… ఇంతట్లో హెలెన్ అనే అమ్మాయి…“ఏమి అందంగా ఉందే ఈ గుడి! ఏమి అందంగా చెక్కాడు నందుల్ని! ప్రతి స్తంభంపైనా తనకున్న కళంతా ధారపోసి నాట్యంచేసే ఈ స్త్రీల విగ్రహాలను చెక్కినవాడు ఎంతటి మహాశిల్పో కదా!”
సుసి: “రాతిలో చెక్కాడా, రాతిని కరిగించి పోత పోశాడా?”
నెల్లి: “ఇవి రాతిబొమ్మలు కావర్రా శాస్త్రజ్ఞానం అంతా కనబరచి ఇనుము కరిగించి తయారుచేసిన బొమ్మలు గాని!”
మేరీ: “ఆ దేహ రేఖలు, ఆ శరీర సౌష్టవం, ఆ విచిత్ర భంగిమ, ఆ రాతితనంలోని నలుపును మరపింపజేస్తున్నవి కదా, రక్తం పోటెత్తుకు వస్తూ, స్నిగ్ధమై, సిక్తమయిన ఆమె శరీరమే కనబడుతోంది. ఈ వేళ్ళతో ఆమెను అంటుకొంటే ఆమె ఎంత మార్దవంగా ఉంటుందో!”
మేరీ అప్పుడు వెనక్కి తిరిగిచూసింది.
విశ్వేశ్వరరావు దూరంగా ప్రాకారపు గోడ దగ్గర నిలబడి, వాళ్ళ సంభాషణ వింటూ తెల్లవాళ్ళ మీద ద్వేషం ఒక నిముషం మాత్రం మరచిపోయి భారతీయ కళను నిర్మల హృదయంతో అభినందిస్తున్న వాళ్ళ మాటలలోని పూజ్యభావానికి సంభ్రమించిపోయాడు. మేరీ వంక తదేకదీక్షతో చూస్తున్నాడు. అప్పుడాతని మోములో ఆశ్చర్యానందవర్ణాలు తప్ప, ద్వేష వైవర్ణ్యం ఏమీ గోచరించడం లేదు. ఒక చిరునవ్వు ఒక చిన్న మేఘంలోని చిరుమెరుములా కలకలమంటున్నది. ఆ సమయంలో మేరీ అతణ్ని చూసింది.
పెద్దపులో, తాచుపామో, పిశాచమో అని అనుకొని భయంపడ్డ ఆ బాలికకూడా అతనికి తెలియకుండానే, అతణ్ని ఆవరించిన ఆనందజోత్స్నను చూచి ఆశ్చర్యహృదయయైనది. ఆ క్షణంలో ఉన్నతరూపుడై గంభీర రేఖా సమంచితుడైన అతని రూపం అతణ్ని ఆమెకు దివ్యుణ్నిగా కనపర్చింది. సుమనస్కయైన ఆ పాశ్చాత్యబాలకు విశ్వేశ్వరుని హృదయం ప్రస్ఫుటంగా ద్యోతకమైంది. ఆమెకప్పుడు గుడిలేదు. హిందూ దేశం లేదు. ఇంగ్లండు లేదు. కాలపథాలలో ఒకయెడ మధురిమలు ఆవహించిన యువతి ఆమె… దూరదూరాన ఆ మహా నిర్జన స్థలంలో దివ్యుడయిన పురుషమూర్తి అతడు. ఆమె బుద్ధినుంచి జాతి తెరలు పటపటమని క్రిందకు జారి కూలిపడిపోయినవి.
– అడవి బాపిరాజు రచించిన ‘ద్వేషము’ కథలో రామప్పగుడి ప్రస్తావన