అమెరికా అంతర్యుద్ధం ముగిసి బానిసత్వం రద్దయినా… నల్ల జాతీయుల పట్ల వివక్ష తగ్గలేదు. అది చాలా సందర్భాల్లో అధికారికంగానే ఉండేది. ఆ పరిస్థితిని మార్చిందీ మరో మహిళే. బస్సులో కొన్ని సీట్లలో (అవి ఖాళీగా ఉన్నా సరే) నల్ల జాతీయులు కూర్చోకూడదు అనే నిబంధనకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిన రోసా పార్క్స్ అనే మహిళను అమెరికన్ పౌరహక్కుల ఉద్యమానికి ఆద్యురాలిగా భావిస్తారు. చెప్పడం మొదలుపెడితే చరిత్రను మార్చిన ఇలాంటి మహిళల జాబితా చాలా పెద్దగానే ఉంటుంది.
‘ఇంత బక్కప్రాణం రాసిన ఓ పుస్తకం… యుద్ధానికి దారితీసిందంటే నమ్మలేకపోతున్నాను’ – అమెరికన్ అధ్యక్షులలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన అబ్రహం లింకన్ అన్న మాటలివి. అంకుల్ టామ్స్ కేబిన్ పుస్తకంతో బానిసత్వానికి వ్యతిరేకంగా భావోద్వేగాలను రగిలించి అమెరికాలో అంతర్యుద్ధానికి బాటలువేసిన హేరియట్ బీచర్ స్టోవె ఆ రచయిత్రి. లింకన్ ఆ మాటలు అన్నాడా లేదా అన్న విషయం మీద సందేహాలు ఉన్నా… ఆ పుస్తకం ప్రభావం మీద మాత్రం ఎవరికీ అనుమానం లేదు.
మేడం క్యూరీ నుంచి సావిత్రిబాయి ఫూలే వరకు లోకం దృష్టినే మార్చేసిన స్త్రీమూర్తులు ఎందరో! రచయిత్రి అంటే అగాథా క్రిస్టీ, రాణి అంటే రుద్రమ, వ్యోమగామి అంటే సునీతా విలియమ్స్… ఇలా ఏ రంగాన్ని తల్చుకున్నా ఓ మహిళ పేరు గుర్తుకొచ్చి తీరుతుంది. మరి మహిళ అన్న కారణంగానే ఎన్ని అద్భుతాలు సాధించినా కూడా పట్టించుకోని పేర్ల సంగతేంటి! వారిని గుర్తుచేసుకోవాల్సిన… అందరితో పంచుకోవాల్సిన సమయమిది!
చెంగీజ్ ఖాన్! చరిత్రతో పరిచయం ఉన్నా లేకపోయినా ఆ పేరు విననివారు అరుదు. క్రూరమైన రాజుగానే కాదు… సామ్రాజ్యాన్ని విస్తరించడంలోను, వ్యూహాలను రచించడంలోనూ తనకు తానే సాటి. చెంగీజ్ ఖాన్ తర్వాత ఆ ఉధృతిని కొనసాగించిన వారసుడు తన మనవడు కైదు. ఓపక్క తన రాజ్యాన్ని కాపాడుకోవడమే కాదు, చెంగీజ్ ఖాన్ మరో వారసుడైన కుబ్లయి ఖాన్‌తో ఆధిపత్య పోరులోనూ కైదు తలమునకలుగా ఉండేవాడు. ఆ పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన వ్యక్తి ‘కుటులున్’. ఎడారి ప్రాంతంలో, కరకు సైనికుల మధ్య, మగవాడి మాటే వినిపించాలనే పరిస్థితుల్లో… కైదు బిడ్డ కుటులున్ గుర్రపు స్వారీ దగ్గర నుంచి కత్తియుద్ధం వరకు ప్రతి యుద్ధకళలోనూ ఆరితేరింది. అన్నిటికంటే ప్రత్యేకం ఏమిటంటే… శత్రువుతో నేరుగా తలపడే మల్లయుద్ధంలో కుటులున్ని కొట్టినవాడు మంగోలియాలోనే లేడట. తన తండ్రితోపాటు నేరుగా యుద్ధభూమికి వెళ్లే కుటులున్… ఎన్నో సమరాల్లో తనకు విజయాన్నందించింది. యుద్ధంలోనే కాదు యుద్ధతంత్రం రచించడంలోనూ, రాజ్యాన్ని పాలించడంలోనూ కుటులున్ సలహాలను కైదు తు.చ. తప్పకుండా పాటించేవాడు. తనకు ఎంతోమంది మగపిల్లలు ఉన్నా… కుటులున్నే తన సింహాసనానికి వారసురాలిగా ప్రకటించాడనే కథా వినిపిస్తుంది.
అంతటి శక్తిమంతురాలిని సైతం చరిత్ర విస్మరించింది. ప్రతి రాజు గురించీ, తను స్థాపించిన వంశాల గురించీ, అందులోని సవాలక్ష రాజుల గుణగణాల గురించీ వివరించే చరిత్రకారులు కుటులున్ ఉన్న విషయాన్నే మర్చిపోయారు. మార్కోపోలో తన యాత్రాసాహిత్యంలో కనుక కుటులున్ గురించి చెప్పి ఉండకపోతే… అసలు అలాంటి వ్యక్తి ఉందనే విషయం కూడా ఎవరికీ తెలిసి ఉండేది కాదు. వైద్యం నుంచి విజ్ఞానం వరకు మానవజాతి మనుగడ సాగించిన ప్రతీ రంగంలోనూ ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తూనే ఉంటాయి. అణువణువునా అలసత్వం! ఈమధ్య వచ్చిన ఓపెన్‌హైమర్ సినిమాతో అందరికీ అణుబాంబు వెనుక ఉన్న ప్రయత్నాల గురించి తెలిసింది. అందుకోసం ఆరంభించిన ‘మేన్హటన్ ప్రాజెక్ట్’ గురించీ తెలిసింది. అయితే ఇందులో షెన్ షియంగ్ గురించి ఎవరికీ తెలియనే తెలియదు. నిజానికి షెన్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ అసలు ముందుకు కదిలేదే కాదు. ఐన్‌స్టీన్ సైతం అసాధ్యం అనుకున్న క్వాంటం ఎంటాగిల్మెంట్ అనే సిద్ధాంతాన్ని షెన్ నిరూపించారు. యురేనియంని వేర్వేరు ఐసోటోప్స్గా విడగొట్టారు. విచిత్రం ఏమిటంటే… అణువుల మీద తను చేసిన ఓ పరిశోధనకుగాను తన శిష్యులైన ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి దక్కింది కానీ, తన పేరు కూడా బయటకు రానివ్వలేదు. ప్రత్యేకించి విన్నప్పుడు ఈ వివక్ష మరీ కఠినంగా ఉండవచ్చు కానీ… కాస్త లోతుగా గమనిస్తే చరిత్ర మరుగుపరచిన ఇలాంటి మహిళా శాస్త్రవేత్తల జాబితా చాలా పెద్దగానే కనిపిస్తుంది. వాటిలో ప్రముఖంగా వినిపించే మరో పేరు రోసాలిండ్ ఫ్రాంక్లిన్.
మన శరీరం జన్యువులు అనే నిచ్చెనలాంటి పదార్థాలతో నిర్మితం అయ్యిందని ప్రతిపాదించడమే కాకుండా, ఏకంగా వాటి ఫొటోనూ తీశారు రోసాలిండ్. అంతేకాదు! తను చేసిన పరిశోధనల ఆధారంగానే విషవాయువులను ఎదుర్కొనే గ్యాస్ మాస్కులను సైన్యం రూపొందించగలిగింది. వైరస్ల మీద రోసాలిండ్ చేసిన సూత్రాల ఆధారంగా పరిశోధన చేసినవారికీ నోబెల్ దక్కింది. తను మాత్రం అనామకంగా మిగిలిపోయింది. ఇప్పుడు మనం రోజూ తల్చుకునే భూతాపానికి కారణమైన ‘గ్రీన్హౌస్ ఎఫెక్ట్’ను కూడా ఓ మహిళా శాస్త్రవేత్తే కనుగొన్నారు. తన పేరు యూనిస్ ఫుట్. ఓ వైజ్ఞానిక సమావేశంలో మహిళలకు ప్రవేశం లేకపోవడంతో తన స్నేహితుడిని బతిమాలి, తన సిద్ధాంతాన్ని అక్కడ వినిపించారు యూనిస్. ఇంత జరిగినా… అదే సిద్ధాంతాన్ని మూడేళ్ల తర్వాత ప్రతిపాదించిన ఓ మగ శాస్త్రవేత్త పేరు మీదుగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చలామణి అవుతున్నది.
వీళ్లే కాదు! క్షయవ్యాధికి, ఆ మాటకు వస్తే ఏ వ్యాధికైనా ఉండే మందును… నేరుగా రక్తంలోకి కలవగలిగే ఇంజెక్షన్లా మార్చే పద్ధతిని కనుగొన్న అలిస్ బాల్; మనుషుల్ని అంతరిక్షంలోకి పంపడంలో నాసాకు ఉపయోగపడేలా సిద్ధాంతాలు రూపొందించిన గణిత శాస్త్రవేత్త కేథరిన్ జాన్సన్; ఇచ్చిపుచ్చుకోవడంలో మనిషి తత్వం గురించి అనూహ్యమైన సిద్ధాంతాలు వెలువరించిన ఆర్థికవేత్త ఎలినార్ ఆస్ట్రామ్; పల్సర్స్ అనే వింత తారలను కనుగొన్న జోసెలిన్ బెల్… వీళ్లందరి పేర్లూ విజ్ఞానశాస్త్రంలో ఉన్నవారికి కూడా తెలియకపోవచ్చు. పైగా వీళ్లలో ప్రతి ఒక్కరిదీ ఓ కన్నీటి గాథ. కేథరిన్ ఓ ల్యాబ్ ప్రమాదంలో చనిపోతే… ఆమె సిద్ధాంతాన్ని తన పేరున ఆపాదించుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఎలినార్ సిద్ధాంతాలన్నీ ఆచరణలో అద్భుతాలు చేశాక కానీ తనకు గుర్తింపు రాలేదు. మైళ్ల కొద్దీ పేపర్లను పరిశీలించిన జోసెలిన్ పల్సర్లను కనుగొంటే, తన పై అధికారికి నోబెల్ దక్కింది. ఈ వివక్ష కేవలం శాస్త్రవేత్తల విషయంలో మాత్రమే కాదు. మొదట్లో చెప్పుకొన్నట్టుగా రాణుల దగ్గరనుంచీ రచయిత్రుల వరకూ మహిళల ప్రతిభను ఓరకంటితో కూడా చూడని నిర్లక్ష్యం చరిత్రపుటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చారిత్రక తవ్వకాల్లో బయటపడిన తొలి రచన ‘ఎన్హెడున’ అనే మహిళదే అని చెబుతున్నారు. క్రీస్తుపూర్వం రెండువేల సంవత్సరంలోనే తను మట్టి పలకల మీద రాసిన పద్యాలు, స్తోత్రాలు బయటపడ్డాయి. మార్కోపోలో కంటే వెయ్యేళ్ల ముందుగా యాత్రాసాహిత్యాన్ని రాసిన ఎగేరియా గురించీ ఎవరికీ తెలియదు. టిబెట్ మీద చైనీయుల దురాక్రమణను అడ్డుకునేందుకు 600 మంది వీరులతో కదం తొక్కిన ‘అని పచెన్’ ఇప్పటికీ మనకు అపరిచితురాలే.
భారతీయ సమాజంలో స్త్రీల పట్ల వివక్ష గురించి సానుకూలంగానూ, ప్రతికూలంగానూ వాదించే విశ్లేషణలు కొత్తేమీ కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివక్షే ఇక్కడా కాస్త ఎక్కువ తక్కువగా ఉందనే విషయాన్ని ఒప్పుకోక తప్పదు. రాణులకూ తప్పలేదు: మన చరిత్రలో రాజులకే కాదు… రాణుల పాత్రకీ కొదవలేదు. దాతృత్వానికి దీటైన అహల్యాబాయి హోల్కర్, దిల్లీ సుల్తానత్‌ను ఏలిన రజియా పేర్లు అందరికీ పరిచయమే. కానీ శాతవాహన వంశం కుప్పకూలిపోకుండా నిలబెట్టిన నయనిక కేవలం చరిత్ర విద్యార్థులకే పరిచయం. తన భర్త మొదటి శాతకర్ణి అర్ధంతరంగా చనిపోయిన తర్వాత, కుమారుడిని గద్దె మీద ఉంచి పాలించిన వ్యక్తిగా నయనికను గౌరవిస్తారు. కానీ నయనికతో పాటుగా కశ్మీరును పాలించిన రాణి సుగంధ, రాజా విక్రమాదిత్యుడి కూతురిగా తనకు దీటుగా 20 ఏళ్లు పాలించిన ప్రభావతి… ఇలా మనం మర్చిపోయిన రాణుల జాబితా కూడా పెద్దదే! ముగ్గురు వైద్యుల కథ: ఆనంది గోపాల్, కాదంబిని గంగూలి, రుక్మాబాయి. ఈ మూడు పేర్లు కొత్తగా వినిపించవచ్చు. కానీ ఆడపిల్లలు చదువుకోవడమే అసాధ్యం అనే రోజుల్లోనే సవాలక్ష పరిమితులను, అవమానాలను ఎదుర్కొని డాక్టర్ పట్టా పొందిన తొలి భారతీయ మహిళలు వీరు.
1886లో డాక్టర్ అయిన ఆనందిబాయి, ప్రసవసమయంలో మహిళలకు సరైన చికిత్స అందాలనీ… దానికోసమే తన వృత్తి సాయపడాలనీ అనుకున్నారు. కానీ తన కల నెరవేరకుండానే 21 ఏళ్లకే చనిపోయారు. అదే ఏడాది డాక్టర్ డిగ్రీ అందుకున్న మరో వ్యక్తి కాదంబిని మాత్రం సుదీర్ఘకాలం ప్రాక్టీస్ చేయడమే కాకుండా అసోం తేయాకు కార్మికుల దగ్గర నుంచి, బీహార్ బొగ్గు కార్మికుల వరకూ పేదల ఆరోగ్యం కోసం అసాధారణ కృషి చేశారు. కాదంబిని కాలంలోనే వైద్యవృత్తి చేపట్టిన రుక్మాబాయిది మరో సాహసగాథ. బలహీన వర్గాల నుంచి వచ్చిన రుక్మాబాయి వైద్యపట్టా అందుకోవడమే కాకుండా వివాహ వ్యవస్థలో ఉన్న లోపాల మీద ఆమె చేసిన పోరాటంతోనే Age of Consent Act అనే చట్టం కూడా రూపొందింది. నిశ్శబ్దంగా నేలకొరిగిన యోధులు: స్వేచ్ఛ ఎంత విలువైందో దాన్ని కోల్పోయినప్పుడే తెలుస్తుంది. అందుకే ఇప్పటికీ మన స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల గురించి తల్చుకుంటూనే ఉంటాం. కానీ అందులో మహిళల శాతం తక్కువే. అలాగని వారి పాత్రకేమీ కొదవ లేదు. మనం గాంధీ పేరు విన్నాం కానీ ‘బుడీ గాంధి’ (వృద్ధ గాంధి) అనే పేరు విని ఉండం కదా! తన అసలు పేరు మాతంగిని హజ్రా. గాంధీజీ బోధనల స్ఫూర్తిగా సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహంలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఓసారి తనే స్వయంగా ఆరువేల మందిని కూడగట్టుకుని ఓ ఊరేగింపును తలపెట్టారు.
వేలమందిని ముందుండి నడిపిస్తున్న మాతంగిని మీద పోలీసులు తూటాలు పేల్చినా సరే జెండా పట్టుకునే నేలకొరిగారు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా అసోంలో భారతీయ జెండాతో ముందుకు నడుస్తూ, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నినదిస్తూ తుపాకులకు బలైన మరో మహిళ కనకలతా బారువా. తన వయసు 18 ఏళ్లే. వీరే కాదు తన పక్కనే నడుస్తున్న భర్త చనిపోయినా, ఊరేగింపును ముందుకు నడిపించిన తారారాణి; ఉరిశిక్ష పడిన కొడుకును చూసి నిబ్బరంగా ఉండమని ధైర్యం చెప్పిన మూల్మతి… ఇలా స్వాతంత్య్ర పోరాటంలో అడుగడుగునా అండగా నిలిచిన మహిళలు ఎందరో. అంతదాకా ఎందుకు! మగవారు తూటాలకు నేలకొరిగినా, జైళ్లలో మగ్గినా ఇంటిని చూసుకుంటూ పిల్లలకు దేశభక్తిని నూరిపోస్తూ మరో తరాన్ని పోరుకు సిద్ధం చేసిన స్త్రీలను ఎలా మర్చిపోగలం. రష్యన్ విప్లవంలో ఇలాంటి వీరవనితలకు సంకేతంగా మాక్సిం గోర్కి రాసిన ‘అమ్మ’ నవల ఓ సంచలనం. అలాంటి అమ్మలు మనకు అడుగడుగునా ఉన్నారు! వారిని మర్చిపోయాం అంతే! మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఉద్యోగాలు చేసే స్త్రీల శాతం, చదువుకునే బాలికల సంఖ్య, నాయకత్వ స్థానంలో ఉన్న మహిళల స్థాయుల్లో మార్పు కచ్చితంగా ఉంది. కానీ ఇప్పటికీ వివక్ష నేరుగా కాకున్నా నిశ్శబ్దంగా మహిళల ఎదుగుదలను, ప్రయాణాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ఇంట్లో తెలిసో తెలియకుండా మాట్లాడే మాటల దగ్గర్నుంచీ పనిచేసే మహిళల ప్రతిభను గుర్తించడంలో అలసత్వం వరకు అసమానత వివిధ రూపాల్లో ఉంది. దాన్ని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన సమయమిది. లేకపోతే మరో పదేళ్ల తర్వాత మరో కథనం రాసేటప్పుడు కంప్యూటర్ యుగం సైతం గుర్తించని మహిళల ప్రతిభ అని మరో విశ్లేషణ చేసుకునే దుస్థితి వస్తుంది.
కంప్యూటర్ లేని లోకాన్ని ఊహించలేం. అదేవిధంగా తను లేని కంప్యూటర్నీ ఊహించలేం. అది బిల్‌గేట్సో, స్టీవ్ జాబ్సో కాదు…. అడా లవ్లేస్! ప్రముఖ కవి బైరన్ కుమార్తె అడా. తనకు కొడుకు పుడతాడని తెగ ఆశపడిన బైరన్, అడా జననంతో చిరాకుపడిపోయాడు. పసివయసులోనే తనను, తల్లిని ఇంటి నుంచి బయటకు పంపేశాడు. తండ్రి నిరాదరణ, తల్లిదండ్రుల మధ్య గొడవలు, అనారోగ్యాల మధ్య అడా చదువులో సాంత్వన వెతుక్కుంది. ఆ ఆసక్తితోనే ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ బాబేజ్‌తో స్నేహం చేసింది. బాబేజ్ రూపొందించిన యంత్రాన్ని తొలి కంప్యూటర్‌గా అందరూ పరిగణిస్తారు. నిజానికి ఆ యంత్ర రూపకల్పన వెనకాల బాబేజ్ ఉద్దేశం, లెక్కల్ని మరింత సులభతరం చేయడం. కానీ అడా అలా కాదు! ఆ యంత్రం అద్భుతాలు చేయబోతున్నదని తను ఊహించింది. దాన్ని ప్రచారం చేసేందుకు వ్యాసాలు రాసింది. అప్పటి శాస్త్రలోకం ఓ జడపదార్థంగా భావిస్తున్న ఆ యంత్రాన్ని అందరికీ పరిచయం చేసింది. అంతేకాదు! దాన్ని ఎలా వినియోగించుకోవచ్చో చెబుతూ అడా రాసిన ఓ అల్గారిథమ్‌ను చరిత్రలోనే తొలి కంప్యూటర్ ప్రోగ్రాంగా పరిగణిస్తారు.
లోకాన్ని మార్చిన శాస్త్రవేత్తలు ఎవరు? అని గూగుల్‌ని అడిగితే ఇంచుమించుగా మగవారి ఫోటోలే చూపిస్తోందా! ఒక వృత్తి గురించో, సందర్భం గురించో అడిగితే మగవారి బొమ్మలే కనిపిస్తున్నాయా! సామాజికంగా మనం దేనికైతే ప్రాముఖ్యం ఇస్తామో దానినే ఇంటర్నెట్ ప్రతిఫలిస్తుంది. ఆ ఫలితాలనే మళ్లీ మనం తలకెత్తుకుంటాం. ఇలా… కంప్యూటర్ యుగంలోనూ వివక్ష ఓ విషవలయంలా మారుతోందని పరిశోధకులు కనుగొన్నారు.
STEM రంగాల్లో మహిళల పట్ల తీవ్ర వివక్ష ఉందని చెప్పక్కర్లేదు. ఇందుకు పాఠశాలే తొలి వేదికగా మారడం బాధాకరం. ఉపాధ్యాయులు… లెక్కల్లో మగపిల్లలను ప్రోత్సహించినంతగా, వారి పనితీరును బేరీజు వేసినంతగా ఆడపిల్లలను పట్టించుకోవడం లేదని న్యూయార్క్ యూనివర్సిటీలో జరిగిన ఓ పరిశోధన తేల్చింది. ఆ ప్రభావం వారి మార్కుల మీద కనిపించగానే, ఆడపిల్లలకు లెక్కలు రావు అని తేల్చేస్తున్నారు. అసలు లెక్క వివక్షే!
మగవారు ఏడవకూడదు, ఏడ్చినా వినిపించకూడదనే భావన మనకు కొత్త కాదు. దీని మూలం పసివయసులో ఉండటమే ఆశ్చర్యం. పిల్లల ఏడుపు పెద్దగా, అసౌకర్యంగా వినిపిస్తే అది కచ్చితంగా ఆడపిల్లల ఏడుపే అనీ… అదే సన్నగా, నిదానంగా వినిపిస్తే మగవారి ఏడుపని అందరూ అనుకుంటారట.
ఆడపిల్లలు రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. అందుకే వాళ్లు చాలా వృత్తులకు అనర్హులు అనేది ఓ బలమైన భావన. స్వీడన్ పరిశోధకులు ఇది తప్పని తేల్చారు. సామాజిక పరిమితులు కనుక లేకపోతే ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో ఆడ, మగ అనే తేడా లేదని విశ్లేషించారు. 15-20 ఏళ్ల లోపు కొందరు మహిళల మనస్తత్వాన్ని నిశితంగా గమనించాక చెప్పిన మాట ఇది.
ఆడపిల్లలు తక్కువ అని చెప్పే కబుర్లన్నీ తప్పని నిరూపిస్తున్నాయి పరిశోధనలు. మరోవైపు చిత్రంగా… భాషా నైపుణ్యాల విషయంలో మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలే మరింత చురుగ్గా ఉండగలరని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. తప్పులు లేకుండా రాయడం, వాక్యనిర్మాణం లాంటి భాషాపరమైన అంశాలలో బాలికలదే పైచేయి అని MRI స్కాన్ ఆధారంగా నిరూపించారు.
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్…ఈ నాలుగు రంగాలను కలిపి STEM అంటారు. ఈ రంగాల్లో రాణించాలంటే చాలా తెలివితేటలు ఉండాలని, అది మగవారికే సాధ్యమని ఓ అభిప్రాయం. అందుకే ఈ రంగాల్లో ఇంట్లో ఆడపిల్లలను చదివించేందుకు కానీ అందులో ఉపాధిలో ప్రోత్సహించేందుకు కానీ అంతగా చొరవ చూపడం లేదు. జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనే నివేదిక ప్రకారం 146 దేశాల్లోని ఈ అసమానతను గ్రహించే ప్రయత్నం చేసింది. ఊహించనట్టుగానే కేవలం 29.2 శాతం మహిళలు మాత్రమే ఈ STEM రంగాల్లో నిలదొక్కుకుంటున్నారు. మిగతా రంగాల్లో ఇది 49.3 శాతం ఉంది. దీన్నిబట్టి ఎంతటి వివక్ష ఉందో గ్రహించవచ్చు. మరీ ముఖ్యంగా లెక్కలు, సివిల్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో ఈ వివక్ష మరింత స్పష్టంగా కనిపించింది. ఇలాంటి గణాంకాలన్నీ చూసిన కొందరు శాస్త్రవేత్తలకు అసలు నిజంగానే లెక్కల్లాంటి అంశాలను నేర్చుకోవడంలో ఆడ, మగ తేడా ఉంటుందా అనే అనుమానం వచ్చింది. దానికోసం విస్కిన్సన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 86 దేశాల్లో లెక్కలు చదువుకునే విద్యార్థులను గమనించారు. ఛాందసంగా ఉండే ప్రాంతాల్లో ఆడపిల్లల లెక్కల నైపుణ్యం కాస్త తక్కువగానే కనిపించింది. అదే అభివృద్ధి చెందిన/చెందుతున్న దేశాల్లో ఆడపిల్లలు గణితశాస్త్రంలో మగవారితో సమానంగా నిలిచారు. దీన్నిబట్టి సమాజం కనుక సమానంగా ప్రోత్సహిస్తే… ఏ నైపుణ్యంలో అయినా లింగపరమైన ఎక్కువతక్కువలు ఉండవని తేలింది.