కాలం ఏదైనా.. పగటి ఉష్ణోగ్రతలు పగబట్టినట్టు పెరుగుతున్నాయి. వేసవిలో అయితే నిప్పుల కొలిమే! ముఖ్యంగా తన గర్భంలో నల్లబంగారం దాచుకున్న సింగరేణి ప్రాంతంలో ఉష్ణతాపం పాశుపతాస్త్రం కన్నా తీవ్రంగా ఉంటుంది. అటు కాలుష్యం, ఇటు తీవ్రమైన ఎండలతో సింగరేణి పరిసరాల ప్రజల పరిస్థితి ఊహించుకోలేం. కానీ, ఇంతో అంతో జనం కాస్త ఉపశమనం పొందుతున్నారంటే ఆయా ప్రాంతాల్లో సింగరేణి సంస్థ పెంచిన వనాలే. సింగరేణి సంస్థ ఇప్పటివరకు 6 కోట్ల మొక్కలు నాటింది. దీని వెనుక పర్యావరణ ప్రేమికుడు, సంస్థ సీఎండీ బలరాం చొరవ చెప్పుకోదగింది. ఆయన చొరవతో బొగ్గు భూములు పచ్చని వనాలయ్యాయి. నల్ల నేలల్లో హరిత యజ్ఞాన్ని కొనసాగిస్తున్న సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం 2024- 25 సంవత్సరంలో ‘ప్రతి అడుగు పచ్చదనం’ నినాదం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
వాస్తవానికి సివిల్ సర్వీసు అధికారిగా.. వేలాది మంది పనిచేస్తున్న సింగరేణి సంస్థ సారథిగా బలరాంకు క్షణం తీరిక ఉండదు. అయినా సరే భగభగ మండే పుడమిపై పచ్చదనాన్ని పెంచాలనేది ఆయన అభిమతం. అందుకోసం సింగరేణిలో మొకలు నాటే మహా యజ్ఞాన్ని ఐదేండ్ల నుంచి కొనసాగిస్తున్నారు. ఏదో ఒకటి రెండు మొకలు నాటి ఫొటోలు దిగి చేతులు దులుపుకోలేదు. సింగరేణి వ్యాప్తంగా స్వయంగా తానొకడే 18 వేల మొకలు నాటి అక్కడివారికి పచ్చదనం ప్రాముఖ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మట్టిదిబ్బలపై ఆయన నాటిన మొక్కలు ఇప్పుడు మానులయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లోని 34 ప్రదేశాల్లో మినీ ఫారెస్టులుగా రూపుదిద్దుకున్నాయి. సింగరేణి అవనిపై ఆకుపచ్చ సంతకం చేస్తున్న బలరాం చొరవ అభినందనీయం.
అధికారులంటే ఆదేశాలిస్తారు.. కానీ పాటించరు అన్నది నానుడి. బలరాం దీనికి పూర్తి భిన్నం. సింగరేణి డైకర్టెర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా 2019లో కొత్తగూడెంలోని బంగ్లాస్ ఏరియాలో 108 మొక్కలు నాటారు. ఆ తర్వాత శ్రీరాంపూర్ ఉపరితల గని మట్టికుప్పపై 2019 జూలై 20న గంటల వ్యవధిలోనే 1,237 మొక్కలు నాటడం విశేషం. అదేరోజు జైపూర్ ఎన్టీపీసీలో 501 మొక్కలు నాటారు. ఇలా ఒకే రోజు 1,700కు పైగా మొక్కలు నాటారు. 2021 జూలై 24న రామగుండంలో 12వేల మొక్కలు నాటారు.
2022 ఫిబ్రవరిలో కొత్తగూడెం బంగ్లాస్ ఏరియాలో 205 గులాబీ మొక్కలను (రోజ్గార్డెన్) మియవాకి పద్ధతిలో నాటారు. నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ చేస్తుండటం గమనార్హం. బలరాం సేవలకు పలు అవార్డులు వరించాయి. గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ నుంచి గ్రాయోదయ బంధుమిత్ర సత్కారం లభించింది. గ్రీన్ చాలెంజ్ సంస్థ నుంచి వనమిత్ర పురస్కారం, హెచ్డీఎఫ్సీ నుంచి అవర్ నైబర్హుడ్ హీరో అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ జియోమెన్టెక్ నుంచి ఎన్విరాన్మెంట్ ఎక్సలెన్స్ అవార్డు పొందారు.
మహబూబ్నగర్ జిల్లాలో నిరుపేద గిరిజన కుటుంబంలో బలరాం జన్మించారు. సంక్షేమ హాస్టల్లో చదువుకునే రోజుల నుంచే మొక్కల పెంపకంపై ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు నర్సరీకి వెళ్లి తన గ్రామానికి వచ్చే దారిలో అనేక మొకలు నాటేవారు. సింగరేణి సంస్థలో ఫైనాన్స్ విభాగం డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొకలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. అధికారిగా సూటుబూటుతో వచ్చే బలరాం మొక్కలు నాటే ప్రాంతంలో బనియన్, నిక్కరు వేసుకుని పార చేత పట్టుకుని తానొక్కడే మొక్కలు నాటుతూ ముందుకుసాగుతుంటారు. మండుటెండలు, వానలను లెక్కచేయకుండా ఈ హరిత హారాన్ని కొనసాగిస్తున్నారు.
అంతరించిపోతున్న అనేక జాతుల మొకలను బలరాం పరిరక్షిస్తున్నారు. జమ్మి, రావి, మర్రి, జువ్వి, సీమచింత, వేప వంటి 20 జాతుల మొకలను పెద్ద ఎత్తున నాటారు. అలాగే కోతుల బెడద నుంచి ఉపశమనం కలిగించేందుకు వీలుగా ఆరే-5 గని (శ్రీరాంపూర్) సమీపంలో 600లకు పైగా పండ్ల మొకలను నాటారు. కొన్ని చెట్లకు ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. పక్షులకు జంతువులకు ఇవి ఆలవాలమవుతున్నాయి. బలరాం నాటిన మొకలకు జియోట్యాగింగ్ చేయడం, ప్రతినిత్యం ఉదయం పూట ఏ ప్రాంతాల్లో మొకలు ఏ విధంగా ఉన్నయనేది ప్రత్యక్షంగా చూస్తుంటారు. ఆయన నాటిన ప్రాంతాల్లో 90 శాతం పైబడి మొకలు చక్కగా ఎదిగాయి. 15,695 రోజుల వయసున్న బలరాం ఇప్పటివరకు 18వేలకు పైగా మొక్కలు నాటారు. తాను నాటిన మొక్కను చూసుకున్నప్పుడల్లా ముచ్చటేస్తుందని అంటారు. అంతేకాదు, ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా పచ్చదనంతో నింపేస్తానని చెబుతున్న బలరాం స్ఫూర్తికి జేజేలు పలుకుదాం.
ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒకరి బాధ్యత. అందుకే, ప్రతి మనిషి కనీసం మూడు మొకలైనా నాటాలి. నేడు అడవులు అంతరిస్తూ పోవడం వల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోయి జీవుల మనుగడ ప్రమాదంలో కూరుకుపోతున్నది.
– బలరాం
– కొంటు మల్లేశం