సృష్టిలోకెల్లా అద్భుతం… జీవితమే! అసలు మనిషే లేకపోతే ఇన్నేసి గ్రహాలు, తారలు ఉండి మాత్రం ఉపయోగం ఏముంటుంది? సూర్యాస్తమయం ఎంత అందంగా ఉన్నా, దాన్ని ఆస్వాదించేవాడు ఉండాలి కదా! పోనీ ఆ జీవితం ఏమన్నా విశ్వం అంతా పరచుకుని ఉందా అంటే అదీ లేదు. వందల ఏండ్ల పరిశోధన తర్వాత కూడా మనిషి తప్ప ఇంకెక్కడా మరో బుద్ధి జీవి ఉన్నట్టు బయటపడలేదు. అంత విలువైన జీవితాన్ని ఓ క్షణికావేశంలో ముగించేసుకోవడం ఎంత విషాదం?! టెన్త్ క్లాస్ పరీక్షలకీ, ఇంట్లో గొడవలకీ, ఆఫీసు టార్గెట్లకీ, అప్పులకీ, తప్పులకీ, నొప్పులకీ… అన్నింటికీ అదే ముగింపు అనుకుంటే అది భ్రమే కదా!! ఆ భ్రమలోనే లక్షలమంది ఉంటున్నారు. అందుకే ఆత్మహత్యల రేటు ఏటికేడు పెరుగుతున్నది. బాధాకరం ఏమిటంటే బతుకునే తల్లిగా కొలుచుకునే తెలంగాణలో కూడా ఈ సంఖ్య గణనీయంగా ఉండటం. ఓ నివేదిక ప్రకారం పెద్ద రాష్ర్టాల జాబితాలో తెలంగాణలో జరిగే ఆత్మహత్యలు మూడో స్థానంలో ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకోవడం విషాదమే. కానీ, అలాంటి ఆలోచన, సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో చెప్పే నిపుణుల మాటలు నిండు జీవితాలను నిలబెట్టగలవు. అంతేకాదు… మన చుట్టూ ఎవరన్నా తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు, వాళ్లు ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకోకుండా నివారించగలం. ఒక్క క్షణం ఆలోచిస్తే… ముప్పు తప్పుతుంది. నూరేండ్ల జీవితం మీదవుతుంది.
గుండెజబ్బుల గురించి అందరికీ తెలుసు, ఊబకాయం గురించి అవగాహన ఉంది, క్యాన్సర్ అంటే భయం కనిపిస్తుంది. వీటన్నింటి గురించీ అవగాహన కల్పించేలా ఏదో ఒక మాట కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటుంది. కానీ, మరణానికి అతి ముఖ్య కారణాల్లో పదో స్థానంలో ఉన్న బలవన్మరణాల గురించి ఎవరం మాట్లాడుకోం! 15-29 ఏళ్ల వయసు తలుచుకుంటేనే గుండె నిండిపోతుంది. లోకపు తలరాతను మార్చగలిగే తరం అది. అలాంటి వయసులో మరణాలకు ఆత్మహత్యలు మూడో కారణం అంటే… కచ్చితంగా సమాజం ఎక్కడో అలసత్వం ప్రదర్శిస్తున్నదని అనడానికి సాక్ష్యం. ఐక్యరాజ్య సమితి ప్రకారం కేవలం 38 దేశాలు మాత్రమే ఆత్మహత్యలను నివారించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకున్నాయి. 80 సభ్య దేశాలు మాత్రమే తమ వద్ద జరుగుతున్న బలవన్మరణాలను జాగ్రత్తగా నమోదు చేస్తున్నాయి. ఇక అతి కొద్ది దేశాలు మాత్రమే ఆత్మహత్య నివారణను ఆరోగ్య రంగం పరిధిలోకి తెచ్చాయి.
జీవితాన్ని ముగించాలనే తలంపు క్షణికావేశంగా కనిపించవచ్చు. కానీ దానికి కారణాలు చాలా స్పష్టంగా ఉంటాయి. మానసిక సమస్యలు, జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసిన సంఘటనలు, భాగస్వాములతో పొరపొచ్చాలు, అనారోగ్యం, వ్యసనాలు ప్రముఖ కారణాలుగా కనిపిస్తున్నాయి. వాగ్వాదం, కుటుంబ సమస్యలు, నిరుద్యోగం, పేదరికం, అప్పులు, మనసుకు దగ్గరైనవారు చనిపోవడం, చట్టపరమైన ఇబ్బందులలో చిక్కుకోవడం… కూడా అనాలోచిత నిర్ణయాలకు దారితీస్తున్నాయి. వాటిని ఆదిలో తుంచేసి బతుకు పరుగును కొనసాగించేందుకు సవాలక్ష మార్గాలున్నాయి.
ఆత్మహత్య చేసుకోవాలి అన్న తలపు దగ్గర దాన్ని అరికట్టడం చాలా సులువు. అందుకే మన చుట్టూ ఉన్నవారిలో ఎవరన్నా కుంగుబాటులోనో, నిరాశలోనో ఉండి… వారిలో బతుకు మీద ఆశ తగ్గిపోతున్నదని గమనించినప్పుడు మనవైపు నుంచి కొన్ని చర్యలు తీసుకుంటే, ఓ నిండు జీవితాన్ని నిలబెట్టినవారం అవుతాం.
ఎవరూ కూడా జీవితాన్ని విరమించుకోవాలి అని బయటికి చెప్పరు. కుంగుబాటులో ఉండే… వారి చర్యల బట్టే అర్థం చేసుకోవాలి. ముభావంగా ఉండటం, సరిగా స్పందించకపోవడం, పదునైన వస్తువులతో ఆడుతూ ఉండటం, జీవితం దండగ లాంటి మాటలు… ఇవన్నీ సూచనలే.
మరీ అనుమానంగా ఉన్నప్పుడు ‘ఆ తరహా ఆలోచనలు వస్తున్నాయా’ అని ఓ మాట అడగాలి. కానీ ఆ పదం ఉచ్ఛరిస్తే, లేనిపోని ఆలోచనలు ప్రేరేపించినట్టు ఉంటుందని భయపడతాం. నిజానికి అనుమానం ఉన్నప్పుడు ఇలా అడగడం తప్పుకాదని, దాని వల్ల లాభమే కానీ అది ప్రేరణగా మారదని పరిశోధనలు చెబుతున్నాయి.
ఎదుటివారి బాధ మనకు చాలా చిన్నదిగా, వారి సమస్య చులకనగా తోచవచ్చు. ఆ భావంతోనే వారి మాటలను అంత సీరియస్‌గా తీసుకోం. ఒకోసారి వారిని చిన్నబుచ్చుతాం కూడా! కానీ, ఇలాంటి వారి మాటలను అడ్డుకోకుండా, సాంత్వనగా వినడం చాలా అవసరం. ఎదుటివారి బాధను పూర్తిగా వినడం వల్ల, వారి మనసు భారం తీరుతుంది. అది ఆత్మహత్యా భావనలను చాలావరకు తగ్గిస్తుందని ఓ పరిశోధన చెబుతున్నది.
ఒకసారి ఈ తరహా ప్రయత్నాలు చేసినవారిలో మళ్లీ అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే వారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
తీవ్రమైన కుంగుబాటు ఉన్నవారికి దగ్గరలో పురుగు మందులు, పదునైన వస్తువులు, మందులు లేకుండా చూసుకోవాలి.
తన మానాన వదిలేస్తే, తనే సర్దుకుంటాడు కదా అనే భావన చాలామందికి ఉంటుంది. అది సరి కాదు. తరచూ తనను పలకరిస్తుండాలి. తన మానసిక స్థితిని గమనిస్తుండాలి.
మనం ఏ పని చేసినా… దాని వెనుక హార్మోన్ల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇంత తీవ్రమైన సమస్యలో వాటి పాత్ర ఏమిటి? ప్రోగ్రెస్ ఇన్ బ్రెయిన్ రీసెర్చ్ అనే ఓ పరిశోధనా పత్రిక ప్రకారం సెరటోనిన్, డోపమైన్ అనే హార్మోన్లకీ, ఆత్మహత్యలకీ మధ్య స్పష్టమైన సంబంధం ఉందని తేలింది. మనం సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్ సెరటోనిన్. ఇక ఇష్టమైన పని చేసినప్పుడు పెరిగే హార్మోన్ డోపమైన్. మనసు నిరాశగా, స్తబ్దుగా ఉంది అంటే అర్థం ఈ హార్మోన్లు వెనకబడ్డాయనే. అంతేకాదు. ఈ రెండు హార్మోన్ల పనితీరు సరిగా లేకపోతే కేవలం కుంగుబాటు మాత్రమే కాదు… ఏకాగ్రత లోపించడం, దేన్నీ ఆస్వాదించలేకపోవడం, లక్ష్యం లేకుండా గడిపేయడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే వీటిని మెరుగుపర్చుకునే అవకాశం ఉండటం ఓ ఊరట.
క్లీవ్‌లాండ్ క్లినిక్ ప్రకారం రోజూ కనీసం ఓ అరగంట వ్యాయామం చేయడం వల్ల ఈ హార్మోన్లు ఉత్తేజితం అవుతాయి.
సూర్యకాంతికీ, సెరటోనిన్కీ మధ్య స్పష్టమైన సంబంధం ఉంది. చాలామంది చలికాలంలో కుంగుబాటుకు లోను కావడానికి కారణం ఇదే. ఈ సమస్యను సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు. అందుకనే సూర్యకాంతి కూడా తగినంత తగిలేట్టు గమనించుకోవాలి.
ట్రిప్టోఫాన్ అనే పదార్థం సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుందని తేలింది. బాదంపప్పు, కోడిగుడ్లు, పాలకూరలాంటి ఆహారాల్లో ఈ ట్రిప్టోఫాన్ ఉంటుంది.
ధ్యానం, యోగాలతో కూడా ఈ సానుకూల హార్మోన్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
నచ్చిన సంగీతం వినడం, ఇష్టమైన పుస్తకాలు చదవడం, మంచి సినిమా చూడటం… ఇలా మనసును సేదతీర్చే వ్యాపకాలు డోపమైన్, సెరిటోనిన్లను ఉత్తేజపరుస్తాయి.
తగినంత నిద్ర లేకపోవడం కూడా ఈ హార్మోన్ల ఉత్పత్త్తిని దెబ్బతీస్తుంది. అందుకే కంటినిండా నిద్రపొమ్మని సూచిస్తున్నారు.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం, పోషకాలు ఎలా ఉండాలో… మనసును కూడా కొన్ని పరిస్థితులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంచుతాయి.
సామాజిక బంధాలు: ఏకాంతం వేరు ఒంటరితనం వేరు. ఈ రెండింటికీ మధ్య తేడాను గుర్తించలేకపోవడం ఇప్పటి తరానికి పెద్ద సమస్య. చిన్న కుటుంబాలు, నగరీకరణ లాంటి కారణాలతో ఉన్న బంధాలు ఎలాగూ పల్చబడ్డాయి. ఆఫీసులో కూడా కొలీగ్స్‌తో మాట్లాడుకోలేని విధంగా కంప్యూటర్లు, క్యాబిన్లు వచ్చేశాయి. కానీ సామాజిక బంధాలు మెరుగుపడితే ఆత్మహత్య భావనలు తగ్గుతాయని, స్నేహితులు ఉన్నవారిలో కుంగుబాటు త్వరగా మాయమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఊరిని పలకరిద్దాం: ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోవడం బాగానే ఉంది. దాంతో ఆదాయానికీ, విజ్ఞానానికీ ఢోకా లేకుండా ఉంది. కానీ, తన భాష, సంస్కృతులకు దూరమవుతున్న వ్యక్తి త్వరగా కుంగుబాటుకు లోనవుతాడనీ, తనలో ఆత్మహత్య భావనలు బలపడతాయనీ నివేదికలు చెబుతున్నాయి. అందుకే అప్పుడప్పుడూ మన ఊరిని, పుట్టిపెరిగిన వాతావరణాన్ని, చిన్ననాటి మిత్రులను పలకరిస్తే మనసు బలం పుంజుకుంటుంది.
కుటుంబం: నార్వేలో కొన్ని జైళ్లు ఖైదీలకు సకల సదుపాయాలు కల్పిస్తాయి. వాళ్లు అన్ని సౌకర్యాలూ ఉన్న ఇళ్లలో స్వేచ్ఛగా జీవిస్తుంటారు. ఇష్టమైన వంటలు చేసుకుంటూ, నచ్చిన కార్యక్రమాలు చూసుకుంటూ కాలం గడిపేస్తారు. మరి వాళ్లకు మీరు విధించిన శిక్షేంటి అంటే అధికారుల నుంచి వచ్చిన సమాధానం- ‘వాళ్లను కుటుంబం నుంచి దూరంగా ఉంచడం’ అని. ఇల్లు, కుటుంబం, స్వేచ్ఛ… ఇవి లేని జీవితంలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా అవి లేని లోటు మనసును తినేస్తుంది. నా అనే భావన కలిగించదు.
ప్రకృతితో కాసేపు: మనిషి ఎన్ని గోడల మధ్య ఉన్నా… తను అడవి తల్లి బిడ్డే. అందుకే ప్రకృతి ఒడిలో తెలియకుండానే సాంత్వన పొందుతాడు. పచ్చదనం మధ్య తిరిగితే బతుకు మీద ఆశ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగని గంటల తరబడి ప్రయాణించి తీరాల్సిందే అని ఏమీ లేదు. దగ్గరలో ఉన్న ఓ పార్క్, నాలుగు చెట్ల మధ్య నడక, గడ్డ్డి మీద కాలం గడపడం కూడా ఓ థెరపీనే!
జీవితాన్ని ముగించాలి అనిపించే తలపుని వైద్య పరిభాషలో సూసైడల్ ఐడియేషన్ (suicidal ideation) అంటారు. చికిత్స తీసుకోవాల్సిన అనారోగ్యంగానే పరిగణిస్తారు. అమెరికా లాంటి విలాస దేశాల్లోనే నాలుగు శాతానికి పైగా జనాభాలో ఈ తరహా ఆలోచనలు ఉన్నాయనీ, 18 ఏళ్ల లోపువారిలో అయితే ఏకంగా 18 శాతం జనాభాలో ఈ ఆలోచన ఉండటం విషాదం. జీవితంలో ఏదో ఒక మజిలీలో ఈ తరహా భావనలు రావడం సహజమే. కానీ అది బలపడి ‘ఎలా చేయాలి?’ అనే ప్రశ్న దాకా వచ్చిందంటే మాత్రం చాలా ప్రమాదకరం.
ఇలాంటి ఆలోచనల ఉధృతి కాసేపే ఉంటుందనీ, ఆ కొద్ది క్షణాలను దాటేసే ప్రయత్నం చేయాలని చెబుతారు నిపుణులు. మన శ్వాస వేగాన్ని తగ్గంచుకోవడం ఇందుకు ఓ ప్రభావవంతమైన మార్గంగా చెబుతారు. నిదానంగా ఊపిరి పీల్చుకుని, కాసేపు నిలిపి, నిదానంగా వదలడం వల్ల ఉపయోగం ఉంటుందట.
వెంటనే ఏదన్నా పనిలో నిమగ్నమైపోవడం కూడా మంచిదే! ఇల్లు సర్దుకోవడమో, మిత్రుల దగ్గరికి వెళ్లి కూర్చోవడమో, నడుచుకుంటూ ఓ లాంగ్ వాక్‌కి వెళ్లడమో, కామెడీ సీన్స్ చూడటమో, ఇష్టమైన పాటలు వినడమో… అన్నీ కూడా ఆ క్షణికోద్వేగాన్ని ఏమారుస్తాయి.
ఇలాంటి ఆలోచనలు వస్తుంటే… వాటిని బలవంతంగా అణచివేసే ప్రయత్నం మరింత ప్రమాదకరం. కాసేపు ప్రశాంతంగా కూర్చుని… మన జీవితంలో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి, వాటిని వదులుకోవడం ఎంత పొరపాటు, ఈ ఉపద్రవం దాటిపోతే జీవితం మళ్లీ ఎంత ప్రశాంతంగా మారిపోతుంది… లాంటి సానుకూలమైన అంశాల మీద దృష్టి పెడితే ప్రతికూలత పల్చబడిపోతుంది.
మనం ఏం ఆలోచిస్తే… ఇంద్రియాలు కూడా అందుకు అనుగుణంగానే పనిచేస్తాయి. ఇంద్రియాలను కట్టిపడేసే ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తుంది. కాసేపు ధ్యానం చేయడం, హిమాలయాలు లాంటి శాంతపరిచే ప్రదేశాలను ఊహించుకోవడం, గోరువెచ్చటి స్నానం… అన్నీ ఉపయోగపడేవే!
ఏదన్నా తీవ్ర సమస్యలో ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడమా, పారిపోవడమా అనే సందిగ్ధంలో ఉంటుంది శరీరం. దీన్నే fight-or-flight స్పందన అంటారు. గుండె వేగం పెరగడం, చెమటలు పట్టడం, కడుపులో గడబిడ… అన్నీ దానికి సూచనే. మన కండరాల్లో వచ్చే ఈ మార్పును పట్టించుకోం. కానీ వాటిని నెమ్మదించే ప్రయత్నం చేస్తే, మనసు కూడా సర్దుకుంటుంది. అందుకని ప్రశాంతంగా కూర్చుని లేదా శవాసనంలో ఉండి. మన శరీరంలో ప్రతి భాగంలోని కండరాలను గమనిస్తూ, వాటిని సడలిస్తూ ఉండమని సూచిస్తున్నారు. మజిల్ రిలాక్స్ అయితే మెదడు కూడా రిలాక్స్ అవుతుందని చెబుతున్నారు.
ఫోన్ చేతిలో ఉన్నది కాలక్షేపానికి మాత్రమే కాదు. మనసు బాగోలేకపోతే, మిత్రుడిని కదిపేందుకు కూడా. ‘కాసేపు నీతో మాట్లాడాలి’ అని అడిగితే కాదనే స్నేహితుడు ఎవరు? ఆ అయిదు నిమిషాలూ చాలు, బతుకు మీద ద్వేషం చల్లారడానికి.
కొన్ని ప్రదేశాలు, కొందరి తీరు పాత గాయాలను రేపుతాయి. వీటిని ట్రిగర్స్ అంటారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి.
తరచూ ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు, మందు తాగి బాధను మర్చిపోదాం అనుకుంటారు. నిజానికి ఇలాంటి వ్యసనాలు… బాధను మరపించవు సరికదా, మరింతగా కుంగదీస్తాయి. విచక్షణ కోల్పోయేలా చేసి అనూహ్య పరిణామాలకు దారితీస్తాయి.
ఆరోగ్య రంగం ఎంతగా అభివృద్ధి చెందినా, అవగాహన ఎంతలా పెరిగినట్టు అనిపించినా… ఇప్పటికీ సైకాలజిస్టు దగ్గరకు వెళ్లడాన్ని చులకనగానే భావిస్తున్నారు చాలామంది. మానసిక సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడం నామోషీగానే తలుస్తున్నారు. కానీ ఆత్మహత్య నివారణలో కౌన్సిలింగ్‌ది అద్భుతమైన పాత్ర అని గణాంకాలు చెబుతున్నాయి. PMC అనే వైద్య జర్నల్ ప్రకారం కౌన్సిలింగ్‌తో ఆత్మహత్య చేసుకోవాలనే తలపు అప్పటికప్పుడు ఏకంగా 55 శాతం తగ్గింది.
సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లగానే సూసైడల్ ఐడియేషన్ స్కేల్ లాంటి పద్ధతుల ద్వారా మనః స్థితిని విశ్లేషిస్తారు. ఆ తర్వాత కాగ్నిటివ్ బిహేవియరల్, డయలెక్టికల్ బిహేవియర్, సైకో డైనమిక్.. లాంటి రకరకాల థెరపీల ద్వారా చెడు ఆలోచనలను చెదరగొట్టేస్తారు. అసలు ఇలాంటి ఆలోచనలు రాగానే వాటిని ఆదిలోనే తుంచేందుకు ఆన్లైన్ హెల్ప్లైన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. snehaindia, vandrevalafoundation, iCALL లాంటి ఎన్నో సంస్థలు నిపుణుల ద్వారా ఫోన్లోనే కౌన్సెలింగ్ అందిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా Tele MANAS, Jeevan Aastha తదితర హెల్ప్లైన్లను నిర్వహిస్తున్నాయి. సేవలు ఉచితమే… సంకోచాన్ని వదిలిపెడితే చాలు.
కాలుష్యం: ఆశ్చర్యంగా ఉన్నా, నివేదికలు చెబుతున్న నిజం ఇది. వాతావరణానికీ, మానసిక ఆరోగ్యానికీ కచ్చితమైన సంబంధం ఉందని సైన్స్ చెబుతున్నది. కొండ ప్రాంతాలు, వేడి వాతావరణం, సూర్యకాంతి… అన్నీ కూడా మన హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. ఆశ్చర్యం ఏమిటంటే కాలుష్యం కూడా మనసును కుదిపేస్తుందట.
సోషల్ మీడియా: సామాజిక మాధ్యమాల వల్ల పోలికలు పెరగడం, న్యూనత, పొగడ్తల కోసం వెంపర్లాట లాంటి సవాలక్ష సమస్యలు వస్తున్నాయని… అవి కుంగుబాటుకు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసులో బలవన్మరణాల వెనుక సోషల్ మీడియా ప్రభావం చాలా తీవ్రంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఓటీటీ: అవును కొవిడ్ తర్వాత ఇంటింటి మాటగా మారిన ఓటీటీ కూడా ఇలాంటి ఆలోచనలకు బలం చేకూరుస్తున్నదట. అందుకు ఉదాహరణే 13 Reasons Why అనే సిరీస్ చూసినవారిలో ఇలాంటి ఆలోచనలు పెరిగిపోవడం, అవి తీవ్ర పరిణామాలకు దారితీయడం పరిశోధకులు గమనించారు.
మనిషికి మరుజన్మ ఉందో లేదో తెలియదు… ఈ లోకానికి రాక ముందు మనం ఏమిటో కూడా తెలియదు. కేవలం ఈ ప్రయాణం మాత్రమే మనకు గుర్తు. దాన్ని మాత్రమే నిరూపించగలం, అనుభవించగలం. ఇంత అందమైన అద్భుతమైన ప్రాణం మీద నిరాశ పెంచుకోవడం అంటే జీవితకాలపు అనుభూతిని కోల్పోవడమే. అదే కసి సమస్యల మీద చూపిస్తే, అద్భుతాలు చేయగలం. ఆరోగ్యం, పరిస్థితులు, హోదా… ఏమాత్రం సహకరించకపోయినా తను గెలిచి, సమాజానికి కూడా ఓ మార్గదర్శిగా నిలిచిన ఎంతోమంది గెలుపు కథలే అందుకు సాక్ష్యం!