చాలా ఎత్తుగా ఉండే ఈ గుగ్గిలం చెట్టు సహజసిద్ధంగా అడవుల్లో పెరుగుతుంది. అడవి నుంచి గిరిజనులు సేకరించే అనేక దినుసుల్లో గుగ్గిలం ప్రధానమైనది. కాండంపై గాటు పెడితే ఒక రకమైన జిగురులాగా ద్రవం స్రవిస్తుంది. ఎండిన ఈ స్రావమే ‘గుగ్గిలం’. పూజల్లో హిందువులే కాక ఇతర మతాల వాళ్లు కూడా గుగ్గిలం ఉపయోగిస్తారు. సాంబ్రాణి పొగ గాలిని శుద్ధి చేస్తుంది. ఇందులోని యాంటి మైక్రోబియల్ గుణాలు గాలిలోని బ్యాక్టీరియాలాంటి సూక్ష్మ క్రిముల్ని నాశనం చేస్తాయి. అంతేకాదు, దాని పొగ పరచుకున్న ప్రాంతమంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందనీ నమ్ముతారు. గుగ్గిలం చెట్టు కొమ్మతో వేసిన పందిట్లోనే బెంగాలీలు పెళ్లి చేసుకోవడం సంప్రదాయం. బౌద్ధులు గుగ్గిలం చెట్లను పూజిస్తారు. గ్రామాల్లో సంతానం లేని దంపతులు గుగ్గిలం చెట్టుని పూజించే ఆచారం కూడా ఉంది.
కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ చెట్టున్న చోట గుగ్గిలం అడవి అని మార్కింగ్ ఉంటుంది. వీటి ఆకులు మంచి సువాసన కలిగి ఉంటాయి. దోమల నివారణ తయారీ మందుల్లో గుగ్గిలం ఆకులు కూడా ఉపయోగిస్తారు. సన్నగా, కోలగా, లేత పచ్చరంగులో మెరుస్తుంటాయివి. మన దేశంలోని అసోం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తూర్పు కనుమల్లో విస్తారంగా గుగ్గిలం చెట్లు పెరుగుతున్నాయి. పొరుగుదేశాల్లోనూ కనిపిస్తాయివి. వర్షపాతం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో సతత హరితంగాను, లేని ప్రాంతాల్లో ఆకులు రాల్చే చెట్లుగానూ ఉంటాయి. ఏప్రిల్, మే నెలల్లో కొత్త ఆకులు, పూలతో ఉండి జూలై వరకల్లా కాయలు కాసి, పక్వానికి వస్తాయి. గుగ్గిలం కాయ కోలగా ఉంటుంది. ప్రతి కాయలో కాఫీ రంగులో ఒకటే గింజ ఉంటుంది. దీని నుంచి సాల్ కొవ్వును తయారు చేస్తారు. ఒక ఎకరం విస్తీర్ణంలోని చెట్ల కాయల నుంచి 400 కేజీల దాకా ఈ నూనె (కొవ్వు) గింజలు పండుతాయి.
గుగ్గిలం కలప దృఢంగా ఉంటుంది. కాబట్టి వీటిని అడవి నుంచి అక్రమంగా తరలించడం కూడా ఎక్కువగా జరుగుతున్నది. రైల్వే బోగీలు, బండి చక్రాలు, ఇళ్లు, వంతెనలు, పడవల తయారీకి గుగ్గిలం కలపను ఉపయోగిస్తారు. దీన్ని సంస్కృతంలో అశ్వకర్ణ అనీ, తెలుగులో సాలువ (సాల్వ) చెట్టు అనీ పిలుస్తారు. మత సంప్రదాయాల్లో, సంప్రదాయ వైద్యంలోనూ అనేక విధాలుగా ఉపయోగపడే ఈ గుగ్గిలం చెట్టు మా ఔషధ వనంలో ఒకటి ఉంది.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు