నారాయణాద్రుల స్వామీజీ చెప్పినట్టే రోజుమారగానే నురగకక్కుకొన్న చిన్నారి చనిపోవడంతో ఇన్స్పెక్టర్ రుద్ర, స్నేహిల్, జయ, రామస్వామితో పాటు అక్కడి జనమంతా షాకయ్యారు. ఇందులో ఏదో కుట్ర కోణం ఉందని రుద్ర అనుమానిస్తుండగా.. స్వామీజీని అనుమానించినందుకే పాప ప్రాణాలు దక్కలేదని ఆ ఊరివారందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
తెల్లవారుజాము కావొస్తున్నది. ఇంతలో చనిపోయిన పాప తల్లిదండ్రులు పరుగెత్తుకొని వచ్చి స్వామీజీ కాళ్లపై పడి ఏడ్వడం మొదలుపెట్టారు. ‘అయ్యా! మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని అనుమానించినందుకే మా బిడ్డ మాకు దక్కలేదు’ అంటూ ప్రాధేయపడ్డారు. దీంతో రుద్ర వాళ్లను వారించబోయాడు. ‘అయ్యా.. పోలీసు సారూ.. ఏండ్ల నుంచి ఈ సాములోరు మా ఊరిని కాపాడుతున్నారు. ఇంగ్లీషు చదువులకు కూడా అంతుబట్టని ఎన్నో తంత్రాలు ఉన్నాయి. అవి మీకు అర్థంకాదు’ అంటూ రోదిస్తూ రుద్రను వెళ్లిపోవాలంటూ ఆ దంపతులు వేడుకొన్నారు.
‘వెళ్తాను. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చాక.. పాప మృతి రహస్యం బయటపడుతుంది. అప్పుడు మోసగాళ్లు ఎవరో మీకే తెలుస్తుంది’ అంటూ రిపోర్ట్ కోసం రామస్వామిని పంపించిన రుద్ర.. అక్కడి నుంచి బయల్దేరుతుండగా స్వామీజీ కలుగజేసుకొన్నాడు. ‘కుట్రేమీ లేదు పోలీస్.. ఆ పాపది నెత్తుటి పిశాచీ జాతకం. అమావాస్య గడియల్లో ఆమె రక్త తర్పణం చెయ్యాల్సిందే. ఆ బాలిక రక్తాన్ని రక్త పిశాచాలు జుర్రుకోవడమే విధి. అలా జరుగకుండా ఉండటానికి నా మంత్ర జలంతో ఆమె రక్తాన్ని శుద్ధి చేయాలనుకొన్నా. ఇంతలో మీరొచ్చి అంతా చెడగొట్టారు. ఫలితం ఆ పాప మరణం!’ అంటూ స్వామీజీ ఆగ్రహించాడు.
‘ఛీ.. ఇంత జరిగినా.. మీ మోసాలకు హద్దు లేదా? దెయ్యాలు, భూతాలు అంటూ ఇంకా ఎన్ని కట్టుకథలు చెప్తారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ రానివ్వండి. మీ సంగతి తేలుస్తా’ అంటూ రుద్ర అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. ‘ఏయ్.. పోలీస్. నా సంగతి తేల్చడం కాదు. ఇప్పుడే నా శక్తి ఏంటో చూయించి.. నీ కండ్లు తెరిపిస్తా’ అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులను దగ్గరగా రమ్మని పిలిచాడు స్వామీజీ. ‘మీ బిడ్డను కాపాడుతానని మీకు మాటిచ్చా. కానీ, ఈ పోలీసు నిర్వాకంతో అంతా చెడిపోయింది. అయితే, పాలు పొంగకపోవడం, అరచేతికి నెత్తురు అంటుకోవడం వంటి అపశకునాలను కూడా సైన్స్‌కు ఆపాదించి ఇలాంటి వ్యక్తులు మేం చేసేవన్నింటినీ కనికట్టుగా ప్రచారం చేస్తున్నారు.
అందుకే, మీతోపాటు ఈ ఊరి జనానికీ నేనేంటో? నా శక్తి ఏంటో? ఇప్పుడే తెలియజేయాలనుకొంటున్నా. అప్పుడైనా నాపై నమ్మకం సడలకుండా ఉంటుంది’ అంటూ గద్గద స్వరంతో స్వామీజీ అంటుండగానే.. ‘మాకు మీపై నమ్మకం ఏమాత్రం పోలేదు స్వామీజీ’ అంటూ అక్కడున్న వారంతా అరవడం ప్రారంభించారు. అయితే, ఆ అరుపుల్లోంచి ఒకతను.. ‘ఆ చిన్నారిని ఎలా కాపాడాలనుకొన్నారు? చేసి చూపించండి స్వామీజీ’ అంటూ అరిచాడు. ఎవరా? అని చూస్తే, అతను ఇన్స్పెక్టర్ శరత్. రుద్రకు తనను తాను పరిచయం చేసుకొన్న శరత్.. స్వామీజీని ప్రారంభించమన్నాడు.
‘ఓహో.. ఒక పోలీసుకు మరో పోలీసు జత కలిశాడా? మరీ మంచిది. నా శక్తేంటో మీ కండ్లతోనే చూడండి. చనిపోయిన చిన్నారిది నెత్తుటి పిశాచీ జాతకం..’ అని స్వామీజీ ఏదో చెప్తూపోతుండగా.. మధ్యలో అడ్డుకొన్న శరత్.. ‘స్వామీజీ.. అదంతా మాకెందుకు? నెత్తురు, పిశాచీ, మంత్ర జలం అంటూ ఏదేదో కహానీ చెప్పారుగా.. ఇప్పుడు వాస్తవాన్ని చేసి చూపించండి’ అంటూ కసురుకొన్నాడు. ‘నా శక్తిని చూపించడానికి ఆ పాప బతికి లేదు.
ఆమె రక్తమే దీనికి కావాలి. అయితే, మరో మార్గం ఉంది. అమావాస్య రోజు దుర్ముహూర్తంలో పుట్టిన ఎవరైనా కొంచెం రక్తం ఇవ్వండి. ఆలోపు చనిపోయిన పాప డెడ్‌బాడీ నుంచి ఒక చుక్క రక్తాన్ని తీసుకొచ్చి.. ఈ రక్తంలో కలపండి. అప్పుడు నా శక్తేంటో చూపిస్తా. మరోవిషయం.. అసలే మీకు నాపై ఎన్నో అనుమానాలున్నాయి. కాబట్టి రక్తాన్ని తీసుకురావడం, దాన్ని ఉంచేందుకు గ్లాసులను ఎంపిక చేయడం అంతా మీపనే. లేకపోతే ఏదో సైన్స్ కిటుకు చెప్పి నన్ను మళ్లీ అనుమానిస్తారు’ అంటూ స్వామీజీ అనగానే.. సరేనని తలూపిన శరత్, రుద్ర.. అమావాస్యనాడు దుర్ముహూర్తంలో పుట్టిన ఓ వ్యక్తి నుంచి కొంత రక్తాన్ని, దవాఖాన నుంచి చనిపోయిన పాప రక్తాన్ని తెప్పించి.. ఆ రెండింటినీ కలిపి ఓ గ్లాసులో ఉంచి దానిపై
మూతపెట్టి స్వామీజీ ముందుంచారు. స్వామీజీ అడగడంతో పక్కనే మరో రెండు ఖాళీ గాజు గ్లాసులనూ ఉంచారు. అప్పటికే చీకటి కావస్తోంది.కొంతసేపు పూజ చేసిన స్వామీజీ.. ఇలా చెప్పడం ప్రారంభించాడు. ‘ఇది చాలా భయంకరమైన పూజ. ఎప్పుడైతే నేను ఈ గ్లాసు మీదున్న మూతను తీస్తానో.. నెత్తుటి పిశాచీ జాతకంలో పుట్టిన ఆ చిన్నారి రక్తాన్ని జుర్రుకోవడానికి పిశాచాలు విరుచుకుపడతాయి. ఎవ్వరూ కంటిరెప్ప వేయవద్దు. నేను నా మంత్ర జలంతో ఆ రక్తాన్ని పవిత్ర జలంగా శుద్ధి చేస్తాను’ అంటూ స్వామీజీ చెప్పగానే.. రుద్ర ఏదో మాట్లాడబోయాడు.
దానికి స్వామీజీ.. ‘ఏయ్.. పోలీస్. నీకు అనుమానం ఉంటే.. నేను మంత్రాలు చదువుతుండగా నువ్వే వచ్చి ఈ పనంతా చెయ్యి. అయితే, ఒక్క విషయం.. నువ్వు ఏ మాత్రం తప్పు చేసినా.. ఆ పిశాచాలు ఊరుమీద పడి ఊరినే వల్లకాడుగా మార్చేస్తాయి. జాగ్రత్తగా చెయ్’ అంటూ రుద్ర చెయ్యిని పట్టుకొని దగ్గరగా కూర్చోబెట్టాడు. ‘స్వామీజీ.. మీపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. వద్దూ’ అంటూ అనుచరులు, గ్రామస్థులు అంటుండగానే.. రక్తం ఉన్న గాజు గ్లాసు మూతను తెరిచాడు స్వామీజీ. అంతే, ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా గాలి దుమారం. అక్కడే జుత్తు విరబోసుకొన్నట్టు ఉన్న మర్రిచెట్లు భయంకరంగా నృత్యం చేస్తున్నట్టు ఊగిపోయాయి. జరుగుతున్నది చూస్తూ అటు జయ, ఇటు ప్రజలంతా భయపడిపోతున్నారు.
ఇంతలో గట్టిగా మంత్రాలు చదువుతున్న స్వామీజీ గాలికి కొట్టుకుపోతున్న గ్లాసులను పట్టుకొని అక్కడ పెట్టాడు. మర చెంబులోని మంత్రజలాన్ని రక్తపు గ్లాసులో పోయమంటూ రుద్రకు చెప్పాడు. అంతే.. రుద్ర మంత్ర జలాన్ని గ్లాసులో పోస్తున్నాడో లేదో.. పక్కనే ఉన్న మరో ఖాళీ గ్లాసులోంచి తెల్లటి పొగ, అందులోంచి ఏదో ఓ ఆకారం బయటకు రాసాగింది. అది చూసిన రుద్ర ఆశ్చర్యపోతూ.. మరచెంబును కిందకు జారవిడవబోయాడు. వెంటనే పట్టుకొన్న స్వామీజీ.. ‘మూర్ఖుడా.. పిశాచాలంటే పరాచకాలనుకొన్నావా??’ అంటూ గట్టిగా మంత్రాలు చదువుతూ.. రక్తం ఉన్న గ్లాసులో మంత్ర జలాన్ని కొంచెం పోశాడు. ఆశ్చర్యం. ఆ రక్తం సాధారణ జలంగా మారిపోయింది.
అలా మారగానే పక్క గ్లాసులోంచి వస్తున్న పొగ, ఆకారం మటుమాయమైంది. అప్పటివరకూ రేగిన గాలి దుమారం శాంతించింది. ‘ఏయ్.. పోలీసులు.. ముందు ముఖంపై పట్టిన చెమటను తుడుచుకోండి’ అంటూ రుద్ర, శరత్‌కు చెప్తూ.. ‘పిశాచాలతో ఇకపై ఆటలొద్దూ’ అంటూ ఆశ్రమంలోకి స్వామీజీ వెళ్లబోయాడు. అసలేం జరిగిందో అర్థంకాక రుద్ర, శరత్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొన్నారు. స్వామీజీకి నిజంగానే శక్తులు ఉన్నాయని ఊరంతా మాట్లాడుకొంటున్నారు.
ఇంతలో పోస్ట్‌మార్టమ్ నివేదికతో వచ్చిన రామస్వామి దాన్ని రుద్ర చేతిలో పెట్టాడు. రిపోర్ట్ సమ్మరీని చదివిన రుద్ర.. ఆశ్రయంలోకి వెళ్తున్న స్వామీజీని అడ్డుకొని.. ‘నెత్తుటి పిశాచీని వెతుక్కొంటూ సైన్స్ వచ్చింది స్వామీజీ. అంతేకాదు.. ఆ బాలిక మరణానికి కూడా..’ అంటూ ఏదో చెప్పాడు. దీంతో నిర్ఘాంతపోయిన స్వామీజీ.. కోపోద్రిక్తుడై రుద్ర మీదకు పదునైన ఆయుధంతో దాడి చేయబోయాడు. స్వామీజీని షూట్ చేశాడు శరత్. అది పక్కనబెడితే.. ‘నెత్తుటి పిశాచీని వెతుక్కొంటూ సైన్స్ వచ్చింది స్వామీజీ’ అని రుద్ర ఎందుకు అన్నాడో కనిపెట్టారా?
…? రాజశేఖర్ కడవేర్గు