నా పాత్రను ప్రమోషన్స్‌లో రహస్యంగా ఉంచాలని, సినిమా విడుదలయ్యే వరకు ఎవరికీ తెలియకూడదని దర్శకుడు నిర్ణయించారు. ఆ ఆలోచన నా పాత్రకు ఊహించని ఆదరణ తెచ్చింది. నా పాత్రనూ, నన్నూ ప్రేక్షకులు ఆదరించడం చాలా సంతోషంగా ఉంది.
చిన్నప్పటి నుంచీ నాకు విలన్ పాత్రలంటే ఇష్టం. తక్కువ స్క్రీన్ టైమ్‌లోనూ ఎక్కువ ప్రభావం చూపగలవు. సినిమాల్లోకి రాకముందు టెలివిజన్ సీరియల్ ‘అరసి’తో నటనా రంగంలోకి అడుగుపెట్టాను. అందులో నేను విలన్ పాత్రను ఎంచుకున్నాను, ఎందుకంటే ఆ రోల్ నాకు ఎక్కువ స్కోప్ ఇస్తుందని భావించాను.
నా మొదటి సినిమా రజినీ సర్‌తో చేయడం చాలా గర్వంగా ఉంది. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ‘కూలీ’ సినిమా నా కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాలో నేను చేసిన కల్యాణి పాత్ర చాలా శక్తిమంతమైనది. నటిగా నాకు కొత్త ఒరవడి నేర్పింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘కూలీ’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ బ్యూటీ రచితా రామ్. శాండల్‌వుడ్‌లో వరుస సినిమాలతో డింపుల్ క్వీన్‌గా పేరుగాంచిన రచిత కెరీర్ తొలినాళ్లలోనే రజినీకాంత్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి నటించే చాన్స్ కొట్టేసింది. ‘కూలీ’తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఆ చిత్రంలో తాను పోషించిన కల్యాణి పాత్ర, రజినీకాంత్‌తో పనిచేసిన అనుభవం గురించి రచిత పంచుకున్న కబుర్లు..
కూలీ కోసం నేను ఎక్కువ రిహార్సల్స్ చేయలేదు. లోకేష్ సర్ కూడా స్పాంటెనిటీని ప్రోత్సహించేవారు.
అందుకే నా నటనలో సహజత్వం వచ్చింది. ముందే కల్యాణి పాత్రలోని పరివర్తనను గురించి స్పష్టంగా చెప్పడం వల్ల, ఒక శిక్షణ పొందిన పోలీసు అధికారిగా ఆలోచించి, ఆ మార్పును సమర్థవంతంగా చూపించగలిగాను.
కల్యాణి పాత్ర ప్రేక్షకులపై గొప్ప ప్రభావం చూపుతుందని రజినీ సర్ చెప్పారు. ఆయన నుంచి వచ్చిన ప్రశంసలు నాకు అతిపెద్ద బహుమతి. ఒక 10 సంవత్సరాలు కన్నడ సినిమా రంగంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాతే ఇతర భాషల సినిమాల్లోకి అడుగుపెట్టాను.
డైరెక్టర్ లోకేష్ సర్ నటనపరంగా నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన నా వ్యక్తిత్వంలోని ఒక కొత్త కోణాన్ని వెలికి తీశారు. ఒక సినిమా ఈవెంట్లో నన్ను చూసి, నీ తమిళ డెబ్యూ గొప్పగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఆయన మాట నిలబెట్టుకున్నారు.
నేను చిన్నప్పటి నుంచి రజినీ సర్కి పెద్ద ఫ్యాన్‌ని. ‘పడయప్ప (నరసింహ)’ సినిమాలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర నన్ను చాలా ప్రభావితం చేసింది. నేను కూడా ఆయన సినిమాలో అలాంటి బలమైన పాత్ర చేయాలని కలలు కన్నాను. కూలీలో కల్యాణి పాత్రతో ఆ కల నెరవేరింది.