Ramayanam ; పిచ్చోడొస్తడు, పట్కపోతడు. బూచోడొస్తడు, ఎత్కపోతడు. దయ్యమొస్తది, పిచ్చి వేషాలేస్తె నిన్ను మింగుతది!’ లాంటి మాటలతో అమ్మ ఎప్పుడూ నన్ను భయపెట్టిన జ్ఞాపకం లేదు. అందుకనే చీకట్లో వెళ్లాల్సి వచ్చినా, ఒంటరిగా వెళ్లినా నాకు చిన్నప్పట్నుంచీ భయం ఉండేది కాదు.
అయితే, బాగా చిన్నప్పుడు నేనూ, అక్కా ఓచోట కూర్చుని ఆడుకుంటున్నప్పుడో, రాసుకుంటున్నప్పుడో అక్క హఠాత్తుగా కనురెప్పలు లోపల ఎర్రగా కనిపించేలా పైకి మడిచిపెట్టి, నాలుక బయటికి చాచి.. “ఏయ్! ఇంటున్నవా.. లేదా?! నేను మీ అక్కను గాదు, దయ్యాన్ని! మీ అక్కను మింగి నేనొచ్చిన. చెప్పినట్టు ఇనకపోతె నిన్ను గూడ మింగుత!” అని భయపెట్టేది. నేను నిజంగానే ఝడుసుకునేదాన్ని. “అక్కా అక్కా! ఏమననక్కా! ప్లీజ్.. నన్ను మింగొద్దు. నాకు దయ్యమొద్దు, నువ్వే కావాలె!” అని వణుకుతూ బతిమిలాడేదాన్ని. “అగో! నేను మీ అక్కను కాదంటుంటె మళ్ల ‘అక్కా!’ అని పిలుస్తవ్?! నేను దయ్యాన్ని!” అనేది. తను దయ్యం కాదని లోలోపల తెలిసినా.. నాకు నిజంగానే భయమేసేది. ఎందుకంటే.. బాలనాగమ్మ, పాతాళ భైరవి, కీలుగుర్రం లాంటి సినిమా కథలు మా మేనవదిన చెబుతుంటే విన్న అనుభవం ఉంది. అందులో మనుషులే అప్పుడప్పుడూ శాపవశానో, మంత్రాల మహిమ వల్లనో జంతువుల్లా, దయ్యాల్లా మారడం జరుగుతుండేది. అందుకని నిజమేనేమో అనిపించేది అప్పుడప్పుడూ.
ఈలోగా నా పుణ్యం పండి (పాపం గదా పండేది.. ఏమో!) అటుగా అమ్మ వచ్చి సంగతి తెలుసుకునేది. “దయ్యం లేదు, భూతం లేదు. రెండు దెబ్బలేస్తే అన్ని ఒదులుతయి. ఎవరు చెప్పిన్రు నీకు ఇట్ల అనాల్నని?! దానికి జడుపు జరం ఒస్తెట్ల?!” అని అక్కను కోప్పడేది.
నా అయిదేళ్ల వయసులో మా ఇంటి ముందు పశువుల కొట్టం స్కూలు కాస్తా.. అర కిలోమీటర్ దూరంలో ఉన్న వేరే ఇంటికి మారింది. నేనూ, అక్కా బడికి నడిచే వెళ్లేవాళ్లం. రాధమ్మ అనే ఓ వ్యవసాయ మహిళ పొలానికి వెళ్లి వచ్చే సమయం.. మా బడి వేళలు ఒకటే. ఆమెకు నేనంటే తెగ ఇష్టం. ఎంతిష్టం అంటే నన్ను దారిలో దొరకపుచ్చుకుని గట్టిగా అణగపట్టి రెండు బుగ్గలూ ముద్దు పెట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేసి గానీ వదిలేది కాదు. ఆమె అంతదూరంలో వస్తున్నదంటేనే.. నాకు గుండెల్లో వణుకు పుట్టేది. పైగా.. “ఒస్తున్నా.. ఒస్తున్నా.. ఒచ్చె ఒచ్చె!” అని ఆమె అంటూంటే.. “ఒద్దు.. ఒద్దు” అని ఏడ్చేదాన్ని.
ఈ విషయం అమ్మకు చెప్పాను. ఓ సారి రాధమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ.. “ఏంది రాధమ్మా! పిల్లను భయపెడ్తున్నవట!” అనడిగితే ఆమె నవ్వి.. “ఏ.. నేనెందుకు బయపెడ్త దొర్సానీ! ముద్దుగుంటరు.. జర ఒక్కముద్దు పెట్టుకుంట గంతే! నాకియ్యండి.. తీస్కపొయ్యి సాదుకుంట” అన్నది. “సరే తియ్యి” అని అమ్మ జవాబిచ్చింది. నన్ను ఆమెకు ఎక్కడ ఇచ్చేస్తుందో అని నాకు భయమేసి అమ్మతో.. “ఒద్దమ్మా! నేను పోను. నీ దగ్గర్నే ఉంట!” అని అమ్మ చీర కుచ్చెళ్లలో తల దాచుకున్నాను.
అమ్మ నవ్వి.. “ఆమె అంటె మాత్రం నేనిస్తనా?!” అని నాకు అభయమిచ్చాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నా పదేళ్లప్పుడు అక్క కోసం తనవెంట నేనూ ట్యూషన్‌కు వెళ్లేదాన్ని. మా ఇంటి నుంచి అరకిలోమీటరు పైనే ఉండేది సారు ఇల్లు. మధ్యలో చెరువు కట్ట, దాన్ని ఆనుకునే శ్మశానం, దాని మరోపక్కగా బోలెడు చింతచెట్ల మధ్యలోంచి నడిచి మా ఇంటికెళ్లాల్సి వచ్చేది. అక్కడ బాగా చీకటిగా ఉండేది కూడా. ఆ యేడే మా మేనత్త వాళ్లు ఇక్కడ ఇల్లు కట్టుకుని హనుమకొండ నుంచి షిఫ్ట్ అయ్యారు. వాళ్లిల్లు దాటుకునే ట్యూషన్‌కు వెళ్లాలి. ఓ ఆదివారం మా దేవ్బావ తాను హనుమకొండలో చూసిన ‘డ్రాకులా’ ఇంగ్లిష్ సినిమా కథ చెప్పాడు మాకిద్దరికీ. చెప్పడమే కాదు.. మేము ట్యూషన్ నుంచి చీకటిపడ్డాక ఇంటికి వెళ్తుంటే.. వాళ్లింటి ముందు నిలబడి ‘డ్రాకులా’ కథ మాకు గుర్తుచేసి.. “మీరు పోయే తోవలో డ్రాకులా ఒస్తడు చూడండి. మీ ఇద్దర్నీ పట్టుకొని, వాడి కోరపళ్లతో మెడ మీద కాటు ఏసి రక్తం పీలుస్తడు మరి. జాగ్రత్త! చూసుకోండి” అని చెప్పి భయపెట్టేవాడు. ఇక మా గుండెల్లో ఒకటే దడదడ. పైగా, పొద్దటిపూట మామూలుగా ఉండే పరిసరాలు రాత్రి దగ్గర పడుతున్న కొద్దీ నల్లగా, చిక్కని చీకట్లతో.. పక్షుల శబ్దాలతో భయం గొల్పేవిగా ఉండేవి. అమ్మతో చెబితే.. “ఎవ్వరేం జెబితె మీకేంది?! గవే చెట్లు, గదే చెరువు, గదే బాట, భయమెందుకు?! కావాల్నంటె ‘ఆంజనేయ దండకం’ చదువుకోండి” అన్నది. మేము దాన్నే అనుసరించి చింతచెట్లు రాగానే ఒకరి చేతులు ఒకరం పట్టుకొని.. “శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం” అని గట్టిగా చదువుకుంటూ పరిగెత్తేవాళ్లం. కొన్నాళ్లకు ఆ భయం పోయింది.
మరి కొన్నేళ్లకు నా ఇంటర్ పూర్తయిన తరువాత సెలవుల్లో మా ఊరి థియేటర్లో నేనూ, అక్కా, మా కజిన్స్ వకుళక్క, రాగక్క కలిసి “పున్నమి నాగు” సినిమా చూశాం. చూసినప్పుడు బాగానే చూశాను గానీ.. ఇంటికొచ్చాక ఆ రాత్రి భయంతో నిద్ర పట్టలేదు. ఏ కిటికీలోంచో పాము కళ్ల చిరంజీవి వచ్చి పిలిస్తే అలా వెళ్లి చచ్చిపోతానేమో అని భయంతో వణికిపోయాను. అసలే చిరంజీవి కళ్లు చాలా షార్ప్! అందులోనూ పాములకు ఉన్నట్టు నీలి కళ్లు, కిటికీలోంచి చూసినట్టే అనిపించి దడుసుకున్నాను. అమ్మ దగ్గరికి వెళ్లి తనను గట్టిగా కరుచుకుని పడుకుంటే.. “ఏం భయమే నీకు? చప్పుడు చెయ్యక కండ్లు మూసుకొని పండుకో! నిద్ర అదే ఒస్తది” అనేది. నాకు కళ్లు మూస్తే చాలు.. ‘పున్నమి రాత్రి.. పువ్వుల రాత్రి! వెల్లువ నాలో.. పొంగిన రాత్రి’ అంటూ నాగులు నా పక్కనే నిలబడి పాడినట్లయి వణుకు పుట్టేది. చిరంజీవి తన ఒంటిమీది నుంచి పొలుసుల్ని తీసే దృశ్యం పదేపదే నన్ను వెంటాడింది. ఇప్పుడు అలాంటి భయాలేవీ లేవు గానీ.. ఆడపిల్లల మీద భయంకరంగా, జుగుప్సాకరంగా, అసభ్యంగా, అశ్లీలంగా జరుగుతున్న మాటల, చేతల దాడులు,అత్యాచారాలు, హత్యలు చూస్తూంటే.. ‘మనం ఎటు వెళ్తున్నాం!?’ అని భయమేస్తున్నది.
-నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి