చంద్రహత్థికి పోటిసుని మీద గల ప్రేమను రాయహత్థి అర్థం చేసుకున్నది. ఆమెను పోటిసునికి పరిచయం చేస్తుండగా ఒక యువకుడు వచ్చి చంద్రహత్థి తన భార్య అంటాడు. సిరిసత్తి కోడలు రోహతో జ్యోతిషాలు, సాముద్రికాలకు భయపడ నవసరం లేదని చెబుతుంది. తర్వాత…
పోదన నగరంలో… ఇంద్ర భవనం లాంటి తన ఇంటిలో, సకల సుగంధాలు, పన్నీరు కలిపిన గోరువెచ్చని నీటితో తలారా స్నానం చేసింది రోహ. ఇప్పటికీ ఆమెకు ఇదంతా నిజం అన్న నమ్మకం కలగడం లేదు. వచ్చిన క్షణం నుంచి తన పెనిమిటిని చూసేందుకు ఆమె తనువు, మనసు తహతహలాడుతున్నాయి. అంతలోనే తమకిద్దరికీ జరిగే తొలిరేయి వేడుకలోనే అతణ్ని తొలిసారి చూడాలని; సిగ్గుతో బరువెక్కిన తన శరీరాన్ని అతని కౌగిట తేలిక చేసి, అతను ఎత్తుకొని ముద్దాడి చేసే చిలిపి పనులు… “రోహా!” ఆ పిలుపుతో ఉలిక్కిపడింది రోహ. ఎదురుగా ఆయనే! తల ఎత్తి చూసేందుకు ధైర్యం చాలడం లేదు… ఎంతగా ఎదురుచూసిందో అంతగా కుంచించుకొని పోతున్నది. తానెంత ప్రయత్నించినా, కనులెత్తి చూడలేక పోతున్నది. ఆయన పాదాల మీదనే దృష్టి ఆగిపోయింది. ఆయన పాదాలకు రెండవ, మూడవ వేళ్లు సమానంగా ఉన్నాయి. అట్లా ఉంటే అదృష్టవంతుడు, శృంగార పురుషుడు, మహావీరుడట… ఎవరో అనుకుంటుంటే విన్నది.
“రోహా!” మరోసారి అతని పిలుపు! ప్రేమనంతా ముద్దగా చేసి మనసుకు అద్దుతున్న అనుభూతి. అది తనువంతా పాకి, పులకాంకురాలను నింపింది. ఎంతమంది ఎన్నిసార్లు తనను అట్లా పిలువలేదు?! తన చెల్లి అయితే అప్పుడప్పుడూ ముద్దు పెట్టుకుంటూ పిలిచేది. పిచ్చిది! ఎంత బతిమిలాడినా తనవెంట రాలేదు. వచ్చి ఉంటే తన ఈ అదృష్టం చూసి ఎంత సంతోషపడేదో! చూడకున్నా, తన అనుభవాలన్నీ దాంతో పంచుకునేది కదా! తన భయాలు, అనుమానాలన్నీ తొలగిపోయినాయి. పెనిమిటితో అనునిత్యం… “రోహా!”.. మళ్లీ పిలిచినాడు. మారు పలకకుంటే అమర్యాదగా భావిస్తాడేమోనని వెంటనే.. “ఊఁ” అన్నది. అన్నదో, లేదో… అంటే అతనికి వినిపించిందో, లేదో… అనుమానమే! మెల్లమెల్లగా తల ఎత్తి అతణ్ని చూసేందుకు ఆమె ఎంత తీవ్రంగా ప్రయత్నించినా ఫలించలేదు. భయం-సిగ్గు, చమటగా మారి ఆమెను నిలువెల్లా ముంచెత్తుతున్నాయి. నిస్సహాయ స్థితిలో… ఇక పడిపోతానేమో అనుకుంటుండగా బలమైన అతని చేతులు భుజాల కిందుగా వచ్చి ఆమెను పట్టుకున్నాయి.
ఒళ్లంతా జల్లుమంది ఆమెకు. శ్రుతి చేసిన వీణను మీటిన అనుభూతి. ఇప్పుడు మరింతగా సిగ్గు ఆమెను కబళించడం మొదలుపెట్టింది. అతడు ఊరుకునేటట్లు లేడు… పైకెత్తి, గట్టిగా గుండెకు హత్తుకున్నాడు. ఆ క్షణాలు అట్లానే స్తంభించిపోతే బాగుండును అనిపించింది. అట్లా ఎంతసేపు ఉన్నదో తెలియదు. క్రమక్రమంగా సిగ్గు స్థానంలో ధైర్యం పరుచుకుంటుంటే మెల్లగా అతణ్ని విడిపించుకుంటూ కనులెత్తి చూసింది… కెవ్వుమని అరిచింది ఒక్కసారిగా! అతని ముఖం భయంకరంగా ఉంది. స్పృహ తప్పి పడిపోయింది రోహ. ఎవరో మొహం మీద నీళ్లు చిలకరించినారు. భయంతో వణుకుతూ కనులు తెరిచింది. ఎవరో నల్లపిల్ల! అందంగానే ఉన్నది. “చిన్న రాణిగారూ! ఏమైందమ్మా…” దాని గొంతులో ఆందోళన. “ఎవరు నీవు? ఏం జరిగింది?” గుర్తుకు తెచ్చుకుంటూ ఆ పిల్లనూ, పరిసరాలనూ పరికించి చూసింది రోహ. “అమ్మా! నా పేరు అలసుద్ది. ఈ ఇంట్లో మీ దాసిని” అంటూ ఒక వెండి చషకంలో చల్లని నీళ్లు ఇచ్చింది తాగడానికి. జరిగిన సంఘటన వీగిపోతుంటే… అదంతా కల అనే విషయం అర్థం కాసాగింది రోహకు.
నీళ్లు తాగుతూ ఉండగా అడిగింది అలసుద్ది.. “అమ్మా! కలగన్నారా?” అవుననలేదు; కాదనలేదు రోహ. ఆమె ఆలోచనలన్నీ ఆ కలను నెమరువేసుకో సాగినాయి. ‘ఆయన అందగాడే కదా! నాకెందుకు అలా కనిపించినాడు? పురోహితుడు చెప్పిన మాట నిజం కాబోతున్నదా? ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఆయనను కలుసుకోకుండా ఉండటం సాధ్యమా?’ అని పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. సరిగ్గా అదే సమయంలో.. ఆ భవనంలోని సిరిసత్తి మందిరంలో… “అది ఇప్పుడు అసంభవం తల్లీ!” అన్నాడు జయసేనుడు. కొడుకు మాటలతో ఉలిక్కిపడ్డది సిరిసత్తి. ‘మల్లికాపురిలో అయ్యవారు అన్నట్లు తనకు, తన కుటుంబానికి చెడు రోజులు దాపురించినాయా!?…’ అన్న సందేహం ఆమె మనసును కుదిపేస్తుండగా.. “ఇప్పుడు కాదంటే ఎట్లా నాయనా? నా కోడలికి ఎన్నో ఆశలు కల్పించి ఇక్కడికి తీసుకొచ్చినాను. ఆ పిల్ల కూడా ఎన్ని కలలు గంటున్నదో… ఈరోజు కాదంటే పున్నమి దాకా మంచి రోజు లేదంట”.. ఆమె మాటల్లో ఆందోళన స్పష్టంగా తెలుస్తున్నది.
“అమ్మా! వాస్తవాల్లో జీవించడం అలవాటు చేసుకో! ఈ శుభాశుభ సమయాలు, ముహూర్తాలు ఏదో సౌకర్యం కోసం ఏర్పరచుకున్నవే. అయినా మరో వారం రోజుల్లోనే పున్నమి. ఒక్క వారం ఆగలేమా? నాయన రావలెనా? వద్దా?” సూటిగా అడిగిన కొడుకు మాట సిరిసత్తి గుండెకు బాణంలా తగిలింది. నిజమే! ఆయనను తీసుకొని రమ్మని పంపిన పోటిసుడు ఈపాటికి రావాలి. ఇంకా రాలేదంటే… అక్కడ ఏం జరిగిందో! వాడు ఆయనను చేరుకున్నాడో లేదో! ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో! “నాయన రాకుండా ఈ కార్యం ఏర్పాటు చేయడం సరైనదేనా? చెప్పమ్మా!” మళ్లీ అడిగినాడు జయసేనుడు. తల్లి సమాధానం చెప్పకపోవడంతో, కొనసాగిస్తూ.. “పోటిసుడు నిన్న ఉదయమే రావలసినవాడు, ఈ సాయంత్రానికి కూడా రాలేదు; నాయన గారు కూడా రాలేదు. వాడు నాయనను ఇంకా కలిసి ఉంటాడో, లేదో! అసలు వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో…”
* * *
ఆ మొరటు మనిషి అడిగిన ప్రశ్న ముగ్గురినీ మూడు రకాలుగా ఆలోచింపజేసింది… ‘వీడు ఎందుకు దాపురించినాడు ఇప్పుడు?’ భయంతో గుండె వేగం పెరిగింది చంద్రహత్థికి. ‘ఓహో! ఈ పిల్లకు పెళ్లయిందా? నాకు దగ్గరవుతుంటే నేనేదో ఊహించుకున్నానే…’ ఏదో విరక్తి పోటిసుని పెదవులను తడుముతూ వెళ్లింది. ‘ఈ తాగుబోతు సన్నాసికి వేరే పనిలేదు. నాలుగేండ్ల నాడు తల్లిదండ్రులు వద్దంటున్నా వినకుండా బుద్ధదేవుని శిష్యుల గుంపులోనికి వెళ్లినాడు. అక్కడ ఏం తిక్క పని చేసినాడో! తన్ని తరిమేసినట్లున్నారు. ఇప్పుడు కనిపించిన ఆడవాళ్ల వెంట కుక్కలా తిరుగుతున్నాడు. ఎంతమంది ముఖం మీద ఉమ్మేసినా, వాడు నానాటికి దిగజారుతున్నాడే కానీ బాగుపడడం లేదు’ అని గుర్తు చేసుకుంటూ… “అరేయ్! ఎవర్రా నీకు పెండ్లాం? చీపురుగట్ట తిరగేసి తంతే, దాంతోనే నీ పెండ్లి అవుతుంది” అంటూ చేరువలోని చీపురును అందుకొని లేచింది రాయహత్థి. “అక్కా! ఎప్పటికైనా అది నా పెళ్లామే! చూస్తా ఉండు…” అనుకుంటూ అక్కడి నుండి వేగంగా కదిలినాడు ఆ తాగుబోతు. వాని పేరు కటిలుడు. వాడు పోయిన పిదప పోటిసునికి అంతా చెప్పింది రాయహత్థి.
“సన్యాసుల్లో చేరబోయిన ఈ కటిలుడి తల్లి వాని మీద కుదెం (బెంగ)తో ప్రాణాలు వదిలింది. తండ్రి వేరే మనువు చేసుకున్నాడు. ఈ సన్నాసి గాడికి తల్లితోపాటు, ఉన్న ఆస్తి కూడా అందక రెంటికి చెడ్డ రేవడి లాగా ఇట్లా తిరుగుతున్నాడు” పోటిసుని ముఖాన్ని ఆవరించిన అనుమానం మబ్బులు తొలగిపోయినాయి. మొదటిసారి చంద్రహత్థిని ప్రేమగా చూసినాడు. ఆ చూపులో చంద్రహత్థి పట్ల ఆరాధనతోపాటు కృతజ్ఞత కూడా దండిగా ఉన్నది. ఆ క్షణాల కోసమే ఎదురుచూస్తున్న చంద్రహత్థి సిగ్గుతో మొగ్గయింది. అక్కడ ఉండలేక, లోపలికి పోయింది. ఆశ్చర్యం, విస్మయం, ఆనందం కలిగింది రాయహత్థికి. దాని వెంటనే వెళ్తూ.. “ఇదేమి చెల్లెలా? ఇన్ని రోజులు నా మరిది నిన్ను ఎప్పుడు చూస్తాడా, ఎప్పుడు మాట్లాడతాడా… అని తహతహలాడినావు. ఇప్పుడు చూడగానే పారిపోతున్నావు? నీ మనసులో ఏమున్నదో చెప్పు! కొన్ని సంగతులు చెప్పవలసిన సమయంలో చెప్పకపోతే దిద్దుకోలేని తప్పులు జరిగిపోతాయి” అంటూ, మళ్లీ పోటిసుని వద్దకు తీసుకొచ్చింది. ఆమె చివరి మాట చంద్రహత్థిని మాట్లాడేటట్లు చేసింది. అది మాటలను పేర్చుకుంటూ… లో గొంతుకలో ఇట్లా అన్నది..
నీ దయతో మేమిప్పుడు నాదరముగ నున్నవార మందాల సఖా! మోదము నీ విట నుండుట కాదనకుము నీకు మనసు, కాయము నిడుదున్! (నీ దయవల్లనే మా మానప్రాణాలు నిలబడి గౌరవంగా బతుకుతున్నాం. నీవు ఇక్కడనే ఉంటే మాకెంతో ఆనందం. దయచేసి కాదనకు! ఈ మనసు, తనువూ నీవే సుమా!)” “ఇప్పుడు అర్థమైందా దాని మనసు? నీవు మమ్ములను కాపాడిన క్షణం నుంచి దీపం కింద నీడలా నిన్ను విడవకుండా అంటిపెట్టుకొని ఉన్నది. మరి నీ మనసులో ఇంకెవరన్నా ఉన్నారా?” సూటిగా అడిగింది పోటిసుణ్ణి రాయహత్థి. కొన్ని క్షణాల తర్వాత… పోటిసుని పెదవులు కలవరించినట్లు అన్నాయి.. “అ…ల…సు…ద్ది” అతని నోటి వెంట వచ్చిన మరో ఆడదాని పేరు విని ఉలిక్కిపడింది చంద్రహత్థి. ఆలోచనలో పడ్డది రాయహత్థి.
“అమ్మా! వాస్తవాల్లో జీవించడం అలవాటు చేసుకో! ఈ శుభాశుభ సమయాలు, ముహూర్తాలు ఏదో సౌకర్యం కోసం ఏర్పరచుకున్నవే. అయినా మరో వారం రోజుల్లోనే పున్నమి. ఒక్క వారం ఆగలేమా? నాయన రావలెనా? వద్దా?” సూటిగా అడిగిన కొడుకు మాట సిరిసత్తి గుండెకు బాణంలా తగిలింది. నిజమే! ఆయనను తీసుకొని రమ్మని పంపిన పోటిసుడు ఈపాటికి రావాలి. ఇంకా రాలేదంటే… అక్కడ ఏం జరిగిందో!?