సపోటా చెట్టు.. పిల్లలున్న ప్రతి ఇంటి పెరట్లో ఉండటం సహజం. ఏడాదంతా పచ్చగా ఉండే ఈ చెట్టు.. 30 మీటర్ల దాకా పెరుగుతుంది. గోధుమరంగులో ఉండే సపోటా పండ్లు.. అతిమధురంగా ఉంటాయి. పూర్తిగా పండిన పండ్లలో 2, 4 గింజల దాకా కనిపిస్తాయి. దోసగింజ ఆకారంలో నల్లగా పెద్దగా ఉంటాయి. ఈ పండ్లు.. సాగదీసిన గుండ్రని ఆకారంలో గుత్తులుగుత్తులుగా కాస్తాయి. పూలు.. తెల్లగా చిన్న గంట ఆకారంలో ఉంటాయి. సపోటా చెట్టు సంవత్సరానికి రెండుసార్లు దిగుబడి ఇస్తుంది. పూలు మాత్రం ఏడాది పొడవునా కనిపిస్తాయి. దీనిని హిందీలో ‘చికూ’ అని అంటారు. పచ్చిగా ఉన్నప్పుడు కాయలను కోస్తే.. తొడిమ దగ్గర పాలు కారతాయి. సపోటాలు చెట్టుమీద పండవు.
కోసి మాగబెట్టిన తర్వాతే పండుతాయి. సపోటాలు మనదేశంలోని అన్ని ఉష్ణ ప్రాంతాల్లోనూ పండుతాయి. దక్షిణాసియా దేశాలతోపాటు వియత్నాం, కంబోడియా, కొలంబియా, క్యూబా, గయానాలాంటి దేశాల్లోనూ విరివిగా కనిపిస్తాయి. మన రాష్ట్రంలో ‘పాలరకం’ అని, మహారాష్ట్రలో ‘కాలిపత్తి’ అని, కర్ణాటకలో ‘క్రికెట్ బాల్’ అని.. వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అయితే ఈ పండ్లు ఎగుమతికి, రవాణాకు అనుకూలమైనవి కావు. శరీరం నీరసంగా ఉన్నప్పుడు 2, 3 సపోటాలు తింటే.. వెంటనే శక్తి పుంజుకుంటుంది. పండుగుజ్జులో లభించే పీచువల్ల మలబద్ధకం దూరమవుతుంది. సపోటాలో ‘ఫ్రక్టోజ్’ షుగర్లు, యాంటి ఆక్సిడెంట్లు, యాంటి బ్యాక్టీరియల్ గుణాలు, క్యాల్షియం, యాంటి పారాసిటిక్ అధికంగా ఉంటాయి.
ఇందులో ఉండే విటమిన్ సి.. శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంలో సాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరిచే సపోటా పండు.. ఎదిగే పిల్లలకు మంచిది. గర్భిణులు, రక్తహీనతతో బాధపడేవారు వీటిని తినడం వల్ల.. రక్తహీనత దూరమవుతుంది. ఒబెసిటి (ఊబకాయం), మధుమేహం బాధితులు.. ఈ పండును తినక పోవడమే మంచిది. ఎయిర్ లేయరింగ్, గ్రాఫ్టింగ్ ద్వారానే కాకుండా గింజలను నాటికూడా చెట్లను పెంచుకోవచ్చు.
మెల్లగా దీర్ఘకాలం పెరిగే ఈ చెట్లు.. అనేక సంవత్సరాలపాటు పండ్లను ఇస్తాయి. సులభంగా, అతి తక్కువ ఖర్చుతోనే ఈ చెట్లు పెరుగుతాయి. దాంతో రైతులు అనుబంధ వ్యవసాయంగా, వాణిజ్య తోటలుగా పెంచుతున్నారు. ఇక వ్యాపారులు సపోటా పండ్ల గుజ్జును నిలువ ఉండేట్లుగా తయారు చేసుస్తున్నారు. వీటితో మిల్క్‌షేక్‌లు, స్మూతీలు తయారుచేస్తూ.. మార్కెట్లో అమ్ముతున్నారు. దాంతో రైతులు ఏకంగా ఎకరాల కొద్దీ తోటలుగా పెంచుతూ.. లాభాలను ఆర్జిస్తున్నారు. మా తోటలోనూ దాదాపు 15 సపోటా చెట్లు ఉన్నాయి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు