ఓ కేసు గురించి బయటికి వెళ్లొచ్చిన ఇన్స్పెక్టర్ రుద్రకు.. ఫోన్లో మాట్లాడుతూ హెడ్ కానిస్టేబుల్ రామస్వామి కనిపించాడు. అతని ఒళ్లంతా చెమటలు. ఫోన్ పెట్టేసిన తర్వాత అదోలా అయిపోయాడు.
కంగారుగా ఉన్న రామస్వామితో ‘ఏమైంది బాబాయ్! ఎందుకలా ఉన్నావ్’ అని అడిగాడు రుద్ర. ‘సార్! ఆ మోహినీ మహల్ దయ్యం మనల్ని వదిలేలా లేదు’ భయంతో అన్నాడు రామస్వామి. దీంతో ఒకింత అసహనానికి గురైన రుద్ర.. ‘బాబాయ్.. అక్కడ ఏ దయ్యమూ లేదని మనమే కనిపెట్టాం. ఇప్పుడు మళ్లీ అలా అంటావేంటి?’ కోపంగా అన్నాడు రుద్ర.
రుద్ర మాటలకు అడ్డుకట్ట వేస్తూ రామస్వామి ‘అదే సార్.. సునీతా మేడమ్‌ను ఆ బిల్డింగ్ ఓనర్ తమ్ముడు చంపించాడు. అది నాకు తెలుసు. అయితే, మేడమ్ చనిపోయినప్పటి నుంచి ఆ భవంతిలో ఎవరో ఏడుస్తున్నట్టు అరుపులు పెడబొబ్బలు వినిపిస్తున్నాయట’ ఫోన్ కాల్ సారాంశాన్ని చెప్పేశాడు రామస్వామి. ‘అలాగా? అయితే, పదండి. ఆ సంగతి కూడా తేల్చుకొని వద్దాం’ అని సిబ్బందితో మోహినీ మహల్‌కు బయల్దేరాడు రుద్ర. అప్పటికే రాత్రి ఏడు కావొస్తున్నది.
మోహినీ మహల్ వీధి నిర్మానుష్యంగా ఉంది. సునీతా మేడమ్ హత్య కేసులో వాచ్మెన్ అరెస్ట్ అవడంతో బిల్డింగ్‌ను చూసుకొనేవారే లేకుండా పోయారు. దీంతో లైట్లు కూడా వేయని ఆ భవంతి మరింత భయానకంగా కనిపిస్తున్నది. ఇంతలో గేటును తోస్తున్న రుద్రతో.. ‘సార్.. ఇప్పుడు ఇదంతా అవసరమా? రేపు పొద్దున వద్దాం’ అంటూ బతిమాలుతున్నట్టు అన్నాడు రామస్వామి. అతని వంక కాస్త కోపంగా చూసి ‘లోపలికి వెళ్దాం పదండి’ అని ఆర్డర్ వేశాడు రుద్ర.
అంతా నిశ్శబ్దం. ఊపిరి పీలుస్తున్న శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దం. ఆ సైలెన్స్‌ను పోలీసుల బూట్ల చప్పుడు డిస్టర్బ్ చేస్తున్నది. రుద్ర తప్ప రామస్వామి సహా మిగిలిన కానిస్టేబుళ్ల గుండెలు దడదడ కొట్టుకోసాగాయి. వారి భయాన్ని రెట్టింపు చేసేలా.. ఎవరో మూలుగుతున్న శబ్దాలు వారి చెవినపడ్డాయి. ఆ సౌండ్ అందరికీ స్పష్టంగా వినిపించింది. నాలుగో ఫ్లోర్ చివరి గది నుంచే ఆ శబ్దాలు వస్తున్నట్టు రుద్ర గమనించాడు. దీంతో అటువైపు వెళ్లసాగాడు. ఇంతలో.. ‘సార్.. సార్.. ప్లీజ్. వద్దు. మేడం చనిపోయింది ఆ గదిలోనే. ఇప్పుడు సన్నగా ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. పైగా అవి ఒక్కరివిగా కూడా అనిపించట్లేదు. ఎందుకో నా మనసేదో కీడు శంకిస్తున్నది’ అంటూ నచ్చజెప్పాడు రామస్వామి.
‘బాబాయ్.. ఇంకో మాట మాట్లాడితే.. ’ అంటూ విసురుగా గది వైపునకు రుద్ర వెళ్లాడు. ‘ఇక్కడ ఎవరూ ఉండొద్దు. ప్రమాదం’ అని డోర్‌పై రాసి ఉన్నదాన్ని రుద్ర చదువుతున్నాడో లేదో.. ‘సార్.. దయ్యంలేదు గియ్యంలేదు. ఇదంతా ఆ బిల్డర్ తమ్ముడిగాడి పనే. సునీతా మేడమ్ హత్య అప్పుడు కూడా ఇలాగే రాశాడు. ఒకసారి మీరు పక్కకు జరుగండి.. ఆ డోర్ నేను తీస్తా..’ అంటూ ఎక్కడలేని ధైర్యం కూడదెచ్చుకొన్న రామస్వామి తన టీమ్ సాయంతో తలుపులను బద్దలుకొట్టాడు. అంతే, గదిలోపల ఓ ఐదుగురు వ్యక్తులు ఎంతో నీరసించిపోయి, కండ్లంతా ఎర్రబడి.. ‘వీళ్లు జాంబీలేమో’ అన్నట్టు కనిపించారు. నేలమీద నిస్సహాయంగా పడి ఉన్న వాళ్లను చూసిన రామస్వామి కెవ్వుమన్నాడు. ‘సార్.. సార్.. ద ద దయ్యాలు..’ అంటూ భయంభయంగా అరిచాడు. వెంటనే తేరుకొన్న రుద్ర.. అంబులెన్స్‌కు ఫోన్ చేసి వాళ్లను దవాఖానకు షిఫ్ట్ చేయించాడు. జరిగిన విషయాన్ని డీఎస్పీ సత్యనారాయణకు చెప్పాడు. ఆయన సలహామేరకు స్లీప్ డిజార్డర్ స్పెషలిస్ట్, డాక్టర్ నిరంజన్ దగ్గరికి తన టీమ్ సహా బయల్దేరాడు.
‘మీరేనా ఇన్స్పెక్టర్ రుద్ర?’ అడిగాడు డాక్టర్. ‘అవును. డీఎస్పీ గారు పంపించారు’ రుద్ర సమాధానం. ‘ఓకే.. ప్రాబ్లం ఏంటి?’ డాక్టర్ ప్రశ్న. ‘డీఎస్పీ గారు ఏమీ చెప్పలేదా?’ రుద్ర ఎదురు ప్రశ్న. ‘మీరు వస్తారని చెప్పారు. అంతే’ డాక్టర్ సమాధానం. ‘మరేంలేదు సార్. మోహినీ మహల్ గురించి మీరు వినే ఉంటారు. సునీతా మేడమ్ హత్య గురించి కూడా తెలిసే ఉంటుంది’ అన్న రుద్ర మాటలకు డాక్టర్ తలాడించాడు. ‘మేడమ్ హత్య జరిగిన అదే గదిలో కొంతమందిని ఎవరో బంధించారు. వాళ్లకు నిద్రలేకుండా ఏదో ఎక్స్పర్మెంట్ చేసినట్టు ఫోరెన్సిక్ టీమ్ చెప్పింది. అసలేంటీ గొడవ? ఎందుకు ఇదంతా? ఇదే విషయమై డీఎస్పీ గారిని అడిగితే, మిమ్మల్ని కలవమన్నారు. అందుకే వచ్చాం’ అసలు విషయం చెప్పాడు రుద్ర.
‘మిస్టర్ రుద్ర. డైరెక్ట్‌గా పాయింట్‌కి వస్తా. మీ ఫోరెన్సిక్ టీమ్ చెప్పిన దాన్ని చూస్తే.. 80 ఏండ్ల కిందట రష్యాలో ఓ ఐదుగురిపై ప్రయోగం చేసినట్టే ఇప్పుడు కూడా అలాగే ఈ ఐదుగురిపై అదే ‘స్లీప్ ఎక్స్పర్మెంట్’ చేస్తున్నట్టు కనిపిస్తున్నది’.. డాక్టర్ మాటలకు రుద్ర ఒకింత షాక్‌కి గురవుతూ.. ‘అర్థం కాలేదు’ అన్నట్టు ముఖంపెట్టాడు. ‘1947లో రష్యాలో ఇలాంటి ప్రయోగం జరిగినట్టు చెబుతారు. ఆహారం, నీరు, ఆక్సిజన్‌తో పాటు నిద్రను దూరంచేసే ప్రత్యేకమైన వాయువును నింపిన ఓ గదిలో కొందరిని ఉంచారట. యుద్ధం సమయంలో నిద్రలేకుండా సైన్యం నిరంతరాయంగా ఉండేందుకే రష్యా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశార’ని డాక్టర్ చెప్తుండగా.. ‘మరి, రిజల్ట్ ఏమైంది?’ ఆత్రుతగా అడిగాడు రుద్ర. ‘కొన్నిరోజుల తర్వాత వాళ్లు పిచ్చిగా, జాంబీలుగా ప్రవర్తించినట్టు చెప్తారు. ఐదుగురిలో ఒక్కరే బతికినట్టు కూడా అంటారు’ అని చెప్పిన డాక్టర్.. ఇప్పుడు కూడా మోహినీ మహల్లో అలాంటి ప్రయోగమే జరిగినట్టు కనిపిస్తున్నది అని తేల్చేశాడు. ‘ఎవరు చేసి ఉంటారు?’ అని రుద్ర అడిగిన ప్రశ్నకు.. ‘ఇంకెవరు? ఆ బిల్డర్ తమ్ముడే’ అంటూ రామస్వామి బదులిచ్చాడు. ‘జైలులో ఉన్నవాడు ఎలా చేస్తాడు?’ అని రామస్వామి వైపు కాస్త కోపంగా చూసిన రుద్ర, వెంటనే డాక్టర్ వైపు తిరిగి.. సన్నగా నవ్వుతూ ‘స్టేషన్‌కి వెళ్దామా?’ అన్నాడు. తాను చేసిన పొరపాటు గ్రహించిన డాక్టర్.. స్టేషన్‌కు కదిలాడు. ఇంతకీ, రుద్ర.. ఆ ఎక్స్పర్మెంట్ డాక్టరే చేశాడని ఎలా కనిపెట్టాడు?
మోహినీ మహల్ ఎక్స్పర్మెంట్ జరుగుతున్న బాధితులు ఎంతమందో రుద్ర అసలు డాక్టర్‌కు చెప్పనే లేదు. ఎక్స్పర్మెంట్ను చేస్తున్న ఆ డాక్టరే రష్యా స్టోరీని చెప్తూ ఏదో యథాలాపంగా ఐదుగురిపై ప్రయోగం చేశారని నాలుక్కరుచుకున్నాడు. కాగా, శత్రుదేశాల వారికోసమే ఆ డాక్టర్ నిరుద్యోగులైన యువకులపై ఈ తరహా క్రూరమైన ప్రయోగానికి ఒడిగట్టినట్టు తర్వాతి విచారణలో తేలింది.