రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఫైకస్ రెలిజియోస. ఎక్కువ కాలం పొడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో రావి చెట్టు పెరుగుతుంది. ఇది 98 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతుంది. రావి మాను చుట్టుకొలత విస్తీర్ణం భారీగా ఉంటుంది. మాను వైశాల్యం దాదాపు మూడు చదరపు మీటర్ల వరకూ పెరుగుతుంది. రావి ఆకు హృదయాకారంలో దళసరిగా ఉంటుంది. ఎండబెట్టిన రావి కొమ్మల భస్మాన్ని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.
గౌతమ బుద్ధుని కాలం నుంచి ఈ రావి చెట్టు ప్రస్తావన చరిత్రలో విన్నాం. రాకుమారుడైన గౌతముడు బీహార్లోని గయ సమీపంలో నిరంజనా (ఇప్పుడు ఫల్గూ) నదీ తీరంలో ఉన్న ఓ రావి చెట్టు కింద ధ్యానం చేసిన సందర్భంలో జ్ఞానోదయం అయిందని చరిత్ర చెబుతున్నది. అప్పటినుంచి ధర్మ ప్రచారానికి పూనుకుంటాడు. బుద్ధగయలో ఓ పురాతనమైన రావి చెట్టు ఉంది. గౌతమ బుద్ధుడు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందిన రావి చెట్టు అదేనని కొందరు చెబుతారు. అందుకే బౌద్ధ విహారాలలో రావి మొక్కలు నాటే సంప్రదాయం ఉంది.
నవగ్రహ వృక్షాలలో రావి చెట్టును బృహస్పతికి ప్రతిరూపంగా భావిస్తారు. బృహస్పతి అంటే ‘గురువు’ అని అర్థం చేసుకోవాలి. గురువు అనుగ్రహం ఉంటేనే మనకు విద్యాబుద్ధులు అబ్బుతాయి. చాలా దేవాలయాల్లో రావి చెట్టును పెట్టుకోవడం ఒక ఆనవాయితీ. ఈ రావి చెట్టు కాండానికి పసుపు, కుంకుమ పూసిన దారాన్ని .. మంత్రం జపిస్తూ కట్టడం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల కుటుంబం అంతా క్షేమంగా ఉంటుందని నమ్మకం. వినాయక చవితి నాడు పత్రిలో భాగంగా పూజ కోసం రావి పత్రాలను వినియోగిస్తారు.