బడిలో చదువు చెప్పే టీచర్లంటే విపరీతమైన భయం ఉండేది. వాళ్లెందుకోగానీ కొట్టడం ద్వారా మాత్రమే పిల్లలు బాగా చదువుకుంటారనే నమ్మకంతో ఉండేవారు. ఇంకొందరు తమ సొంతపనులు చేసిపెట్టే మగపిల్లలకు ఉదారంగా ఐదో పదో మార్కులు ఎక్కువ వేసేవాళ్లు.
బడిలో బాగా చదివే పిల్లలకు అభిమాన టీచర్లు వేరే ఉండేవారు. సబ్జెక్టు బాగా తెలవడమే కాదు, పిల్లలకు అర్థమయ్యేలా, ఆసక్తిగా పాఠం చెప్పేవారు. వెనుక బెంచీ వాళ్లను కూడా కలుపుకొని పోవడంలోనూ, పిల్లలను మాలిమి చేయడంలోనూ వీళ్లు స్పెషలిస్టులన్న మాట. వాళ్లు వ్యక్తిగత పనులకు పిల్లలను వాడరు. పైగా బీదపిల్లలకు పుస్తకాలు, బట్టలు, పెన్నులు, పెన్సిళ్లు లాంటివి కొనిచ్చేవారు కూడా.
ఇక మూడోరకం సార్లు.. వీళ్లకు సబ్జెక్టు వచ్చేమోకానీ అటు పాఠం చెప్పడమూ రాదు, ఇటు పిల్లల్ని ఆకట్టుకోవడమూ రాదు. వీళ్లే పిల్లలకు అప్పుడప్పుడూ టార్గెట్ అయ్యేవారు. మేము ఆడపిల్లలమేమో.. ‘బడికి వెళ్లామా.. పాఠాలు విన్నామా.. ఇంటికొచ్చామా!’ అన్నట్టు ఉండేవాళ్లం. చాలామంది మగపిల్లలు కూడా బుద్ధిగా ఉండేవారు గానీ, బహుకొద్దిమంది కోతిమూక మాత్రం పైకి ఏమీ తెలియనట్టే ఉంటూ.. డాకు పనులు చేసేవాళ్లు.
మాకు వెంకట్రామ నర్సయ్య అనే సారు ఉండేవారు. ఆ రోజుల్లోనే ఆయన మా ఊరికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మడికొండ నుంచి రోజూ బస్సులో వచ్చేవాడు. చాలా లావుగా ఉండటంతో ఆయనకు నడవడమే కష్టంగా ఉండేది. పిల్లలందరూ ఆయన్ను ‘లడ్డు సార్’ అని చెప్పుకొనేవాళ్లు. బస్సు దిగి స్కూలుకి గానీ, సాయంత్రం బస్‌స్టాప్‌కి గానీ ఆయన నడిచి వెళ్తుంటే.. ఓ ఏనుగు నడుస్తున్నట్టే ఉండేది. పాపం .. చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడంటే టీచర్లు కార్లు మెయిన్టైన్ చేస్తున్నారు గానీ, ఆయనకు స్కూటర్ కూడా ఉండేది కాదు. ఆయన మాకు సోషల్ స్టడీస్ చెప్పేవారు.
ఓరోజు లడ్డు సార్ క్లాసుకు వచ్చి కూచున్నారు. మామూలుగానే ఆయన అస్సలు నిలబడలేక పోయేవారు. పాఠం కూడా కూర్చునే చెప్పేవారు. రాగానే కూర్చుంటే.. వెళ్లిపోయేటప్పుడు మాత్రమే లేచేవారు. మళ్లీ కుర్చీలోంచి లేవడం, చెయ్యెత్తడం.. ఇదంతా కష్టం ఎందుకని కాబోలు పిల్లల్ని పెద్దగా కొట్టేవారు కాదు. ఒకరోజు పాఠం చెప్పాక గంట వినపడగానే కుర్చీలోంచి లేవడానికి ప్రయత్నించారు లడ్డు సార్. ఊహూ.. వీలవలేదు. మళ్లీ లేచారు, మళ్లీ లేచారు. ఏ మాత్రం కుదరలేదు. పాపం, ఆయన మొహం కందగడ్డలా మారిపోయింది. “అరేయ్.. ఇద్దరు, ముగ్గురు రాండిరా!” అన్నారు అసహనంగా. వెంటనే వెనుక బెంచీల నుంచి కాస్త కండపుష్టి ఉన్న ఓ నలుగురు పిల్లలు వచ్చారు. “ఏమైంది సార్?!” అన్నారు ఏమీ తెలియనట్టుగా. “ఇండ్లకెల్లి వస్తలేను, ఇగ్గుండిరా!” అన్నారు సారు. ఆ బాలవీరులు అప్పుడే విషయం తెలిసినట్టు.. “అయ్యో! గట్లెట్ల అయింది సార్?!” అని ముసిముసి నవ్వులు ఆపుకొంటూ.. ఇటిద్దరు, అటిద్దరు చేతులు పట్టుకుని బయటికి లాగేందుకు ప్రయత్నించారు. ఎంత లాగినా.. సారు మొత్తుకోవడమే తప్ప కుర్చీలో ఇరుక్కుని బయటికి రాలేదు. మళ్లీ ఇద్దరు కుర్చీ చేతుల మీద తమ చేతులు బలంగా అణచిపెట్టి ఉంచితే.. మిగతావాళ్లు లాగడానికి చూశారు. అయినా లాభం లేకపోయింది. ఈలోగా తర్వాతి పీరియడ్ కోసం ఇంగ్లీష్ సార్ వచ్చారు. “ఏమైంది సార్!” అని చూస్తూచూస్తూ ఆయన్ని అడగలేక.. “ఎట్లయిందిరా?!” అని పిల్లల్ని అడిగాడు. వాళ్లు చాలా సిన్సియర్‌గా.. “ఎమ్మో సార్.. తెల్వదు!” అన్నారు ముక్తకంఠంగా. ఇలాంటప్పుడు పిల్లల్లో భలే ఐక్యత ఉంటుంది.
కొద్దిసేపటికి ఎవరో సుత్తె తెచ్చారు. సారుకు దెబ్బ తగలకుండా చూసి.. మొత్తానికి కుర్చీకి ఒకపక్క చెయ్యి విరగ్గొట్టారు. అప్పుడు లడ్డు సారుకు విముక్తి లభించింది. అంతలో ఇంగ్లిష్ సారుకు అనుమానం వచ్చింది. “సారు పొయ్యే క్లాసు రూములల్ల చేతులుండే కుర్చీలెయ్యం గద.. మరి గీ రొండు దిక్కుల శేతులున్న కుర్చీ గిండ్లకెట్ల ఒచ్చింది?” అన్నదే ఆ డౌటు!
దొంగలెవ్వరూ మాట్లాడలేదు. మొత్తానికి నిజ నిర్ధారణలో తెలిసింది ఏమిటంటే.. సోషల్ స్టడీస్‌లో అతితక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయిన ఓ ఆరుగురు విద్యార్థులు ఈ పనిచేశారని. సారును ఏడిపించాలన్న ఉద్దేశంతో క్లాసు రూంలోని చేతుల్లేని కుర్చీని తీసేసి.. రెండు దిక్కులా చేతులున్న కుర్చీని తెచ్చి పెట్టారని! లడ్డు సారు అది చూసుకోకుండా వచ్చి కూర్చుని ఇరుక్కు పోయారని!
పాపం.. లడ్డు సారుకెంత బాధ కలిగిందో గానీ, మేము ఓ పక్క ‘అయ్యో! అయ్యో!’ అనుకుంటూనే.. ఆ ప్రహసనాన్ని చూసి కిసుక్కుమని నవ్వుకుంటూనే ఉన్నాం. ఏమాత్రం జాప్యం లేకుండా నిందితులకు కఠిన శిక్ష పడిందని సాయంత్రానికల్లా వాళ్ల చేతుల వాతలు, కుంటుతూ నడిచే వాళ్ల కాళ్లే చెప్పాయి. దూర్వాసుడనే పేరున్న సింహాచారి సారుకు కూడా ఇలాగే జరిగిందో సారి. ఆ ముచ్చట వచ్చేవారం.