– బెల్లి జంగయ్య, ఆలేరు
‘ఇంత గొప్పగా నా ఇంటిని కట్టుకునే అనుగ్రహం నాకు ప్రసాదించావు. అలాంటిది నీవు లేకుండా నేను ఉండలేను ఈ ఇంట్లో’ అని భగవంతునికి ఇంట్లోనే స్థానం కల్పిస్తాం. అది ఇంటి వైభవానికి నిదర్శనం. ఇంటి బయట కట్టేది కూడా గుడే కానీ ఇంట్లోనే కోవెల ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు గుడిలా వర్ధిల్లుతుంది. కొందరు మైసమ్మ, పోచమ్మ గుళ్లు విశేషంగా ఆరుబయట కాంపౌండ్లో నిర్మిస్తారు.
కానీ, దేవతా పీఠం తప్పకుండా ఇంట్లోనే ఉండాలి. ఎక్కడ కట్టినా, కట్టకపోయినా తన కోవెలను ఎందుకు కట్టలేదని దైవం అడగడు, అలగడు కూడా.. ఆ కృతజ్ఞత మనం పాటించాలి. నిత్యం పూజలు ఆయన చేయమన్నాడా? చిత్తంకోసం చేస్తాం. ఈ పంచేంద్రియాలు ఇచ్చి నిలబెట్టినందుకు కృతజ్ఞతగా ఆ భగవంతునికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తాం. బయట ఎన్ని గుడులున్నా ఇంటిలోపల పూజగది మాత్రం ఉండాల్సిందే.
– ఎస్వీ చంద్ర, కోరుట్ల
ఇల్లంటే జీవితం. మన భవిష్యత్తు. అన్ని విధాలుగా సరిచూసుకోని నిర్మాణం చేయాలి. ఒకప్పుడు ఆ నేలలో ఇంటి నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నాక.. భూమిని దున్ని విత్తనాలు చల్లి పరీక్షించేవారు. తొలుత దాన్ని చదును చేసి, అందులోని రాళ్లు రప్పలు తొలగించేవారు. అనంతరం అందులో బండలు, కళేబరాలు ఇతర అవశేషాలేమైన ఉన్నాయా? మట్టి గట్టిదా? మెత్తదా? కందకాలు ఏమైనా ఉన్నాయా? తెలుసుకునేందుకు ఆ నేలను దున్ని నవధాన్యాలు చల్లేవారు. అవి ఎన్నిరోజుల్లో, ఏఏ ధాన్యాలు మొలకెత్తాయనే దాన్ని బట్టే నేల స్వభావాన్ని అంచనా వేసేవారు. ప్రస్తుతం మీరు నిర్మాణం చేయాలనుకుంటున్న స్థలంలో కూడా ఈ తరహాలో పరీక్షించొచ్చు. ఏదేమైనా స్థలాన్ని శుద్ధి చేయకుండా ఆ నేల స్వభావం తెలుసుకోకుండా ఇంటి నిర్మాణానికి పూనుకోవద్దు.
– సుంకి శారద, కాచిగూడ
ఒక స్థలం వీధిపోటుతో ఉండి దాని పక్కనే మరో స్థలం వీధిపోటు లేకుండా ఉన్నప్పుడు.. రెండింటినీ ఒకటిగా భావించకూడదు. కానీ, వాటి యజమానులు వేరువేరు అయినా కూడా రిజిస్ట్రేషన్ స్థలం మాత్రం ఒక్కటే కదా అనిపిస్తుంది. ఇందులో రెండు స్థలాలకు ఒకే కాంపౌండ్ కలిపి ఉంటే.. అది వీధిపోటుగా మారి దోషం ఏర్పడుతుంది. ఇదికాకుండా వీధిపోటు ఉన్న స్థలంలో కట్టిన ఇల్లును ఆనుకొని మరొకరు నిర్మాణం చేస్తే.. కాంపౌండ్లు ఉండవు కాబట్టి ఆ వీధిపోటు ఇద్దరికీ వర్తిస్తుంది. లే అవుట్ సరిగ్గా చేస్తే ఎలాంటి వీధిపోట్లు రావు. గతంలో ఈ వీధిపోటు సమస్యలు రాకుండా గ్రామ నిర్మాణం-నగర నిర్మాణం చేసేవారు. నేడు ఆధునికులు అతి తెలివితో అడ్డదిడ్డంగా ప్లాన్లు చేసి అవస్థలు పడుతున్నారు.
– కేవీఎల్ హరీష్
నిర్మాణం చేసే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. స్థలం అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అన్నీ కాయలే అని పత్తికాయతో కూర వండలేం కదా. స్థలం కూడా అంతే. అది వ్యాపారంగా పనికొస్తుందా? గృహ నిర్మాణానికి ఉపయోగపడుతుందా? అనే విషయం ముందే నిర్ధారించుకోవాలి. మీరు వెంటనే తెలిసిన వారిచేత స్థల నిర్ధారణ చేసుకోండి. వీధులు, దిక్కులు అనుకూలంగా ఉన్నాయా? లేదా? ఒకే రోడ్డు ఉందా? స్థల వైశాల్యం దాని తీరుతెన్నులు పరిశీలించి.. గృహానికి అనుకూలమైతే నిర్మాణం కొనసాగించండి. లేదంటే వ్యవసాయానికి గానీ, ఇతర వ్యాపారానికేమైనా ఉపయోగపడితే అదే తరహాలో ఎంచుకోండి. ఏదేమైనా ఇంటి నిర్మాణానికి యోగ్యకరమైన స్థలాన్ని ఎంచుకోండి. అప్పుడే మీ జీవితం బాగుంటుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143