తొలి మలితరం తెలుగు టాకీలన్నీ పురాణేతిహాస కథలతో పాటు ఆదర్శ పురుషుల కథలు, గాథలతో వచ్చాయి. సాంఘిక చిత్రాల జోరు ఎక్కువగా మొదలైన తరువాత దేశం, ధర్మం, కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలకు పెద్దపీట పడింది. అటు తరువాత సమాజానికి సందేశాలతో వచ్చాయి. అందులోనూ పల్లెటూరు నేపథ్యంగా సాగిన చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ నేపథ్యంలో 1984లో వచ్చిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం బావా, మరదలు, నాయనమ్మ-అమ్మమ్మ అనుబంధాలను చిత్రీకరించింది. ఇందులోని గీతాల్లో దాన్నంతా గుప్పించారు సినారె. అందులోని ఓ అపురూప గీతం మీ కోసం..
తెలుగునాట సంచలన విజయం నమోదు చేసుకున్న ‘మంగమ్మగారి మనవడు’లో అగ్రేసరనటి డా॥ భానుమతి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ, సుహాసిని ప్రధాన తారాగణం. ఈ మూడు ప్రధాన పాత్రల చుట్టూ అల్లుకున్న కథ ఇది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా కోసం సినారె ఐదు గీతాలు రాశారు. ‘వంగతోట కాడ ఒళ్లు జాగర్త’, ‘దంచవే మేనత్తా కూతురా/ వడ్లు దంచవే నా గుండెలదరా..’, ‘చందురుడు నిన్ను చూసి చేతులెత్తాడు/ తన అందం నీలో చూసి తడబడి పోయాడు’ వంటి వాటితోపాటు ‘శ్రీ సూర్యనారాయణ మేలుకో’ బహుళ జనాదరణ పొందింది. అమ్మమ్మ తన మనవరాలిని, మనవరాలు తన అమ్మమ్మను ఆట పట్టిస్తూ పాడుకునేలా కవి రాసిన కింది జంట పల్లవులను చూద్దాం
అమ్మమ్మ: శ్రీ సూర్యనారాయణ మేలుకో, మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో, చూసిపో తెల్లవారకముందే ఇల్లంతా పరుగుల్లు చీకట్లో ముగ్గుల్లు చెక్కిట్లో సిగ్గుల్లు ఏమి ఓయ్యారమో ఎంత విడ్డూరమో ఎంత విడ్డూరమో
మనవరాలు: శ్రీ సూర్యనారాయణ మేలుకో, మేలుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో, చూసిపో చిట్టి మనవడిరాక చెవిలోన పడగానే ముసిముసి చీకట్లో ముసలమ్మ రాగాలు ఏమి జాగారమో, ఎంత సంబరమో, ఎంత సంబరమో
చిత్ర కథా సందర్భం ప్రకారం తెల్లవారితే పట్నం నుంచి వచ్చే తన బావ కోసం నాయిక ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది. మాటిమాటికి సూర్యోదయం ఎప్పుడవుతుందా తెల్లారకముందే లేచి ముగ్గులు పెట్టేస్తుంటుంది. ఆ ఆరాటాన్ని చూసిన అమ్మమ్మ తన మనవరాలిని ఆటపట్టిస్తుంది. మరోవైపు కొన్ని కారణాలతో ఇల్లు వదిలి వెళ్లిపోయిన మనవడు తిరిగి వస్తుండటంతో ఆ నాయనమ్మకూ ఆరాటమే! తన మనవడి కోసం ఆమె పడే ఆరాటాన్ని ఇందులో చెప్పారు సినారె. మరదలిది బులపాటమైతే, అమ్మమ్మది మనవడి కోసం తపించి ఎదురుచూసే ఆరాటం.
ఇక్కడ ఒక మాట చెప్పాలి అవకాశవశాత్తు అనేకసార్లు సినారెతో ఉన్నప్పుడు అనేక బాల విషయాలు చెప్పేవారు. ఈ ఎదురుచూపుల ఆరాటల కథ వినగానే వారే చెప్పిన ముచ్చట యాదికొస్తుంది. వేసవి మొదలు బతుకమ్మ, దసరా సెలవులకు ఇంటికి వచ్చే ముందు తనకు ‘కచ్చురం’ సిరిసిల్లకు ఎప్పుడు పంపాలో పోస్టుకార్డు రాసేవారట సినారె. సిరిసిల్ల నుంచి హైదరాబాద్కు 1950 ప్రాంతంలో ఒకే బస్సు ఉండేది. ఉదయం సిరిసిల్లలో బయలుదేరి మధ్యాహ్నం హైదరాబాద్ చేరితే తిరిగి సాయంత్రానికో, అర్ధరాత్రికో సిరిసిల్లకు చేరేది. అలా బస్సు ఆలస్యం అయిననాడు, లేదా బస్సు క్యాన్సల్ అయిననాడు ఆ ముచ్చట తెలియక ‘కొడుకు ఇంకా రాలేదు’ అని తల్లి బుచ్చవ్వ దొరసాని ఎదురుచూసేదట. ఇంకా కొడుకు రాగానే పప్పు మెతుకులు ఎందుకని ముందటి రోజే మేకపోడేలు కోయించి, పొతం జేయించి ఉప్పుపసుపు పట్టిచ్చి పెట్టేదట. ఆ ఎదురుచూపులు కూడా బహుశ: కవి సినారెకు మదిలో మెదిలి ఉంటాయి ఈ గీత రచన సమయంలో. అమ్మమ్మగా భానుమతి విలక్షణ నటనకు విశ్వరూపమీ చిత్రం. తన మనవడి కోసం ఆమె చేసే జాగారాలు, బావకోసం మరదలు ఆరాటాలు, బులపాటాలు, అర్ధరాత్రి పొద్దుపోక వాకిలిని ముగ్గులతో నింపి సూర్యుణ్ని లేపే ప్రయత్నాలను ఎంతో సహజసుందరంగా వర్ణిస్తారు సినారె.
అమ్మమ్మ: సరిగంచుపైట సవరించుకున్నా
మరి మరి జారిపోతోంది,
ఓసోసి మనవరాల ఏం జరిగింది
ఓసోసి మనవరాల ఏం జరిగింది
మనవరాలు:
తాతయ్యనీ నువ్వు తలచిన తొలినాడు
నీకేం జరిగిందో అమ్మమ్మ
నాకంతే జరిగింది అమ్మమ్మ
అమ్మమ్మ మనవరాళ్ల చక్కని బంధాన్ని సంభాషణాత్మక శైలిలో గీతాన్ని నడిపించారు కవి. అమ్మమ్మ మనవరాలిని కొంటెగా కవ్విస్తూ పైట జారిపోవడం ఎందుకు అంటే, అంతే తుంటరిగా తాతయ్యను తలచిననాడు నీకు ఏం జరిగిందో నాకు అదే జరుగుతున్నదని అంటుంది. తరువాతి చరణాన్ని మరింతగా ఇద్దరి ఆరాటాలకు అద్దం పట్టేలా రాశారు సినారె.
అమ్మమ్మ:
కోడిని కొడితే, సూర్యుని లేపితే
తెల్లవారిపోతుందా,
ఓ పిల్ల పెళ్లి ఘడియవస్తుందా
ఓ పిల్ల పెళ్లి ఘడియ వస్తుందా
కోడి కూసిందంటే పల్లెకు తెల్లవారినట్టే..
అందుకే ఇంకా కూయని కోడిని మాటిమాటికి తట్టిలేపే మనవరాలు మనసు అర్థం చేసుకున్న అమ్మమ్మ మందలింపుగా పై మాటలు అనడం ఆమె పట్ల వున్న ప్రేమను, పల్లెటూరి మరదలు అమాయకత్వాన్ని చెబితే, తరువాత మనవరాలు “దిగివచ్చే బావను క్షణమైనా ఆపితే/ దేవుణ్ని నిలదీయనా/ ఓయమ్మో/ కాలాన్ని చుట్టేయనా” అంటూ వ్యక్తపరిచిన ఆమె ప్రేమను చూసిన అమ్మమ్మ తన మనవరాలిని “నా పిచ్చితల్లీ, నా బుజ్జితల్లీ/ నీ మనసే బంగారం” అంటూ మనసారా దీవిస్తుంది. ఆ దీవెనలనూ, ముత్యాల మూటలుగా, తొలి దీవెనలుగా తలిచిన మనవరాలు నిలువెల్లా మురిసి పోతుంది.