Ramaayanam | కృష్ణాతీరం నుంచి మా ఇంటికి వచ్చిన ఆ గురువుగారి నాట్యం చూడగానే.. నాకూ కూచిపూడి నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగింది. అదే విషయం అమ్మకు చెబితే.. ఎప్పటిలాగే విస్తుపోయి చూసింది. ‘చప్పుడు జెయ్యకుండ.. మంచిగ చదువుకో చాలు” అన్నది కచ్చితంగా.
దాంతో నాకు ఉక్రోషం వచ్చింది. “అరె! నేను క్లాసులో ఫస్టు వొస్తలేనా?! ఇంకేంది?! మనింటికి ఒచ్చేటాయన దగ్గర నేర్చుకుంట!” అన్నాను తేల్చేస్తూ. “ఓహో! ఆయినను చూసి అనుకున్నవా?! నీకు ఆయన నేర్పొద్దా కూచోబెట్టి ?!” అన్నది అమ్మ ఎగతాళిగా. “ఎందుకు నేర్పడు?! అయినా డాన్సు కూచోబెట్టి నేర్పరు.. నిలబెట్టి నేర్పిస్తరు!” అన్నాను. “నీకు మాటలు ఎక్వ అయినయ్ గానీ, బడి టైం అయింది పో !” అని అప్పటికి అమ్మ నన్ను కంట్రోల్ చేసింది గానీ, నేను ఆరోజు నుంచీ అయిదారు రోజులు అమ్మనూ, నాన్ననూ బాగా సతాయించాను.
‘తద్ధిత్తక ధినతాం.. తకద్ధిత్తక ధినతాం.. ధిత్తక ధినతాం’ అంటూ సమయం సందర్భం లేకుండా నాదైన శైలిలో పాడటం మొదలుపెట్టాను. “నీ నట్టువాంగం చట్టుబండలైనట్టే ఉన్నది. నేనేం చెయ్యలేను. నీ ఇష్టం, మీ నాన ఇష్టం” అన్నది అమ్మ. అమ్మకు ఇష్టమైతే ఎలాగైనా టేకప్ చేసేది గానీ.. ఇది ఇష్టం లేదని అర్థమైంది. ‘మంచివాడులే మా నాన్న.. మా మాటే వింటాడోయీ’ అని పాడుతూ.. నాన్నను సతాయించడం మొదలుపెట్టాను. నాన్నకు కూడా పెద్దగా ఇష్టం లేకపోయినా, నా గోల పడలేక ఆ మర్నాడు.. “మా అమ్మాయి మీ దగ్గర నాట్యం నేర్చుకుంటనని ఉబలాట పడుతున్నది. నేర్పడానికి మీకు వీలు పడుతుందా?!” అని అడిగాడు. దానికి ఆయన.. “నేర్పడానికేముందండీ! సంతోషంగా నేర్పుతాను. కాకపోతే నాకు భోజనానికి, ఉండటానికి వసతి, నెల జీతం ఏర్పాటుచేస్తే ఉండగలను. మీరొక్కరూ అంత ఖర్చు భరించలేరు. మీ ఇద్దరమ్మాయిలతోబాటు మరో పదిమంది నేర్చుకుంటే బావుంటుంది. నేను అప్పుడప్పుడూ మా ఊరికి వెళ్లి వస్తుంటాను” అన్నాడు.
నేను ఎగిరి గంతేశాను. ఆ రాత్రి నేను ఎల్.విజయలక్ష్మిలా చకాచకా అడుగులు వేస్తూ.. నాట్యం చేస్తున్నట్టు కలొచ్చింది కూడా. ఆ మర్నాడే బడిలో ఎంతో ఉత్సాహంతో మా క్లాస్మేట్స్ని అడిగాను.. ‘ఎవరైనా నాట్యం నేర్చుకుంటారా!?’ అని. “మా ఇంట్ల గీ ఇంత చదువుకుంటున్నదే నేను. మా అక్కలందరికీ జల్దీ పెండ్లిళ్లు జేసిన్రు. ఇదే ఎక్వ అంటే.. ఇంక డాన్సు నేర్పిస్తారు?! ఉత్త ముచ్చట” అన్నది నా క్లోజ్ ఫ్రెండు.
“ఇంక నయ్యం.. నేనైతె బడికి ఒచ్చేటప్పుడు తలకాయ దించితె మళ్ల ఇంటికి పోయినాకనే తలకాయ ఎత్తుడు. ఇగ డాన్సు అంటె కాళ్లు ఇరగ్గొడుతడు మా బాపు. వామ్మో!” అన్నది ఇంకో ఫ్రెండు. “మా ఇంట్లనైతె ఆరునెల్ల పరీక్షల దనుక పుస్తకాలే కొనరు. వాళ్లను, వీళ్లను అడుక్కోని చదువుడు. ‘స్కూలు డ్రెస్సు లేకుంటె ఏంది? ఏదుంటె గది ఏస్కపో!’ అంటరు. మా అక్కకు పొట్టిగైన బట్టలే నాకు దిక్కు. ఇగ డాన్సులు నేర్పిస్తరానుల్లా?!” అంది మరొక దోస్త్. “ఏం బాగుంటదబ్బా.. అందరు జూస్తుంటె గంతంత పెద్దగ అయ్యి మనం ఎగురుతుంటె! మా ఇంట్ల సంగతి ఒదిలిపెడ్తె.. నాకైతె సిగ్గయితది” అన్నది మరో అమ్మాయి. “అయితె సిగ్గు పడుకుంటనే ఉండు!” అన్నాను కోపంగా. మా క్లాసులో ఇంకొక అమ్మాయి తన వయసుకి మించి మాట్లాడేది, నీతులు చెప్పేది. ఆమె అయితే.. “ఏయ్ రమా! నీకొక మాట జెప్తనోయ్.. ఏమనుకోవద్దు” అని కొండంత ముచ్చట పెట్టి.. “మా మామయ్య అయితే ఏమంటడో ఎరికేనా?!” అన్నది. “మీ మామయ్య ఏమంటడో నువ్వు చెప్పకుండ నాకెట్ల తెలుస్తది?!” అన్నాను చిరాగ్గా. నాకసలే ఒక్కరైనా సపోర్ట్ లేరని కోపం వస్తున్నది. “మనం ఏది కావాల్నన్నా అమ్మ నాన్నలను అడిగి వాండ్లను కష్టపెట్టొద్దట తెలుసా?! మనం మంచిగ చదువుకొని, పెద్ద ఉద్యోగం చేసి.. అప్పుడు మనకు కావాల్సినయి కొనుక్కుంటె మస్తు సంతోషం అయితదట!” అన్నది. “ఆహాఁ.. గప్పటిదాక మరి నీకేమన్న కావాల్నంటె మీ పక్కింట్ల వాండ్లను అడుగుతవా? మీ మామయ్యను అడుగుతవా?! అయినా గూడ మనం ఉద్యోగం జేసేటంత పెద్దగ అయినాక డాన్సు ఎవరు నేర్పుతారు?!” అన్నాను. సూక్తిముక్తావళి ఏమీ మాట్లాడలేదు గానీ నన్ను కటీఫ్ చేస్తదనిపించింది.
అన్నానే గానీ.. నా క్లాసుమేట్స్తోబాటు బీ సెక్షన్ వాళ్లనూ, సీనియర్స్నూ, మా జూనియర్స్నూ, మా కజిన్స్నూ అడిగాను. బతిమిలాడాను. కానీ, మిగతా కారణాలెలా ఉన్నా.. ఎవ్వరి తల్లిదండ్రులూ అంత డబ్బు పెట్టడానికి సిద్ధంగా లేరనే విషయం నాకు అర్థమైంది.
“ఏమైంది?! డాన్సు నేర్చుకునేటందుకు ఎంతమందిని తయారు జేసినవ్?!” అని అమ్మ రోజూ నవ్వు దాచుకుంటూ అడిగేది. నాకు మరింత ఉక్రోషం వచ్చేది. చివరికి ఆ కూచిపూడి నుంచి వచ్చినాయన అన్ని వేషాలూ వేసి ఇక అయిపోయాయేమో.. డబ్బులు అడిగి “అమ్మాయి ముచ్చట పడుతున్నది గానీ, ఓ పదిమందైనా ఉంటే బావుంటుంది. దొరికితే ఓ కార్డు ముక్క రాయండి!” అంటూ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.
ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు గానీ, నేనే ఏమీ చేయలేక.. ‘డాన్సే నేరమౌనా?! నాపై ఈ పగేలా?!’ అని పాడీపాడీ ఊరుకున్నాను. “నీ పైసలు మీ నాన ఇయ్యకుంటె నేనన్న ఇద్దును గానీ, వేరే ఆడ పిలగాండ్లు ఒద్దనిరి. ఏం జేస్తం? ప్రాప్తి లేదనుకోవాలె..” అంటూ నానమ్మ నన్ను ఓదార్చింది. నానమ్మకు ఉన్న కళాభిరుచి వీళ్లకు లేకపోయే.. అనుకున్నాను.
ఆ తరువాత నేను ఇంటర్ చదివే రోజుల్లో హైదరాబాద్ రవీంద్రభారతిలో మా కజిన్ దేవానంద్ అన్నయ్య వాళ్ల కళాసంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మొదట ‘శాంతి వేదాంతం’ అన్నావిడ చేసిన కూచిపూడి నృత్యం ముందువరుసలో కూర్చుని చూశాను. చెప్పరానంత సంతోషం కలిగింది. ఇక ఆ తరువాత రోజుల్లో శోభా నాయుడుగారి నృత్యంతోబాటు మరెందరివో నాట్య ప్రదర్శనలు చూశాను. ఇటు కూచిపూడి, అటు భరతనాట్యంతోపాటు ఆంధ్రనాట్యం కూడా చూసే భాగ్యం కలిగింది. సినిమాల్లోనూ, బయట కూడా నాకు క్లాసికల్ డాన్సులు ఎక్కువ ఇష్టం. అప్పుడప్పుడూ అనుకుంటాను.. దేనికైనా అదృష్టం కూడా ఉండాలి అని!!
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి