అక్క పదో తరగతి అయిపోగానే వరంగల్‌లోని పింగళి మహిళా కళాశాలలో ఇంటర్లో చేరింది. నాన్న వైపుగానీ అమ్మ వైపుగానీ అప్పటికి మా కజిన్స్లో ఎవరూ.. పదో తరగతికి మించి చదవలేదు. మా చదువుల కోసం అమ్మా, నాన్నా.. మరీ ముఖ్యంగా అమ్మ మా బంధువుల నుంచి ఎన్నో మాటలు ఎదుర్కోవాల్సి వచ్చిందట.
‘ఆడ పిల్లలకు పై చదువులెందుకు?! చదువుకున్న పిల్లలు మన మాటింటరా?! అత్తగారింట్ల అణిగి మణిగి ఉంటరా?! వయసొచ్చినాక ప్రేమలు దోమలు అనకుండ ఉంటరా?! ఏమోనమ్మా.. నేనైతె మా పిల్లకు చదువు బంజేసి ఇంటి పని, వొంట పని నేర్పిస్తున్న. మొగణికి, పిల్లలకు ఒండి పెట్టుకుంటె చాలు. అయినా, మొగోళ్లకు తెల్వకుంటె ఆడోళ్లన్న చెప్పొద్దా?! మందిండ్లల్ల ఉంచి చదివిచ్చుడు ఏంది?!’ ఇలా.. నాన్న తరఫువాళ్లు రకరకాల మాటలు అన్నారని అమ్మ చెబుతుండేది. అప్పటికి ఆ కాలేజీలో హాస్టల్ వసతి లేకనో, అమ్మానాన్నలకు హాస్టల్లో ఉంచడం ఇష్టం లేకనో, మరెందుకనో గానీ.. అక్కను మా చిన్నాయన కూతురైన లక్ష్మి అక్కయ్య ఇంట్లో ఉంచారు. ఆ బావ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. అక్కను ఉంచినందుకు కొంత డబ్బు, కొన్ని బియ్యం ఇచ్చేవారు. ఎటూ మాకు పండినవి, ఇంకేమైనా కావాలంటే తెప్పించి మరీ పంపేవారు. మమ్మల్ని మా ఊరి బడిలో చేర్చడానికి కూడా రాకుండా ఎవర్నో తోడిచ్చి పంపిన నాన్న.. అక్క కోసం మాత్రం ఆ కాలేజికి వెళ్లాడు. “వాండ్ల క్లాసుల మన పిల్లే అందరికంటె చిన్నగ ఉన్నది. ఎప్పుడు, ఎవరింట్ల ఒక్కతి ఉండలేదు. ఎట్లుంటదో ఏందో!” అని అమ్మతో అనడం విన్నాను. అప్పుడు నాన్న కళ్లల్లో నీళ్లు చూశాను. ఆ తరువాత రోజుల్లో నేనూ ఓసారి అక్కతో వాళ్ల కాలేజీ చూడటానికి వెళ్లాను. ఆ పింగళి కాలేజీ ఒక రాజభవనంలా ఉండేది. అప్పటి నిజాం రాజ్యంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పింగళి వెంకట్రామ రెడ్డి తన తమ్ముళ్లతో కలిసి వరంగల్‌లో మహిళా విద్య కోసం 1965లో తమ స్వంత భవనాన్ని కాలేజీ కోసం ఇచ్చేశారట. అలా కాలేజీకి వాళ్ల పేరు వచ్చింది.
ఇప్పుడంతా కలిసిపోయింది గానీ, హనుమకొండను ఆనుకొని ఉన్న వడ్డేపల్లి ఊరిలో ఈ కాలేజీ ఉండేది. మెయిన్ రోడ్‌కు ఉండదు కనుక.. కాలేజీకి కూడా ఆర్టీసీ వాళ్ల స్పెషల్ బస్సులు ఉండేవి. వరంగల్, హనుమకొండల్లో అప్పటికే.. అంటే 1974లోనే లోకల్ బస్సులుండేవి. హైదరాబాద్ తరువాత ఒక్క వరంగల్‌లోనే సిటీ బస్సులు ఉన్నాయని అందరూ చెప్పుకొనేవారు.
అక్క వాళ్ల కాలేజీ చాలా అందంగా ఉండేది. తెల్లగా, సినిమాల్లో చూపించే రాజ ప్రాసాదంలా ఉండేది. పెద్ద పెద్ద తరగతి గదులు, పొడవాటి వరండాలు, క్యాంటీను, ఆవరణలో చెట్లు … నాకైతే భలే నచ్చింది. అక్కకు అక్కడ సరోజ, విజయ, సంధ్య, ఉష.. ఇలా ఎందరో కొత్త స్నేహితులయ్యారు. స్కూల్లో అక్క ఫ్రెండ్ అయిన ఇంద్రాణి కూడా అదే కాలేజీలో చేరి మళ్లీ క్లాస్మేట్ అయ్యింది. ఆ తరువాత రోజుల్లో ఆ స్నేహం మరింత బలపడి, ఇంద్రాణి, సరోజ, విజయ, సంధ్య.. ఆ నలుగురు ఒక జట్టు, దేహాలు వేరైనా ప్రాణం ఒక్కటే అన్నట్టు ఉండేవారు. అది కుటుంబ స్నేహంగా మారి, గత యాభై ఏళ్లుగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. వాళ్లతో నా స్నేహమూ అలాగే కొనసాగుతూ ఉంది.
ఇంద్రాణితో నాకు అప్పటికే ఆరేళ్ల అనుబంధం ఉంది గనుకా.. నేనూ తనూ ఎన్నో ముచ్చట్లూ, జోకులూ చెప్పుకునేవాళ్లం గనుకా.. నేను తనను పేరుతోనే పిలిచేదాన్ని. సరోజక్క కొంచెం పెద్దరికంగా ఉండేది గనుక తనను ‘అక్కా’ అంటాను. వాళ్లు పక్కా ఆంధ్రావాళ్లు. వాళ్ల నాన్న రైల్వేలో ఎక్స్‌ప్రెస్ గార్డు. వాళ్లు కాజీపేటలోని రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవారు. సరోజక్క ఎంతో సౌమ్యురాలు, మృదు స్వభావి. చాలా ప్రేమను పంచుతుంది. ఓసారి హనుమకొండకు వెళ్లినప్పుడు అక్కతో కలిసి సరోజక్కవాళ్ల ఇంటికి వెళ్లాను. ఆ రాత్రి అక్కడే పడుకున్నాం. బంధువులు కాకుండా ఎవరైనా కొత్త వాళ్లింట్లో ఉండటం అదే మొదలు. వాళ్ల మాటలన్నీ నాకు ఎంతో విచిత్రంగా అనిపించేవి. పుస్తకాల్లో, సినిమాల్లో వాడే భాష కాకుండా, రోజూ మన చుట్టూ వినిపించే భాష కాకుండా అదేమిటో కొత్తగా అనిపించేది.
“నువ్వు అక్కడ పడుక్కో! సంధ్యా, రమా ఆ పెద్ద మంచం ఎక్కి పడుక్కుంటారు. వాళ్లకి దుప్పట్లూ, దిళ్లూ ఇవ్వు” అనేది వాళ్లమ్మ. మాకేమో పండుకునుడు, చద్దర్లు, మెత్తలు అనడం అలవాటు. మొదటిసారి పూర్తి ఆంధ్రా కుటుంబాన్ని చూసినందుకు ఆశ్చర్యంగా ఉండేది. వాళ్లమ్మ కొంచెం నిశ్శబ్దంగా ఉండేది గానీ.. సరోజక్క, వాళ్ల నాన్న, తమ్ముడు అందరూ ఎక్కువగా.. అంటే నాన్ స్టాప్‌గా మాట్లాడేవారు. వాళ్ల మాటలన్నీ తమాషాగా అనిపించేవి. సరోజక్క వాళ్ల నాన్న చాలా ఆప్యాయంగా ఉండేవాడు. ఆ తరువాత ఎన్నో ఏళ్లపాటు వాళ్లింటికి చాలాసార్లు వెళ్లామంటే.. ఆ ప్రేమ, ఆప్యాయతలే కారణం. అయితే, నాకో విషయం చాలా ఆశ్చర్యం కలిగించేది. సరోజక్క వాళ్ల నాన్న.. “రాజీ.. కాఫీ ఇవ్వు. రాజీ.. మంచి నీళ్లివ్వు. రాజీ.. వేడి నీళ్లు పెట్టు. రాజీ.. నా దువ్వెనెక్కడ?!” అంటూ, ప్రతి దానికీ భార్యని పిలుస్తుండేవాడు. ఆవిడ ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా.. “వస్తున్నానండీ.. తెస్తున్నానండీ..” అంటూ ఎంతో భయభక్తులతో , వినయంగా చేస్తున్న పని వదిలేసి ఆయన్ని అటెండ్ అయ్యేది. ఇలా ఎప్పుడూ చూడని నాకు వింతగా ఉండటమే కాదు.. కొన్ని పనులు ఆయన చేసుకోవచ్చుగా అనిపించేది.
అయితే సరోజక్క వాళ్ల తమ్ముడు రాజు మాత్రం వాళ్లమ్మకు పనుల్లో సహాయం చేయడం నాకు నచ్చేది. అతను కూడా జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతుండేవాడు. పాటలు పాడుతుండేవాడు. తరువాతి రోజుల్లో వరంగల్ ఆర్ఈసీ (ఇప్పుడు ఎన్ఐటీ)లో ఇంజినీరింగ్ చేసి, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ చేసి.. ఆ తరువాత అమెరికా వెళ్లాడు.
మేము అందరిలా రాజును ముందు జాగ్రత్తగా ‘రాజన్నయ్యా!’ అనకుండా.. ‘రాజూ’ అనే పిలిచేవాళ్లం. అతను కూడా మా అందరితో సరదాగా ఉండేవాడు. ఇక సరోజక్క వయసులో నాలుగైదేళ్లు పెద్దది గానీ, ఎంతో పెద్దదానిలా “ఏం కావాలమ్మా?! ఏం తింటావు?” అంటూ అడుగుతుండేది. బాగా గారాబం చేసేది. తను ఆ కాలనీలోనే కాకుండా ఫ్రెండ్స్‌కీ, తెలిసినవాళ్లకీ తోచినంత సహాయం చేస్తూ, తనకు ఇబ్బంది అయినా పైకి చెప్పకుండా ఉండేది. అందుకే.. సరోజక్కకు మేము ‘మదర్ థెరిస్సా’ అని నిక్‌నేమ్ పెట్టాం. ఆమె ఇప్పటికీ అలాగే ఉంటున్నది కూడా.