భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, గజగజా వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు, మంచు దుప్పటిలో ఉత్తరాది… ఇలాంటి పతాక శీర్షికలు చదివే సమయం వచ్చేసింది. నిజంగానే చలికి కొండలు సైతం వణికిపోతున్నాయి. ఆ చలి నుంచి తప్పించుకోవడం, దాని వల్ల వచ్చే అనారోగ్యాల గురించి వినడం సాధారణం. కానీ, చలి కాలంలో మాత్రమే వేధించే డిప్రెషన్ గురించి విన్నారా! అదే Seasonal affective disorder (SAD). చాలామంది తెలియకుండానే దీనితో బాధపడుతూ ఉంటారు. అది ఓ సమస్య అని తెలియక పోవడం వల్ల తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతుంటారు. ఇంతకీ ఏమిటీ SAD?
చలికాలం పగటివేళలు తగ్గిపోతాయి. దీనివల్ల మన జీవగడియారం మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. మన భావోద్వేగాలను నియంత్రించే సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తిలో లోటు ఏర్పడుతుంది. ఇక చలికాలం విటమిన్-డి లభ్యత కూడా తక్కువగా ఉంటుంది. ఈ లోటు మన నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఈ కారణాలన్నిటితో మనిషిలో స్తబ్ధత ఏర్పడుతుంది. సహజంగానే డిప్రెషన్‌తో బాధపడుతున్నవారినీ, వంశపారంపర్యంగా ఈ సమస్య ఉన్నవారినీ ఈ SAD మరింతగా ఇబ్బంది పెట్టవచ్చు. చలికాలంలో సూర్యకాంతి తగ్గడం వల్ల మాత్రమే కాదు… సూర్యుడు ఆకాశంలో ఎంత తక్కువ సమయం ఉంటే ఈ SAD ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందని ఓ ముగ్గురు పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది.
ఇలాంటి లక్షణాలు సుదీర్ఘకాలం పాటు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
కౌన్సెలింగ్, లైట్ థెరపీ, యాంటి డిప్రెసెంట్స్ లాంటి మార్గాల ద్వారా SAD సమస్యను తేలికగానే ఎదుర్కోవచ్చు. వ్యాయామం చేయడం, ఉదయాన్నే కాసేపు ఎండపట్టున ఉండటం, మంచి పోషకాహారం, నిరాశగా ఉన్నప్పుడు దాన్ని ఇతరులతో పంచుకోవడం, కాస్త కలుపుగోలుగా నలుగురితో కలవడం, నిర్దుష్టమైన లక్ష్యాలు పెట్టుకుని పనిలో నిమగ్నమవడం లాంటి చర్యలతో SAD నుంచి ఉపశమనం పొందవచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చలికాలంలో వచ్చే కార్తిక, మార్గశిర మాసాలలో పెద్దలు దీపాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వెనుక కూడా ఇదొక కారణం ఉందని అంటారు. నువ్వులనూనె, ఆముదం, ఆవునెయ్యి లాంటివాటితో దీపారాధన చేయమని సూచిస్తూ ఉంటారు. వీటి సాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి… వాటి నుంచి వచ్చే గాఢమైన వెలుతురు, వెచ్చదనం రెండూ కూడా మనసుకు సాంత్వన ఇస్తాయన్నది నమ్మకం. ఇదీ SAD కబురు. కారణం, లక్షణాలూ, చికిత్సా అన్నీ తెలిశాయి కాబట్టి… ఈ చలికాలం కాస్త జాగ్రత్తగా ఉందాం. రాకుంటే మంచిది. వస్తే అవలీలగా అధిగమిద్దాం!