తాను అడిగిన ఐదు ప్రశ్నల్లో మూడింటికి కరెక్ట్‌గా సమాధానాలు చెప్పడంతో.. 18వ పునర్జన్మ బలిపీఠ యాగంలో శరత్ చేసిన పొరపాటును చెప్పడం ప్రారంభించాడు రుద్ర. శివుడు సహా అందరూ ఆసక్తిగా వింటున్నారు. ‘రేయ్.. శరత్. ఈ మరణమృదంగం ప్రారంభంలో నువ్వేమన్నావో గుర్తుందా? నువ్వు అన్నది నీ మాటల్లోనే చెప్పాలంటే..
భస్మాసురుడి వారసులం మేం. అతని వారసత్వాన్ని నిలబెట్టి, మళ్లీ భస్మాసురుడిని భూమి మీదకు తీసుకురావాలంటే.. 18వ పునర్జన్మ బలిపీఠ యాగాన్ని చేయాలి. అది జరగాలంటే మరణ శాసనాలను లిఖించాలి. విష్ణుమూర్తి జాతకంలో పుట్టి, లింగమార్పిడి చేసుకొన్న 18 మందిని బలివ్వాలి. ఇందులో 16 మందిని గంట ఎడంతో బలిస్తూ పోవాలి. వేర్వేరు లింగాలు కలిగిన మిగతా ఇద్దరు ప్రేమికులు ఆత్మ బలిదానం చేయాలి. అలా జరిగితే, భస్మాసురుడు సశరీరంతో పూర్ణాయుష్షుడు అయ్యి భూమిపై రాక్షస రాజ్యాన్ని మళ్లీ సృష్టిస్తాడు. అంతరించిపోతున్న మా జాతి వర్ధిల్లుతుంది. అందుకే ఈ భస్మాసుర ప్రేమకు అంకురార్పణ చేశా’ అని ఏదో విజయ గర్వంతో అన్నావ్.. గుర్తుందా? ఇంకా ఏం చెప్పావంటే.. చివరగా.. ఆత్మ బలిదానం చేసుకొనే ఆ ఇద్దరి డెడ్‌బాడీలను అక్షయతృతీయ నాడు కాల్చేలా ప్లాన్ చేశానని, అలాగైతేనే, ఆత్మ బలిదానం చేసే ఆ ప్రేమికులు మళ్లీ పుడతారని అన్నావ్. అవునా?’ అంటూ రుద్ర అడిగాడు. తాను చెప్పిందే.. అక్షరాలా రుద్ర చెప్పడంతో అవునన్నట్టు తలూపాడు శరత్.
‘ఇందులో నీ చితికిపోయిన మెదడుకు తట్టని లాజిక్ ఏమిటంటే?? ఈ యాగంలోని 18 మంది లింగమార్పిడి చేసుకోవాలి. 16 మందికి ఆపరేషన్ చేయించి రెడీ చేశావ్. మిగతా ఇద్దరు కూడా లింగమార్పిడి చేయించుకొంటేనే పూజకు అర్హులు. ఆ ఇద్దరు ఎవరు?’ అని రుద్ర అడగ్గానే.. ‘నేను, శివుడు’ అన్నాడు శరత్. ‘మరి, మీ ఇద్దరూ తొలుత పురుషులు. లింగమార్పిడి చేసుకొంటే ఇద్దరు ఒకేరకమైన వ్యతిరేక లింగంలోకి మారుతారు. మరి, యాగంలోని ‘వేర్వేరు లింగాలు కలిగిన ఇద్దరు ప్రేమికులు ఆత్మ బలిదానం చేయాల’న్న సూత్రాన్ని ఎలా సంతృప్తి పరుస్తారురా? నువ్వు నిజానికి ప్రేయసిగా ఎంచుకోవాల్సింది ఓ అమ్మాయిని. ఆ అమ్మాయికి లింగమార్పిడి చేసి అబ్బాయిగా, నీకు నువ్వు లింగమార్పిడి చేసుకొని అమ్మాయిగా మారి.. ఇద్దరూ ఆత్మబలిదానం చేస్తే.. నీ ఫార్ములా ప్రకారం యాగం పూర్తయినట్టు. అవునా?’ అంటూ రుద్ర అన్న మాటలకు.. శరత్ నిర్ఘాంతపోయాడు. ఇంత చిన్నలాజిక్ తాను ఎలా మరిచిపోయానన్న విషయం అర్థంకాక సిగ్గుతో తలవంచుకొన్నాడు. అంతే, రెండు నిమిషాలు నిశ్శబ్దం తర్వాత తనను తాను తమాయించుకొన్న శరత్.. రుద్ర అండ్ టీమ్‌తో ఇలా అన్నాడు.
‘రుద్ర. ఓడిపోయానురా! నీ చేతుల్లో తల ఎత్తుకోలేని విధంగా ఘోరంగా ఓడిపోయా. ఏదో మా పూర్వికులు చెప్పిన విషయాలను పట్టుకొని ఇంతటి మారణహోమానికి తెగబడ్డా. నేను ఎంతపెద్ద తప్పు చేశానో.. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నిజానికి నా తప్పులకు ప్రాయశ్చిత్తమే లేదు. నన్ను చట్టానికి అప్పగించు. నాకు తగిన శిక్ష పడాల్సిందే’ అంటూ ప్రాధేయపడుతున్న శరత్ దగ్గరికి రుద్ర పోతుండగా.. ‘ఆపురరేయ్.. నువ్వూ.. నీ ఎదవ లాజిక్‌లు. అవును. ఏదో మిస్టేక్ జరిగింది. అంతమాత్రం దానికి నేను తెలివిలేని వాడిననుకున్నావా? ఏమన్నావ్.. నా మెదడును ఫ్రిజ్‌లో పెట్టి వచ్చానా? ఇప్పుడు తెలుస్తుంది. శరత్ అంటే ఏంటో?’ అంటూ గట్టిగా నవ్వుతూ పక్కనే ఉన్న శివుడికి సైగ చేశాడు శరత్. అంతే, ఒక్క ఉదుటన ముందుకు వచ్చిన శివుడు.. తన వీపులో దాచుకొన్న పదునైన గొడ్డలితో ఒక్క వేటుతో శరత్ తల నరికాడు. అనంతరం.. తన తల నరుక్కున్నాడు. సెకండ్ల వ్యవధిలోనే ఇద్దరి తలలు పది అడుగుల దూరంలో ఎగిరిపడటాన్ని చూసిన రుద్ర, జయ, రామస్వామి, స్నేహిల్ సహా అక్కడే ఉన్న మిగతా కానిస్టేబుల్స్ ఉలిక్కిపడ్డారు. అసలేం జరుగుతుందో ఎవ్వరికీ అర్థంకాలేదు. ఇంతలో డెన్‌లో ఎక్కడో అమర్చిన ఓ డివైజ్ యాక్టివేట్ అయ్యి.. శరత్ గొంతుతో వాయిస్ ఓవర్ ఇలా వచ్చింది.
‘హాయ్ రుద్ర. ఇప్పుడు నువ్వు నా వాయిస్ వింటున్నావంటే, నేను, నా శివుడు ఆత్మబలిదానం చేశామన్నమాట. ఈ గేమ్‌లో నువ్వు గెలిచావని అనుకోకు. బలివ్వడానికి సిద్ధమైన 16 మంది ఈపాటికి ఎప్పుడో చనిపోయి ఉంటారు. ఇక వాళ్ల గురించి పక్కనబెట్టు. ఈ డెన్‌లో నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో ముందు ఆలోచించు. ఎప్పుడైతే, ఈ డివైజ్ యాక్టివేట్ అవుతుందో.. అప్పటినుంచి మీకు కౌంట్‌డౌన్ మొదలైనట్టు లెక్క. ఇప్పటికే టాక్సిక్ గ్యాస్ లీక్ అవడం స్టార్టయినట్టుందిగా. నువ్వు.. నీ తొట్టిగ్యాంగ్ ఈ డెన్ నుంచి ప్రాణాలతో బయటపడాలంటే.. ఒక్కటే మార్గం. అది నీ తెలివికి ఇదే నా చివరి పరీక్ష. చివరిసారిగా ఈ పజిల్‌తో నన్ను ఓడించి.. నిన్ను నీ వాళ్లను కాపాడుకో.. జాగ్రత్తగా పజిల్ విను.. ‘ఈ డెన్లోపల ఓ మూల చిన్న గది ఉంది. ఆ గదిలోపల ఒకటే బల్బ్ ఉంది. ఆ గది డోర్‌కు బయట మూడు స్విచ్‌లు ఉన్నాయి. ఒక్కసారి మాత్రమే నువ్వు రూమ్ లోపలికి వెళ్లగలవు. ఇప్పుడు ఈ మూడు స్విచ్‌లను ఎన్నిసాైర్లెనా వాడుకో. అయితే, బల్బ్‌ను వెలిగించే కరెక్ట్ స్విచ్ ఏదో మాత్రం కనిపెట్టు. అన్నట్టు.. రూమ్‌లోకి నీకు ఎంట్రీ ఒక్కసారే. అది గుర్తుపెట్టుకో. తప్పు చెప్తే.. మీకు శుభమ్ కార్డు. అన్నట్టు నీకు జస్ట్ 5 నిమిషాలే టైమ్.. హియర్ సైనింగ్ ఆఫ్ శివరత్.. బైబై’ అంటూ ఆ వాయిస్ ఆగిపోయింది.
ఈ పజిల్‌ను విన్న జయ, స్నేహిల్, రామస్వామి, మిగతా టీమ్ భయంతో వణికిపోతున్నారు. రుద్రకు కూడా ఏమీ అర్థంకావట్లేదు. అప్పటికే కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. ఏదో ప్రయత్నిద్దామని రుద్ర ఓ టెక్నిక్ ట్రై చేశాడు. ఆశ్చర్యం.. అది వర్కౌట్ అయ్యింది. కరెక్ట్ స్విచ్ మూడోది అంటూ రుద్ర అరిచాడు. అంతే డెన్ తలుపులు ఓపెన్ అయ్యాయి. ఆ వెంటనే రుద్ర అండ్ టీమ్ సురక్షితంగా బయటపడ్డారు. ఇంతకీ రుద్ర మూడో స్విచ్‌ను కనిపెట్టిన టెక్నిక్ ఏంటో మీరు గుర్తించారా?
రుద్ర మొదటి స్విచ్‌ను రెండుమూడు నిమిషాలు ఆన్ చేశాడు. తర్వాత ఆఫ్ చేశాడు. అనంతరం రెండో స్విచ్‌ను ఆన్ చేసి గది లోపలికి వెళ్లాడు. లైట్ వెలగలేదు. బల్బ్‌ను తాకి చూస్తే అది వేడిగా కూడా లేదు. దీంతో కరెక్ట్ స్విచ్ మూడోది అని రుద్ర కనిపెట్టాడు.