నారు. ఏదైనా నోటిఫికేషన్ వస్తే చాలు.. వెంటనే చెక్ చేసుకుంటున్నారు. అంతటితో ఆగిపోకుండా.. ఫోన్లో తలదూర్చి సోషల్ మీడియా ఖాతాలు చూస్తున్నారు. పని పక్కనపెట్టి మరీ వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్, ఇన్‌స్టా స్టోరీలు.. రీల్స్, యూట్యూబ్ షార్ట్ వీడియోలు చూస్తున్నారు. దీనివల్ల సెకన్లు నిమిషాలుగా.. నిమిషాలు గంటలుగా ఖర్చయిపోతున్నాయి. అంతలా ఫోన్‌కు బానిసలు అవుతున్నారు. చదువుల్లో చురుగ్గా ఉండే పిల్లలు సైతం పక్కదారి పడుతున్నారు. వ్యూస్, లైకులు, కామెంట్ల కోసం వెంపర్లాడుతున్నారు. కనీసం పది నిమిషాలు కూడా ఫోన్ చూడకుండా, ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. దీనివల్ల ఎన్నో అనర్థాలు చుట్టుముడతాయి. ఎన్నో సంసారాలు రచ్చకెక్కుతున్నాయి. అందుకే స్మార్ట్‌ఫోన్, గ్యాడ్జెట్స్ వాడే ప్రతి ఒక్కరికీ డిజిటల్ బ్రేక్ కావాలి.
ఇదొక వ్యసనం. ఒక్కసారిగా బ్రేక్ ఇవ్వలేరు. కాబట్టే క్రమక్రమంగా ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలి. ఇలా కొన్ని గంటలు ఫోన్ పక్కనపెట్టడాన్నే ‘డిజిటల్ బ్రేక్’ అంటారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిత్యం ఫోన్ వాడటం వల్ల కంటికి, ఒంటికి విశ్రాంతి కరువవుతుంది. ఏవేవో పోస్టులు చూసి లేనిపోని కోపతాపాలు తెచ్చుకుంటారు. వాటి గురించే ఆలోచిస్తూ డిప్రెషన్‌కు లోనవుతారు. చిరాకు పెరుగుతుంది. టెన్షన్ నెత్తికెక్కుతుంది. వెరసి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. గంటల తరబడి ఫోన్, గ్యాడ్జెట్స్ చూడటం వల్ల మెడనొప్పి, వేళ్లనొప్పులు వస్తాయి. మైగ్రేన్, తలనొప్పి, దృష్టి సమస్యలు వేధిస్తాయి. కళ్లమంటలు, దురద వల్ల నిద్ర దూరమవుతుంది. డిజిటల్ వ్యసనం వల్ల ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. వ్యాపారంలో నష్టాలు చవిచూడాల్సి రావచ్చు.
› ఫోన్, గ్యాడ్జెట్స్‌తో మీ పని ముగియగానే.. వెంటనే నెట్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్‌లైన్‌లో ఉండటం వల్ల చాలావరకు ఫోన్‌కు బ్రేక్ ఇవ్వొచ్చు.
› మీ ఫోన్లో అత్యంత అవసరమైనవి మినహా ఇతర యాప్‌ల నోటిఫికేషన్లు ఆఫ్ చెయ్యండి.
› ముఖ్యంగా మీకు మీరే కొన్ని సరిహద్దులు నిర్ణయించుకోండి. తినేటప్పుడు, బెడ్రూమ్లో ఫోన్ వాడకూడదనే నిబంధన విధించుకోండి.
› ఫోన్‌కు బదులుగా డెస్క్‌టాప్ కంప్యూటర్ వాడండి. పనిలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ఖాతాలు చూడకూడదనే నియమం పెట్టుకోండి.
› ఫోన్లో మీ హోమ్ స్క్రీన్‌ను ఖాళీగా ఉంచండి. అత్యవసరమైన యాప్‌లు మినహా మిగిలిన వాటికి ఓ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, అందులో పడేయండి.
› ముఖ్యంగా స్నేహితులు, కుటుంబసభ్యులతో భోజనం చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఫోన్ దూరంగా పెట్టండి.
› iOS స్మార్ట్ఫోన్లలో స్క్రీన్ టైమ్ యాప్ ఉపయోగించి మీ స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ట్రాక్ చేయండి.
› Android స్మార్ట్ఫోన్లలో డిజిటల్ వెల్బీయింగ్ యాప్ ఉపయోగించి మీ స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ట్రాక్ చేయండి.
› ..ఇవన్నీ పాటించడం మొదట్లో చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది. క్రమక్రమంగా అలవాటు చేసుకుంటే మీ జీవితం సంతోషంగా సాగుతుంది.
› డిజిటల్ బ్రేక్ ఇవ్వడం వల్ల మీతోపాటు, మీ కుటుంబసభ్యులు, సహోద్యోగులు సైతం ఆనందంగా ఉంటారు. మిమ్మల్నే ఆదర్శంగా తీసుకుంటారు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్నారా.. అయితే ఇలా బయటపడండి
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమో.. కాదో ఎలా తెలుసుకోవాలి?