Ramaayanam | అమ్మ ఎన్నో పద్యాలు చక్కగా పాడేది. ఏ పత్రికయినా, చిత్తు కాగితం ముక్కయినా, పొట్లం కట్టిన పేపరైనా ఎంతో ఆసక్తిగా చదివేది. ఆమెకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. చదివిన కథలు మాకు పొల్లుపోకుండా చెప్పేది. కథ చెప్పడం ఒక కళ. అది అమ్మ దగ్గరే నేర్చుకున్నాను.
“నేను పుస్తకాలు చదవడం ద్వారానే ఎన్నో నేర్చుకున్నాను” అనేది అమ్మ. నవలలు, కథలు, సినిమాల గురించి, పాత్రల స్వభావాలు, మనస్తత్వ చిత్రణ గురించి, పాటల్లో సాహిత్యం, గాత్ర మాధుర్యం గురించి ఆ తరువాత రోజుల్లో అమ్మ మాతో చాలా చర్చించేది.
ఓసారి సంక్రాంతి సెలవుల కన్నా ముందు రోజుల్లో అనుకుంటా.. ఒకాయన మా ఇంటికి వచ్చాడు. ఆయన్ను మా అమ్మా, నాన్నా కూడా ‘పంతులు’ అని పిలవడం మొదలుపెట్టారు. ఆయనెందుకో నాకు తమాషాగా అనిపించాడు. బాగా ఎత్తూ, కొంచెం లావూ ఉండి.. బొజ్జతో, నుదుటి మీదా, భుజాల పైనా, ఛాతీ మీదా నిలువుగా పెద్ద పట్టెనామాలు పెట్టుకుని ఉన్నాడు. ఊరి నుంచి వచ్చేటప్పుడు కూడా గాంధీతాతలా పైన అంగీ వేసుకోకుండానే వచ్చాడు. అప్పుడే కాదు, ఆయన అంగీ వేసుకోవడం నేనెప్పుడూ చూడలేదు.
“గీయినెవరు నానమ్మా!” అని అమ్మ పనిలో ఉండటం చూసి.. నేను మెల్లగా నానమ్మ దగ్గరికి చేరి అడిగాను. నానమ్మకు ఆయన నచ్చినట్టు అనిపించలేదు. “మీ నాయనమ్మ వాండ్ల ఊర్ల ఉండే సాతాని పంతులు. అమ్మ ఏందో నేర్చుకుంటదట గద! నాకా పేరు నోరు దిరుగదు” అన్నది నానమ్మ. మా నాయనమ్మకు చెల్లెలూ, నాన్నకు చిన్నమ్మ అయినా.. మాకు ఈ నానమ్మ దగ్గరే చనువు ఎక్కువ. ‘అమ్మ ఏం నేర్చుకుంటుంది?!’ అన్న ఆలోచన వచ్చింది గానీ.. అమ్మ ఎందుకో చాలా పనిలో మునిగిపోయి ఉంది.
ఇక ఆరోజు నుంచీ అమ్మ చాలా బిజీగా అయిపోయింది. మామూలుగానే అమ్మకు వంటా, ఇంటి పనీ, ఎప్పుడూ వచ్చేవాళ్లూ, పోయేవాళ్లూ, చుట్టాలూ, వాళ్ల మర్యాదలూ.. వీటితోనే సరిపోయేది. ఈ పంతులు వచ్చినప్పటి నుంచీ అమ్మ తెల్లవారుజామున మూడున్నరకే లేవడం మొదలుపెట్టింది. అంత పొద్దున్నే స్నానం చేసి పనులన్నీ చేసుకుని పొంగలి వండి.. అప్పుడు పుస్తకాలు తీసుకుని రెడీగా ఉండేది. రెండిళ్ల అవతల ఉండే చిన్నమ్మ రాగానే.. ఇద్దరూ కలిసి మా అత్తయ్య వాళ్లింటికి వెళ్లేవాళ్లు. అక్కడ ముగ్గురూ కలిసి ఈ పంతులు చెప్పేవి నేర్చుకునేవారు. మళ్లీ అయిదింటికే అమ్మ ఇంటికి వచ్చేసి.. తరువాత పనుల్లో పడేది. మధ్యాహ్నం పూట కాస్త రెస్ట్ తీసుకునేదల్లా.. ఆ సమయాన్ని కూడా నేర్చుకొన్నవి కంఠోపాఠం చేయడానికి ఉపయోగించేది.
‘ఇంతకూ అమ్మ ఎందుకింత కష్టపడాలి!?’ అనుకునేదాన్ని. చాలా పరిశోధన చేశాక తెలిసింది ఏమిటంటే.. నాయనమ్మ వాళ్ల ఊరిలో ఈ పంతులు ఉంటాడనీ, ఆయన దివ్య ప్రబంధాలన్నీ చదవడమే కాక, నూటా ఎనిమిది దివ్య దేశాలు దర్శించాడనీ, సంస్కృతంతోపాటు ద్రావిడ గ్రంథాలన్నీ క్షుణ్నంగా చదివాడనీ, ఇతని వద్ద నేర్చుకుంటే బాగుంటుందని భావించిన మా చిన్నమ్మలిద్దరూ తిరుప్పావై వంటివి నేర్చుకున్నారనీ, అందుకని ఈ పంతుల్ని మా అమ్మకు రికమెండ్ చేశారనీ.. ఇలా చాలాచాలా విషయాలు తెలిశాయి.
ఆ పంతులు పేరు వెంకట్రాం నర్సయ్య. ఆయన మొహం చూస్తే సింహం పోలికలే కనిపించేవి. దూర్వాసుడిలా చాలా కోపం, మాటకూడా కటువుగా ఉండేది. అయితే ఆయన విద్వత్తు చాలా గొప్పది. ఒక్కోసారి పండితులే తప్పు చదివితే పంతులు తప్పు దొరకబట్టి చెప్పేవాడట. ముగ్గురు విద్యార్థినులు వెళ్లగానే.. “ఆఁ.. ఏం జూస్తున్నరు కూచోండి!” అనేవాడు పంతులు. ఎవరికి వీలుగా వాళ్లు కూర్చుంటే.. “గదేంది?! నవగ్రహాల తీరుగ తలో దిక్కు మొఖం పెట్టుకోని కూచుంటె ఎట్ల?! ముగ్గురు ఒక్కతీరుగ కూచోండి, నా దిక్కు మొఖం చేసి!” అనేవాడు. వాళ్లకు మొదట ‘ఉపదేశరత్తినమాలై’, తరువాత ‘తిరుప్పావై’, ఆ తరువాత ‘తిరుప్పళ్లేజిచ్చు’ వంటివి మొత్తం రెండు నెలల్లో నేర్పించాడు. గోదాదేవి రచించిన ముప్పై పాశురాలున్న ‘తిరుప్పావై’ మాత్రం.. సరిగ్గా ధనుర్మాసంలో నేర్పిస్తూ ఆచరించేలా చూశాడు. మొత్తానికి మంచిగానే నేర్పాడు. అయితే కొన్ని తమిళ పదాలు వీళ్లకు పలకడానికి కష్టంగా ఉండేవి. ఒక్క ఉచ్చారణ తప్పు పోయినా బాగా కోప్పడేవాడు. అమ్మ ఎంతో మనసుపెట్టి పట్టుదలగా నేర్చుకుని శ్రావ్యంగా పాడేది. అయితే ముగ్గురు కలిసి ఒకేసారి చదివేటప్పుడు ఏ ఇద్దరి శ్రుతి కలవకపోయినా.. పంతులుకు విపరీతమైన అసహనం కలిగేది. “ఎహె.. బండికి రెండెడ్లు కడితె చెరో దిక్కు గుంజినట్టు ఏం చదువుడు?! చక్కగ చదువుండి, లేకపోతె నేను నేర్ప!” అని కసిరేవాడు. అమ్మ గానీ, చిన్నమ్మ గానీ, అత్తయ్య గానీ ఆయన్ను చూస్తేనే భయపడేవారు. ఇది మాకు చిత్రంగా ఉండేది.
చాలామంది ఇళ్లలో లాగా మా ఇంట్లో అంతగా పూజలు చేసేవాళ్లం కాదు. అలా అని నాస్తికులేం కాదు గానీ.. పూజలూ, నోములూ, వ్రతాలూ, తీర్థయాత్రలూ.. ఇవేవీ ఉండేవి కావు. మరి అమ్మకు ఇంత కష్టపడి ఇవన్నీ.. అందులోనూ తమిళంలో నేర్చుకోవడం ఎందుకో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఆయన మా ఇంట్లో కొన్ని రోజులు, అత్తయ్య వాళ్లింట్లో కొన్ని రోజులు భోంచేసేవాడు. కొన్ని పర్టిక్యులర్ కూరలే తినేవాడు. “కొంచెం తినరాదయ్యా..” అని అమ్మ అంటే, “అయ్యో! ఇది వర్జితం అండీ, తినకూడదు” అనేవాడు. “మొదలే చెప్పకపోయినావు” అనేది నానమ్మ. “ఎమ్మో.. మీరు గా శాఖం ఒండుతరని నాకేమెరుక?!” అనేవాడు.
మొత్తం నేర్పాక పంతులుకు తోచినది ఇచ్చి పంపించారు అమ్మ వాళ్లు. మధ్యమధ్యన కూడా ఆయన మా ఊరికి వచ్చేవాడు. ఈ మధ్య కనబడ్డం లేదు. ప్రతి ధనుర్మాసంలో ‘తిరుప్పావై’ చదువుతూ.. “ఏదో పాపం! కఠినంగా ఉన్నా మనకోసమే చెప్పిండు కద! ఆనాడు పంతులు అట్ల కోప్పడకుంటె మనకు ఇవన్ని వచ్చునా?!” అనుకుంటుంటారు అమ్మా, అత్తయ్యా, చిన్నమ్మా!
– నెల్లుట్ల రమాదేవి, రచయిత్రి